2021 సిద్ధాంతము మరియు నిబంధనలు
ఆగష్టు 23–29. సిద్ధాంతము మరియు నిబంధనలు 93: “ఆయన సంపూర్ణత్వమును పొందుము”


“ఆగష్టు 23–29. సిద్ధాంతము మరియు నిబంధనలు 93: ‘ఆయన సంపూర్ణత్వమును పొందుము,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: సిద్ధాంతము మరియు నిబంధనలు 2021 (2020)

“ఆగష్టు 23–29. సిద్ధాంతము మరియు నిబంధనలు 93,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2021

చిత్రం
స్తెఫెను దేవుడిని, యేసు క్రీస్తును చూచును

మనుష్యకుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటను నేను చూచుచున్నాను, వాల్టర్ రానె చేత

ఆగష్టు 23–29

సిద్ధాంతము మరియు నిబంధనలు 93

“ఆయన సంపూర్ణత్వమును పొందుము”

“సత్యమనగా, ప్రస్తుతము ఉన్నవిధముగా, గతములో ఉన్నవిధముగా, భవిష్యత్తులో ఉండబోవు విధముగా ఉన్న సంగతుల యొక్క జ్ఞానము” (24వ వచనము) అని సిద్ధాంతము మరియు నిబంధనలు 93 బోధిస్తుంది. మీరు ఈ ప్రకరణమును చదువుతున్నప్పుడు, సత్యము కొరకు చూడండి మరియు మీరు నేర్చుకున్న దానిని నమోదు చేయండి. సత్యాన్ని పొందడానికి ఏమి చేయడానికి మీరు సమ్మతిస్తున్నారు? (27–28 వచనాలు చూడండి).

మీ మనోభావాలను నమోదు చేయండి

“మీరు ఒక నిచ్చెన ఎక్కుతున్నప్పుడు, మీరు తప్పకుండా క్రింద నుండి మొదలుపెట్టి పైకి చేరేవరకు ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కాలి; సువార్త సూత్రముల విషయములో కూడా అంతే—మీరు తప్పకుండా మొదటి దానితో మొదలుపెట్టి, ఉన్నతస్థితి యొక్క సూత్రాలన్నీ నేర్చుకొనే వరకు ముందుకు సాగాలి” అని జోసెఫ్ స్మిత్ బోధించారు (Teachings of Presidents of the Church: Joseph Smith [2007], 268).

మనము ఎప్పటికీ ఉన్నతస్థితిని పొందలేమని అనిపించినప్పటికీ, దానిని పొందడమే మన జీవిత ధ్యేయంగా ముందుకు సాగాలి. మనలో మనం ఎన్ని పరిమితులను చూసినా, పరలోక తండ్రి మరియు ఆయన కుమారుడు మనలో మహిమకరమైనదేదో, దైవము వంటిదేదో చూస్తున్నారు. యేసు క్రీస్తు “ఆదియందు తండ్రితో ఉన్నట్లే మీరు కూడా ఉన్నారు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 93:21, 23). ఆయన “సంపూర్ణత్వమును పొందువరకు కృప వెంబడి కృపయందు కొనసాగినట్లు, మీరు కృప వెంబడి కృపను పొందెదరు” (13, 20 వచనాలు). పునఃస్థాపించబడిన సువార్త దేవుని యొక్క నిజమైన స్వభావము గురించి మనకు బోధిస్తుంది, అలాగే అది మన గురించి మరియు మనము ఏమి కాగలమనే దాని గురించి మనకు బోధిస్తుంది. “దుష్టుని” (39వ వచనము) ప్రయత్నాలు ఉన్నప్పటికీ—మీకు ఏదో కొదువగా ఉందని మీరు భావించినప్పటికీ—“తగిన కాలమందు ఆయన సంపూర్ణత్వమును పొందగల” (19వ వచనము) సామర్థ్యముతోనున్న దేవుని నిజమైన బిడ్డ మీరు.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 93

తండ్రియైన దేవుడిని మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తును మేము ఆరాధిస్తాము.

సిద్ధాంతము మరియు నిబంధనలు 93లోని బయల్పాటు గురించి మాట్లాడుతూ ప్రభువు ఇలా వివరించారు, “ఏ విధముగా ఆరాధించవలెనో గ్రహించి తెలుసుకొనుటకు, దేనిని ఆరాధించవలెనో తెలుసుకొనుటకు ఈ మాటలను నేను మీకిచ్చుచున్నాను, తద్వారా నా నామములో మీరు తండ్రి యొద్దకు వచ్చి, తగిన కాలమందు ఆయన సంపూర్ణత్వమును పొందగలరు” (19వ వచనము). మీరు ఈ బయల్పాటును చదువుతున్నప్పుడు, మనము ఆరాధించే వ్యక్తులైన తండ్రియైన దేవుడు మరియు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు గురించి మీరు కనుగొనే సత్యాలను గుర్తించండి. వారిని “ఏ విధముగా ఆరాధించవలెను,” అనేదాని గురించి మరియు ఏ విధముగా “తండ్రి యొద్దకు రాగలమనే” దాని గురించి మీరేమి నేర్చుకుంటారు?

“దేవుని స్వభావాన్ని మనుషులు గ్రహించలేనట్లయితే, వారు తమనుతాము గ్రహించలేరు,” అని ప్రవక్త జోసెఫ్ స్మిత్ బోధించారు (Teachings: Joseph Smith, 40). సిద్ధాంతము మరియు నిబంధనలు 93 చదవడం ద్వారా మీరు రక్షకుని గురించి నేర్చుకుంటున్నప్పుడు, మీ గురించి కూడా మీరు నేర్చుకొనే దాని కొరకు చూడండి. ఉదాహరణకు, 3, 12, 21, మరియు 26 వచనాల నుండి ఆయన గురించి మీరేమి నేర్చుకుంటారు? 20, 23, మరియు 28–29 వచనాలలో మీ గురించి మీరు అటువంటి ఏ సత్యాలను కనుగొంటారు? (1 యోహాను 3:2; 3 నీఫై 27:27; Dean M. Davies, “The Blessings of Worship,” Ensign or Liahona, Nov. 2016, 93–95 కూడా చూడండి.)

సిద్ధాంతము మరియు నిబంధనలు 93:1–39

వెలుగు, సత్యము దేవుని మహిమయైయున్నది.

ఈ బయల్పాటులో మహిమ, వెలుగు మరియు సత్యము తరచు చెప్పబడ్డాయని మీరు గమనించవచ్చు. ప్రత్యేకించి మీరు 21–39 వచనాలు చదువుతున్నప్పుడు, మహిమ, వెలుగు మరియు సత్యము గురించి మీరు నేర్చుకొనే సత్యాల జాబితా తయారుచేయండి. అధిక వెలుగు మరియు సత్యమును వెదకడానికి ఈ సత్యాలు మిమ్మల్ని ఎలా ప్రేరేపిస్తాయి? మీ అనుదిన జీవితంలో మీరు జీవించే విధానాన్ని ఈ సత్యాలు ఎలా ప్రభావితం చేయవచ్చు?

చిత్రం
గాజు కిటికీ

దేవుని ఆజ్ఞలను పాటించినప్పుడు, మనము వెలుగు మరియు సత్యమును పొందుతాము.

సిద్ధాంతము మరియు నిబంధనలు 93:40–50

“నీ ఇంటిని నీవు చక్కబెట్టుకోవలెను.”

సుమారు 40వ వచనము నుండి సిద్ధాంతము మరియు నిబంధనలు 93 దేవుని మహిమ మరియు మన దైవిక సామర్థ్యము గురించిన బోధనల నుండి మాతాపితృత్వము మరియు మన ఇళ్ళను చక్కబెట్టుకోవడం గురించిన సూచనకు మారుతున్నట్లు అనిపిస్తుంది. 1–39 వచనాలలో వెలుగు, సత్యము మరియు మహిమ గురించి ప్రభువు బోధనలు 40–50 వచనాలలోని ఉపదేశాన్ని గ్రహించి, అనుసరించడానికి మీకెలా సహాయపడతాయి?

David A. Bednar, “More Diligent and Concerned at Home,” Ensign or Liahona, Nov. 2009, 17–20 కూడా చూడండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

సిద్ధాంతము మరియు నిబంధనలు 93:2.యేసు క్రీస్తు మన జీవితాలలో ఏవిధంగా “నిజమైన వెలుగైయున్నారు”? మన చుట్టూ ఉన్న ఇతర జనులలో ఆయన వెలుగును మనమెలా చూసాము?

సిద్ధాంతము మరియు నిబంధనలు 93:3–29.రక్షకుని గురించి మరియు వారి గురించి 93వ ప్రకరణములో వారు నేర్చుకొనిన దానిని మీ కుటుంబము చర్చించడానికి సహాయపడేందుకు మీరు ఒక జతపరిచే ఆటను ఆడవచ్చు. ఉదాహరణకు, 93వ ప్రకరణము నుండి రక్షకుని గురించి సత్యాలను బోధించే (3, 12, 21, 26 వచనాలు చూడండి) వచనాలతో ఒక అట్టముక్కల సెట్టును మరియు అదేవిధంగా మన గురించి బోధించే (20, 23, 28–29 వచనాలు చూడండి) వాటితో మరొక సెట్టును మీరు తయారు చేయవచ్చు. కుటుంబ సభ్యులు వంతులవారీగా ప్రతి సెట్టు నుండి ఒక అట్టముక్కను తీసుకొని, వచనాలను చదివి, వాటికి సరిపోయే సత్యాలను కనుగొనడానికి ప్రయత్నించవచ్చు. రక్షకుని గురించి మరియు మన గురించి మనము భావించే దానిని ఈ సత్యాలు ఎలా ప్రభావితం చేస్తాయి?

సిద్ధాంతము మరియు నిబంధనలు 93:12–13, 20.“కృప వెంబడి కృపను పొందుట” మరియు “కృప వెంబడి కృపయందు కొనసాగుట” అనగా అర్థమేమిటి? (12–13 వచనాలు). మనము ఎదిగే మరియు నేర్చుకొనే విధానము గురించి ఈ వచనాలు ఏమి సూచిస్తున్నాయి? దీనిని తెలుసుకోవడం ఇతరులను మరియు మనల్ని మనం ఆదరించే విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

సిద్ధాంతము మరియు నిబంధనలు 93:24.ఈ వచనములో సత్యము గురించి కనుగొనబడిన నిర్వచనాన్ని చదవండి మరియు 93వ ప్రకరణము నుండి విలువైన సత్యమని వారు పరిగణించిన ఒకదానిని పంచుకోమని కుటుంబ సభ్యులను ఆహ్వానించండి. యోహాను 14:6; యాకోబు 4:13లో మనము కనుగొనే సత్యము యొక్క ఇతర నిర్వచనాలేవి?

సిద్ధాంతము మరియు నిబంధనలు 93:40.మీరు ఈ వచనమును చదివినప్పుడు, బహుశా మీ కుటుంబము ఇంటి వద్ద నేర్చుకోవడం గురించి ఒక పాట పాడవచ్చు. పదాలకు తగినట్లుగా అభినయించడాన్ని చిన్నపిల్లలు ఆనందించవచ్చు. మీ ఇంటిలోనికి మరింత “వెలుగు మరియు సత్యము”ను ఆహ్వానించడానికి ఏమి చేయాలని ప్రేరేపించబడినట్లు మీరు భావిస్తున్నారు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 93:41–50.“మీ ఇంటిలో సరిగాలేని సంగతుల” గురించి కుటుంబముగా కలిసి చర్చించండి. “[మన] ఇంటిని చక్కబెట్టుకోవడానికి” మనమేమి చేయగలము? (43–44 వచనాలు).

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

ఒకటికంటే ఎక్కువసార్లు చదవండి. వారంలో ఒకటికంటే ఎక్కవసార్లు మీరు సిద్ధాంతము మరియు నిబంధనలు 93 చదవాలని ఎంచుకోవచ్చు. మీరు చదివిన ప్రతిసారీ, విభిన్న సత్యాలు మీకు ముఖ్యమనిపించడాన్ని లేక క్రొత్తగా మిమ్మల్ని ప్రేరేపించడాన్ని మీరు గమనించవచ్చు. అనేకసార్లు చదవడం మరింత లోతుగా ధ్యానించడానికి మీకు అవకాశాలను అందిస్తుంది.

చిత్రం
యేసు క్రీస్తు

వెలుగు మరియు సత్యము, సైమన్ డివి చేత

ముద్రించు