2021 సిద్ధాంతము మరియు నిబంధనలు
ఆగష్టు 2–8. సిద్ధాంతము మరియు నిబంధనలు 85–87: “పరిశుద్ధ స్థలములలో నిలిచియుండుడి”


“ఆగష్టు 2–8. సిద్ధాంతము మరియు నిబంధనలు 85–87: ‘పరిశుద్ధ స్థలములలో నిలిచియుండుడి,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)

“ఆగష్టు 2–8. సిద్ధాంతము మరియు నిబంధనలు 85–87,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021

చిత్రం
దేవాలయానికి నడిచివెళ్తున్న కుటుంబము

ఆగష్టు 2–8

సిద్ధాంతము మరియు నిబంధనలు 85–87

“పరిశుద్ధ స్థలములలో నిలిచియుండుడి”

ఈ సారంశంలో ప్రముఖంగా పేర్కొనని సూత్రాలను 85–87 ప్రకరణములలో చదవడానికి ఆత్మ మిమ్మల్ని నడిపించవచ్చు. అతని ప్రేరేపణలను అనుసరించండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

సాధారణంగా క్రిస్మస్ రోజు, “భూమి మీద సమాధానము” మరియు “మనుష్యులలో సద్భావము కలుగును గాక” (లూకా 2:14 చూడండి) వంటి సందేశాలను ధ్యానించే సమయము. కానీ 1832, డిసెంబరు 25న జోసెఫ్ స్మిత్ మనసంతా యుద్ధ భయముతో నిండిపోయింది. అప్పుడే దక్షిణ కరోలినా, సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వాన్ని వ్యతిరేకించి, యుద్ధానికి సిద్ధమవుతోంది. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని ప్రభువు జోసెఫ్‌కు బయల్పరిచారు: “సమస్త జనముల మీద యుద్ధము వ్యాపించును” (సిద్ధాంతము మరియు నిబంధనలు 87:2) అని ఆయన ప్రకటించారు. ఈ ప్రవచనము అతి త్వరలో నెరవేరబోతున్నట్లు అనిపించింది.

కానీ అప్పుడది జరుగలేదు. కొద్ది వారాలలోపు, దక్షిణ కరోలినా మరియు సంయుక్త రాష్ట్రాల ప్రభుత్వాలు సంధి కుదుర్చుకున్నాయి, యుద్ధము తప్పిపోయింది. కానీ బయల్పాటు ఎల్లప్పుడూ మనం కోరుకున్న సమయంలో లేక ఆశించిన విధంగా నెరవేర్చబడదు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత, జోసెఫ్ స్మిత్ మతం కోసం చంపబడి, పరిశుద్ధులు పశ్చిమానికి తరలిపోయిన చాలా కాలానికి దక్షిణ కరోలినా తిరుగుబాటు చేసింది మరియు పౌర యుద్ధం మొదలైంది. అప్పటి నుండి, ప్రపంచవ్యాప్తంగా యుద్ధము “భూమి దుఃఖించునట్లు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 87:6) చేసింది. ప్రవచనము చివరికి నెరవేర్చబడినప్పటికీ, ఈ బయల్పాటు యొక్క విలువ విపత్తు ఎప్పుడు వస్తుందని ఊహించడంలో తక్కువగాను, అది వచ్చినప్పుడు ఏమి చేయాలని బోధించడంలో ఎక్కువగాను ఉంది. 1831, 1861 మరియు 2021లో ఉపదేశము ఒక్కటే: “పరిశుద్ధ స్థలములలో మీరు కదలక నిలిచియుండుడి” (8వ వచనము).

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 85:1–2

“చరిత్రను వ్రాయుట” మంచిది.

1వ వచనములో వివరించబడిన “చరిత్ర” సీయోనులో “చట్టరీత్యా స్వాస్థ్యములను పొందిన” వారి పేర్లను నమోదు చేసింది (సిద్ధాంతము మరియు నిబంధనలు 72:24–26 కూడా చూడండి). అయినప్పటికీ, ఈ చరిత్ర కేవలం పరిపాలనను మించినది—అది పరిశుద్ధుల “జీవనశైలి, వారి విశ్వాసము, వారి కార్యముల” (2వ వచనము) యొక్క విలువైన వృత్తాంతము.

మీరు వ్యక్తిగత చరిత్రను లేక దినచర్య పుస్తకాన్ని వ్రాస్తున్నారా? భవిష్యత్ తరాలకు ఒక దీవెనగా ఉండునట్లు మీ జీవనశైలి, విశ్వాసము, కార్యముల గురించి మీరేమి నమోదు చేయగలరు? ఈ చరిత్ర మీ కొరకు ఎట్లు ఒక దీవెన కాగలదు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 85:6

ఆత్మ “మిక్కిలి నిమ్మళమైన స్వరము”తో మాట్లాడును.

సిద్ధాంతము మరియు నిబంధనలు 85:6లో ఆత్మను వర్ణించడానికి జోసెఫ్ స్మిత్ ఉపయోగించిన పదాలను ధ్యానించండి. ఆత్మ యొక్క స్వరము ఏ విధంగా “నిమ్మళముగా” మరియు “చిన్నగా” ఉంది? మీ జీవితంలో అది “చొచ్చుకొనిపోవు” కొన్ని విషయాలేవి?

ఆత్మ మీతో ఎలా మాట్లాడుతుందని మీరు ఆలోచిస్తున్నప్పుడు, జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన ఈ వర్ణనలను పరిగణించండి: సిద్ధాంతము మరియు నిబంధనలు 6:22–24; 8:2–3; 9:7–9; 11:12–13; 128:1. మీరు చదివిన దానిని బట్టి, ఆత్మ యొక్క స్వరమును మీరు బాగా గ్రహించడానికి ఏమి చేయాలని మీరు భావిస్తున్నారు?

1 రాజులు 19:11–12; హీలమన్ 5:30 కూడా చూడండి.

చిత్రం
లేఖనాలను చదువుతున్న స్త్రీ

లేఖనాలను అధ్యయనం చేయడం పరిశుద్ధాత్మను వినడంలో మనకు సహాయపడుతుంది.

సిద్ధాంతము మరియు నిబంధనలు 86

అంత్యదినాలలో నీతిమంతులు సమకూడుదురు.

మత్తయి 13:24–30, 37–43 లో ఆయన చెప్పిన దానికి స్వల్ప తేడాతో గోధుమలు మరియు గురుగుల ఉపమానం గురించి ప్రభువు యొక్క వివరణను సిద్ధాంతము మరియు నిబంధనలు 86:1–7 కలిగియుంది. మీరు ఆ రెండిటిని పోల్చినప్పుడు, మీరు గమనించిన తేడాలేవి? ఈ తేడాలతో ఈ ఉపమానము “ప్రస్తుతము, అంత్యదినములలో” (సిద్ధాంతము మరియు నిబంధనలు 86:4) మరలా చెప్పడం ఎందుకు యోగ్యమైనదో పరిగణించండి. ఈ ఉపమానము మరియు దాని కడవరి-దిన వివరణ నుండి మీరేమి నేర్చుకోగలరు?

8–11 వచనాలలో నమోదు చేయబడినట్లుగా, ప్రభువు అప్పుడు యాజకత్వము, పునఃస్థాపన మరియు తన జనుల రక్షణ గురించి మాట్లాడారు. ఈ వచనాలు మరియు గోధుమలు, గురుగుల ఉపమానము మధ్య ఏ సంబంధాలను మీరు చూస్తున్నారు? “(ప్రభువు యొక్క) ప్రజలకు రక్షకునిగా” మీరెలా ఉండగలరు? (11వ వచనము).

సిద్ధాంతము మరియు నిబంధనలు 87

“పరిశుద్ధ స్థలములలో” సమాధానము కనుగొనబడును.

భౌతిక అపాయాలైన “రక్తపాతము … (మరియు) కరువు, తెగులు, భూకంపములకు” (Doctrine and Covenants 87:6) అదనంగా, మనమందరము కడవరి-దినాలలో అనుభవించే ఆత్మీయ అపాయాలకు కూడా ఈ బయల్పాటులోని ఉపదేశము అన్వయించబడగలదు. మీరు సమాధానమును, భద్రతను కనుగొనే “పరిశుద్ధ స్థలములు” (8వ వచనము) ఏవి? ఏది ఒక స్థలమును పరిశుద్ధముగా చేస్తుంది? భౌతిక ప్రదేశాలకు అదనంగా, బహుశా పరిశుద్ధ సమయాలు, పరిశుద్ధ అభ్యాసాలు లేక పరిశుద్ధ ఆలోచనలు సమాధానాన్ని అందించగలవు. ఈ స్థలముల నుండి “కదలకయుండడం” అంటే అర్థమేమిటి?

హెన్రీ బి. ఐరింగ్, “ప్రభువు ఆత్మ నివసించే గృహము,” ఎన్‌సైన్ లేక లియహోనా, మే 2019, 22–25 కూడా చూడండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 85:6.ఆత్మ యొక్క మిక్కిలి నిమ్మళమైన స్వరమును గుర్తించడాన్ని మీ కుటుంబానికి మీరెట్లు బోధించగలరు? దారి మళ్ళించే స్వరముల మధ్య ఒకరు ముఖ్యమైన సూచనలను గుసగుసగా చెప్పే ఆటను మీరు ఆడవచ్చు. పరిశుద్ధాత్మను వినడం నుండి ఏది మనల్ని దారి మళ్ళించవచ్చు? బహుశా కుటుంబ సభ్యులు ఆత్మ యొక్క స్వరమును వినడానికి వారేమి చేస్తారో పంచుకోవచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 86.గోధుమలు మరియు గురుగుల ఉపమానమును అర్థం చేసుకోవడానికి చిత్రాలను గీయడం లేక వాటిని చూడడం మీ కుటుంబానికి సహాయపడవచ్చు. మత్తయి 13:24–30 లో వర్ణించబడిన విషయాల చిత్రాలతో మీరు ప్రారంభించాలని కోరవచ్చు. తర్వాత, సిద్ధాంతము మరియు నిబంధనలు 86:1–7 నుండి వివరణలతో మీ కుటుంబము చిత్రాలకు పేరు పెట్టవచ్చు. మనము గోధుమల వలె ఎట్లున్నాము? గోధుమలను సమకూర్చే దేవదూతల వలె మనము ఎట్లు కాగలము?

సిద్ధాంతము మరియు నిబంధనలు 87:8.మీ ఇంటిని ఒక పరిశుద్ధ స్థలముగా ఎలా చేయాలనే దాని గురించి చర్చను ప్రారంభించడానికి, రక్షకుడిని ప్రేమించే ఒకరి కోసం ఒక ఇంటిని రూపొందించమని మీరు కుటుంబ సభ్యులను ఆహ్వానించవచ్చు. లోకములోని ఆత్మీయ అపాయాల మధ్య సమాధాన స్థలముగా తయారు చేయడానికి మీ ఇంటిని ఎలా “తిరిగి రూపకల్పన” చేయాలనే ఆలోచనలకు ఇది దారితీయవచ్చు. “Love at Home,” “Home Can Be a Heaven on Earth” (Hymns, nos. 294, 298), or “Where Love Is” (Children’s Songbook, 138–39) వంటి పాటలు మీకు ఉపాయాలను ఇవ్వగలవు.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

మీ సృజనాత్మకతను ఉపయోగించండి. మీరు లేఖనముల నుండి మీ కుటుంబానికి బోధించినప్పుడు, ఈ సారాంశములో సూచించబడిన ప్రశ్నలు మరియు ప్రోత్సాహ కార్యక్రమ ఉపాయాలకే పరిమితం కావద్దు. ఈ ఉపాయాలు మీ సృజనాత్మకతను మెరిపించనివ్వండి. మీ కుటుంబము దేనిని ఆనందిస్తుందో మరియు లేఖనాలు, వారి జీవితాలకు మధ్య సంబంధాలను కనుగొనడానికి వారికి ఏది సహాయపడుతుందో ఆలోచించండి.

చిత్రం
గోధుమ పొలము

అంత్యదినాలలో ఆయన జనులు ఎలా సమకూర్చబడతారో వివరించడానికి ప్రభువు గోధుమలు మరియు గురుగుల ఉపమానాన్ని ఉపయోగించారు.

ముద్రించు