2024 రండి, నన్ను అనుసరించండి
జూన్ 3–9: “వారు స్థిరముగా కదలకయుండిరి.” మోషైయ 29–ఆల్మా 4


“జూన్ 3–9: ‘వారు స్థిరముగా కదలకయుండిరి.’ మోషైయ 29–ఆల్మా 4,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2024)

“జూన్ 3-9. మోషైయ 29–ఆల్మా 4,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2024)

చిత్రం
ప్రవచించుచున్న చిన్నవాడగు ఆల్మా

Alma the Younger Preaching [ప్రవచించుచున్న చిన్నవాడగు ఆల్మా], గ్యారీ ఎల్. కాప్ చేత

జూన్ 3–9: “వారు స్థిరముగా కదలకయుండిరి”

మోషైయ 29ఆల్మా 4

రాజుల స్థానంలో ఎంపిక చేయబడిన న్యాయాధిపతులను ఉంచాలనే రాజైన మోషైయ సూచనను కేవలము ఒక తెలివైన రాజకీయ సంస్కరణగా కొందరు జనులు చూడవచ్చు. కానీ నీఫైయులకు, ప్రత్యేకంగా దుష్ట రాజైన నోవహు క్రింద జీవించిన వారికి, ఈ మార్పు ఆత్మీయ ప్రాముఖ్యతను కూడా కలిగియున్నది. ఒక అవినీతిపరుడైన రాజు తన జనులను ఎలా ప్రభావితం చేసాడో వారు చూసారు మరియు వారు అటువంటి ప్రభావము నుండి స్వేచ్ఛగా ఉండుటకు “మిక్కిలి ఆతృత” కలిగియున్నారు. ఈ మార్పు వారి స్వంత నీతి కొరకు మరియు “[వారి] స్వంత పాపముల కొరకు లెక్క అప్పగించుటకు” (మోషైయ 29:38) బాధ్యులుగా ఉండుటకు వారిని అనుమతిస్తుంది.

అవును, రాజుల పరిపాలనకు ముగింపు అనగా అర్థము నీఫైయుల సమాజములో సమస్యలకు ముగింపు అని కాదు. నీహోర్ మరియు అమ్లిసై వంటి కపటమైన జనులు అబద్ధపు ఆలోచనలు వ్యాప్తి చేసారు, అవిశ్వాసులు పరిశుద్ధులను హింసించారు, అనేకమంది సంఘ సభ్యులు గర్విష్టులయ్యారు మరియు సంఘమును విడిచిపెట్టారు. అయినప్పటికీ, “దేవుని యొక్క వినయముగల అనుచరులు” వారి చుట్టూ జరుగుచున్న దానిని లక్ష్యపెట్టకుండా, “స్థిరముగా కదలకయుండిరి” (ఆల్మా 4:15; 1:25).

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

మోషైయ 29:26–27; ఆల్మా 2:1–7

నా సమాజములో నేను మంచి ప్రభావమును కలిగియుండగలను.

న్యాయాధిపతుల పాలనలోకి వచ్చిన కేవలము ఐదు సంవత్సరాలలో, జనులలో అనేకులు సాధారణంగా సరైన దానిని ఎంపిక చేస్తారనే మోషైయ యొక్క ప్రకటనను పరీక్షించు ఒక క్లిష్ట పరిస్థితి ఎదురైంది (మోషైయ 29:26 చూడండి). సమస్య ఏమిటో మరియు దాని గురించి నీఫైయులు ఏమి చేసారో కనుగొనడానికి ఆల్మా 2:1–7ను అధ్యయనం చేయండి. “సంఘ జనులు” తమ స్వరాలు వినబడేలా చేసియుండకపోతే ఏమి జరిగియుండేది? మీ సమాజములో మీరు ఎలా ప్రమేయం కలిగియుండాలని ప్రభువు కోరుతున్నారనే దాని గురించి ఈ వృత్తాంతము నుండి మీరు ఇంకేమి నేర్చుకుంటారు? (మోషైయ 29:26–27 కూడా చూడండి).

మీ సమాజము ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలు ఏవి? నీపైయుల వలే, మీ స్వరము “జనుల యొక్క స్వరము”లో చేర్చబడునట్లు మీరు ఎలా నిశ్చయపరచగలరో ఆలోచించండి. యేసు క్రీస్తు యొక్క అనుచరులుగా, మంచి కొరకు మీ సమాజాన్ని మీరు ప్రభావితం చేయగల ఇతర విధానాలేవి?

డాలిన్ హెచ్. ఓక్స్, “మీ శత్రువులను ప్రేమించుడి,” లియహోనా, నవ. 2020, 26-29 కూడా చూడండి.

ఆల్మా 1

అబద్ధ బోధనలను గుర్తించడానికి దేవుని వాక్యము నాకు సహాయపడగలదు.

నీహోర్ చివరకు తాను బోధించినది తప్పు అని ఒప్పుకొన్నప్పటికీ, అతడి బోధనలు అనేక సంవత్సరాలు నీఫైయులను ప్రభావితం చేయడం కొనసాగించాయి. నీహోర్ బోధించిన దానిని జనులు ఇష్టపడ్డారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఆల్మా 1:2–6లో, నీహోర్ బోధనలలోని అబద్ధాలు—మరియు ఆ అబద్ధాలను కప్పిపుచ్చడానికి అతడు ఉపయోగించిన సత్యాల కొరకు చూడండి.

గిడియన్ “దేవుని వాక్యములతో” (ఆల్మా 1:7, 9) నీహోర్‌ను ఎదుర్కొన్నాడు. నీహోర్ అబద్ధాలను ఖండించే లేఖనాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి: మత్తయి 7:21–23; 2 నీఫై 26:29–31; మోషైయ 18:24–26; మరియు హీలమన్ 12:25–26. ప్రతీ లేఖన గద్యభాగాన్ని సంక్షిప్తపరచడానికి ప్రయత్నించండి. మన కాలంలో అబద్ధ బోధనలను ఖండించేలా సజీవ ప్రవక్తల నుండి మీరు ఏమి నేర్చుకున్నారు?

ఆల్మా 1:19–31; 4:6-15

యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులు “దేవుని యొక్క వినయముగల అనుచరులు.”

ఆల్మా యొక్క 1 మరియు 4వ అధ్యాయాలు రెండూ సంఘము అభివృద్ధి చెందిన సమయములను వివరిస్తాయి, కానీ ఆ అభివృద్ధికి సంఘ సభ్యులు భిన్నంగా స్పందించారు. ఉదాహరణకు, కేవలం కొన్ని సంవత్సరాలలో సంఘ సభ్యులు ఏవిధంగా మారిపోయారో చూడడానికి ఆల్మా 1:19–30ను ఆల్మా 4:6–15తో పోల్చండి. మీరు చదివిన దానిని బట్టి, భిన్న విశ్వాసాలు గల జనుల గురించి యేసు క్రీస్తు యొక్క నిజమైన అనుచరులు ఎలా భావిస్తారు? సంపదలు మరియు వృద్ధి పట్ల క్రీస్తు యొక్క నిజమైన అనుచరులు కలిగియున్న వైఖరి ఏది? మీ స్వంత వైఖరి గురించి మీరు మార్చుకోవాలని ప్రేరేపించబడినట్లు భావించినదేమిటి?

లేఖనములను మీతో పోల్చుకోండి. లేఖనముల వృత్తాంతములు మరియు బోధనలు మీ జీవితానికి ఎలా అన్వయించబడతాయో ఆలోచించండి. ఉదాహరణకు, నేడు మీరు గమనించే సమస్యలు మరియు ఆల్మా 1–4లో నీఫైయులు ఎదుర్కొన్న సమస్యల మధ్య పోలికలను మీరు కనుగొనవచ్చు.

చిత్రం
సెమినరీ చిహ్నము

ఆల్మా 4:6-20

నా మాదిరి మరియు సాక్ష్యము హృదయాలను మార్చగలవు.

అతని జనుల మధ్య జరుగుతున్న దానిని చూసినప్పుడు ఆల్మా అనుభవించిన విచారానికి బహుశా మీరు సంబంధం కలిగియుండవచ్చు. ఆల్మా 4:6–15లో అతడు చూసిన సమస్యల కొరకు చూడండి. మీరు ఎప్పుడైనా అటువంటి సమస్యలను గమనించారా? బహుశా ఈ సమస్యలతో కష్టపడుతున్న మీ ప్రియమైన వారి గురించి మీరు చింతిస్తుండవచ్చు. సహాయపడేందుకు మీరు ఏమి చేయగలరని మీరు ఆశ్చర్యపోయారా?

ప్రధాన న్యాయాధిపతిగా ఆల్మా ఈ సమస్యలను పరిష్కరించడానికి సరైన వ్యక్తి అని కొందరు చెప్పవచ్చు. కానీ ఒక ఉత్తమమైన విధానము ఉన్నదని ఆల్మా భావించాడు. మీరు 16–20 వచనాలు చదువుతున్నప్పుడు, తన జనులకు సహాయపడుటకు అతని విధానము గురించి మీకు ఆశ్చర్యము కలిగించేది ఏది?

దేవుని వాక్యము మరియు “శుద్ధమైన సాక్ష్యము”లో (19వ వచనము) ఆల్మా గొప్ప విశ్వాసం కలిగియున్నాడు. శుద్ధమైన సాక్ష్యము యొక్క శక్తికి ఎటువంటి ఉదాహరణలను మీరు చూసారు? యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త గురించి మీ సాక్ష్యాన్ని పంచుకోగల విభిన్న విధానాలను మీరు ధ్యానించినప్పుడు, మీరు ఆల్మా 4:6–14ను మరలా చదువవచ్చు. ఈ వచనాలలో సంఘ సభ్యుల చర్యలు యేసు క్రీస్తు మరియు ఆయన బోధనల పట్ల వారి సాక్ష్యముల గురించి ఏమి బయల్పరుస్తాయి? వారిపై మరియు ఇతరులపై వారి చర్యల యొక్క ప్రభావం గురించి మీరు ఏమి గమనిస్తారు? అది మాటలలో లేదా క్రియలలో పంచుకోబడినప్పటికీ, ఇతరుల యొక్క శుద్ధమైన సాక్ష్యము చేత మీరు దీవించబడిన విధానాల గురించి కూడా మీరు ఆలోచించవచ్చు.

మాటలలో లేదా క్రియలలో—యేసు క్రీస్తు గురించి మీ సాక్ష్యాన్ని పంచుకోగల విధానాల గురించి ఆలోచించండి. మీ సాక్ష్యం నుండి ఎవరు లాభం పొందుతారు?

గ్యారీ ఈ. స్టీవెన్‌సన్, “మీ సాక్ష్యమును పోషించుట మరియు పంచుకొనుట,” లియహోనా, నవ. 2022, 111–14 కూడా చూడండి.

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

ఆల్మా 1:2-9

అబద్ధ బోధనలను గుర్తించడానికి ప్రభువు నాకు సహాయపడగలరు.

  • మీ పిల్లలతో ఆల్మా 1:2–4 చదవడానికి ఒక విధానమేదనగా, అబద్ధ బోధకుడైన నీహోర్ చేత బోధించబడిన వ్యాఖ్యానాలను ఉపయోగించి తప్పు-ఒప్పుల క్విజ్ తయారుచేయడానికి వారికి సహాయపడడం. తర్వాత, సాతాను తరచు సత్యాలను అబద్ధాలతో ఎందుకు కలుపుతాడనే దాని గురించి మీరు వారితో మాట్లాడవచ్చు. కొన్ని ఉదాహరణలను ఆలోచించడానికి మీ పిల్లలకు సహాయపడండి. 7–9 వచనాలలో, గిడియన్ ఏ విధంగా నీహోర్ అబద్ధాలను ఎదుర్కొన్నాడు?

ఆల్మా 1:19-25

యేసు క్రీస్తు యొక్క సంఘ సభ్యునిగా నేను ఇతరులను ప్రేమిస్తాను మరియు సేవ చేస్తాను.

  • ఆల్మా కాలంలోని ప్రభువు సంఘము యొక్క కొందరు సభ్యులు ఉదారంగా ఉండేవారు మరియు ఇచ్చేవారు, ఇతరులు నిర్దయులు మరియు గర్విష్ఠులు. ఈ అనుభవాల నుండి నేర్చుకోవడానికి మీ పిల్లలకు సహాయపడేందుకు, మీరు కలిసి ఆల్మా 1:27, 30 చదువవచ్చు మరియు ప్రభువు సంఘము యొక్క సభ్యులు సహాయపడిన వివిధ జనుల జాబితా చేయవచ్చు. మన ప్రేమ మరియు సహాయం యొక్క “అవసరతలోనున్న” (ఆల్మా 1:30) వారెవరు మనకు తెలుసు?

  • జనులు మన పట్ల నిర్దయగా ఉన్నప్పుడు మనము ఏమి చేయాలి? మీ పిల్లలతో కలిసి ఆల్మా 1:19–20లో క్రీస్తు యొక్క అనుచరులు ఏవిధంగా ఆదరించబడ్డారో చదవడం గురించి ఆలోచించండి. 22 మరియు 25 వచనాలలో వారు ఎలా స్పందించారనే దాని గురించి మాట్లాడండి. ఇతరులు నిర్దయగా ఉన్నప్పుడు స్పందించవలసిన విధానాలను బహుశా మీరు సాధన చేయవచ్చు.

ఆల్మా 4:8-20

నా సాక్ష్యము ఇతరులను బలపరచగలదు.

  • తరచు ఒక చిన్న బిడ్డ యొక్క “శుద్ధమైన సాక్ష్యము” (ఆల్మా 4:19) ఇతరులపై బలమైన ప్రభావం కలిగియుండగలదు. మీ పిల్లలు దీనిని కనుగొనడంలో సహాయపడేందుకు, సంఘములో సంభవిస్తున్న సమస్యలను గుర్తించడంలో వారికి సహాయపడుతూ మీరు వారితో కలిసి ఆల్మా 4:8–12, 15 చదువవచ్చు. ఈ సమస్యలను పరిష్కరించడానికి ఆల్మా ఏమి చేయగలడు? ఆల్మా 4:16-20లో ఆల్మా ఏమి చేయాలని నిర్ణయించుకున్నాడో కనుగొనడానికి వారికి సహాయపడండి. క్రీస్తు గురించి వేరొకరి సాక్ష్యము మిమ్మల్ని ఎలా బలపరిచిందో బహుశా మీరు ఒకరితో ఒకరు పంచుకోవచ్చు.

  • సాక్ష్యమంటే ఏమిటనే దానికి మీ పిల్లలకు ఉదాహరణలు అవసరమైతే, సర్వసభ్య సమావేశంలో సాక్ష్యము పంచుకుంటున్న ఒక ప్రసంగీకుని వీడియో చూపడాన్ని పరిగణించండి. ఈ వనరుల నుండి సాక్ష్యాల గురించి మనం ఏమి నేర్చుకుంటాము? మీ పిల్లలు వారి సాక్ష్యాలను పంచుకోవడాన్ని సాధన చేయనివ్వండి.

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

చిత్రం
అమ్లిసైయులతో పోరాడుతున్న నీఫైయులు

Alma and Amlici [ఆల్మా మరియు అమ్లిసై], స్కాట్ ఎమ్. స్నో చేత

ముద్రించు