2024 రండి, నన్ను అనుసరించండి
అక్టోబరు 14-20: “మీరు నిబంధన యొక్క సంతానము.” 3 నీఫై 20–26


“అక్టోబరు 14–20: ‘మీరు నిబంధన యొక్క సంతానము.’ 3 నీఫై 20-26,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2023)

“అక్టోబరు 14-20. 3 నీఫై 20-26,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2023)

నీఫైయులకు ప్రత్యక్షమయిన క్రీస్తు

నీఫైయులకు ప్రత్యక్షమయిన క్రీస్తు యొక్క వివరణ, ఆండ్రూ బోస్లే చేత

అక్టోబరు 14-20: “మీరు నిబంధన యొక్క సంతానము”

3 నీఫై 20–26

జనులు ఇశ్రాయేలు వంశము వంటి పదాలను ఉపయోగించడాన్ని మీరు వినినప్పుడు, వారు మీ గురించి మాట్లాడుతున్నారని మీరు భావిస్తారా? నీఫైయులు మరియు లేమనీయులు ఇశ్రాయేలు యొక్క అసలైన వారసులు, “ఇశ్రాయేలు వృక్షము యొక్క ఒక కొమ్మయై” యున్నప్పటికీ, వారు కూడా “దాని శరీరము నుండి తప్పిపోయారు” (ఆల్మా 26:36; 1 నీఫై 15:12 కూడా చూడండి). కానీ రక్షకుని దృష్టిలో వారు తప్పిపోలేదని వారు తెలుసుకోవాలని ఆయన కోరుకున్నారు. “మీరు ఇశ్రాయేలు వంశస్థులైయున్నారు,” “మరియు మీరు నిబంధన వారైయున్నారు” (3 నీఫై 20:25) అన్నారాయన. బాప్తిస్మము తీసుకొని, ఆయనతో నిబంధనలు చేయువారెవరైనా కూడా ఇశ్రాయేలు వంశము వారైయున్నారని, “నిబంధన వారైయున్నారని”, నేడు కూడా అటువంటిదేదైనా ఆయన మీతో చెప్పవచ్చు. మరొక మాటలలో, యేసు ఇశ్రాయేలు వంశస్థుల గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆయన మీ గురించి మాట్లాడుతున్నారు. “భూమి యొక్క సమస్త జాతులు ఆశీర్వదించబడును” అనే సూచన మీకొరకైయున్నది (3 నీఫై 20:27). “లెమ్ము, నీ బలము ధరించుకొనుము” అనే ఆహ్వానము మీకొరకైనది (3 నీఫై 20:36). “నా కృప నిన్ను విడిచిపోదు, సమాధానవిషయమైన నా నిబంధన తొలగిపోదు” అనే ఆయన అమూల్యమైన వాగ్దానము మీ కొరకైనది (3 నీఫై 22:10).

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

3 నీఫై 20–22

కడవరి దినాలలో, దేవుడు ఆశ్చర్యకరమైన కార్యము జరిగిస్తారు.

3 నీఫై 20–22లో, రక్షకుడు తన నిబంధన జనుల భవిష్యత్తు గురించి ప్రవచించారు (ప్రత్యేకించి 3 నీఫై 20:30–32, 39–41; 21:9–11, 22–29 చూడండి). మీరు ఈ వచనాలు చదివినప్పుడు, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ చెప్పినదానిని గుర్తుంచుకోండి: “మనం ప్రభువు యొక్క నిబంధన జనుల మధ్య ఉన్నాము. ఈ వాగ్దానాల నెరవేర్పులో స్వయంగా పాల్గొనే విశేషాధికారము మనకు కలదు. జీవించేందుకు ఎంత ఉత్తేజభరితమైన సమయం!” (“The Gathering of Scattered Israel,” Liahona, Nov. 2006, 79). ఈ ప్రవచనాలలో ఏవి ప్రత్యేకంగా మీకు ఉత్తేజభరితంగా ఉన్నాయి? అవి నెరవేరడంలో సహాయపడేందుకు మీరేమి చేయగలరు?

ప్రేరేపించు పదాలు మరియు వాక్యభాగాల కోసం చూడండి. లేఖనములందు మీ కోసం ప్రత్యేకంగా వ్రాయబడినట్లుగా, మిమ్మల్ని ముగ్ధులను చేసే కొన్ని నిర్దిష్టమైన పదములు మరియు వాక్యభాగములను మీరు కనుగొనవచ్చు. వాటిని మీ లేఖనాలలో గుర్తించుట లేదా దినచర్య పుస్తకములో వ్రాయుట గురించి ఆలోచించండి.

3 నీఫై 22; 24

తన వద్దకు తిరిగివచ్చే వారిపట్ల దేవుడు కనికరము కలిగియుంటారు.

3 నీఫై 22 మరియు 24 లో రక్షకుడు యెషయా మరియు మలాకీ నుండి మాటలను వ్యాఖ్యానించారు, అవి మంటలోని బొగ్గులు, శుద్ధిచేయబడిన వెండి, వివాహము, పరలోకపు వాకిండ్లు—వంటి స్పష్టమైన చిత్రాలు మరియు పోలికలతో నిండియున్నాయి (ప్రత్యేకించి, 3 నీఫై 22:7–8, 10–17; 24:10–12, 17–18 చూడండి). తన జనులతో దేవుని సంబంధం—మరియు మీతో ఆయన సంబంధం గురించి ఈ పోలికలు మీకేమి బోధిస్తాయి? ఈ అధ్యాయాలలోని వాగ్దానాలు మీ జీవితంలో లేదా మీ కుటుంబం యొక్క జీవితంలో ఎలా నెరవేరాయి?

3 నీఫై 23:6–13

ఆధ్యాత్మిక అనుభవాలను నమోదు చేయడం నా కుటుంబాన్ని దీవించగలదు.

3 నీఫై 23:6–13లో నీఫైతో రక్షకుని సంభాషణ గురించి ఏది మిమ్మల్ని ఆకట్టుకుంటుంది? మీరు భద్రపరచిన గ్రంథాలను రక్షకుడు పరిశీలించవలసి వచ్చినట్లయితే, ఆయన మిమ్మల్ని ఏ ప్రశ్నలడగవచ్చు? మీరు నమోదు చేయవలసిన ముఖ్యమైన సంఘటనలు లేదా ఆధ్యాత్మిక అనుభవాలు ఏవి? అలా చేయడం ఎందుకు ముఖ్యమైనది? (3 నీఫై 26:2 చూడండి).

3 నీఫై 23; 26:1-12

నేను లేఖనాలను పరిశోధించాలని రక్షకుడు కోరుతున్నారు.

మీరు 3 నీఫై 20:10–12; 23; 26:1–12 చదువుతున్నప్పుడు, లేఖనాల గురించి రక్షకుడు ఎలా భావిస్తారో ధ్యానించండి. లేఖనాలను పరిశోధించడం మరియు కేవలం చదవడం మధ్యగల తేడా ఏమిటి? (3 నీఫై 23:1 చూడండి).

3 నీఫై 24:7-12

సెమినరీ చిహ్నము
దశమభాగము చెల్లించుట పరలోకపు వాకిండ్లను తెరుస్తుంది.

దశమభాగము చెల్లంచాలని దేవుని జనులు ఎల్లప్పుడు ఆజ్ఞాపించబడ్డారు (ఆదికాండము 14:17–20; మలాకీ 3:8–11 చూడండి). మీరు 3 నీఫై 24:7-12 అధ్యయనం చేస్తున్నప్పుడు, దశమభాగము చెల్లంచమని దేవుడు తన జనులను ఎందుకు అడుగుతారో ఆలోచించండి. ఈ ప్రశ్నలు మీ అధ్యయనాన్ని నడిపించగలవు:

  • దశమభాగ చట్టము అనగానేమి? (సిద్ధాంతము మరియు నిబంధనలు 119 చూడండి. ఈ బయల్పాటులో “అభివృద్ధి” అనగా ఆదాయము అని అర్థము. ఆదాయము గల సభ్యులందరు దశమభాగము చెల్లించాలి.) దశమభాగము ఇతర విరాళాల కంటే ఏవిధంగా భిన్నంగా ఉంది?

  • దశమభాగము దేనికి ఉపయోగించబడుతుంది? సంఘ సభ్యులు దశమభాగము చెల్లించినందువలన మీరు ఏ విధాలుగా దీవించబడ్డారు?

  • దశమభాగ చట్టమును జీవించే జనులకు వచ్చే దీవెనలేవి? (3 నీఫై 24:7-12 చూడండి). ప్రత్యేకించి, తప్పనిసరిగా డబ్బుతో సంబంధం లేని దీవెనల కొరకు చూడండి. మీ జీవితంలో ఈ దీవెనలను మీరు ఎలా చూసారు?

మార్కు 12:41–44 చదవాలని కూడా మీరు కోరుకోవచ్చు. ఈ కథ మీకేమి బోధిస్తుంది?

3 నీఫై 25:5–6

నా హృదయాన్ని నా పూర్వీకుల వైపు తిప్పడానికి ప్రభువు ఏలియాను పంపారు.

మన కాలంలో, దేవాలయము మరియు కుటుంబ చరిత్ర కార్యము ద్వారా మన హృదయాలు “[మన] తండ్రుల తట్టు తిప్పబడ్డాయి”. ఇది మీకు ఎలా జరిగింది? మీరు 3 నీఫై 25:5–6 మరియు సిద్ధాంతము మరియు నిబంధనలు 110:13–16 చదువుతున్నప్పుడు, ఇది దేవుని ప్రణాళికలో ఎందుకంత ముఖ్యమైన భాగమో ధ్యానించండి.

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

3 నీఫై 23:1, 5

నేను లేఖనాలను శ్రద్ధగా వెదకగలను.

  • 3 నీఫై 23 లో ఉన్న రక్షకుని యొక్క సూచనలు లేఖనాలు ఆయనకు ఎంత ముఖ్యమో చూపుతాయి. మీ పిల్లలు దీనిని కనుగొనడంలో సహాయపడేందుకు, మీరు బిగ్గరగా 3 నీఫై 23:1, 5 చదువవచ్చు మరియు మూడుసార్లు పునరావృతం చేయబడిన పదము కొరకు వినమని వారిని అడగవచ్చు. కేవలం చదవడం నుండి పరిశోధించడం ఏవిధంగా భిన్నంగా ఉంది?

  • బహుశా మీరు, మీ పిల్లలు బాగా ఇష్టమైన ఒక లేఖన వచనాన్ని వ్రాసి, దానిని దాచిపెట్టవచ్చు. తర్వాత వంతులవారీగా మీరు ఒకరు దాచిన లేఖనాన్ని మరొకరు కనుగొని, కలిసి వాటిని చదివి, ఈ వచనాలు ఎందుకు అర్థవంతమైనవో అనేదాని గురించి మాట్లాడవచ్చు.

3 నీఫై 24:8-12

దశమభాగము చెల్లించుట పరలోకపు వాకిండ్లను తెరుస్తుంది.

  • ఈ వాక్యాన్ని పూరించే విధానాలను కనుగొనడానికి 3 నీఫై 24:8–12 వెదకడంలో మీ పిల్లలకు సహాయపడండి: నేను దశమభాగము చెల్లించినట్లయితే, ప్రభువు … . మీరు దశమభాగము చెల్లించినందువలన దీవించబడిన ఒక అనుభవాన్ని కూడా మీరు పంచుకోవచ్చు. సహాయకరంగా అనిపించినట్లయితే, కొన్ని డబ్బు మొత్తాలను వ్రాసి, ప్రతీ మొత్తానికి ఎంత దశమభాగము చెల్లించాలో (10 శాతం) లెక్కించడానికి మీ పిల్లలకు సహాయపడడాన్ని పరిగణించండి.

  • ఆయన సంఘ సభ్యులను దీవించడానికి ప్రభువు దశమభాగాన్ని ఉపయోగించే కొన్ని విధానాల గురించి మాట్లాడడానికి ఈ వారపు ప్రోత్సాహ కార్యక్రమ పేజీ మీ పిల్లలకు సహాయపడగలదు. దశమభాగము వారిని దీవించే విధానాలను సూచించే బొమ్మలను వారు గీయవచ్చు (లేదా సంఘ పత్రికలలో బొమ్మలను కనుగొనవచ్చు).

3 నీఫై 25:5–6

నా పూర్వీకుల గురించి నేను నేర్చుకోవాలని పరలోక తండ్రి కోరుతున్నారు.

  • వారి పూర్వీకుల గురించి వెదకడానికి మరియు నేర్చుకోవడానికి మీ పిల్లలను మీరెలా ప్రేరేపిస్తారు? వారు పెద్దయినప్పుడు వారి పూర్వీకుల కొరకు విధులు నిర్వహించడానికి మీ పిల్లలను మీరెలా ప్రోత్సహించగలరు? కడవరి దినాలలో జరుగవలసిన దానిని కనుగొనడానికి 3 నీఫై 25:5–6 వెదకడానికి వారికి సహాయపడడాన్ని పరిగణించండి. మీరు ఈ వచనాలను చదువుతున్నప్పుడు, “హృదయం” అనే పదాన్ని వారు వినిన ప్రతీసారి చిన్నపిల్లలు తమ చేతిని తమ హృదయంపై పెట్టవచ్చు. సిద్ధాంతము మరియు నిబంధనలు 110:13–16 లో ఈ ప్రవచనము ఎలా నెరవేర్చబడిందో కూడా మీరు చదువవచ్చు. ఏవిధంగా మీ హృదయం మీ పూర్వీకుల వైపు తిరిగిందనే దాని గురించి మీ పిల్లలకు చెప్పండి. ఉదాహరణకు, మీ పూర్వీకుల గురించి నేర్చుకుంటున్నప్పుడు మరియు వారి కొరకు దేవాలయ విధులను చేస్తున్నప్పుడు మీకు కలిగిన ఏవైనా అనుభవాలను మీరు పంచుకోవచ్చు.

  • వారి తల్లిదండ్రులు మరియు తాతమామ్మల పేర్లతో ఒక వంశవృక్షాన్ని నింపడానికి మీ పిల్లలకు సహాయపడండి. మీ పూర్వీకులలో ఒకరి గురించి మీరు ఏ కథలు పంచుకోగలరు? వీలైతే ఫోటోలు చూపించండి.

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

నీఫైతో పాటు నీఫైయుల గ్రంథాలను చదువుతున్న యేసు

Bring Forth the Record [గ్రంథాన్ని తీసుకురండి], గ్యారీ ఎల్. కాప్ చేత