2023 క్రొత్త నిబంధన
జూన్ 26–జూలై 2. మత్తయి 28; మార్కు 16; లూకా 24; యోహాను 20–21: “ఆయన లేచియున్నాడు”


“జూన్ 26–జూలై 2. మత్తయి 28; మార్కు 16; లూకా 24; యోహాను 20–21: ‘ఆయన లేచియున్నాడు,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“జూన్ 26–జూలై 2. మత్తయి 28; మార్కు 16; లూకా 24; యోహాను 20–21,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
సముద్రతీరము వద్ద పేతురుతో మాట్లాడుతున్న యేసు

నా గొఱ్ఱెలను మేపుము, కమీల్ కోరీ చేత

జూన్ 26–జూలై 2

మత్తయి 28; మార్కు 16; లూకా 24; యోహాను 20–21

“ఆయన లేచియున్నాడు”

క్రీస్తు యొక్క పునరుత్థానము మూలంగా మీకు కలిగిన ఆనందంపై దృష్టిసారిస్తూ, ప్రార్థనాపూర్వకంగా మత్తయి 28; మార్కు 16; లూకా 24; మరియు యోహాను 20–21 చదవండి. ఈ సంఘటన గురించి మీ సాక్ష్యాన్ని వినడం ద్వారా ఎవరు దీవించబడవచ్చు?

మీ మనోభావాలను నమోదు చేయండి

పరిశీలకులు అనేకులకు, నజరేతు యొక్క యేసు మరణము ఒక విశేషమైన జీవితానికి విరుద్ధమైన ముగింపుగా కనిపించియుండవచ్చు. లాజరును మరణం నుండి లేపినది ఈ మనుష్యుడు కాదా? పదేపదే పరిసయ్యుల నుండి హింసాత్మక బెదిరింపులు ఇతడు ఎదుర్కొనలేదా? గ్రుడ్డితనమును, కుష్టురోగమును, పక్షవాతమును స్వస్థపరచడంలో ఆయన శక్తిని చూపాడు. ఈదురు గాలులు, సముద్రము కూడా ఆయనకు లోబడియుండెను. అయినప్పటికీ ఇక్కడ ఆయన శిలువపై వ్రేలాడుతూ, “సమాప్తమైనది” (యోహాను 19:30) అని ప్రకటిస్తున్నాడు. “వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు” (మత్తయి 27:42) అనే వెక్కిరింపులో కొంత హృదయపూర్వక ఆశ్చర్యము కూడా ఉండియుండవచ్చు. కానీ యేసు మరణము, కథకు ముగింపు కాదని మనకు తెలుసు. సమాధి యొక్క నిశ్శబ్దము తాత్కాలికమైనదని, క్రీస్తు యొక్క రక్షణ కార్యము అప్పుడే మొదలు కాబోతుందని మనకు తెలుసు. నేడు ఆయన “మృతులలో” కాదు గాని సజీవులలో కనుగొనబడును (లూకా 24:5). ఆయన బోధనలు అణచివేయబడవు, ఎందుకనగా “యుగసమాప్తి వరకు సదాకాలము (వారితో) కూడ ఉంటానని” (మత్తయి 28:19–20) ఆయన చేసిన వాగ్దానమును నమ్ముతూ విధేయులైన ఆయన శిష్యులు “సమస్త జనములకు” సువార్తను ప్రకటించెదరు.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

మత్తయి 28; మార్కు 16; లూకా 24; యోహాను 20

యేసు క్రీస్తు పునరుత్థానము చెందారు.

ఈ వాక్యభాగాలలో మీరు మానవజాతి చరిత్రలోని అత్యంత ముఖ్యమైన సంఘటనలలో ఒకదాని గురించి చదువుతారు: యేసు క్రీస్తు యొక్క పునరుత్థానము. మీరు చదువుతున్నప్పుడు, పునరుత్థానమునకు సంబంధించిన సంఘటనలను చూసిన జనుల స్థానంలో మిమ్మల్నిమీరు ఊహించుకోండి. వారి అనుభవాల నుండి మీరు ఏమి నేర్చుకుంటారు?

రక్షకుని పునరుత్థానము గురించి మీరు చదువుతున్నప్పుడు, మీరు ఎలా భావిస్తారు? అది మిమ్మల్ని—జీవితంపై మీ దృక్పథాన్ని, మీ సంబంధాలను, క్రీస్తునందు మీ విశ్వాసాన్ని, ఇతర సువార్త సత్యాలలో మీ విశ్వాసాన్ని ఎలా ప్రభావితం చేసిందో ఆలోచించండి.

బైబిలు నిఘంటువు, “పునరుత్థానము”; సువార్త అంశములు, “పునరుత్థానము,” topics.ChurchofJesusChrist.org కూడా చూడండి.

లూకా 24:13–35

“[నా]తో కూడ ఉండమని” రక్షకుడిని నేను ఆహ్వానించగలను.

పునరుత్థానుడైన రక్షకుడిని కలిసిన ఇద్దరు ప్రయాణిస్తున్న శిష్యుల అనుభవాన్ని మీరు చదువుతున్నప్పుడు, క్రీస్తు యొక్క అనుచరునిగా మీ అనుభవాలతో గల పోలికల కొరకు చూడండి. నేడు మీరు ఆయనతో కలిసి ఎలా నడువగలరు మరియు ఇంకొంతసేపు “ఉండమని” ఆయనను ఎలా ఆహ్వానించగలరు? (లూకా 24:29). మీ జీవితంలో ఆయన ఉనికిని మీరెలా గుర్తిస్తారు? యేసు క్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి ఏ విధాలుగా పరిశుద్ధాత్మ మీకు సాక్ష్యమిచ్చాడు?

లూకా 24:36–43; యోహాను 20

పునరుత్థానమనగా ఆత్మ శరీరంతో శాశ్వతంగా ఏకమగుట.

యేసు క్రీస్తు యొక్క పునరుత్థాన వృత్తాంతములు పునరుత్థానము అనగా అర్థమేమిటో గ్రహించడానికి మీకు సహాయపడగలవు. ఉదాహరణకు, పునరుత్థానము చెందిన వారి గురించి లూకా 24:36–43 మరియు యోహాను 20 లో మీరు కనుగొన్న సత్యములేవి? పునరుత్థానము గురించి 1 కొరింథీయులకు 15:35–44; ఫిలిప్పీయులకు 3:20–21; 3 నీఫై 11:13–15; సిద్ధాంతము మరియు నిబంధనలు 88:27–31; 110:2–3; 130:1, 22 వంటి ఇతర లేఖనాలను కూడా మీరు అన్వేషించవచ్చు.

యోహాను 20:19–29

“చూడక నమ్మినవారు ధన్యులు.”

కొందరు, “నేను చూస్తే గానీ … నేను నమ్మనే నమ్మను” (యోహాను 20:25) అని చెప్పిన తోమా వలె భావించవచ్చు. మీ అభిప్రాయంలో, చూడకుండా నమ్మడం ఎందుకు దీవెన కాగలదు? (యోహాను 20:29 చూడండి). మీరు చూడలేని సంగతులను నమ్మినందుకు మీరెలా దీవించబడ్డారో ధ్యానించండి. మీరు ఆయనను చూడలేనప్పటికీ, రక్షకుని యందు విశ్వాసము కలిగియుండడానికి ఏది మీకు సహాయపడుతున్నది? “చూడని, కానీ సత్యమైన సంగతులలో” మీ విశ్వాసాన్ని బలపరచుకోవడాన్ని మీరెలా కొనసాగించగలరు? (ఆల్మా 32:16–21; ఈథర్ 12:6 చూడండి). యేసు క్రీస్తును నమ్మడానికి మీకు సహాయపడిన అనుభవాలను ఒక దినచర్య పుస్తకంలో వ్రాయడం లేదా మీకు తెలిసిన వారితో వాటిని పంచుకోవడం గురించి ఆలోచించండి.

యోహాను 21:1–17

తన గొఱ్ఱెలను మేపమని రక్షకుడు నన్ను ఆహ్వానిస్తారు.

యోహాను 21 లో తన అపొస్తలులతో రక్షకుని వ్యవహారములను, లూకా 5:1–11 లో నమోదు చేయబడిన, వారి చేపల వలలను వదిలివేయమని మొదటిసారి ఆయన వారిని ఆజ్ఞాపించిన దానితో పోల్చడం ఆసక్తికరంగా ఉండవచ్చు. ఏ పోలికలను మరియు తేడాలను మీరు కనుగొంటారు? శిష్యత్వము గురించి ఏ అంతరార్థములను మీరు కనుగొంటారు?

యోహాను 21:15–17 లో రక్షకుడు పేతురుతో పలికిన మాటలు మీకెలా అన్వయించబడగలవో ఆలోచించండి. ప్రభువు యొక్క గొఱ్ఱెలకు పరిచర్య చేయడం నుండి మిమ్మల్ని ఏదైనా ఆపుతున్నదా? “నీవు నన్ను ప్రేమించుచున్నావా” అని ప్రభువు మిమ్మల్ని అడిగినట్లయితే, మీ జవాబు ఏమైయుంటుంది? ప్రభువు పట్ల మీ ప్రేమను మీరెలా చూపగలరో ధ్యానించండి.

1 పేతురు 5: 2– 4, 8 కూడా చూడండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

లూకా 24:5–6.“క్రైస్తవ లేఖనాలలో వీటిని మించిన మాటలు నాకు లేవు” అని లూకా 24:5–6 గురించి అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ చెప్పారు (“He Is Risen!,” Liahona, May 2010, 89). మీకు, మీ కుటుంబానికి ఈ మాటల అర్థమేమిటి?

మత్తయి 28; మార్కు 16; లూకా 24; యోహాను 20–21మీ కుటుంబము ఈ అధ్యాయాలను చదివినప్పుడు, ప్రతి వృత్తాంతములో యేసుతో వ్యవహరించిన జనులను గమనించండి. ఉదాహరణకు, రక్షకుని సమాధిని దర్శించిన వారి గురించి ఏది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది? అపొస్తలుల మాటలు లేదా చర్యల నుండి లేదా ఎమ్మాయుకు వెళ్ళే దారిలో శిష్యుల నుండి మీరేమి నేర్చుకుంటారు?

మీ కుటుంబానికి తెలిసి మరణించిన ఒకరి గురించి మాట్లాడండి మరియు ఈ అధ్యాయాలలోని సత్యాలు ఎలా ఓదార్పునివ్వగలవో చర్చించండి.

చిత్రం
రహదారిపై ఇద్దరు మనుష్యులతోపాటు నడుస్తున్న యేసు

ఎమ్మాయుకు వెళ్ళే దారి, వెండీ కెల్లర్ చేత

మత్తయి 28:16–20; మార్కు 16:14–20; లూకా 24:44–53.ఈ వచనాలలో, తన అపొస్తలులను ఏమి చేయమని యేసు అడుగుతున్నారు? ఈ కార్యమును సాధించడానికి మనమెలా సహాయపడగలము? ఆయన ఉద్దేశ్యాలను సాధించడానికి “ప్రభువు వారికి సహకారుడై యుండినట్లు” వారు భావించినప్పటి అనుభవాలను కుటుంబ సభ్యులు పంచుకోవచ్చు (మార్కు 16:20).

యోహాను 21:15-17.కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఈ వచనాలను చదవడం గురించి ఆలోచించండి. “నా గొఱ్ఱెలను మేపుము” అనే రక్షకుని మాటలకు ఇది కొంత అర్థాన్ని చేర్చగలదు. క్రొత్త నిబంధనలో గొఱ్ఱెల గురించి యేసు బోధించిన దానిపై ఆధారపడి (ఉదాహరణకు, మత్తయి 9:35–36; 10:5–6; 25:31–46; లూకా 15:4–7; యోహాను 10:1–16 చూడండి), గొఱ్ఱెలను మేపడమనేది దేవుని పిల్లలకు సేవచేయడాన్ని వర్ణించడానికి ఎందుకు ఒక మంచి విధానంగా ఉన్నది? మన గురించి పరలోక తండ్రి మరియు యేసు ఎలా భావిస్తారనే దానిగురించి ఈ పోలిక ఏమి బోధిస్తుంది?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

ఆత్మను ఆహ్వానించడానికి, సిద్ధాంతమును నేర్చుకోవడానికి సంగీతాన్ని ఉపయోగించండి. రక్షకుని గురించిన కీర్తనలను వినడం లేదా పాడడం ఆత్మను ఆహ్వానించగలదు మరియు ఆయన గురించి నేర్చుకోవడానికి మీకు సహాయపడగలదు.

చిత్రం
లేచిన క్రీస్తును సమాధి వద్ద చూస్తున్న స్త్రీ

పునరుత్థానము చెందిన క్రీస్తు, వాల్టర్ రానె చేత

ముద్రించు