2023 క్రొత్త నిబంధన
జూలై 31–ఆగష్టు 6. అపొస్తలుల కార్యములు 22–28: “పరిచారకుడు మరియు సాక్షి”


“జూలై 31–ఆగష్టు 6. అపొస్తలుల కార్యములు 22–28: ‘పరిచారకుడు మరియు సాక్షి,’”రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“జూలై 31–ఆగష్టు 6. అపొస్తలుల కార్యములు 22–28,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023

చిత్రం
చెరశాలలో పౌలు

జూలై 31–ఆగష్టు 6

అపొస్తలుల కార్యములు 22–28

“పరిచారకుడు మరియు సాక్షి”

పరిశుద్ధాత్మ నుండి కలుగు మనోభావాలు తరచు నిశ్శబ్దంగా, కొన్ని సార్లు క్షణభంగురమైనవిగా ఉంటాయి. మీ మనోభావాలను నమోదు చేయడం వాటి గురించి మీరు మరింత లోతుగా ఆలోచించేందుకు అనుమతిస్తుంది. మీరు అపొస్తలుల కార్యములు 22–28 చదువుతున్నప్పుడు, మీకు కలిగే ఆలోచనలను, భావనలను వ్రాయండి మరియు వాటిని ధ్యానించడానికి సమయాన్ని వెచ్చించండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

“మనం ప్రభువు పనిలో ఉన్నప్పుడు, ప్రభువు సహాయాన్ని పొందడానికి మనం అర్హులం” అని అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ వాగ్దానము చేసారు (“To Learn, to Do, to Be,” Liahona, Nov. 2008, 62). అయినప్పటికీ, శ్రమలు లేని జీవితము మరియు అంతులేని విజయాల ప్రవాహానికి మనము అర్హులము కాము. దీనికి సాక్ష్యం కోసం, అపొస్తలుడైన పౌలును మించి మనం ఎవరిని చూడవలసిన అవసరం లేదు. రక్షకుని నుండి ఆయన పొందిన కార్యము “అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుట” (అపొస్తలుల కార్యములు 9:15). అపొస్తలుల కార్యములు 22–28 అధ్యాయములలో, పౌలు ఈ కార్యాన్ని నెరవేర్చడం మరియు గొప్ప వ్యతిరేకతను ఎదుర్కోవడం—సంకెళ్ళు, చెరసాలలో వేయబడడం, శారీరక వేధింపు, ఓడ పగులుట మరియు పాము దాడిని కూడా మనం చూస్తాము. కానీ యేసు “అతనియొద్ద నిలుచుండి–పౌలు, ధైర్యముగా ఉండుము అని చెప్పెనని” కూడా మనం చూస్తాము (అపొస్తలుల కార్యములు 23:11) “సంతోషధ్వనితో (ఆయన) సువార్తను ప్రకటించుటకు” ప్రభువు యొక్క పిలుపు “మీ హృదయములను పైకెత్తుకొని ఆనందించుడి, ఏలయనగా నేను మీ మధ్యనున్నాను” అనే వాగ్దానంతో పాటు వస్తుంది (సిద్ధాంతము మరియు నిబంధనలు 29:4–5; మత్తయి 28:19–20 కూడా చూడండి) అనడానికి పౌలు అనుభవాలు ప్రేరిపిత జ్ఞాపకార్థములు.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత అధ్యయనము కొరకు ఉపాయములు

అపొస్తలుల కార్యములు 22:1–21; 26:1–29

యేసు క్రీస్తు యొక్క శిష్యులు తమ సాక్ష్యాలను ధైర్యంగా పంచుకుంటారు.

అపొస్తలుల కార్యములు 22 మరియు 26 లో నమోదు చేయబడిన శక్తివంతమైన సాక్ష్యాలను పౌలు చెప్పినప్పుడు, ఆయన రోమా సైనికుల చేత ఖైదీగా ఉంచబడెను. ఆయన మాట్లాడిన వ్యక్తులు అతనికి మరణశిక్ష విధించే అధికారాన్ని కలిగియున్నారు. అయినప్పటికీ యేసు క్రీస్తు గురించి మరియు “ఆకాశమునుండి కలిగిన ఆ దర్శనము” (అపొస్తలుల కార్యములు 26:19) గురించి ధైర్యముగా సాక్ష్యము చెప్పుటకు ఆయన ఎంచుకొనెను. ఆయన మాటలలో ఏది మీకు ప్రేరణనిస్తుంది? మీ సాక్ష్యాన్ని పంచుకోవడానికి మీకు ఉన్న అవకాశాలను పరిగణించండి. ఉదాహరణకు, యేసు క్రీస్తు గురించి మీరెలా భావిస్తారో మీ స్నేహితులకు తెలుసా? లేదా సువార్త గురించి మీ సాక్ష్యాన్ని మీరెలా పొందారో మీ కుటుంబ సభ్యులకు చివరిసారి ఎప్పుడు చెప్పారు?

అతని మొదటి దర్శనం గురించి చెప్పినందుకు యువ జోసెఫ్ స్మిత్ ఎగతాళి చేయబడినప్పుడు, పౌలు తన దర్శనం గురించి సాక్ష్యమిచ్చిన విధానం చేత అతడు ప్రేరేపించబడ్డాడు (జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:24–25 చూడండి.). పౌలు నుండి జోసెఫ్ స్మిత్ నేర్చుకున్న దానిని మీరు ఎలా సంక్షిప్తపరుస్తారు? యేసు క్రీస్తు యొక్క ఈ ఇద్దరు సాక్ష్యుల నుండి మీరేమి నేర్చుకుంటారు?

అపొస్తలుల కార్యములు 23:10–11; 27:13–25, 40–44

ఆయనకు సేవ చేయడానికి ప్రయత్నించే వారికి ప్రభువు అండగా నిలుస్తారు.

పౌలు పరిచర్య స్పష్టంగా చూపినట్లుగా, మన జీవితంలో కలిగే కష్టాలు మనల్ని లేదా మనం చేస్తున్న పనిని దేవుడు అంగీకరించలేదు అనడానికి సంకేతం కాదు. వాస్తవానికి, కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడే ఆయన సహకారాన్ని మనం చాలా బలంగా భావిస్తాము. పౌలు పరిచర్య గురించి మీరు ఇటీవల చదివిన వాటిని సమీక్షించడం మరియు అతడు సహించిన కొన్ని విషయాలను జాబితా చేయడం ఆసక్తికరంగా ఉండవచ్చు (ఉదాహరణకు అపొస్తలుల కార్యములు 14:19–20; 16:19–27; 21:31–34;23:10–11; 27:13–25, 40–44 చూడండి). ప్రభువు అతనికి ఏవిధంగా అండగా నిలిచారు? ఆయన మీకు అండగా ఎలా నిలిచారు?

అపొస్తలుల కార్యములు 24:24–27; 26:1–3, 24–29; 27

దేవుని సేవకుల మాటలను ఆలకించడంలో శాంతిభద్రతలున్నాయి.

పౌలు తన పరిచర్య అంతటిలో, యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త గురించి శక్తివంతమైన సాక్ష్యాలను ఇచ్చాడు. అతని సాక్ష్యాన్ని చాలామంది అంగీకరించారు, కానీ అందరూ అంగీకరించలేదు. అపొస్తలుల కార్యములు 24:24–27 మరియు అపొస్తలుల కార్యములు 26:1–3, 24–29 మీరు చదువుతున్నప్పుడు, యూదయలో ఉన్న రోమా పాలకులు పౌలు బోధనలకు ఎలా స్పందించారో చూపించే పదాలు మరియు వాక్యభాగాలను వెదకండి:

  • ఫేలిక్సు

  • ఫేస్తు

  • అగ్రిప్ప రాజు

కైసరు చేత విచారణ చేయబడుటకు రోమాకు ప్రయాణిస్తున్నప్పుడు, ఓడ మరియు దాని ప్రయాణీకులకు “హానియు బహు నష్టమును” కలుగునని పౌలు ప్రవచించెను (అపొస్తలుల కార్యములు 27:10). ఓడలో పౌలు యొక్క సహచరులు అతని హెచ్చరికలకు ఏ విధంగా స్పందించారో తెలుసుకోవడానికి 27వ అధ్యాయము చదవండి. వారి అనుభవంలో మీ కొరకు ఏవైనా పాఠాలను మీరు కనుగొన్నారా?

సంఘ నాయకుల బోధనలను వినినప్పుడు మీరెప్పుడైనా ఈ జనులలో ఎవరిలాగైనా స్పందించారా? ఈ విధాలలో ప్రతిస్పందించడం వల్ల కలిగే కొన్ని పర్యవసానాలేవి? ఆయన సేవకుల ద్వారా ప్రభువు ఉపదేశాన్ని ఆలకించడం గురించి మీరు ఈ వృత్తాంతాల నుండి ఏమి నేర్చుకుంటారు?

2 నీఫై 33: 1– 2; డి. టాడ్ క్రిస్టాఫర్‌సన్, “హెచ్చరించు స్వరము,” లియహోనా, మే 2017, 108–11; “Follow the Living Prophet,” Teachings of Presidents of the Church: Ezra Taft Benson (2014), 147–55 కూడా చూడండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

అపొస్తలుల కార్యములు 24:16.తన పరివర్తనకు ముందు, పౌలు దేవుని పట్ల చేసిన దోషములకు సుదీర్ఘ చరిత్ర ఉంది. కానీ పశ్చాత్తాపపడుటకు సిద్ధంగా ఉండడం వలన ఆయన ఈ విధంగా చెప్పగలిగెను, “ఈ విధమున నేను దేవుని యెడలను మనుష్యుల యెడలను ఎల్లప్పుడు నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసికొనుచున్నాను” (సిద్ధాంతము మరియు నిబంధనలు 135:4–5 కూడా చూడండి). దేవుడు మరియు ఇతరుల యెడల చేసిన దోషాలపట్ల మన మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు మనమెలా చేయగలము?

అపొస్తలుల కార్యములు 26:16–18.ఈ వచనాలలో పౌలును ఏమి చేయమని ప్రభువు పిలుపునిచ్చారు? ఇటువంటి పనులు చేయడానికి మనకు ఏ అవకాశాలు ఉన్నాయి?

అపొస్తలుల కార్యములు 28:1–9.మీ కుటుంబంలో ఎవరైనా పాములను ఇష్టపడతారా? అపొస్తలుల కార్యములు 28:1–9 లో కనుగొనబడు కథలను చెప్పమని మీరు ఆ వ్యక్తిని లేదా మరొక కుటుంబ సభ్యుడిని అడగవచ్చు. మీ పిల్లలు ఈ కథల చిత్రాన్ని గీయడం లేదా వాటిని అభినయించడాన్ని ఆనందించవచ్చు. ఈ వృత్తాంతాల నుండి మనం ఏ పాఠాలను నేర్చుకోగలము? ప్రభువు తన సేవకులకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తారు అనేది వాటిలో ఒకటి కావచ్చు. ఉదాహరణకు, మార్కు 16:18 లో చేయబడిన వాగ్దానాలను పౌలు అనుభవాలలో వాటి యొక్క నెరవేర్పుతో మీరు పోల్చవచ్చు. ఇటీవలి సర్వసభ్య సమావేశ ప్రసంగంలో ప్రభువు యొక్క సేవకులలో ఒకరు ఇచ్చిన వాగ్దానాన్ని—బహుశా మీ కుటుంబానికి అర్థవంతముగా ఉండేదానిని—మీరు కనుగొనవచ్చు మరియు దానిని మీ ఇంటిలో ప్రదర్శించవచ్చు. ఈ వాగ్దానము నెరవేరుతుందని ఏవిధంగా మన విశ్వాసాన్ని చూపగలము?

చిత్రం
విషపూరితమైన పాము

విషపూరితమైన పాము పౌలును కరిచినప్పుడు దేవుడు ఆయనను రక్షించారు.

అపొస్తలుల కార్యములు 28:22–24.పౌలు కాలములోని సంఘము వలె ( 22వ వచనం లో “మతభేదము” అని పిలువబడింది), నేటి సంఘము తరచుగా “ఆక్షేపణ” చేయబడుతోంది. జనులు రక్షకునికి మరియు ఆయన సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, పౌలు ఎలా స్పందించాడు? పౌలు అనుభవం నుండి మనం ఏమి నేర్చుకోగలము?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

మీ కుటుంబాన్ని దీవించే సూత్రాలపై దృష్టి పెట్టండి. మీరు లేఖనాలను అధ్యయనం చేస్తున్నప్పుడు, “నా కుటుంబానికి ప్రత్యేకంగా అర్థవంతముగా ఉండే దేనిని నేను ఇక్కడ కనుగొన్నాను?” అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. (Teaching in the Savior’s Way, 17 చూడండి.)

చిత్రం
అగ్రిప్ప రాజు యెదుట పౌలు

అగ్రిప్ప రాజు యెదుట పౌలు యేసు క్రీస్తు యొక్క సాక్ష్యంలో పరాక్రమశాలి, డానియెల్ ఎ. లూయిస్.

ముద్రించు