“జనవరి 17–23. ఆదికాండము 5; మోషే 6: ’ఈ సంగతులను నిస్సంకోచంగా నీ పిల్లలకు బోధించుము,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)
“జనవరి 17–23. ఆదికాండము 5; మోషే 6,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022
జనవరి 17–23
ఆదికాండము 5; మోషే 6
“ఈ సంగతులను నిస్సంకోచంగా నీ పిల్లలకు బోధించుము”
మీరు ఆదికాండము 5 మరియు మోషే 6 చదివి, ధ్యానించినప్పుడు మీరు పొందే ఆత్మీయ మనోభావాలను నమోదు చేయండి. మీకు, మీ కుటుంబానికి అత్యంత విలువైన ఏ సందేశాలను మీరు కనుగొంటారు?
మీ మనోభావాలను నమోదు చేయండి
ఆదికాండము 5 లో అధిక భాగము ఆదాము హవ్వలు మరియు నోవహు మధ్యగల తరాల జాబితా. మనం చాలా పేర్లు చదువుతాము, కానీ వారి గురించి మనం ఎక్కువగా నేర్చుకోము. తర్వాత ఆదాము నుండి ఆరు తరములకు వచ్చిన హనోకు గురించి మనం చదువుతాము, సూటిగా చెప్పబడినప్పటికీ, వివరించబడని ఈ వాక్యములో అతని గూర్చి వర్ణించబడింది: “హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను” (ఆదికాండము 5:24). ఖచ్చితంగా దాని వెనుక ఒక కథ ఉంది. కానీ మరింత వివరణ లేకుండా, తరాల జాబితా సంక్షిప్తపరచబడింది.
అదృష్టవశాత్తూ, మోషే 6 హనోకు వృత్తాంతము యొక్క వివరాలను బయల్పరుస్తుంది—నిజంగా ఇది గొప్ప వృత్తాంతము. హనోకు వినయము, అతని అభద్రతాభావములు, దేవుడు అతనిలో చూసిన సామర్థ్యము మరియు దేవుని ప్రవక్తగా అతడు నిర్వర్తించిన గొప్ప కార్యము గురించి మనం నేర్చుకుంటాము. తరతరాల గుండా అది పురోగమించినప్పుడు ఆదాము, హవ్వల కుటుంబము గురించి కూడా మనం స్పష్టమైన వివరణను పొందుతాము. సాతాను యొక్క ”గొప్ప ఏలుబడి” గురించి మనం చదువుతాము, పిల్లలకు “దేవుని మార్గములను” మరియు “మాట్లాడి, ప్రవచించిన నీతి బోధకుల గురించి” (మోషే 6:15, 21, 23) బోధించిన తల్లిదండ్రుల గురించి కూడా మనం చదువుతాము. విశ్వాసము, పశ్చాత్తాపము, బాప్తీస్మము మరియు పరిశుద్ధాత్మను పొందుట గురించి ఈ తల్లిదండ్రులు మరియు బోధకులు బోధించిన సిద్ధాంతము గురించి మనము నేర్చుకొనేది చాలా అమూల్యమైనది (మోషే 6:50–52). దాని వెంట వచ్చే యాజకత్వము వలె ఆ సిద్ధాంతము ”ఆదియందు (మరియు) లోకాంతమునందు కూడా ఉండును” (మోషే 6:7).
వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు
ప్రవక్త ఒక దీర్ఘదర్శి.
మీరు మోషే 6:26–36 చదువుతున్నప్పుడు, కళ్ళు, అంధకారము మరియు చూడడం గురించి మీరేమి నేర్చుకుంటారు? హనోకు కాలంలో ఎవరు “బహుదూరము చూడలేరు”? ఈ జనులు సత్యాన్ని ఎందుకు చూడలేకపోయారు? హనోకు ఏమి చూడగలిగాడు? ఆధునిక ప్రవక్తలు దీర్ఘదర్శులనే మీ విశ్వాసాన్ని నిర్మించినదేది? (36వ వచనము చూడండి).
మనలో కొరతలున్నప్పటికీ, ఆయన కార్యము చేయడానికి దేవుడు మనల్ని పిలుస్తారు.
ప్రభువు మనల్ని చేయమని పిలిచిన దానితో ముంచివేయబడినట్లుగా భావించడం అసాధారణమైనదేమీ కాదు. అతడిని ఒక ప్రవక్తగా ప్రభువు పిలిచినప్పుడు హనోకు ఆవిధంగా భావించాడు. మీరు మోషే 6:26–36 చదువుతున్నప్పుడు, హనోకు ముంచివేయబడినట్లుగా ఎందుకు భావించాడు మరియు అతనికి ధైర్యమివ్వడానికి ప్రభువు ఏమి చెప్పారనే దాని కొరకు చూడండి. 37–47 వచనాలలో, ప్రభువు హనోకుకు సహకారమిచ్చి, తన కార్యమును చేయుటకు అతనికి అధికారమిచ్చిన విధానాల కొరకు చూడండి (మోషే 7:13 కూడా చూడండి). అనర్హులమని భావించిన మోషే (నిర్గమకాండము 4:10–16 చూడండి), యిర్మియా (యిర్మియా 1:4–10 చూడండి), నీఫై (2 నీఫై 33:1–4 చూడండి), మరియు మొరోనై (ఈథర్ 12:23–29 చూడండి) వంటి ఇతర ప్రవక్తలతో హనోకు అనుభవాన్ని మీరు పోల్చవచ్చు. మీరు చేయాలని ఆయన ఇచ్చిన కార్యము గురించి ఈ లేఖనాల నుండి మీరు ఏమి నేర్చుకోవాలని దేవుడు కోరుతున్నాడని మీరు భావిస్తున్నారు?
జేకబ్ 4:6–8 కూడా చూడండి.
క్రీస్తు యొక్క సిద్ధాంతము దేవుని యొక్క రక్షణ ప్రణాళికకు కేంద్రమైయున్నది.
మోషే గ్రంథాన్ని మనం కలిగియున్నందు వలన, ఆది నుండి క్షమాపణను, విమోచనను ఎలా కనుగొనాలని దేవుడు తన పిల్లలకు బోధిస్తున్నాడని మనకు తెలుసు. లేఖనాలలో, ఈ బోధనలు కొన్నిసార్లు క్రీస్తు యొక్క సిద్ధాంతంగా పిలువబడ్డాయి (2 నీఫై 31:13–21 చూడండి). మీరు మోషే 6:48–68 చదువుతున్నప్పుడు, విమోచింపబడడానికి మనం తప్పక తెలుసుకోవలసిన మరియు చేయవలసిన వాటి కోసం వెదకండి. హనోకు బోధించిన దాని గురించి మీ స్వంత సమీక్ష వ్రాయడాన్ని మీరు సహాయకరంగా కనుగొనవచ్చు. ఈ సత్యాలు ఆదాము, హవ్వల కాలం నుండి బోధించబడ్డాయని తెలుసుకోవడం ఎందుకు ముఖ్యము? ఈ బోధనలను అధ్యయనం చేసిన ఫలితముగా ఏమి చేయాలని ప్రేరేపించబడినట్లు మీరు భావించారు?
“ఈ సంగతులను నిస్సంకోచంగా నీ పిల్లలకు బోధించుము.”
యేసు క్రీస్తు సువార్త యొక్క అమూల్యమైన సత్యాలు ఆదాము, హవ్వలకు బోధించబడ్డాయి. కానీ హనోకుకు ముందు తరాలలో అనేకమంది జనులు ఆ సత్యాలను జీవించడం లేదని మోషే 6:27–28 లో ప్రభువు మాటలు స్పష్టం చేస్తాయి. “ఈ సంగతులను నిస్సంకోచంగా నీ పిల్లలకు బోధించుము” (మోషే 6:58) అని మొదట ఆదాముకు ఇవ్వబడిన ఆజ్ఞతో పాటు— కోల్పోబడిన సత్యాలను పునఃస్థాపించమని ప్రభువు హనోకును కోరారు. మీరు మోషే 6:51–62 చదువుతున్నప్పుడు, యేసు క్రీస్తు గురించి మీరేమి నేర్చుకుంటారు? ప్రత్యేకించి రాబోయే తరానికి విలువైన దేనిని మీరు కనుగొంటారు? ఈ సత్యాలను భవిష్యత్ తరాలకు అందించడంలో సహాయపడేందుకు మీరేమి చేయగలరు?
కుటుంబ లేఖన అధ్యయనము మరియు గృహ సాయంకాలము కొరకు ఉపాయములు
-
ఆదికాండము 5; మోషే 6:5–25, 46.ఆదాము హవ్వల కుటుంబము భద్రపరచిన “జ్ఞాపకార్థ గ్రంథము” గురించి చదువుట మీ స్వంత జ్ఞాపకార్థ గ్రంథమును తయారు చేయడానికి మీ కుటుంబాన్ని ప్రేరేపించవచ్చు. మీరు జతచేయాలని కోరుతున్న వాటి గురించి కుటుంబంగా చర్చించండి. మీ కుటుంబ చరిత్ర నుండి మీరు ఫోటోలను, కథలను లేక ప్రమాణ పత్రాలను మీరు కలిగియుండవచ్చు. మీ కుటుంబంలో ప్రస్తుతం జరుగుతున్న విషయాలను జతచేయడానికి మీరు ఎంచుకోవచ్చు. భవిష్యత్ తరాలు వేటిని విలువైనవిగా కనుగొంటారు? “ప్రేరేపణాత్మ చేత” (మోషే 6:5) మరియు “దేవుని వ్రేలుచేత ఇవ్వబడిన విధానము” (మోషే 6:46) వంటి వాక్యభాగాలు మీ ప్రయత్నాలను ఏ విధంగా నడిపించగలవో కూడా మీరు చర్చించవచ్చు.
-
మోషే 6:53–62.మోషే 6:53 లో కనుగొనబడు ఆదాము ప్రశ్నకు మనమెలా జవాబిస్తాము? 57–62 వచనాలలో మనం ఏ జవాబులను కనుగొంటాము?
-
మోషే 6:59.“పరలోకరాజ్యములో తిరిగి జన్మించుట” అనగా అర్థమేమిటి? మన జీవితాలంతటా తిరిగి జన్మించడాన్ని కొనసాగించడానికి మనమేమి చేయగలము? సహాయము కొరకు, ఆల్మా 5:7–14, 26; డేవిడ్ ఎ. బెడ్నార్, “ఎల్లప్పుడూ మీ పాపక్షమాపణను నిలుపుకోండి” (లియహోనా, మే 2016, 59–62) చూడండి.
-
మోషే 6:61.ఈ వచనము నుండి పరిశుద్ధాత్మ గురించి మనం ఏమి నేర్చుకుంటాము?
-
మోషే 6:63.“(క్రీస్తు) కు సూచనగానున్న” విషయాలలో కొన్ని ఏవి? (2 నీఫై 11:4 కూడా చూడండి). యేసు క్రీస్తు గురించి నేర్చుకోవడానికి వారికి సహాయపడేలా “పైన పరలోకంలో” లేదా “భూమిపై” వారు చూసేదాని గురించి పంచుకోవడానికి కుటుంబ సభ్యులను ఆహ్వానించడాన్ని పరిగణించండి. ఉదాహరణకు, చెట్లు, బండలు లేక సూర్యుడు మనకు రక్షకుడిని ఎలా జ్ఞాపకం చేస్తాయి? ఆయన గురించి ”జీవజలము” మరియు “జీవాహారము” అనే పేర్లు మనకు ఏమి బోధిస్తాయి? (యోహాను 4:10–14; 6:35).
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.