“మార్చి 8–14. సిద్ధాంతము మరియు నిబంధనలు 23–26: ‘సంఘమును బలపరచుము,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)
“మార్చి 8–14. సిద్ధాంతము మరియు నిబంధనలు 23–26,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021
మార్చి 8–14
సిద్ధాంతము మరియు నిబంధనలు 23–26
“సంఘమును బలపరచుము”
మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 23–26 చదివినప్పుడు, పరిశుద్ధాత్మ నుండి మీరు పొందే భావాలను నమోదు చేయండి. మీ స్వంత శిష్యరికమును మరియు సంఘమును బలపరచడానికి ఈ బయల్పాటులలో ఉన్న సలహాను మీరేవిధంగా అన్వయించుకోగలరు?
మీ మనోభావాలను నమోదు చేయండి
సంఘము ఏర్పాటు చేయబడిన తర్వాత, హింస పెరగడం కొనసాగుతుండగా అప్పటికే సంఘముతో ఏకమైయున్న వారిని బలపరచడం మరియు సువార్తను వ్యాపింపజేయడం అనే క్రొత్త సవాలును పరిశుద్ధులు ఎదుర్కొన్నారు. వ్యక్తిగతంగా ఎమ్మా స్మిత్ వ్యతిరేకతను ఎదుర్కొంది. 1830 జూన్‌లో ఎమ్మా మరియు నైట్ కుటుంబ సభ్యులు బాప్తీస్మము పొందాలని కోరుకున్నారు. కానీ పరిశుద్ధ అనుభవము కావలసిన దానిని భంగం చేయడానికి సంఘ శతృవులు ప్రయత్నించారు. మొదట వారు బాప్తీస్మముల కొరకు తగినంత లోతుగా నీటిని అందించడానికి కట్టిన ఆనకట్టను ధ్వంసం చేసారు. ఆనకట్ట బాగుచేయబడిన తర్వాత కూడా మతోన్మాదులు సమకూడి గట్టిగా బెదిరిస్తూ, బాప్తీస్మము తీసుకుంటున్న వారిని ఎగతాళి చేసారు. అప్పుడు క్రొత్త సభ్యులను జోసెఫ్ నిర్థారించబోవుచుండగా, మోర్మన్ గ్రంథము గురించి బోధిస్తూ సమాజాన్ని కలవరపెడుతున్నాడని అతడిని ఖైదు చేసారు. క్రొత్తగా పునఃస్థాపించబడిన ప్రభువు యొక్క సంఘమునకు ఇది సఫలముకాని ఆరంభముగా తోచింది. కానీ ఈ అనిశ్చితి మరియు తిరుగుబాటుల మధ్య ప్రభువు అమూల్యమైన మాటలతో సలహాను, ప్రోత్సాహాన్ని అందించారు, అది ”అందరికీ ఆయన స్వరమును” సూచిస్తున్నది (సిద్ధాంతము మరియు నిబంధనలు 25:16).
Saints, 1:89–90, 94–97 కూడా చూడండి.
వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 23–26
ప్రభువు యొక్క సంఘమును బలపరచడానికి నేను సహాయపడగలను.
పునఃస్థాపించబడిన సంఘము ఏర్పాటు చేయబడి దాదాపు 200 సంవత్సరాల తర్వాత, నేటికీ “సంఘమును బలపరచవలసిన” అవసరము కొనసాగుతోంది (సిద్ధాంతము మరియు నిబంధనలు 23:3–5). ఈ పని జోసెఫ్ స్మిత్, ఆలీవర్ కౌడరీ లేక మన ప్రస్తుత సంఘ నాయకులది మాత్రమే కాదు– ఇది మనందరిది. సిద్ధాంతము మరియు నిబంధనలు 23–26 ను మీరు చదువుతున్నంతసేపు, సంఘమును బలపరచడానికి ఆనాటి సంఘ సభ్యులకు సహాయపడేలా ప్రభువు ఇచ్చిన సలహాను ధ్యానించండి. ఈ ప్రయత్నములో పాల్గొనడానికి మీరు ఏమి చేయాలని ప్రభువు కోరుతున్నారని మీరనుకుంటున్నారు?
“(నా) శ్రమల నుండి” రక్షకుడు నన్ను లేవనెత్తగలడు.
తీవ్రమైన హింస గల సమయంలో సంఘమును నడిపించుట జోసెఫ్ స్మిత్ కొరకు చాలా కష్టంగా ఉండియుండవచ్చు. సిద్ధాంతము మరియు నిబంధనలు 24 లో అతన్ని ప్రోత్సహించే ప్రభువు యొక్క మాటల కొరకు చూడండి.
మీ శ్రమల నుండి రక్షకుడు మిమ్మల్ని ఎలా లేవనెత్తగలరనే దాని గురించి క్రింది లేఖనాలు మీకేమి సూచిస్తున్నాయి?
సిద్ధాంతము మరియు నిబంధనలు 24:1–3
సిద్ధాంతము మరియు నిబంధనలు 24:8
సిద్ధాంతము మరియు నిబంధనలు 121:7–8
మీ శ్రమల నుండి యేసు క్రీస్తు మిమ్మల్ని ఎలా లేవనెత్తారు? కష్టసమయాల్లో ఆయన సహాయాన్ని వెదకడం కొనసాగించడానికి మీరేమి చేయగలరు?
ఎమ్మా స్మిత్ “ఎన్నుకోబడిన స్త్రీ.”
ఎమ్మా హేల్, జోసెఫ్ స్మిత్‌ను వివాహమాడినప్పుడు, తాను త్యాగాలు చేయబోతున్నదని ఆమె ఎరిగియుండెను. ఆమె తన తండ్రి కోరికలకు వ్యతిరేకంగా, సౌకర్యవంతమైన జీవితానికి బదులుగా అస్థిరమైన జీవితాన్ని ఎంచుకుంది. పునఃస్థాపన కార్యములో ప్రభువు ఆమె నుండి ఆశించిన దానిపట్ల ఆమె ఆశ్చర్యపడియుండవచ్చు. సిద్ధాంతము మరియు నిబంధనలు 25 లో ప్రభువు ఇచ్చిన జవాబుల కొరకు చూడండి. 16వ వచనము లో ప్రభువు మాటలను గమనించండి—“(మీ) కొరకు ఆయన స్వరమును” భావించేలా ఈ ప్రకరణములో మీరు ఏదైనా కనుగొన్నారా?
జాయ్ డి. జోన్స్, “ప్రత్యేకంగా ఘనమైన పిలుపు,” ఎన్‌సైన్ లేక లియహోనా, మే 2020, 15–18 చూడుము.
సిద్ధాంతము మరియు నిబంధనలు 26:2
ఉమ్మడి అంగీకారము అనగానేమి?
సంఘములో సభ్యులు పిలుపులను లేక యాజకత్వ నియామకాలను పొందినప్పుడు, సహకారానికి నిదర్శనంగా మన చేతిని పైకెత్తడం ద్వారా పద్ధతి ప్రకారం వారిని ఆమోదించే అవకాశాన్ని మనం కలిగియుంటాము. బహిరంగంగా సహకారాన్ని మరియు అంగీకారాన్ని తెలిపే సూత్రాన్ని ఉమ్మడి అంగీకారము అని పిలుస్తారు. అధ్యక్షులు గార్డన్ బి. హింక్లీ బోధించినట్లుగా, “ఆమోద ప్రక్రియ అనేది ఆచార ప్రకారము చేతిని పైకెత్తడాన్ని మించినది. ఎన్నుకోబడిన వారిని ఆమోదించడం, వారికి సహకరించడం, సహాయపడడమనేది నిబద్ధతతో కూడుకున్నది” (“This Work Is Concerned with People,” Ensign, May 1995, 51).
కుటుంబ లేఖన అధ్యయనము మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 23:6.“(మన) కుటుంబములో, (మన) స్నేహితుల మధ్య మరియు అన్ని ప్రదేశాలలో” ప్రార్థన చేయమని ప్రభువు మనల్ని ఎందుకు కోరుతున్నారు?
2 నీఫై 32:8–9; 3 నీఫై 18:18–23 కూడా చూడుము.
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 24:8.“శ్రమలలో సహనముగా ఉండడం” అనగా అర్థమేమిటి అనేదాని గురించి మాట్లాడడం మీ కుటుంబానికి సహాయకరంగా ఉంటుందా? మీరు చిన్నపిల్లలను కలిగియున్నట్లయితే, “సహనములో కొనసాగుము” లో అధ్యక్షులు డిటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్ వివరించిన ప్రయోగాన్ని తిరిగి చేయడం ఉల్లాసకరంగా ఉండవచ్చు (Ensign లేక లియహోనా, మే2010, 56; ChurchofJesusChrist.org వద్ద వీడియో కూడా చూడుము). సహనము గురించి సిద్ధాంతము మరియు నిబంధనలు 24:8 మనకేమి బోధిస్తుంది? మన శ్రమలలో సహనముగా ఉండడానికి ప్రభువు మనకేవిధంగా సహాయపడతారు?
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 25:11–12.బహుశా మీరు ప్రతి కుటుంబ సభ్యునికి ఇష్టమైన కీర్తన లేక పాటను పాడి, అది అతని లేక ఆమె యొక్క “హృదయ కీర్తన“ ఎందుకైనదో మాట్లాడవచ్చు. ఈ పాటలు “(దేవునికి) ప్రార్థన“ వలె ఎట్లున్నవి?
-
సిద్ధాంతము మరియు నిబంధనలు 26:2.లేఖన మార్గదర్శిలో ”ఉమ్మడి అంగీకారము” ను చూడడం సహాయకరముగా ఉండవచ్చు (scriptures.ChurchofJesusChrist.org). మన నాయకుల కొరకు మన సహకారాన్ని మనము ఎలా చూపగలము?
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.
సూచించబడిన పాట: “Lift Up Your Voice and Sing,” పిల్లల పాటల పుస్తకము, 252 ( “మీ కుటుంబ లేఖన అధ్యయనమును మెరుగుపరచుటకు ఉపాయములు” చూడుము).
పునఃస్థాపన స్వరములు
ఎమ్మా హేల్ స్మిత్
ఎమ్మా స్మిత్ కొరకు సిద్ధాంతము మరియు నిబంధనలు 25 లో నమోదు చేయబడిన ప్రభువు యొక్క మాటలు ఆమె గురించి మరియు ఆయన కార్యములో ఆమె తోడ్పాటు గురించి ఆయన ఎలా భావించారో బయల్పరుస్తాయి. కానీ ఎమ్మా ఎటువంటిది? ఆమె వ్యక్తిత్వము, ఆమె సంబంధాలు, ఆమె బలాల గురించి మనకేమి తెలియును? ”ఎన్నుకోబడిన ఈ స్త్రీ” (సిద్ధాంతము మరియు నిబంధనలు 25:3) గురించి తెలుసుకోవడానికి గల మార్గము, వ్యక్తిగతంగా ఆమె గురించి తెలిసిన వారి మాటలను చదవడమే.
జోసెఫ్ స్మిత్ జూ., ఆమె భర్త
“వర్ణించలేనంత సంతోషంతో, ఆనందంతో నింపబడి ఆ రాత్రి నా ప్రియమైన ఎమ్మా చేయి అందుకున్నప్పుడు—ఆమె నా భార్య, నా యౌవనకాలపు భార్య; నాకు అతిప్రియమైన వ్యక్తి. మేము చవిచూడవలసిన అనేక అనుభవాల గురించి ఒక్క క్షణం నేను ధ్యానించినప్పుడు, నా మనస్సులో ఎన్నో ఆలోచనలు కలిగాయి. మా శ్రమలు, కష్టాలు, బాధలు, దుఃఖాలు, ఆనందాలు మరియు ఓదార్పులు ఎప్పటికప్పుడు మా జీవితాలంతటా విస్తరించి మమ్మల్ని దీవించాయి. ఒక్క క్షణం మంచి చెడులన్నిటిని నేను జ్ఞాపకం చేసుకున్నాను, కానీ మాకు ఎటువంటి శ్రమలు కలిగినప్పటికీ నిర్భయంగా, స్థిరంగా, కదలకుండా, మారకుండా ప్రియమైన ఎమ్మా ఇంకా ఇక్కడే ఉంది.”1
లూసీ మేక్ స్మిత్, ఆమె అత్తగారు
“అప్పుడామె యౌవనురాలైయుండి, సహజంగా ఆశలు గలదై, ప్రభువు యొక్క కార్యానికి పూర్తిగా అంకితమైంది మరియు సంఘానికి, సత్యము యొక్క హేతువుకు బద్ధురాలైయుంది. ఆమె ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేసింది మరియు ’దీని వల్ల మిగిలిన వారికంటే నేను ఎక్కువ లాభం పొందుతానా?’ అని స్వార్థంతో ఎన్నడూ ప్రశ్నించలేదు. ఆమె ఎటువంటి కష్టాలు పడుతున్నప్పటికీ, పెద్దలు ప్రవచించడానికి దూరంగా పంపబడినప్పుడు వారి ప్రయాణానికి కావలసిన బట్టలు తయారుచేసి అందించడంలో ఆమె ఎప్పుడూ ముందుండేది.”2
“ప్రతి నెలా, ప్రతి సంవత్సరం అటువంటి నిస్సంకోచమైన ధైర్యం, పట్టుదల, సహనంతో ప్రతిరకమైన శ్రమను, కష్టాన్ని సహించిన అటువంటి స్త్రీని నా జీవితంలో ఎన్నడూ నేను చూడలేదు, ఆమె ఎప్పుడూ అలాగే చేసేది; ఆమె సహించవలసిన కష్టాలు నాకు తెలుసు; ఆమె అనిశ్చితిని భరించింది; హింసలను సహించింది, మనుష్యుల మరియు దయ్యాల కోపాన్ని జయించింది, ఆమె ఎన్నో రకాల కష్టాలను అనుభవించింది, మరొకరైతే ఎప్పుడో నశించిపోయేవారు.”3
జోసెఫ్ స్మిత్ సీ., ఆమె మామగారు
ఎమ్మా యొక్క గోత్రజనకుని దీవెన జోసెఫ్ స్మిత్ సీ. చేత ప్రకటించబడింది, ఆయన సంఘము యొక్క గోత్రజనకునిగా సేవచేసేవారు:
“ఎమ్మా, నా కోడలా, నీ విశ్వాసమును యధార్థతను బట్టి నీవు ప్రభువు చేత దీవించబడినదానవు: నీవు నీ భర్తతో పాటు దీవించబడెదవు, అతనిపై రాబోవు మహిమయందు ఆనందించెదవు: నీ సహచరుడిని నాశనం చేయాలని చూసే మనుష్యుల దుష్టత్వం కారణంగా నీ ఆత్మ బాధపడినది, అతని విడుదల కొరకు నీ పూర్ణాత్మ ప్రార్థనలో కొనసాగింది: ఆనందించుము, ఏలయనగా ప్రభువైన నీ దేవుడు నీ ప్రార్థనను ఆలకించాడు.
“నీ తండ్రి ఇంటివారి హృదయముల కఠినత్వము కారణంగా నీవు దుఃఖించావు, వారి రక్షణ కొరకు నీవు ఆకాంక్షించావు. నీ రోదనల పట్ల ప్రభువు గౌరవము కలిగియుండును, మరియు ఆయన తీర్పుల చేత వారిలో కొందరు తమ తప్పులు తెలుసుకొని, వారి పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడేలా ఆయన చేయును; కానీ బాధలచేతనే వారు రక్షింపబడెదరు. నీవు దీర్ఘకాలము జీవించెదవు; నీవు సంతృప్తి చెందేవరకు ప్రభువు నిన్ను కాపాడును, ఏలయనగా నీవు నీ విమోచకుని చూచెదవు. ప్రభువు యొక్క గొప్ప కార్యమందు నీ హృదయము ఆనందించును, ఏ ఒక్కరూ నీ నుండి నీ ఆనందాన్ని దూరం చేయలేరు.
“నీఫైయుల గ్రంథాన్ని దేవదూత నా కుమారునికి ఇచ్చినప్పుడు అతనితో పాటు నీవు ఉండేందుకు అనుమతించిన నీ దేవుని గొప్ప తగ్గింపును నీవు ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకోవలెను. నీ పిల్లల్లో ముగ్గురిని ప్రభువు నీ నుండి దూరం చేసినందుకు నీవు చాలా దుఃఖమును అనుభవించావు: ఇందులో నీవు నిందించబడవలసినది లేదు, ఏలయనగా నా కుమారుని నామము దీవించబడునట్లు ఒక కుటుంబమును పెంచుటకు స్వచ్ఛమైన నీ కోరికలు ఆయన ఎరుగును. ఇప్పుడు నేను నీతో చెప్పుచున్నాను, ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు నమ్మినట్లయితే, నీవు ఈ విషయములో ఇంకను దీవించబడెదవు మరియు నీ ఆత్మ యొక్క ఆనందము, సంతృప్తి కొరకు, నీ స్నేహితుల ఆనందము కొరకు నీవు ఇంకా పిల్లలను కనెదవు.
“నీవు జ్ఞానముతో దీవించబడెదవు, ఇతర స్త్రీలకు ఉపదేశించుటకు శక్తి కలిగియుందువు. నీ కుటుంబమునకు నీతిని, నీ పిల్లలకు జీవన విధానాన్ని బోధించుము, పరిశుద్ధ దేవదూతలు నిన్ను కావలి కాయుదురు: నీవు దేవుని రాజ్యములో రక్షింపబడెదవు; అట్లేయగును గాక. ఆమేన్.”4