“సెప్టెంబరు 23–29: ‘లేచి నా యొద్దకు రండి.’ 3 నీఫై 8-11,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2023)
“సెప్టెంబరు 23-29. 3 నీఫై 8-11,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2023)
సెప్టెంబరు 23-29: “లేచి నా యొద్దకు రండి”
3 నీఫై 8–11
”ఇదిగో లోకములోనికి వచ్చునని ప్రవక్తలు సాక్ష్యమిచ్చిన యేసు క్రీస్తును నేనే” (3 నీఫై 11:10). ఈ మాటలతో, 600 సంవత్సరాలకు పైగా మోర్మన్ గ్రంథ ప్రవచనాలను నెరవేరుస్తూ, పునరుత్థానము చెందిన రక్షకుడు తననుతాను పరిచయం చేసుకున్నారు. ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ ఇలా వ్రాసారు, “ఆ ప్రత్యక్షత మరియు ఆ ప్రకటన మోర్మన్ గ్రంథము యొక్క సమస్త చరిత్రలో ఒక కేంద్ర బిందువును, మహోన్నత క్షణాన్ని ఏర్పరచింది. ప్రతీ నీఫై ప్రవక్తకు తెలియజేసి, ప్రేరేపించిన ప్రత్యక్షత మరియు ఆదేశమది. … ప్రతీఒక్కరు ఆయన గురించి మాట్లాడారు, ఆయన గురించి పాడారు, ఆయన గురించి కలలుగన్నారు మరియు ఆయన ప్రత్యక్షత కోసం ప్రార్థించారు—కానీ ఇక్కడ ఆయన నిజంగా ఉన్నారు. అద్భుతమైన దినము! ప్రతీ చీకటి రాత్రిని ఉదయపు వెలుగుగా మార్చే దేవుడు వచ్చియున్నాడు” (Christ and the New Covenant [1997], 250–51).
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
యేసు క్రీస్తు లోకమునకు వెలుగైయున్నారు.
చీకటి మరియు వెలుగుకు సంబంధించిన చిహ్నములు 3 నీఫై 8–11 అంతటా మళ్ళీ మళ్ళీ చెప్పబడ్డాయని మీరు గమనించవచ్చు. ఆత్మీయ అంధకారము మరియు వెలుగు గురించి ఈ అధ్యాయాల నుండి మీరేమి నేర్చుకుంటారు? (ఉదాహరణకు, 3 నీఫై 8:19–23; 9:18; 10:9–13 చూడండి). మీ జీవితంలోకి చీకటిని తెచ్చేది ఏది? వెలుగును తెచ్చేది ఏది? “లోకమునకు జీవమును వెలుగునైయున్నానని” రక్షకుడు తననుతాను ఎందుకు పరిచయం చేసుకున్నారని మీరనుకుంటున్నారు? (3 నీఫై 9:18; 11:11).
3 నీఫై 9–11 లో వివరించబడిన సంఘటనలు మోర్మన్ గ్రంథములో అత్యంత పవిత్రమైన వాటి మధ్య ఉన్నాయి. వాటిని నెమ్మదిగా చదవండి మరియు జాగ్రత్తగా ధ్యానించండి. మీకు సహాయం చేయడానికి ఇక్కడ కొన్ని ప్రశ్నలున్నాయి. మీకు కలిగే భావాలను నమోదు చేయడాన్ని పరిగణించండి.
-
నేను ఈ జనుల మధ్య ఉన్నట్లయితే, నేను ఎలా భావించియుండేవాడిని?
-
ఈ అధ్యాయాలలో రక్షకుని గురించి నన్ను ఆకట్టుకున్నదేది?
-
యేసు క్రీస్తు నా రక్షకుడు అని నాకెలా తెలుస్తుంది?
-
ఆయన నా జీవితంలో ఏవిధంగా వెలుగైయున్నారు?
షారన్ యుబాంక్, “క్రీస్తు: అంధకారములో ప్రకాశించు వెలుగు,” లియహోనా, మే 2019, 73–76 కూడా చూడండి.
క్షమించడానికి యేసు క్రీస్తు ఆతృతగా ఉన్నారు.
“మన పాపములను క్షమించడానికి రక్షకుడు సమర్థుడని మరియు ఆతృతగా ఉన్నారని నేను సాక్ష్యమిస్తున్నాను” (“Repent … That I May Heal You,” Liahona, Nov. 2009, 40) అని ఎల్డర్ నీల్ ఎల్. ఆండర్సెన్ వ్యాఖ్యానించారు. క్షమించడానికి క్రీస్తు యొక్క ఆతృతకు నిదర్శనము కొరకు 3 నీఫై 9–10 వెదకండి. ఆయన ప్రేమ మరియు దయను అనుభవించడానికి మీకు సహాయపడేలా 3 నీఫై 9:13–22; 10:1–6 లో మీరేమి కనుగొంటారు? ఆయన మిమ్మల్ని “చేర్చుకొని”, “పోషించినట్లు” మీరు ఎప్పుడు భావించారు? (3 నీఫై 10:4 చూడండి).
“విరిగిన హృదయము మరియు నలిగిన మనస్సు” ప్రభువుకు కావాలి.
రక్షకుడు రాకముందు జంతు బలులు యేసు క్రీస్తు యొక్క త్యాగానికి చిహ్నముగా ఉండేవి (మోషే 5:5–8 చూడండి). 3 నీఫై 9:20-22 లో రక్షకుడు ఇచ్చిన క్రొత్త ఆజ్ఞ ఏది? ఇది మనకు ఆయన వైపు మరియు ఆయన త్యాగం వైపు ఎలా దారిచూపుతుంది?
విరిగిన హృదయము మరియు నలిగిన మనస్సును బలిగా అర్పించడమంటే మీకు గల అర్థమేమిటి? రక్షకుడు మీ నుండి ఈ త్యాగాన్ని కోరుతున్నారని మీరెందుకు భావిస్తున్నారు?
దేవుని స్వరమును వినడాన్ని మరియు గ్రహించడాన్ని నేను నేర్చుకోగలను.
దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఎలా తెలుసుకోగలరు? దేవుని స్వరమును వినడం మరియు గ్రహించడం గురించి కొన్ని సూత్రాలను అర్థం చేసుకోవడానికి 3 నీఫై 11:1–8 లోని జనుల అనుభవం బహుశా మీకు సహాయపడగలదు. జనులు వినిన దేవుని స్వరము యొక్క స్వభావాలను మరియు దానిని బాగా అర్థం చేసుకోవడానికి వారు చేసిన దానిని మీరు వ్రాసియుంచుకోవచ్చు.
దేవుని స్వరమును లేదా ఆయన ఆత్మ యొక్క ప్రభావాన్ని వివరించే ఇతర లేఖనాలను పరిశోధించడం కూడా సహాయపడవచ్చు. ఇక్కడ కొన్ని ఉన్నాయి. బహుశా వీటిని చదివిన తర్వాత, బయల్పాటును గుర్తించడానికి కొన్ని మార్గదర్శకాలను మీరు వ్రాయవచ్చు: 1 రాజులు 19:11–12; గలతీయులకు 5:22–23; ఆల్మా 32:27–28, 35; హీలమన్ 10:2–4; ఈథర్ 4:11–12; సిద్ధాంతము మరియు నిబంధనలు 9:7–9; 11:11–14.
దేవుని స్వరమును విని, అనుసరించే అనుభవం గల నేటి ప్రవక్తలు, అపొస్తలులు మరియు ఇతర సంఘ నాయకుల నుండి వినడం వలన కూడా మీరు లాభం పొందవచ్చు.
మరింత స్పష్టంగా దేవుని స్వరమును విని, గుర్తించడానికి మీరు నేర్చుకున్న దానిని మీరు ఏవిధంగా అన్వయిస్తారు?
రస్సెల్ ఎన్. నెల్సన్, “ఆయనను వినుము,” లియహోనా, మే 2020, 88–92 కూడా చూడండి.
ఆయన గురించి ఒక వ్యక్తిగత సాక్ష్యమును పొందమని యేసు క్రీస్తు నన్ను ఆహ్వానిస్తున్నారు.
యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, సమృద్ధి దేశమందు దేవాలయము వద్ద సుమారు 2,500 మంది జనులు సమకూడారు (3 నీఫై17:25 చూడండి). ఇంత గొప్ప సంఖ్యలో ఉన్నప్పటికీ, ఆయన చేతులు మరియు పాదాలలో ఉన్న మేకు గురుతులను తాకడానికి వారిలో ప్రతీఒక్కరిని ”ఒకరి తర్వాత ఒకరుగా” రమ్మని రక్షకుడు ఆహ్వానించారు (3 నీఫై11:14–15). మీరు చదివినప్పుడు, అక్కడ ఉండడం ఎలా ఉండియుంటుందో ఊహించండి. ఏ విధాలుగా రక్షకుడు మిమ్మల్ని “లేచి తన వద్దకు రమ్మని“ ఆహ్వానిస్తున్నారు? (3 నీఫై 11:14).
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
ఈ ఆదివారం నెలలో ఐదవ ఆదివారం కాబట్టి, “అనుబంధం బి: దేవుని నిబంధన బాటపై జీవితకాలము నిలిచేందుకు పిల్లలను సిద్ధపరచుట”లోని అభ్యాస కార్యకలాపాలను ఉపయోగించమని ప్రాథమిక బోధకులు ప్రోత్సహించబడ్డారు.
నేను అంధకారములో ఉన్నప్పుడు, యేసు క్రీస్తు నాకు వెలుగు కాగలరు.
-
3 నీఫై 8–9 లో వివరించబడిన అనుభవాలతో పోల్చుకోవడానికి మీ పిల్లలకు సహాయపడేందుకు, ఒక చీకటి గదిలో మీరు ఈ అధ్యాయాలలో నమోదు చేయబడిన కొన్ని భాగాలను మళ్ళీ చెప్పవచ్చు లేదా వినవచ్చు. మూడు రోజులు చీకటిలో ఉండడం ఎలా ఉండియుంటుందో చర్చించండి. అప్పుడు యేసు క్రీస్తు తననుతాను లోకమునకు వెలుగుగా ఎందుకు పిలుచుకున్నారు (3 నీఫై 9:18 చూడండి) అనే దాని గురించి మీరు మాట్లాడవచ్చు. ఆయన మనకు వెలుగుగా ఉండగలుగునట్లు జనులను మరియు మనల్ని ఏమి చేయమని యేసు ఆహ్వానిస్తున్నారు? (3 నీఫై 9:20–22 చూడండి).
కోడి తన పిల్లలను కాపాడినట్లు యేసు తన జనులను కాపాడతారు.
-
కోడి తన పిల్లలను రెక్కల క్రింద చేర్చుకొని కాపాడే కథ, రక్షకుని స్వభావము మరియు పనిని అర్థం చేసుకోవడానికి పిల్లలకు సహాయపడేందుకు శక్తివంతమైన బోధనా సాధనం కాగలదు. మీ కుటుంబము కోడి మరియు కోడిపిల్లల చిత్రాన్ని చూస్తున్నప్పుడు మీరు 3 నీఫై 10:4–6 చదువవచ్చు. ఒక కోడి తన పిల్లలను సమకూర్చవలసిన అవసరమేమిటి? రక్షకుడు మనల్ని ఆయనకు దగ్గరగా సమకూర్చాలని ఎందుకు కోరుతున్నారు? రక్షణ కొరకు మనము ఆయన వద్దకు ఎలా రాగలము?
యేసు క్రీస్తు నన్ను ఆయన వద్దకు రమ్మని ఆహ్వానిస్తున్నారు.
-
మీరు 3 నీఫై 11:1–15 కలిసి చదువుతున్నప్పుడు, ఆత్మను అనుభవించడానికి మీరు మీ పిల్లలకు ఎలా సహాయపడతారు? బహుశా దేవుని ప్రేమను అనుభవించడానికి వారికి సహాయపడే ఒకదానిని ఈ వచనాలలో వారు కనుగొనినప్పుడు మీకు చెప్పమని మీరు వారిని అడగవచ్చు. ఈ సారాంశంలోని చిత్రాలతో కూడా మీరు అదేవిధంగా చేయవచ్చు. మీరు ఈ సంఘటనలను చదివి, ధ్యానించినప్పుడు మీరు ఏవిధంగా భావించారనే దాని గురించి మీ పిల్లలకు చెప్పండి. వారిని తమ భావాలను పంచుకోనివ్వండి.
దేవుడు నాతో మృదువైన, నిమ్మళమైన స్వరంలో మాట్లాడతారు.
-
బహుశా ఈ వచనాలలో కొన్నింటిని మీరు మృదువుగా, “నిమ్మళమైన స్వరములో” చదువవచ్చు (3 నీఫై11:3). పరలోకము నుండి వచ్చిన స్వరమును గ్రహించడానికి జనులు ఏమి చేయవలసియున్నది? (5–7 వచనాలు చూడండి). వారి అనుభవము నుండి మనమేమి నేర్చుకుంటాము?
నేను బాప్తిస్మం పొందాలని యేసు క్రీస్తు కోరుతున్నారు.
-
మీరు 3 నీఫై 11:21-26 చదువుతున్నప్పుడు, బాప్తిస్మమివ్వు అనే పదమును వారు వినిన ప్రతిసారీ లేచి నిలబడమని మీరు మీ పిల్లలను ఆహ్వానించవచ్చు. బాప్తిస్మం గురించి యేసు ఏమి బోధించారు? మీ పిల్లలు ఇంతకుముందు బాప్తిస్మమును చూసినట్లయితే, వారు చూసిన దానిని వివరించమని వారిని అడగండి. మనము బాప్తిస్మం తీసుకోవాలని యేసు ఎందుకు కోరుతున్నారు?