2024 రండి, నన్ను అనుసరించండి
ఆగష్టు 26–సెప్టెంబరు 1: “మన విమోచకుని యొక్క బండ.” హీలమన్ 1–6


“ఆగష్టు 26–సెప్టెంబరు 1: ‘మన విమోచకుని యొక్క బండ.’ హీలమన్ 1-6,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2023)

“ఆగష్టు 26–సెప్టెంబరు 1. హీలమన్ 1–6,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు:2024 (2023)

రాళ్ళపై ఎగిసిపడుతున్న అలలు

ఆగష్టు 26–సెప్టెంబరు 1 : “మన విమోచకుని యొక్క బండ”

హీలమన్ 1–6

నీఫైయులు మరియు లేమనీయుల మధ్య విజయాలు మరియు విషాదాంతాలు రెండిటిని హీలమన్ గ్రంథము నమోదు చేస్తుంది. ఇది “నీఫైయుల జనుల మధ్య గంభీరమైన సంకటము” (హీలమన్ 1:1) తో మొదలవుతుంది మరియు గ్రంథము అంతటా కష్టాలు వస్తూనే ఉంటాయి. ఇక్కడ మనము రాజకీయ సమస్య, దొంగల ముఠాలు, ప్రవక్తలను తిరస్కరించుట, గర్వము మరియు దేశమంతటా అపనమ్మకము గురించి చదువుతాము. అయితే నీఫై మరియు లీహైల వంటి మాదిరులను, “జనులలో మిక్కిలి వినయము గలవారిని,” (హీలమన్ 3:34) వారు బ్రతికియుండుట మాత్రమే కాదు కానీ ఆత్మీయంగా వర్ధిల్లుటను కూడా మనము కనుగొంటాము. వారు దీనిని ఎలా చేసారు? వారి నాగరికత క్షీణించి, పడిపోతున్నప్పుడు వారు బలంగా ఎలా నిలిచారు? “(మన) పైన కొట్టుటకు” అపవాది “బలమైన గాలివాన”ను పంపినప్పుడు—మన జీవితాలను “దేవుని కుమారుడైన క్రీస్తు మరియు మన విమోచకుని యొక్క బండపైన” కట్టుట ద్వారా అదేవిధంగా మనలో ఎవరైనా బలముగా నిలిచియుండగలము … మనుష్యులు ఆ పునాదిపై కట్టబడిన యెడల ఎన్నటికీ పడిపోరు (హీలమన్ 5:12).

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

హీలమన్ 1–6

గర్వము నన్ను ప్రభువు యొక్క ఆత్మ మరియు బలము నుండి వేరు చేస్తుంది.

మీరు హీలమన్ 1–6 చదివినప్పుడు, నీఫైయుల ప్రవర్తనలో ఒక నమూనాను మీరు గమనించవచ్చు. వారు నీతిమంతులుగా ఉన్నప్పుడు దేవుడు వారిని దీవిస్తారు మరియు వారు వృద్ధిచెందుతారు. కొంతకాలము తరువాత, నాశనము మరియు బాధ అనుభవించడానికి నడిపించు ఎంపికలు చేస్తూ, వారు గర్విష్ఠులు మరియు దుష్టులవుతారు. తరువాత వారు తగ్గించబడి, పశ్చాత్తాపపడుటకు ప్రేరేపించబడతారు మరియు దేవుడు వారిని మరలా దీవిస్తారు. ఆ నమూనా దానికదే ఎంత తరచుగా పునరావృతం అవుతుందంటే, కొందరు దానిని “గర్వపు చక్రము” అని పిలుస్తారు.

గర్వపు చక్రము

“గర్వపు చక్రము”

మీరు హీలమన్ 1–6 చదివినప్పుడు ఈ చక్రము యొక్క మాదిరుల కొరకు చూడండి. ఈ నమూనాను అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడేందుకు ఇక్కడ కొన్ని ప్రశ్నలున్నాయి:

  • నీఫైయుల మధ్య గర్వము యొక్క ఏ నిదర్శనములను మీరు చూస్తారు? (ఉదాహరణకు హీలమన్ 3:33–34; 4:11–13 చూడండి). మీలో అదేవిధమైన గర్వపు నిదర్శనములను మీరు చూసారా?

  • గర్వము మరియు దుష్టత్వము యొక్క పర్యవసానములేవి? (హీలమన్ 4:23–26 చూడండి). వినయము మరియు పశ్చాత్తాపము యొక్క పర్యవసానములేవి? (హీలమన్ 3:27–30, 35; 4:14–16 చూడండి).

  • అతని కుమారులు జ్ఞాపకముంచుకోవాలని హీలమన్ కోరిన విషయాలేవి? (హీలమన్ 5:4–12 చూడండి). ఈ సత్యాలను జ్ఞాపకముంచుకోవడం మీరు గర్విష్ఠులు కాకుండా ఉండడానికి మీకు ఏవిధాలుగా సహాయపడగలదు?

హీలమన్ 3:24–35

క్రీస్తునందు విశ్వాసము నా ఆత్మను ఆనందంతో నింపుతుంది.

హీలమన్ 3 లో, సంఘము చాలా వృద్ధిచెంది, ఆశీర్వదించబడిన సమయమును మోర్మన్ వివరించాడు, అది చూసి నాయకులు కూడా ఆశ్చర్యపడ్డారు. మీరు 24–32 వచనాలలో చదివిన దానిపై ఆధారపడి, ఆ ఆనందకరమైన స్థితికి దారితీసినదేది అని మీరనుకుంటున్నారు? అయితే, సభ్యులందరు ఆ ఆనందంలో కొనసాగలేదు. 33–35 వచనాలలో వివరించబడిన జనుల మధ్య తేడాలను గమనించండి. వారి మాదిరి నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?

వ్యక్తిగత అన్వయము కొరకు చూడండి. మోర్మన్ గ్రంథమును ప్రవక్త మోర్మన్ సంక్షిప్తపరచినప్పుడు ముఖ్యమైన సత్యాలను నొక్కి చెప్పడానికి అతడు “ఆవిధముగా మనము చూచుచున్నాము” అనే వాక్యభాగాన్ని ఉపయోగించాడు. ఉదాహరణకు, హీలమన్ 3:27–30 లో మనము ఏమి చూడాలని అతడు కోరాడు? మీరు లేఖనాలను చదువుతున్నప్పుడు, మీరు చదివిన దానికి సంబంధించి “ఆవిధముగా మనము చూచుచున్నాము” అనే వాక్యభాగమును పూర్తి చేయడానికి మీరు అప్పుడప్పుడు విరామం ఇవ్వవచ్చు.

హీలమన్ 5:6–7

నేను రక్షకుని నామమును గౌరవించగలను.

హీలమన్ 5:6–7 ను చదవడం ఇంటి పేర్లతో కలిపి, మీకు పెట్టబడిన పేర్లను పరిగణించడానికి మిమ్మల్ని ప్రేరేపించవచ్చు. ఈ పేర్లపై మీ అభిప్రాయమేమిటి? మీరు వాటిని ఎలా గౌరవించగలరు? మరీ ముఖ్యంగా, రక్షకుని నామాన్ని వహించడం అనగా అర్థమేమిటో పరిగణించండి (మొరోనై 4:3 చూడండి). ఆ పవిత్ర నామాన్ని మీరు ఎలా గౌరవిస్తారు?

హీలమన్ 5:12–52

seminary icon
యేసు క్రీస్తును నా పునాదిగా నేను చేసుకున్నట్లయితే, నేను పడిపోలేను.

మీ దృష్టిలో “మన విమోచకుని యొక్క బండ” పైన “మీ పునాదిని కట్టుట” అంటే అర్థమేమిటి? (హీలమన్ 5:12). జీవితపు తుఫానుల నుండి రక్షణను మీరు యేసు క్రీస్తునందు ఎలా కనుగొన్నారు? హీలమన్ 5:12–52 ను మీరు చదివినప్పుడు, నీఫై మరియు లీహైలు వారి విశ్వాసాన్ని వారి విమోచకుని యొక్క బండపైన కట్టినందుకు ఎలా దీవించబడ్డారో గమనించండి.

కొంతమంది వారు చదువుతున్న దానిని దృశ్యీకరించడాన్ని సహాయకరంగా కనుగొంటారు. హీలమన్ 5:12 ను వర్ణించడానికి, మీరు వివిధ పునాదుల పైన ఒక చిన్న నిర్మాణాన్ని కట్టవచ్చు. తరువాత మీరు దానిపై నీటిని చల్లుట ద్వారా మరియు గాలిని కల్పించుటకు ఒక ఫ్యాన్‌ను ఉపయోగించుట ద్వారా “బలమైన గాలివాన” సృష్టించవచ్చు. యేసు క్రీస్తుపై మీ పునాదిని నిర్మించుకోవడం గురించి ఇది మీకు ఏ అంతర్దృష్టులను ఇస్తుంది?

లేమనీయులు పొందిన “నిదర్శనముల యొక్క గొప్పతనమును” 50వ వచనము తెలియజేస్తుంది. హీలమన్ 5:12–52 ను చదవడం, దేవుడు మీకిచ్చిన సాక్ష్యములను మీకు జ్ఞాపకం చేయవచ్చు. ఉదాహరణకు, పరిశుద్ధాత్మ నుండి “ఒక గుసగుస” రక్షకుని యందు మీ విశ్వాసాన్ని బలపరచియుండవచ్చు (హీలమన్ 5:30; సిద్ధాంతము మరియు నిబంధనలు 88:66 కూడా చూడండి). లేదా బహుశా మీరు చీకటిలో ఉండి, అధిక విశ్వాసము కొరకు దేవునికి మొరపెట్టియుండవచ్చు (హీలమన్ 5:40–47 చూడండి). యేసు క్రీస్తుపై మీ పునాదిని నిర్మించుకోవడానికి ఏ ఇతర అనుభవాలు మీకు సహాయపడ్డాయి?

రస్సెల్ ఎమ్. నెల్సన్, “దేవాలయము మరియు మీ ఆత్మీయ పునాది,” లియహోనా, నవ. 2021, 93–96; సీన్ డగ్లస్, “క్రీస్తును నమ్ముట ద్వారా మన ఆత్మీయ తుఫానులను ఎదుర్కొనుట,” లియహోనా, నవ. 2021, 109–11 కూడా చూడండి.

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

హీలమన్ 3:24, 33–34; 4:11–15

వినయంగా ఉండాలని పరలోక తండ్రి నన్ను కోరుతున్నారు.

  • పైనున్న చిత్రంపై ఆధారపడి, “గర్వపు చక్రము” యొక్క వారి స్వంత సంస్కరణను గీయడానికి మీ పిల్లలను ఆహ్వానించడం గురించి ఆలోచించండి. తర్వాత, మీరు కలిసి హీలమన్ 3:24, 33–34 మరియు 4:11–15 చదివినప్పుడు, ఈ వచనాలు వివరించే ఆ చక్రము యొక్క భాగాలను వారు ఎత్తి చూపవచ్చు. మనం వినయంగా ఉండడానికి—ఆవిధంగా నిలిచియుండడానికి ఎలా ఎంచుకోగలము?

హీలమన్ 5:12

నేను యేసు క్రీస్తుపై నా పునాదిని నిర్మిస్తాను.

  • భవనాలకు బలమైన పునాది ఎందుకు అవసరమనే దాని గురించి ఒక సంభాషణను మొదలుపెట్టడానికి ఒక దేవాలయం యొక్క చిత్రాన్ని ఉపయోగించడం గురించి ఆలోచించండి. లేదా మీ ఇల్లు లేదా సంఘ భవనము యొక్క పునాదిని మీరు చూడవచ్చు. దృఢమైన పునాది యొక్క బలాన్ని నొక్కి చెప్పడానికి, మీ పిల్లలు ఒక రాయిపై ఊదడం ద్వారా దానిని కదిలించడానికి ప్రయత్నించవచ్చు. మీరు కలిసి హీలమన్ 5:12 చదివినప్పుడు, యేసు క్రీస్తు మన జీవితాలకు ఎందుకు “ఒక నిశ్చయమైన పునాది” అని మీ పిల్లలను అడగండి. ఆయనపై మన జీవితాలను మనం ఎలా నిర్మించుకోగలము? (హీలమన్ 3:27–29, 35 మరియు విశ్వాస ప్రమాణాలు 1:4 చూడండి).

  • (దూది ఉండలు లేదా చదునైన రాయి వంటి) వివిధ రకాల పునాదులపై బ్లాకులు లేదా ఇతర వస్తువులు ఉపయోగించి ఒక గోపురాన్ని నిర్మించమని మీ పిల్లలను ఆహ్వానించండి. గట్టి పునాది యేసు క్రీస్తు వలె ఎట్లున్నది? ఆయనను అనుసరించడానికి వారు చేయగల వాటి గురించి వారు పంచుకున్న ప్రతీసారి ఆ నిర్మాణానికి వారు ఒక బ్లాకును జతచేయవచ్చు.

హీలమన్ 5:21–52

పరిశుద్ధాత్మ మిక్కిలి నిమ్మళమైన స్వరముతో గుసగుసలాడును.

  • హీలమన్ 5:29–30, 45–47 లో వర్ణించబడిన స్వరము పరిశుద్ధాత్మ మనతో మాట్లాడే ఒక విధానం గురించి మనకు బోధిస్తుంది. జనులు వినిన స్వరము గురించి మీరు మాట్లాడేటప్పుడు, మృదువైన స్వరంతో మాట్లాడండి. కొన్నిసార్లు కథను పునరావృతం చేయండి మరియు మీతో గుసగుసలాడేందుకు పిల్లలను ఆహ్వానించండి. పరిశుద్ధాత్మ మనతో మాట్లాడగల ఇతర విధానాల గురించి ఆలోచించడానికి వారికి సహాయపడండి.

హీలమన్ 5:20–52

పశ్చాత్తాపము ఆత్మీయ అంధకారాన్ని వెలుగుతో భర్తీ చేస్తుంది.

  • అంధకారము మరియు వెలుగు గురించి హీలమన్ 5:20–41 బోధించే దానిని నొక్కి చెప్పడానికి, చీకటిలో ఒక టార్చిలైటును ఉపయోగించి ఈ వచనాలను చదవడానికి లేదా సంక్షిప్తపరచడానికి ప్రయత్నించండి. చీకటి తొలగించబడేందుకు జనులు చేయవలసిన దాని కొరకు మీ పిల్లలు వినవచ్చు. అప్పుడు దీపాలు వెలిగించి, 42–48 వచనములు కలిసి చదవండి. పశ్చాత్తాపము గురించి ఈ వచనాలు మనకేమి బోధిస్తాయి?

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

చెరసాలలో నీఫై మరియు లీహై

చెరసాలలో కూడా నీఫై మరియు లీహై దేవుని శక్తి చేత కాపాడబడ్డారు.

© The Book of Mormon for Young Readers, నీఫై మరియు లీహై అగ్ని స్తంభము చేత చుట్టబడిరి, బ్రయా షాక్రాఫ్ట్ చేత; అనుకరించబడదు