2023 క్రొత్త నిబంధన
మీ వ్యక్తిగత లేఖన అధ్యయనమును మెరుగుపరచుటకు ఉపాయములు


“మీ వ్యక్తిగత లేఖన అధ్యయనమును మెరుగుపరచుటకు ఉపాయములు,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: క్రొత్త నిబంధన 2023 (2022)

“మీ వ్యక్తిగత లేఖన అధ్యయనమును మెరుగుపరచుటకు ఉపాయములు,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2023

చిత్రం
లేఖనాలను అధ్యయనం చేస్తున్న స్త్రీ

మీ వ్యక్తిగత లేఖన అధ్యయనమును మెరుగుపరచుటకు ఉపాయములు

ఇవి లేఖనాలలో దేవుని వాక్యమునకు సంబంధించి మీ అధ్యయనాన్ని మెరుగుపరిచే కొన్ని సులువైన మార్గాలు.

యేసు క్రీస్తు గురించిన సత్యాల కొరకు వెదకండి

సమస్త సంగతులు క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చునని లేఖనాలు మనకు బోధిస్తున్నాయి (2 నీఫై 11:4; మోషే 6:63 చూడండి), కాబట్టి రక్షకుడి గురించి మరియు ఆయనను ఎలా అనుసరించాలనే దాని గురించి బోధించే వచనాలను గమనించడాన్ని లేదా గుర్తించడాన్ని పరిగణించండి.

ప్రేరేపించే పదములు మరియు వాక్యభాగముల కొరకు వెదకండి

లేఖనములందు మీ కోసం ప్రత్యేకంగా వ్రాయబడినట్లుగా, మిమ్మల్ని ముగ్ధులను చేసే కొన్ని నిర్దిష్టమైన పదములు మరియు వాక్యభాగములను మీరు కనుగొనవచ్చు. అవి వ్యక్తిగతంగా మీకు సంబంధితమైనవిగా అనిపించి, మిమ్మల్ని ప్రేరేపించి, ప్రోత్సహించవచ్చు. వాటిని మీ లేఖనాలలో గుర్తించుటకు లేదా దినచర్య పుస్తకములో వ్రాయుటకు ఆలోచించండి.

సువార్త సత్యముల కొరకు వెదకండి

కొన్నిసార్లు సువార్త సత్యములు (సిద్ధాంతము లేదా సూత్రాలు అని తరచు పిలువబడినవి) సూటిగా వ్యాఖ్యానించబడతాయి, మరికొన్నిసార్లు అవి ఒక ఉదాహరణ లేదా వృత్తాంతము ద్వారా సూచించబడతాయి. “ఈ వచనములలో బోధించబడిన నిత్య సత్యములేవి?” అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.

ఆత్మను ఆలకించండి

మీరు చదువుతున్న దానికి సంబంధించక పోయినప్పటికీ, మీ ఆలోచనలు మరియు భావాలపట్ల శ్రద్ధ వహించండి. ఆ మనోభావాలే మీ పరలోక తండ్రి మీరు నేర్చుకోవాలని కోరే విషయాలు కావచ్చు.

లేఖనాలను మీ జీవితానికి పోల్చుకోండి

మీరు చదువుతున్న వృత్తాంతములు మరియు బోధనలు ఏవిధంగా మీ జీవితానికి వర్తిస్తాయో ఆలోచించండి. ఉదాహరణకు, మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోవచ్చు, “నాకు కలిగిన ఏ అనుభవాలు నేను చదివిన దానిని పోలియున్నాయి?” లేదా “లేఖనాలలో ఈ వ్యక్తి ఉదాహరణను నేను ఎలా అనుసరించగలను?”

మీరు అధ్యయనము చేస్తున్నప్పుడు ప్రశ్నలు అడగండి

మీరు లేఖనాలను అధ్యయనము చేస్తున్నప్పుడు, మనస్సులో ప్రశ్నలు తలెత్తవచ్చు. ఈ ప్రశ్నలు మీరు చదివే దానికి లేదా సాధారణంగా మీ జీవితానికి సంబంధించినవై యుండవచ్చు. మీరు లేఖనాలను అధ్యయనము చేయుట కొనసాగించినప్పుడు, ఈ ప్రశ్నలను ధ్యానించండి మరియు జవాబుల కొరకు వెదకండి.

చిత్రం
లేఖనాలను అధ్యయనం చేస్తున్న బాలుడు

లేఖన అధ్యయన సహాయములను ఉపయోగించండి

మీరు చదివే వచనాల యొక్క అదనపు అంతరార్థములను తెలుసుకొనుటకు, పాదవివరణలను, విషయదీపిక, బైబిలు నిఘంటువు, లేఖనదీపిక (scriptures.ChurchofJesusChrist.org) మరియు ఇతర అధ్యయన సహాయకాలను ఉపయోగించండి.

లేఖనాల సందర్భాన్ని పరిగణించండి

ఒక లేఖనము యొక్క అర్థవంతమైన అంతరార్థములను దాని యొక్క సందర్భమును—అనగా ఆ లేఖనము యొక్క పరిస్థితులు లేదా స్థితిగతులను పరిగణించినట్లైతే—మీరు కనుగొనగలరు. ఉదాహరణకు, ప్రవక్త మాట్లాడిన మనుషుల యొక్క నేపథ్యము మరియు నమ్మకాలను తెలుసుకోవడం ఆయన మాటల ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడగలదు.

మీ ఆలోచనలను మరియు అనుభూతులను నమోదు చేయండి

మీరు అధ్యయనం చేసేటప్పుడు వచ్చే మనోభావాలను వ్రాయడానికి వేర్వేరు విధానాలున్నాయి. ఉదాహరణకు, మీరు ఒక అర్థవంతమైన పదము లేదా వాక్యభాగమును గుర్తించవచ్చు మరియు మీ లేఖనములందు ఒక వివరణగా మీ ఆలోచనలను వ్రాయవచ్చు. మీరు పొందే అంతరార్థములు, భావనలు మరియు మనోభావాలను దినచర్య పుస్తకములో వ్రాసిపెట్టుకోవచ్చు.

కడవరి దిన ప్రవక్తలు మరియు అపొస్తలుల మాటలను అధ్యయనము చేయండి

లేఖనములందు మీరు కనుగొనే సూత్రములను గూర్చి కడవరి దిన ప్రవక్తలు మరియు అపొస్తలులు బోధించిన దానిని చదవండి (ఉదాహరణకు, conference.ChurchofJesusChrist.org మరియు సంఘ మాసపత్రికలు చూడండి).

అంతరార్థములను పంచుకోండి

మీ వ్యక్తిగత అధ్యయనము నుండి అంతరార్థములను చర్చించుట ఇతరులకు బోధించుటకు మంచి విధానము మాత్రమే కాదు, కానీ మీరు చదివిన దానిని గూర్చి మీ అవగాహనను బలపరచుటకు కూడా అది సహాయపడుతుంది.

మీరు నేర్చుకున్నదాని ప్రకారము జీవించండి

లేఖన అధ్యయనము మనల్ని ప్రేరేపించడం మాత్రమే కాదు, కానీ అది మన జీవన విధానాన్ని మార్చేలా కూడా ఉండాలి. మీరు చదువుతున్నప్పుడు ఆత్మ మిమ్మల్ని ఏమి చేయమని ప్రేరేపిస్తుందో వినండి, తరువాత ఆ ప్రేరణలపై పనిచేయడానికి కట్టుబడి ఉండండి.

ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ ఇలా చెప్పారు: “సంఘము ఒక సంస్థగా మనము తెలుసుకోవలసిన సమస్తమును, భక్తిగల శిష్యులగుటకు మరియు పరాక్రమముతో అంతము వరకు సహించుటకు చేయవలసిన సమస్తమును మనకు బోధించాలని లేదా చెప్పాలని మనము ఆశించరాదు [సిద్ధాంతము మరియు నిబంధనలు 121:29 చూడండి]. బదులుగా మన వ్యక్తిగత బాధ్యత ఏదనగా, మనము నేర్చుకోవలసిన దానిని నేర్చుకొనుట, మనము జీవించాలని మనకు తెలిసినట్లుగా జీవించుట మరియు బోధకుడు మనము కావాలని కోరినట్లుగా మారుట. నేర్చుకొనుటకు, జీవించుటకు మరియు మారుటకు మన గృహాలు అంతిమ వేదికగా ఉన్నాయి.” (“అవసరమైన ప్రతిదానిని పొందుటకు సిద్ధపడుము,” లియాహోనా, మే 2019, 102).

ముద్రించు