“జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు: ‘ఇంటికి రండి,’ అని ఇశ్రాయేలీయులందరికి యేసు చెప్పును” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)
“జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు: ‘ఇంటికి రండి,’ అని ఇశ్రాయేలీయులందరికి యేసు చెప్పును” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022
జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు
“‘ఇంటికి రండి,’ అని ఇశ్రాయేలీయులందరికి యేసు చెప్పును”
సీనాయి అరణ్యములో, మోషే ఇశ్రాయేలీయులను కొండ క్రింద సమావేశపరిచాడు. అప్పుడే స్వేచ్ఛగా చేయబడిన బానిసలను ఒక బలమైన జనముగా మార్చాలని కోరుతున్నానని అక్కడ ప్రభువు ప్రకటించెను. “మీరు నాకు,” “యాజకరూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని” ఆయన చెప్పెను (నిర్గమకాండము 19:6). మిక్కిలి పెద్ద మరియు శక్తివంతమైన శత్రువుల చేత చుట్టబడినప్పుడు కూడా, వారు ఫలించి, అభివృద్ధి చెందుతారని ఆయన వాగ్దానమిచ్చెను (ద్వితీయోపదేశకాండము 28:1–14 చూడండి).
ఇశ్రాయేలీయులు విస్తారముగా లేదా బలముగా ఉండి లేదా నైపుణ్యము కలిగి ఉండుట వలన ఇదంతా జరగలేదు. “కాగా నా మాట శ్రద్ధగా విని, నా నిబంధన ననుసరించి నడిచిన యెడల” అది జరుగుతుందని ప్రభువు వివరించెను (నిర్గమకాండము 19:5). వారిని బలముగా చేసేది దేవుని యొక్క శక్తే కానీ వారి స్వశక్తి కాదు.
అయినప్పటికీ, ఇశ్రాయేలీయులు ఆయన స్వరము వినలేదు మరియు కాలక్రమేణా వారు ఆయన నిబంధనను పాటించుట ఆపివేసారు. అనేకమంది ఇతర దేవతలను పూజిస్తూ, వారి చుట్టూ ఉన్న సంప్రదాయల ఆచారాలను పొందుపరచుకున్నారు. ఇతరుల నుండి ప్రత్యేకపరచి, వారిని ఒక రాజ్యముగా చేసిన ముఖ్యమైన విషయాన్ని—అనగా ప్రభువుతో వారి నిబంధన అనుబంధాన్ని వారు తిరస్కరించారు. దేవుని యొక్క శక్తి వారిని కాపాడకుండా (2 రాజులు 17:6–7 చూడండి), వారి శత్రువులను ఆపడానికి అక్కడ ఏదీ లేదు (2 దినవృత్తాంతములు 36:12–20 చూడండి).
చెదరగొట్టబడుట
దాదాపు క్రీ.పూ 735 మరియు 720 మధ్య, అనేకసార్లు అష్షూరు రాజు పన్నెండు గోత్రములలో పదివాటికి గృహమైన ఇశ్రాయేలు యొక్క ఉత్తర రాజ్యము ముట్టడి చేసి, అష్షూరు సామ్రాజ్యములో వేర్వేరు భాగాలకు వేలమంది ఇశ్రాయేలీయులను చెరపట్టాడు (2 రాజులు 17:1–7 చూడండి).1 ఈ ఇశ్రాయేలీయులు కొంతవరకు “తప్పిపోయిన గోత్రములుగా,” పిలవబడ్డారు ఎందుకంటే వారు తమ స్వదేశమునుండి తీసివేయబడి ఇతర రాజ్యముల మధ్య చెదరగొట్టబడ్డారు. కానీ వారు లోతైన భావములో కూడా తప్పిపోయారు: కాలక్రమేణా దేవుని యొక్క నిబంధన జనులుగా వారి గుర్తింపు భావనను కోల్పోయారు.
యూదా యొక్క దక్షిణ రాజ్యము కొన్నిసార్లు ఉత్తర రాజ్యము కంటె ఎక్కువ నీతిగలది కనుక, అది ఎక్కువ కాలము నిలిచియున్నది.2 కానీ, చివరకు అక్కడ జనులు కూడా ప్రభువు నుండి తొలగిపోయారు. అష్షూరీయులు ముట్టడి చేసి, దక్షిణ రాజ్యములో అధిక భాగమును జయించారు; యెరూషలేము మాత్రమే అద్భుతంగా కాపాడబడింది (2 రాజులు 19; యెషయా 10:12–13 చూడండి). తరువాత, క్రీ.పూ. 597 మరియు 580 మధ్య, బబులోనియులు దేవాలయముతో పాటు యెరూషలేమును నాశనము చేసారు మరియు అనేకమంది నగర వాసులను చెరపట్టి తీసుకుపోయారు (2 రాజు 24–25; 2 దినవృత్తాంతములు 36; యిర్మీయా 39; 52 చూడండి). దాదాపు 70 సంవత్సరాల తరువాత, యూదాలో జనశేషము యెరూషలేముకు తిరిగి వెళ్లి, దేవాలయమును తిరిగి కట్టడానికి అనుమతించబడ్డారు. అయినప్పటికీ, అనేకమంది బబులోనులో ఉండిపోయారు. 3
తరములు గతించినప్పుడు, అన్ని గోత్రముల నుండి ఇశ్రాయేలీయులు “వారెరుగని అన్యజనులలో సుడిగాలితో … చెదరగొట్టబడ్డారు” (జెకర్యా 7:14; ఆమోసు 9:8–9 కూడా చూడండి). కొందరు ప్రభువు చేత ఇతర దేశాలకు నడిపించబడ్డారు (2 నీఫై 1:1–5; ఓం నై 1:15–16 చూడండి). ఇతరులు చెరను తప్పించుకోవడానికి (2 రాజులు 25:22–26; యిర్మీయా 42:13–19; 43:1–7 చూడండి) లేక రాజకీయ లేక ఆర్థిక కారణముల చేత ఇశ్రాయేలును విడిచిపెట్టారు.4
ఈ సంఘటనలను మనము ఇశ్రాయేలు చెదరగొట్టబడుట అని పిలుస్తాము. అనేక కారణముల వలన చెదరిపోవుట గురించి తెలుసుకొనుట ముఖ్యమైనది. ఒక కారణం చేత అది పాత నిబంధన యొక్క ప్రధాన విషయముగా ఉన్నది: అదేమనగా ఇశ్రాయేలు చెదరిపోవుటకు దారితీసిన ఆత్మీయంగా దిగుజారుతున్న ధోరణికి సాక్షులుగా అనేకమంది పాత నిబంధన ప్రవక్తలు ఉన్నారు. వారు ఆ చెదరిపోవుటను ముందుగా చూసారు, దాని గురించి హెచ్చరించారు మరియు వారిలో కొందరు దాని గుండా జీవించారు కూడా.5 యెషయా, యిర్మీయా, ఆమోసు గ్రంథాలలో మరియు పాత నిబంధనలో తరువాయి భాగములో మిగిలిన అనేక గ్రంథాలలో చదివినప్పుడు మీరు దీనిని జ్ఞాపకముంచుకోవడం మీకు సహాయకరంగా ఉంటుంది. ఈ భావన మనస్సులో ఉంచుకొని, అష్షూరు, బబులోను గురించి వారి ప్రవచనాలను మీరు చదివినప్పుడు, విగ్రహారాధన, దాస్యము, నిస్సహాయస్థితి మరియు చివరికి పునఃస్థాపించబడుట మీరు చదివినప్పుడు, వారు దేని గురించి మాట్లాడుతున్నారో మీరు తెలుసుకుంటారు.
ఇశ్రాయేలీయులు చెదరగొట్టబడుటను అర్థము చేసుకోవడం మోర్మన్ గ్రంథమును మీరు బాగా గ్రహించడానికి సహాయపడుతుంది, ఎందుకంటే చెదరిపోయిన ఇశ్రాయేలీయుల యొక్క నివేదిక లేక శాఖగా మోర్మన్ గ్రంథమున్నది (1 నీఫై 15:12 చూడండి). ఈ నివేదిక దాదాపు క్రీ.పూ 600 సంవత్సరములో బులోనియులు ముట్టడి చేయుటకు కొంచెం ముందుగా, లీహై కుటుంబము యెరూషలేము నుండి పారిపోవుటతో మొదలౌతుంది. ఇశ్రాయేలు చెదరగొట్టబడుట గురించి ప్రవచించిన ఆ ప్రవక్తలలో లీహై ఒకరు.6 మరియు అతడి కుటుంబము ఇశ్రాయేలు సంతతి యొక్క వారి శాఖను తీసుకొనివెళ్ళి, ప్రపంచానికి మరొకవైపున, అమెరికాలో నాటి ఆ ప్రవచనము నెరవేర్చబడుటకు సహాయపడింది.
సమకూర్చబడుట
అయినప్పటికీ, ఇశ్రాయేలీయులు చెదరగొట్టబడుట, కథలో సగభాగము మాత్రమే. ప్రభువు తన జనులను మరచిపోడు లేదా వారు ఆయనను విడిచిపెట్టినప్పుడు కూడా ఆయన వారిని పూర్తిగా విడిచిపెట్టడు. ఇశ్రాయేలీయులు చెదరగొట్టబడతారనే అనేక ప్రవచనాలు దేవుడు ఒకరోజు వారిని సమకూర్చుననే అనేక వాగ్దానములతో కూడియున్నవి.7
ఆ దినము నేడే—మన దినము. సమకూర్చబడుట ఇదివరకే ప్రారంభమైంది. 1836 లో, సీనాయి కొండ క్రింద మోషే ఇశ్రాయేలీయులను సమావేశపరచిన వేల సంవత్సరాల తరువాత, కర్ట్‌లాండ్ దేవాలయములో జోసెఫ్ స్మిత్‌కు మోషే ప్రత్యక్షమై “భూమికి నాలుగువైపుల నుండి ఇశ్రాయేలీయులను సమకూర్చే తాళపు చెవులను” (సిద్ధాంతము మరియు నిబంధనలు 110:11) అప్పగించాడు. ఇప్పుడు, ఈ తాళపుచెవులు కలిగిన వారి నడిపింపు క్రింద, ఇశ్రాయేలీయుల గోత్రములు ప్రభువు సేవకులు వెళ్ళగలిగే చోట ప్రతీ రాజ్యము నుండి సమకూర్చబడుతున్నారు.
అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఈ సేకరణను “నేడు భూమి మీద జరుగుతున్న అత్యంత ముఖ్యమైన విషయముగా” పిలిచారు. దాని పరిమాణానికి, దాని ప్రాముఖ్యతకు, దాని ఘనతకు ఏదియు పోల్చబడదు. నీవు ఎన్నుకున్నట్లైతే, నీవు కోరుకుంటే, నీవు కూడా దానిలో పెద్ద భాగం పొందగలవు.“8
దానిని మీరు ఎలా చేస్తారు? ఇశ్రాయేలును సమకూర్చబడుట అనగా అర్థమేమిటి? వారు ఒకసారి నివసించిన దేశానికి పన్నెండు గోత్రములను తిరిగి పునఃస్థాపించుట అని అర్థమా? వాస్తవానికి, దాని అర్థము ఇంకా గొప్పది, ఇంకా ఎక్కువ నిత్యమైనది. అధ్యక్షులు నెల్సన్ వివరించినట్లుగా:
“ఇశ్రాయేలీయులను సమకూర్చుట గురించి మనం మాట్లాడినప్పుడు, మనం కేవలం ఈ ప్రాథమిక సూత్రాన్ని చెప్పుచున్నాము: తెరకు ఇరువైపులా ఉన్న మన పరలోక తండ్రి యొక్క పిల్లలలో ప్రతీఒక్కరు, యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్త సందేశమును వినుటకు అర్హులు.…
“దేవునితో నిబంధనలు చేయుట వారి ముఖ్యమైన బాప్తీస్మపు నిబంధనలు మరియు దేవాలయ నిబంధనలు పొందుట వైపు ఒక అడుగు వేయుటకు—ఏ సమయంలోనైనా మీరు చేసేదిఏదైనా అదిఎవరికైనా తెరకు ఇరువైపుల—సహాయపడిన యెడల, ఇశ్రాయేలును సమకూర్చుటకు మీరు సహాయపడుతున్నారు. అది అంత సులభమైనది.”9
యెషయా చెప్పినట్లుగా, “ఒకరినొకరు” (యెషయా 27:12) లేక యిర్మీయా ఊహించినట్లుగా, “ఒకానొక పట్టణములోనుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబములో నుండి ఇద్దరినిగాను” (యిర్మీయా 3:14) ఇది జరుగుతుంది.
ఇశ్రాయేలును సమకూర్చుట అనగా దేవుని పిల్లలను ఆయన యొద్దకు తిరిగి తెచ్చుట. దాని అర్థము ఆయనతో వారి నిబంధన సంబంధమునకు వారిని పునఃస్థాపించుట. దాని అర్థము చాలా కాలం క్రితం ఆయన స్థాపించుటకు ఉద్దేశించిన “పరిశుద్ధమైన జనమును” తిరిగి స్థాపించుట (నిర్గమకాండము 19:6) .
ఇంటికి రండి
నిబంధనను కాపాడు వారిగా, మీరు ఇశ్రాయేలు సంతతిలో భాగముగా ఉన్నారు.10 మీరు సమకూర్చబడ్డారు, మరియు మీరు సమకూర్చేవారు. దేవుడు మరియు అబ్రహాము మధ్య ఒక నిబంధనతో ప్రారంభమైన శతాబ్ధాల పురాణ గాథ దాని ముగింపును చేరుకుంటుంది, దానిలో మీరు ముఖ్యమైన పాత్రధారి. “‘ఇంటికి రండి’ అని యేసు ఇశ్రాయేలీయులందరికి”11 చెప్పే సమయము ఇదే.
సమకూర్చువారి సందేశము ఇదే: నిబంధన చేయుటకు ఇంటికి రండి. సీయోనులో ఇంటికి రండి. ఇశ్రాయేలు పరిశుద్ధుడైన, యేసు క్రీస్తు యొద్దకు ఇంటికి రండి, మరియు ఆయన మీ తండ్రియైన దేవుని యొద్దకు ఇంటికి మిమ్మల్ని తీసుకొనివస్తాడు.