“మే 27–జూన్ 2: ‘వారు దేవుని జనులని పిలువబడిరి.’ మోషైయ 25-28,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2024)
“మే 27–జూన్ 2. మోషైయ 25-28,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2024)
మే 27–జూన్ 2: “వారు దేవుని జనులని పిలువబడిరి”
మోషైయ 25–28
దాదాపు మూడు తరముల వరకు వేర్వేరు ప్రాంతాలలో నివసించిన తరువాత, నీఫైయులు మరలా ఒకే జనముగా ఉన్నారు. లింహై యొక్క జనులు, ఆల్మా యొక్క జనులు మరియు మోషైయ యొక్క జనులు—నీఫై వంశమునుండి రాని జరహేమ్ల యొక్క జనులు కూడా —ఇప్పుడు అందరు “నీఫైయులతో లెక్కింపబడిరి” (మోషైయ 25:13). వారిలో అనేకమంది ఆల్మా జనుల వలె ప్రభువు సంఘము యొక్క సభ్యులు కావాలని కూడా కోరుకున్నారు. కావున, “క్రీస్తు యొక్క నామమును తమపై తీసుకొనుటకు కోరిన వారు” అందరూ బాప్తిస్మము పొందిరి మరియు “వారు దేవుని జనులని పిలువబడిరి” (మోషైయ 25:23–24). అనేక సంవత్సరాల వివాదము మరియు దాస్యము తరువాత, చివరికి నీఫైయులు శాంతిగల సమయమును ఆనందించగలిగినట్లు అనిపించింది.
కానీ త్వరలోనే, అవిశ్వాసులు పరిశుద్ధులను హింసించడం ప్రారంభించారు. దీనిని మరింత బాధాకరంగా చేసింది ఏమిటంటే, ఈ అవిశ్వాసులలో అనేకులు విశ్వాసుల యొక్క స్వంత పిల్లలు —“యువతరము” (మోషైయ 26:1 ), వీరిలో మోషైయ యొక్క కుమారులు మరియు ఆల్మా యొక్క ఒక కుమారుడు ఉన్నారు. ఒక దేవదూత యొక్క అద్భుతమైన సందర్శన గురించి ఈ వృత్తాంతము చెప్తుంది. కానీ ఈ కథలో నిజమైన అద్భుతము దారితప్పిన పిల్లలకు దేవదూత కనిపించడం గురించినది మాత్రమే కాదు. నిజమైన పరివర్తన అనేది ఒక అద్భుతము, అది ఒక విధంగా లేదా మరొక విధంగా, మనందరికీ సంభవించాల్సిన అవసరమున్నది.
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
ఇతరులు యేసు క్రీస్తు యొద్దకు వచ్చుటకు నేను సహాయము చేయగలను.
పరివర్తన అనేది వ్యక్తిగతమైనది—అది ఒకరి పిల్లలకు వారసత్వంగా ఇవ్వబడలేనిది. మోషైయ 26:1–6ను మీరు చదివినప్పుడు, “యువతరము” పతనమవడానికి గల కారణాలను ధ్యానించండి మరియు వారి అవిశ్వాసము యొక్క పర్యవసానములను గమనించండి. క్రీస్తు నొద్దకు తీసుకురావాలని మీరు కోరిన జనుల గురించి కూడా మీరు ఆలోచించవచ్చు. మీరు మోషైయ 25–28 అధ్యయనం చేస్తున్నంతసేపూ, యేసు క్రీస్తు నందు విశ్వాసమును వృద్ధిచేయడానికి వారికి సహాయపడుటకు మీరు చేయగల విషయాలను ఆత్మ గుసగుసగా చెప్పవచ్చు.
దేవుని యొక్క విశ్వాసులైన సేవకులు ఆయన చిత్తమును చేయాలని కోరతారు.
కొన్నిసార్లు ఆల్మా వంటి నాయకులు ఎల్లప్పుడు సరైన దానిని చేయుటను ఎరిగియున్నారని మనము అనుకుంటాము. మోషైయ 26లో సంఘములో ఆల్మా ఎన్నడూ ఎదుర్కోని ఒక సమస్యను గూర్చి మనము చదువుతాము. ఈ పరిస్థితిలో ఆల్మా ఏమి చేసాడు? (మోషైయ 26:13–14, 33–34, 38–39 చూడండి). మీ కుటుంబములో లేదా మీ సంఘ సేవలో కష్టమైన సమస్యలతో మీరు ఎలా వ్యవహరించాలి అనేదాని గురించి ఆల్మా యొక్క అనుభవము ఏమి సూచిస్తుంది?
మోషైయ 26:15–32లో ప్రభువు ఆల్మాకు ఏమి బోధించారు? ప్రభువు యొక్క జవాబులలో కొన్ని ఆల్మా యొక్క ప్రశ్నకు నేరుగా వచ్చిన స్పందనగా లేవని గమనించండి. ప్రార్థన మరియు వ్యక్తిగత బయల్పాటును పొందడం గురించి ఇది మీకేమి సూచిస్తుంది?
నేను పశ్చాత్తాపపడి, ఇతరులను క్షమించినప్పుడు, దేవుడు నన్ను స్వేచ్ఛగా క్షమిస్తారు.
పశ్చాత్తాపము మరియు క్షమాపణ మోషైయ 26–27లో పునరావృతమయ్యే విషయాలు. మోషైయ 26:22–24, 29–31; 27:23–37లో పశ్చాత్తాపము మరియు క్షమాపణ గురించి బోధించే పదాలు మరియు వాక్యభాగాల కొరకు చూడండి.
దేవుడు నిజంగా వారిని క్షమిస్తారా అని కొంతమంది జనులు ఆశ్చర్యపోతారు. ఆ చింత కలిగియున్న జరహేమ్లలోని సంఘ సభ్యునికి పెద్దవాడగు ఆల్మా ఏ విధంగా సలహా ఇస్తాడని మీరు ఊహిస్తున్నారు? ఈ సంఘ సభ్యునికి సహాయపడగలుగునట్లు మోషైయ 26:15–31లో ప్రభువు నుండి ఆల్మా ఏమి నేర్చుకున్నాడు? (మొరోనై 6:8; సిద్ధాంతము మరియు నిబంధనలు 19:16–18; 58:42–43 కూడా చూడండి).
యేసు క్రీస్తు ద్వారా నేను మంచిగా మారగలను.
చిన్నవాడగు ఆల్మాకు ఆత్మీయ పునర్జన్మ అవసరమనేది స్పష్టమైనది. అతడు మరియు మోషైయ కుమారులు “మిక్కిలి దుష్టులైన పాపులైయుండిరి” (మోషైయ 28:4). కానీ అతడు పరివర్తన చెందిన వెంటనే, ప్రతీఒక్కరికి —పరివర్తన ఆవశ్యకమైనదని ఆల్మా సాక్ష్యమిచ్చాడు: “సమస్త మానవజాతి … మరలా జన్మించవలెనని ఆశ్చర్యపడవద్దు,” అని అతడు చెప్పాడు (మోషైయ 27:25; వివరణ చేర్చబడినది).
మోషైయ 27:8–37లో ఆల్మా యొక్క అనుభవమును మీరు చదివినప్పుడు, అతని స్థానములో మిమ్మల్ని ఊహించుకోవడం గురించి ఆలోచించండి. మీరు మార్చుకోవలసిన విషయాల గురించి మీరు ఆలోచించగలరా? ఆల్మా తండ్రి వలె, ఎవరు “అధిక విశ్వాసముతో” మీ కొరకు ప్రార్థిస్తున్నారు? “దేవుని యొక్క శక్తి మరియు అధికారమును గూర్చి (మిమ్మల్ని) ఒప్పించుటకు” ఏ అనుభవాలు సహాయపడ్డాయి? (మోషైయ 27:14). మీరు “జ్ఞాపకము చేసుకొనునట్లు” మీకు లేదా మీ కుటుంబానికి ప్రభువు చేసిన “గొప్ప క్రియలు” ఏవి? (మోషైయ 27:16). మరలా జన్మించుట అనగా అర్థమేమిటనే దాని గురించి చిన్నవాడగు ఆల్మా యొక్క మాటలు మరియు క్రియల నుండి మీరేమి నేర్చుకుంటారు? మీరు చూసిన మాదిరులు ఏవి?
మీ అనుభవాలు ఆల్మా వంటి వాటిలా నాటకీయంగా లేదా అకస్మాత్తుగా లేనప్పటికీ, మీరు మారడానికి—లేదా మరలా జన్మించడానికి—రక్షకుడు సహాయపడుతున్న విధానాలలో కొన్నిటిని నమోదు చేయడానికి సమయం తీసుకోండి. మీ అనుభవాల గురించి వినడం నుండి ఎవరు లాభం పొందవచ్చు?
పరివర్తన గురించి ఈ పోలిక మీకేమి బోధిస్తుంది?
దేవుడు నా ప్రార్థనలు ఆలకించి, ఆయన చిత్తము మరియు సమయం ప్రకారము వాటికి జవాబిస్తారు.
మీరు పెద్దవాడగు ఆల్మా యొక్క పరిస్థితిలో ఉండియుండవచ్చు మరియు కుటుంబ సభ్యులలో ఒకరు నాశనకరమైన ఎంపికలు చేస్తుండవచ్చు. మీకు నిరీక్షణను ఇచ్చునట్లు మోషైయ 27:8–24లో మీరు ఏమి కనుగొంటారు? ఇతరుల తరఫున మీ ప్రార్థనలను ఈ వచనాలు ఎలా ప్రభావితం చేయవచ్చు?
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
నేను క్షమించాలని ప్రభువు కోరుతున్నారు.
-
క్షమాపణ గురించి ప్రభువు ఆల్మాకు ఏమి బోధించారో మీ పిల్లలు కనుగొనడానికి సహాయపడేందుకు, మీరు వారిని మోషైయ 26:29–31 చదవమని ఆహ్వానించవచ్చు మరియు“క్షమాపణ” అనే పదము ఎన్నిసార్లు కనిపిస్తుందో లెక్కించమని చెప్పవచ్చు. ఈ వచనాలు ఇతరులను క్షమించడం గురించి ఏమి బోధిస్తాయి?
-
క్షమాపణ గురించి రక్షకుని మాదిరిని నొక్కిచెప్పడానికి, మీరు సిలువపై నున్న ఆయన చిత్రాన్ని చూపించి, లూకా 23:33–34 కలిసి చదువవచ్చు. ఆయనను సిలువ వేసిన వారి కొరకు ఏమి చేయమని యేసు పరలోక తండ్రిని అడిగారు? ఈ చర్చ తర్వాత, మీ పిల్లలు ఒకరినొకరు క్షమించుకుంటున్నట్లు అభినయించవచ్చు.
-
మనం తప్పులు చేసినప్పుడు, మనల్ని మనం క్షమించుకోవడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. ఆల్మాకు దేవుడు చెప్పిన మాటలు ఎలా సహాయపడగలవు? దేవుడు వారిని క్షమిస్తారని ఎన్నడూ అనుకోని ఒకరితో వారు మాట్లాడుతున్నట్లు మీ పిల్లలు నటించవచ్చు. ఆ వ్యక్తికి సహాయపడునట్లు మోషైయ 26: 22–23, 29–30లో ఏదైనా కనుగొనమని మీ పిల్లలను ఆహ్వానించండి.
మరింతగా ఆయన వలె కావడానికి యేసు క్రీస్తు నాకు సహాయపడతారు.
-
చిన్నవాడగు ఆల్మా మరియు మోషైయ కుమారుల పరివర్తన రక్షకుని శక్తితో ఎవరైనా మారగలరని మీ పిల్లలకు చూపగలదు. ఆల్మా పశ్చాత్తాపపడ్డాడని మరియు అతడు మారడానికి యేసు క్రీస్తు సహాయపడ్డారని బోధించడానికి 24వ వచనానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వండి. వారికి నచ్చినట్లయితే, మీ పిల్లలు కథను అభినయించనివ్వండి.
నేను ప్రేమించే జనులను దేవుడు దీవించడానికి నేను ప్రార్థించి, ఉపవాసముండగలను.
-
మోషైయ 27:8–24 కలిసి చదవండి మరియు చిన్నవాడగు ఆల్మాకు సహాయపడేందుకు ఆల్మా మరియు అతని జనులు ఏమి చేసారో గుర్తించమని మీ పిల్లలను అడగండి. ఎవరి కోసమైనా మీరెప్పుడైనా ఉపవాసముండి, ప్రార్థన చేసారా? మీ అనుభవాన్ని మీ పిల్లలతో పంచుకోండి మరియు వారి అనుభవాలను పంచుకోనివ్వండి.
-
దేవుని సహాయం అవసరమైన వారెవరినైనా మీరు లేదా మీ పిల్లలు ఎరుగుదురా? ఆల్మా మాదిరిని అనుసరిస్తూ, మీరు ఆ వ్యక్తి గురించి కలిసి ప్రార్థించవచ్చు మరియు మీ పిల్లలు చేయగలిగితే, వారి కోసం ఉపవాసం కూడా ఉండవచ్చు.