2021 సిద్ధాంతము మరియు నిబంధనలు
ఆగష్టు 16–22. సిద్ధాంతము మరియు నిబంధనలు 89–92: “వాగ్దానముతో కూడిన సూత్రము”


“ఆగష్టు 16–22. సిద్ధాంతము మరియు నిబంధనలు 89–92: ‘వాగ్దానముతో కూడిన సూత్రము,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)

“ఆగష్టు 16–22. సిద్ధాంతము మరియు నిబంధనలు 89–92,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021

ఆహారము తయారు చేస్తున్న స్త్రీ పురుషులు

ఆగష్టు 16–22

సిద్ధాంతము మరియు నిబంధనలు 89–92

“వాగ్దానముతో కూడిన సూత్రము”

ప్రార్థనాపూర్వకంగా సిద్ధాంతము మరియు నిబంధనలు 89–92 అధ్యయనం చేసి, మీరు పొందే ఆత్మీయ మనోభావాలను నమోదు చేయండి. మీరు అధ్యయనం చేస్తున్నప్పుడు, ఏవిధంగా మీకు “ఆత్మ సత్యమును (ప్రత్యక్షపరచునో)” గ్రహించండి (సిద్ధాంతము మరియు నిబంధనలు 91:4).

మీ మనోభావాలను నమోదు చేయండి

ప్రవక్తల పాఠశాలలో, ప్రవక్త జోసెఫ్ స్మిత్ ఇశ్రాయేలు పెద్దలకు భూమిమీద దేవుని రాజ్యమును నిర్మించడం గురించి బోధించారు. వారు ఆత్మీయ సత్యాలను చర్చించారు, కలిసి ప్రార్థించారు, ఉపవాసమున్నారు మరియు సువార్తను బోధించడానికి సిద్ధపడ్డారు. కానీ అక్కడి వాతావరణం నేడు మనకు అసాధారణంగా కనిపించవచ్చు మరియు ఎమ్మా స్మిత్‌కు కూడా అది సరైనదిగా అనిపించలేదు. ఈ సమావేశాలప్పుడు, పురుషులు పొగత్రాగి, పొగాకు నమిలేవారు, ఆ కాలంలో అది అసాధారణమైనది కాదు, కానీ దానివలన చెక్క నేలల మీద మరకలు పడి, గాలిలో గాఢమైన వాసన ఉండేది. ఎమ్మా తన విచారాలను జోసెఫ్‌తో పంచుకుంది మరియు జోసెఫ్ ప్రభువును అడిగారు. ఫలితంగా, పొగ మరియు పొగాకు మరకలను మించిన ఒక బయల్పాటు వచ్చింది. అది రాబోయే తరాల కొరకు, పరిశుద్ధులకు, “వాగ్దానముతో కూడిన సూత్రము”ను, అనగా శారీరక ఆరోగ్యమును, “జ్ఞానమును,” “జ్ఞానము యొక్క గొప్ప నిధులను” వాగ్దానమిచ్చింది (సిద్ధాంతము మరియు నిబంధనలు 89:3, 19).

వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 89

జ్ఞానవాక్యము అనునది “వాగ్దానముతో కూడిన సూత్రము”.

ప్రవక్తల పాఠశాలలోని పెద్దలు జోసెఫ్ స్మిత్ మొదటిసారి జ్ఞానవాక్యమును చదువగా వినినప్పుడు, వారు వెంటనే “వారి పొగాకు డబ్బాలను, గొట్టాలను మంటల్లో విసిరివేసారు” (Saints, 1:168). ఆ సమయంలో, జ్ఞానవాక్యము ఒక ఆజ్ఞకంటే ఎక్కువగా ఒక హెచ్చరికగా యెంచబడింది, కానీ దానికి లోబడియుండడానికి వారు తమ సమ్మతిని చూపదలిచారు. జ్ఞానవాక్యము వద్దని వారించే పదార్థాలను బహుశా మీ జీవితం నుండి మీరు ఇదివరకే “విసిరివేసియుండవచ్చు”, కానీ ఈ బయల్పాటు నుండి మీరు ఇంకేమి నేర్చుకోగలరు? ఈ ఉపాయాలను పరిగణించండి:

  • మీరు గమనించని లేక ఇంతకుముందు ఎక్కువగా ఆలోచించని వాక్యభాగాల కొరకు చూడండి. వాటినుండి మీరేమి నేర్చుకుంటారు?

  • సిద్ధాంతము మరియు నిబంధనలు 89 అనేక వాగ్దానాలను కలిగియుంది (18–21 వచనాలు చూడండి). ఈ వాగ్దానాలకు అర్థమేమిటని మీరనుకుంటున్నారు?

  • ప్రభువు గురించి ఈ బయల్పాటు మీకేమి బోధిస్తుంది?

  • “రహస్యముగా దుష్టాలోచనలు చేయు మనుష్యుల హృదయాలలో ఉండు … దుష్టత్వము మరియు ప్రణాళికలకు” ఎటువంటి ఉదాహరణలను మీరు చూసారు? (4వ వచనము).

  • ఈ బయల్పాటును “వాగ్దానముతో కూడిన సూత్రము”గా (3వ వచనము)—నిర్ణయాలు తీసుకోవడాన్ని నడిపించే శాశ్వత సత్యాలుగా పరిగణించండి—కేవలం చేయవలసిన మరియు చేయకూడని పనుల జాబితాగా కాదు. మీ నిర్ణయాలను నడిపించగలిగేలా మీరు కనుగొను సూత్రాలేవి?

జ్ఞానవాక్యములో చెప్పబడిన వాటిని మించిన హానికారక పదార్థాలు మరియు ప్రవర్తనల గురించి కూడా ఆధునిక ప్రవక్తలు హెచ్చరించారు. మీ శరీరము మరియు మనస్సు పట్ల బాగా శ్రద్ధ వహించడానికి ఏమి చేయాలని మీరు ప్రేరేపించబడ్డారు?

దానియేలు 1; 1 కొరింథీయులకు 6:19–20 కూడా చూడండి.

సముద్రతీరంలో పరిగెత్తుతున్న బాలురు

మన శరీరాలను జాగ్రత్తగా కాపాడుకోవాలని జ్ఞానవాక్యము మనకు బోధిస్తుంది.

సిద్ధాంతము మరియు నిబంధనలు 90:1–17

“రాజ్యపు తాళపుచెవులను” ప్రథమ అధ్యక్షత్వము కలిగియుంటారు.

90వ ప్రకరణములో, ఇప్పుడు మనం ప్రథమ అధ్యక్షత్వము అని పిలిచే దాని సభ్యులైన జోసెఫ్ స్మిత్, సిడ్నీ రిగ్డన్ మరియు ఫ్రెడ్రిక్ జి. విలియమ్స్ యొక్క “పరిచర్య మరియు అధ్యక్షత్వము” (12వ వచనము) గురించి ప్రభువు ఉపదేశాలిచ్చారు. 1–17 వచనాల నుండి ప్రథమ అధ్యక్షత్వము గురించి మీరేమి నేర్చుకుంటారు? ప్రథమ అధ్యక్షత్వము యొక్క సభ్యుల నుండి ఇటీవలి సందేశాలను పునర్వీక్షించండి. వారి మాటలు ఏవిధంగా మీ కొరకు “పరలోకరాజ్య మర్మములను విప్పుతాయి”? (14వ వచనము). ఏవిధంగా అవి “ఈ సంఘము, రాజ్యము యొక్క వ్యవహారములన్నిటిని సక్రమములో ఉంచుతాయి”? (16వ వచనము).

హెన్రీ బి. ఐరింగ్, “బలపరచు విశ్వాసము యొక్క శక్తి,” ఎన్‌సైన్ లేక లియహోనా, మే 2019, 58–60 కూడా చూడండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 90:24

“(నా) మేలుకొరకు సమస్తము సమకూడి జరుగును.”

సిద్ధాంతము మరియు నిబంధనలు 90:24లో ప్రభువు యొక్క వాగ్దానానికి సాక్ష్యమిచ్చేవిధంగా మీరు కలిగియున్న అనుభవాలను ధ్యానించండి. మీ అనుభవాలను నమోదు చేసి, వాటిని ఒక కుటుంబ సభ్యుడు లేక ప్రియమైన వారితో—అభయము లేక ప్రోత్సాహము అవసరమైన వారెవరితోనైనా పంచుకోవడాన్ని పరిగణించండి. మీరు ఇంకా వేచిచూస్తున్న దీవెనలు ఉన్నట్లయితే, ఏవిధంగా “మీ మేలుకొరకు సమస్తము సమకూడి జరుగునో” చూడడానికి మీరు వేచియున్నప్పుడు, విశ్వాసంగా నిలిచియుండేందుకు మీరు ఏమి చేయగలరో ధ్యానించండి.

సిద్ధాంతము మరియు నిబంధనలు 90:28–31

వియెన్నా జాక్వెస్ ఎవరు?

వియెన్నా జాక్వెస్ మస్సాచుసెట్స్‌లో 1787, జూన్ 10న జన్మించింది. చెప్పుకోదగినంత ఆర్థిక వనరులు కలిగియున్న విశ్వాసముగల స్త్రీ అయిన వియెన్నా మొదటిసారి 1831లో సువార్తికులను కలిసింది. వారి సందేశము నిజమని ఒక ఆత్మీయ సాక్ష్యాన్ని పొందిన తర్వాత, ఆమె కర్ట్‌లాండ్, ఒహైయోలో ప్రవక్తను కలవడానికి ప్రయాణమైంది, అక్కడ ఆమె బాప్తీస్మము పొందినది.

సిద్ధాంతము మరియు నిబంధనలు 90:28–31లో ప్రభువు ఆమెకిచ్చిన ఉపదేశానికి వియెన్నా లోబడింది. అంతకుముందు కర్ట్‌లాండ్‌లో ఆమె ఇచ్చిన విరాళాలతో కలిపి ప్రభువుకు ఆమె సమర్పించినది ఒక క్లిష్ట సమయములో సంఘానికి వచ్చింది, ఆ సమయంలో నాయకులు కర్ట్‌లాండ్ దేవాలయాన్ని నిర్మించడానికి స్థలము కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వియెన్నా తన జీవితమంతా “సోమరిగానుండక, విశ్వాసముగా“ ఉంది మరియు చివరకు సాల్ట్ లేక్ లోయలో సమాధానముతో ఆమె స్థిరపడగలిగింది” (31వ వచనము), అక్కడ ఆమె 96వ యేట మరణించింది.

కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 89.సిద్ధాంతము మరియు నిబంధనలు 89లో చెప్పబడిన తినుబండారాలు మరియు ఇతర పదార్థాల చిత్రాలు గీయడాన్ని లేక కనుగొనడాన్ని మీ కుటుంబ సభ్యులు ఆనందించవచ్చు. తర్వాత మీరు ఒక ఆట ఆడవచ్చు—కుటుంబ సభ్యులు వంతులవారీగా యథేచ్చగా చిత్రాలను యెంచుకొని, మనము ఉపయోగించకూడని వాటిని చెత్తబుట్టలో మరియు మనము ఉపయోగించవలసిన వాటిని ఒక పళ్ళెములో పెట్టవచ్చు. 18–21 వచనాలలో ఉన్న వాగ్దానాలు మన జీవితాల్లో ఎలా నెరవేర్చబడ్డాయి?

For the Strength of Youth (25–27) లో “Physical and Emotional Health” గురించి చదవడం, మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడానికి గల ఇతర మార్గాలు మరియు దేవుడు వాగ్దానం చేసే దీవెనల గురించి చర్చను ప్రేరేపించగలదు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 90:5.“దేవుని దేవోక్తులను (బయల్పాటులు లేక ప్రవక్తలను) మీరెలా స్వీకరిస్తారో” అనేదాని గురించి మాట్లాడండి. అవి మనకు “తేలికైన విషయాలు” కావని మనమెలా చూపగలము?

సిద్ధాంతము మరియు నిబంధనలు 91.అపొక్రిపను (1–2 వచనాలు) గూర్చి ప్రభువు ఉపదేశము నేడు మీ కుటుంబం ఎదుర్కొనే ప్రసార మాధ్యమాలకు ఎలా అన్వయిస్తుందో మీరు చర్చించవచ్చు. “ఆత్మవలన వెలిగించబడడం” (5వ వచనము) అనేది సత్యాసత్యాల మధ్య తేడాను గుర్తించడానికి మీకు సహాయపడినప్పటి వ్యక్తిగత అనుభవాలను కూడా మీరు పంచుకోవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 92:2.సంఘములో “క్రియాశీలక సభ్యునిగానుండుట” అనగా అర్థమేమి?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

సూచించబడిన పాట: “The Lord Gave Me a Temple,” Children’s Songbook, 153.

మన బోధనను మెరుగుపరచుట

వైవిధ్యాన్ని ఉపయోగించండి. మీ కుటుంబాన్ని కుటుంబ లేఖన అధ్యయనములో నిమగ్నం చేయడానికి వైవిధ్యమైన విధానాల కొరకు చూడండి. ఉదాహరణకు, కుటుంబ సభ్యులు ఒక వచనానికి సంబంధించిన కీర్తనలు లేక పిల్లల పాటలను పాడవచ్చు, వారు చదివిన దానిని బొమ్మలుగా గీయవచ్చు లేక వారి స్వంత మాటలలో ఒక వచనాన్ని సంక్షిప్తపరచవచ్చు.

పళ్ళు మరియు కూరగాయలు

“ఈ మాటలను పాటించుటకు … ఆజ్ఞలకు విధేయులై నడుచుకొను పరిశుద్ధులందరు వారి నాభిలో ఆరోగ్యమును, ఎముకలలో మూలుగును పొందుదురు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 89:18).