“సెప్టెంబరు 30–అక్టోబరు 6: ‘నేనే ధర్మశాస్త్రమును, వెలుగునైయున్నాను.’ 3 నీఫై 12-16,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2023)
“సెప్టెంబరు 30–అక్టోబరు 6. 3 నీఫై 12-16,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2023)
సెప్టెంబరు 30–అక్టోబరు 6: “నేనే ధర్మశాస్త్రమును, వెలుగునైయున్నాను”
3 నీఫై 12–16
గలిలయలో కొండమీది ప్రసంగమును వినుటకు సమావేశమైన యేసు యొక్క శిష్యుల వలే, సమృద్ధి దేశములో దేవాలయము వద్ద సమావేశమైన జనులు మోషే ధర్మశాస్త్రము ప్రకారము జీవించారు. అది వారి ఆత్మలకు క్రీస్తు వైపు దారిచూపెను కనుక, వారు దానిని అనుసరించారు (జేకబ్ 4:5 చూడండి) మరియు ఇప్పుడు ఒక ఉన్నతమైన ధర్మశాస్త్రమును ప్రకటిస్తూ, క్రీస్తు వారి యెదుట నిలబడెను. కానీ మోషే ధర్మశాస్త్రమును ఎన్నడూ జీవించని మనము కూడా యేసు తన శిష్యుల కొరకు ఉంచిన ప్రమాణము ఎక్కువ ఉన్నతమైనదని గుర్తించవచ్చు. “మీరును పరిపూర్ణులు కావలెనని నేను కోరుచున్నాను,” (3 నీఫై 12:48) అని ఆయన ప్రకటించారు. ఇది మీరు సరిపోరని భావించేలా చేస్తే, యేసు ఇలా కూడా చెప్పారని జ్ఞాపకముంచుకోండి, “ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది” (3 నీఫై 12:3). మరొకవిధంగా చెప్పుచూ—ఈ మహోన్నతమైన ధర్మశాస్త్రము ఒక ఆహ్వానాన్ని కలిగియున్నది, “నా యొద్దకు రండి మరియు రక్షణ పొందుడి” (3 నీఫై 12:20). మోషే ధర్మశాస్త్రము వలే, ఈ ధర్మశాస్త్రము మనకు క్రీస్తు వైపు దారిచూపుతుంది—ఆయన మనల్ని రక్షించగల మరియు పరిపూర్ణులుగా చేయగల ఏకైక వ్యక్తి. “ఇదిగో, నేనే ధర్మశాస్త్రమును, వెలుగునైయున్నాను. నావైపు చూచి, అంతము వరకు సహించుడి మరియు మీరు జీవించెదరు” (3 నీఫై 15:9) అని ఆయన చెప్పారు.
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
నేను యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యునిగా ఉండగలను.
3 నీఫై 12–14 లో రక్షకుడు బోధించిన దానిని అధ్యయనము చేయుటకు మరియు అన్వయించుకొనుటకు ఒక విధానము ఇక్కడున్నది: వచనముల గుంపును ఎంచుకొని, “యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులు …” అని ప్రారంభించి ఒక్క వాక్యములో వాటిని మీరు సంక్షిప్తపరచగలరేమో చూడండి, ఉదాహరణకు 3 నీఫై 13:1-8 యొక్క సంగ్రహము ఇలా ఉండవచ్చు, “యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులు మంచి చేసినందుకు జనుల అభినందనలు కోరరు.” ఈ గద్యభాగాలతో దీనిని ప్రయత్నించండి:
ఈ వచనాలను చదివిన తర్వాత, యేసు క్రీస్తును అనుసరించడానికి ఏమి చేయాలని మీరు ప్రేరేపించబడ్డారు?
3 నీఫై 12:48 లోని ఆజ్ఞ ముంచివేయునట్లుగా—అసాధ్యంగా కూడా కనిపించవచ్చు. ఈ వచనములో రక్షకుని మాటలను గ్రహించుటకు మీకు సహాయపడునట్లు, ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ యొక్క సందేశము “చివరకు—మీరును పరిపూర్ణులుగా ఉండుము” (లియహోనా, నవ. 2017, 40–42) నుండి మీరేమి నేర్చుకుంటారు? మొరోనై 10:32–33 ప్రకారము, రక్షకుని వలె పరిపూర్ణులవడాన్ని ఏది సాధ్యం చేస్తుంది?
3 నీఫై 12:1-2; 15:23–24; 16:1–6
చూడకుండా విశ్వసించు వారు ధన్యులు.
దేవుని పిల్లలలో చాలా తక్కువమంది సమృద్ధి దేశములోని జనుల వలె రక్షకుడిని చూసారు మరియు ఆయన స్వరమును విన్నారు. మనలో అనేకులు 3 నీఫై 12:2; 15:23; మరియు 16:4–6 లో వర్ణించబడిన జనుల వలే ఎక్కువగా ఉన్నారు. ఈ వచనములలో అటువంటి జనులకు ఏ వాగ్దానములు చేయబడినవి? ఈ వాగ్దానములు మీ జీవితంలో ఏవిధంగా నెరవేర్చబడినవి?
యోహాను 20:26–29; 2 నీఫై 26:12–13; ఆల్మా 32:16–18 కూడా చూడండి.
3 నీఫై 12:21–30; 13:1–8, 16–18; 14:21–23
నా హృదయపు కోరికలను శుద్ధి చేసుకోవడానికి నేను ప్రయత్నించగలను.
ఈ అధ్యాయాలలో మీరు గుర్తించగల ఒక విషయము—మన క్రియలందు మాత్రమే కాదు కానీ మన హృదయములందు కూడా నీతిగా ఉండాలి అనే ఒక ఉన్నతమైన ధర్మశాస్త్రమును జీవించుటకు రక్షకుని యొక్క ఆహ్వానము. వివాదము (3 నీఫై 12:21–26), దుర్నీతి (3 నీఫై 12:27–30), ప్రార్థన (3 నీఫై 13:5–8) మరియు ఉపవాసము (3 నీఫై 13:16–18) గురించి రక్షకుడు మాట్లాడినప్పుడు ఈ విషయము కొరకు వెదకండి. మీరు కనుగొనగల ఇతర మాదిరులేవి? మీ హృదయపు కోరికలను శుద్ధి చేయడానికి మీరేమి చేయగలరు?
నేను అడిగి, వెదకి, తట్టిన యెడల పరలోక తండ్రి నాకు మంచి వస్తువులనిచ్చును.
3 నీఫై 14:7–11 లో అడుగమని, వెదకమని మరియు తట్టమని ప్రభువు యొక్క ఆహ్వానమును మీరు చదివినప్పుడు, ఏ “మంచి విషయాలను” మీరు అడగాలని ఆయన కోరియుండవచ్చో ధ్యానించండి. మీరు ఎలా అడగాలి, వెదకాలి మరియు తట్టాలో గ్రహించుటకు క్రింది అదనపు లేఖనాలు మీకు సహాయపడవచ్చు. మీరు ఆశించిన రీతిలో కొన్ని ప్రార్థనలు ఎందుకు జవాబివ్వబడుట లేదో వివరించుటకు కూడా అవి సహాయపడగలవు: యెషయా 55:8–9; హీలమన్ 10:4–5; మొరోనై 7:26–27, 33, 37; మరియు సిద్ధాంతము మరియు నిబంధనలు 9:7–9; 88:64. మీరు అడిగి, వెదకి, తట్టే విధానాన్ని ఈ గద్యభాగాలు ఎలా ప్రభావితం చేయవచ్చు?
మిల్టన్ కామెర్గో, “అడుగుడి, వెదకుడి మరియు తట్టుడి,” లియహోనా, నవ. 2020, 106–8 కూడా చూడండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
యేసును అనుసరించుట ద్వారా నేనొక మంచి మాదిరిగా ఉండగలను.
-
వారి మాదిరులు ఇతరులను ఎంతగా దీవించగలవో పిల్లలు కొన్నిసార్లు గుర్తించలేకపోవచ్చు. వారి వెలుగును ప్రకాశించనివ్వడానికి వారిని ప్రోత్సహించేందుకు 3 నీఫై 12:14–16 ఉపయోగించండి. ఉదాహరణకు, ఈ వచనాలలో మీరు “మీరు” లేదా “మీ యొక్క” అని చదివినప్పుడు, తమవైపు తాము చూపించుకోమని మీ పిల్లలను అడగండి. వారు యేసు క్రీస్తును అనుసరించినప్పుడు వారిలో మీరు చూసే వెలుగు గురించి మరియు ఆయనను అనుసరించమని అది మిమ్మల్ని కూడా ఎలా ప్రేరేపిస్తుందో పిల్లలకు చెప్పండి.
-
వారి వెలుగును దాచకుండా ఉండేందుకు మీ పిల్లలను ప్రోత్సహించడానికి (3 నీఫై 12:15 చూడండి), వంతులవారీగా ఒక దీపాన్ని లేదా ఇతర వెలుగును దాచమని లేదా మూసియుంచమని వారికి చెప్పండి. ఇతరులకు మంచి మాదిరిగా ఉండేందుకు వారు చేయగల దేనినైనా వారు చెప్పిన ప్రతీసారి వారు దీపంపై ముసుగు తొలగించవచ్చు.
“పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి.”
-
ఈ వచనాలు చదవడం మనము దేనికి విలువిస్తామనే దాని గురించి ఒక చర్చను ప్రేరేపించవచ్చు. నిత్య విలువగల సంపదలను గూర్చి వారికి జ్ఞాపకం చేసే వస్తువులను కనుగొనడానికి ఒక నిధి వేటలో మీరు మీ పిల్లలను నడిపించవచ్చు.
పరలోక తండ్రి నా ప్రార్థనలకు జవాబిస్తారు.
-
మీరు 3 నీఫై 14:7 చదివినప్పుడు, మీ పిల్లలు ఈ వచనంలో రక్షకుని యొక్క ప్రతీ ఆహ్వానాన్ని సూచించే అభినయాలను చేయవచ్చు. ఉదాహరణకు, వారు తమ చేతులను పైకెత్తవచ్చు (అడుగుడి), వారి చేతులతో దుర్బిణీలు చేయవచ్చు (వెదకుడి) లేదా తలుపు తడుతున్నట్లు నటించవచ్చు (తట్టుడి). వారి ప్రార్థనలలో వారు చెప్పగల మరియు అడుగగల విషయాలను గురించి ఆలోచించడానికి మీ పిల్లలకు సహాయపడండి.
-
మీ పిల్లలు ఒక ఆటను ఆనందించవచ్చు, అందులో వారు దేనికొరకైనా అడుగుతారు మరియు పూర్తిగా భిన్నమైన దానిని పొందుతారు. 3 నీఫై 14:7–11 లో, పరలోకమందున్న మన తండ్రి గురించి మనము ఏమి తెలుసుకోవాలని రక్షకుడు కోరుతున్నారు?
ఆయన బోధించే దానిని నేను విని, చేయాలని రక్షకుడు కోరుతున్నారు.
-
ఈ వచనములలో ఉన్న ఉపమానమును దృశ్యీకరించుటకు మీ పిల్లలకు మీరు సహాయపడగల విధానములను గూర్చి ఆలోచించండి. బహుశా వారు బొమ్మలు గీయవచ్చు, అభినయించవచ్చు లేదా గట్టి మరియు ఇసుక పునాదులపై ఏదైనా నిర్మించవచ్చు. వారు 3 నీఫై 14:24–27 చదివినప్పుడు, “బుద్ధిగలవాడు” స్థానంలో వారి పేర్లను కూడా భర్తీచేయవచ్చు. లేదా 3 నీఫై 14:21–27 మరియు 15:1 లో “చేస్తాడు” అనే పదాన్ని వారు వినిన ప్రతీసారి వారు లేచి నిలబడవచ్చు.
-
మీరు ప్రయత్నించగల ఒక వస్తుపాఠము ఇక్కడున్నది: మీ పిల్లలను వారి కాళ్ళలో ఒకటి రక్షకుని మాటలు వినడాన్ని సూచిస్తున్నదని, మరొకటి రక్షకుడు బోధించిన దానిని చేయడాన్ని సూచిస్తున్నదని ఊహించుకోమని అడగండి. వారి “వినడం” అనే కాలిపై మాత్రమే నిలబడేందుకు ప్రయత్నించమని మీ పిల్లలను ఆహ్వానించండి. గదిలో బలమైన గాలి వీచినట్లయితే ఏమి జరుగుతుంది? తర్వాత మీరు, మీ పిల్లలు మనం చేయాలని రక్షకుడు బోధించిన నిర్దిష్టమైన విషయాల కొరకు చూడవచ్చు: 3 నీఫై 12:3–12, 21–26; 13:5–8 చూడండి.