“జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు: పాత నిబంధనలో కవిత్వమును చదువుట,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)
“జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు: పాత నిబంధనలో కవిత్వమును చదువుట,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2022
జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు
పాత నిబంధనలో కవిత్వమును చదువుట
పాత నిబంధన గ్రంథాలలో, యోబు గ్రంథమునకు ముందు వచ్చే వాటిలో మనము ఎక్కువగా కథలను చూస్తాము—ఒక ఆత్మీయ దృష్టికోణము నుండి చారిత్రక సంఘటనలు వివరించే, చిత్రీకరించే కథలు. నోవహు ఒక ఓడను నిర్మించాడు, మోషే ఇశ్రాయేలీయులను విడిపించాడు, హన్నా ఒక కుమారుని కోసం ప్రార్థించింది మొదలైనవి. యాకోబుతో ప్రారంభించి, పాత నిబంధన రచయతలు లోతైన భావనలు లేదా చిరస్మరణీయమైన విధానంలో చాలా ముఖ్యమైన ప్రవచనాలు తెలుపుటకు కవిత్వ భాషవైపు తిరిగినప్పుడు మనము భిన్నమైన రచనా శైలిని కనుగొంటాము.
పాత నిబంధన యొక్క చారిత్రక గ్రంథాలన్నిటిలో కవిత్వము వెదజల్లిన కొన్ని మాదిరులను మనము ఇదివరకే చూసాము. యోబు గ్రంథము నుండి మనము దానిని ఎక్కువగా చూస్తాము. యోబు, కీర్తనలు మరియు సామెతల గ్రంథాలు దాదాపు పూర్తిగా కవిత్వమును కలిగియుండి, యెషయా, యిర్మీయా మరియు ఆమోసు వంటి ప్రవక్తల రచనలలో భాగాలుగా ఉన్నాయి. కవిత్వము చదవడం ఒక కథను చదవడం కంటే భిన్నంగా ఉంటుంది కనుక దానిని గ్రహించుటకు తరచుగా వేరే విధానము అవసరము. మీ పాత నిబంధన పఠనమును అర్థవంతంగా చేయగల కొన్ని ఆలోచనలు ఇక్కడున్నాయి.
హెబ్రీ కవిత్వము గురించి తెలుసుకొనుట
మొదట, పాత నిబంధనలో హెబ్రీ కవిత్వము కొన్ని ఇతర రకాల కవితల వలె పద్యముపై ఆధారపడిలేదని గమనించుట మీకు సహాయపడవచ్చు. లయ, పదబంధము మరియు శబ్దాల పునరావృతం పురాతన హెబ్రీ కవిత్వం యొక్క సాధారణ లక్షణాలైనప్పటికీ, కొన్ని అర్థాలు ఇతర భాషలలోనికి సరిగా అనువదించబడవు. అయినప్పటికీ, ఆలోచనలు లేదా ఉపాయములు పునరావృతమై కొన్నిసార్లు “సాదృశ్యము” అని పిలువబడే ఒక లక్షణమును మీరు గమనిస్తారు. యెషయా నుండి ఈ వచనము ఒక సాధారణమైన మాదిరిని కలిగియున్నది:
-
ఓ సీయోనూ, నీ బలము ధరించుకొనుము;
-
ఓ యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము (యెషయా 52:1).
29వ కీర్తన అనేక సాదృశ్యములను కలిగియున్నది—వాటిలో ఒక మాదిరి ఇక్కడున్నది:
-
యెహోవా స్వరము బలమైనది;
-
యెహోవా స్వరము ప్రభావము గలది (కీర్తనలు 29:4).
రెండవ వరుస మొదటి వరుసకు సాదృశ్యముగా ఉందని తెలుసుకొనుట ద్వారా లేఖన భాగాన్ని అర్థం చేసుకోవడం సులభతరం చేసే ఒక సంఘటన ఇక్కడున్నది.
-
మీ పట్టణములన్నిటిలోను నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను,
-
మీరున్న స్థలములన్నిటిలోను మీకు ఆహారము లేకుండ చేసితిని (ఆమోసు 4:6).
ఈ మాదిరులలో, ఒక ఆలోచన కొద్దిపాటి భేదములతో పునరావృతం చేయబడింది. దానిని మరింత పరిపూర్ణంగా వివరించడానికి లేక వృద్ధి చేయడానికి భేదాలను ఉపయోగిస్తున్నప్పుడు ఈ సాంకేతికత పలుమార్లు చెప్పబడిన ఆలోచనను నొక్కి చెప్పగలదు.
మరొక సందర్భాలలో, రెండు సాదృశ్వపు వాక్యాలు ఈ మాదిరిలో ఉన్నట్లుగా వ్యతిరేక ఆలోచనలను తెలుపుటకు అదే భాషను ఉపయోగిస్తుంది.
-
మృదువైన మాట క్రోధమును చల్లార్చును:
-
నొప్పించు మాట కోపమును రేపును (సామెతలు 15:1).
ఈ సాదృశ్యము ఆకస్మికంగా జరగలేదు. రచయతలు దానిని ఉద్దేశ్యపూర్వకంగా చేసారు. అది ఆత్మీయ భావాలను లేక సత్యములను వారికి శక్తివంతంగా, అందముగా కనబడిన విధానములో వారు వ్యక్తపరచేలా చేసింది. కనుక పాత నిబంధన రచనలో మీరు సాదృశ్యమును గమనించినప్పుడు, రచయత యొక్క సందేశమును గ్రహించడానికి అది మీకు ఎలా సహాయపడిందో మీకై మీరు ప్రశ్నించుకోండి. ఉదాహరణకు, “సుందర వస్త్రములతో” “బలమును” మరియు “యెరూషలేముతో” “సీయోనును” సంబంధింప చేయుట ద్వారా యెషయా ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు?(యెషయా 52:1). “నొప్పించు మాటలు” అనే పదజాలానికి వ్యతిరేకమైనది “మృదువైన మాట” అని మనకు తెలిసినప్పుడు దాని గురించి మనము ఏమి ఊహించగలము? (సామెతలు 15:1
ఒక క్రొత్త స్నేహితునిగా హెబ్రీ కవిత్వము
కవిత్వమును చదవడాన్ని ఒక క్రొత్త వ్యక్తిని కలుసుకొనుటతో పోల్చుట మీకు సహాయకరంగా ఉండవచ్చు. ఉదాహరణకు, పాత నిబంధన కవిత్వమును చదవడం సుదూరమైన దేశము, మనం మాట్లాడే భాషను మాట్లాడని విదేశీ సంస్కృతి నుండి వచ్చి—వారు రెండువేల సంవత్సరాల కంటె పెద్దవారు అయిన ఎవరినైనా కలుసుకొనుటతో మీరు పోల్చవచ్చు. ఈ వ్యక్తి బహుశా మొదట మనం అర్థము చేసుకోని విషయాలను మాట్లాడవచ్చు, కానీ అతడు లేక ఆమెకు మనతో మాట్లాడటానికి విలువైనది ఏదీ లేదని దాని అర్థము కాదు. కొంత సహనము మరియు కొంత కనికరముతో, మన క్రొత్త పరిచయస్తుడు చివరకు ఒక ప్రియమైన స్నేహితుడిగా మారవచ్చు. అతడు లేక ఆమె దృష్టి కోణంలో నుండి విషయాలను చూడటానికి ప్రయత్నిస్తూ, మనము కాస్త సమయాన్ని కలిసి గడపాలి. మన హృదయాలలో వాస్తవంగా మనం ఒకరినొకరం బాగా అర్థము చేసుకోవడాన్ని కనుగొనవచ్చు.
కనుక మీరు యెషయా నుండి ఒక వాక్యభాగమును చదివిన మొదటసారి, ఒక క్రొత్త పరిచయస్తునితో మీ మొదటి పరిచయముగా దానిని భావించండి. “నా సాధారణమైన అభిప్రాయం ఏమిటి?” అని మీకైమీరు ప్రశ్నించుకోండి. ప్రతీ మాటను మీరు గ్రహించనప్పటికీ—లేఖన భాగము మీరు ఎలా భావించునట్లు చేయాలి? సాధ్యమైతే, దానిని మరలా కొన్నిసార్లు చదవండి. లేఖన భాగాలను బిగ్గరగా చదవటం ద్వారా కొందరు జనులు దానిలో ఉన్న అర్థమును కనుగొంటారు. యెషయా ఎంపిక చేసిన ప్రత్యేకమైన మాటలు, ప్రత్యేకంగా మీ మనస్సులో ఒక చిత్రమును గీసే మాటలను గమనించండి. ఆ చిత్రములు మీరు ఎలా భావించునట్లు చేయాలి? యెషయా ఎలా భావించాడో ఊహాచిత్రాలు ఏమి సూచిస్తున్నాయి? పాత నిబంధన కవుల యొక్క మాటలను మీరు ఎంత ఎక్కువగా అధ్యయనం చేస్తే, అంత ఎక్కువగా వారు లోతైన ఆత్మీయ సందేశాన్ని వ్యక్తీకరించడానికి వారు ఉద్దేశపూర్వకంగా వారి మాటలు మరియు పద్ధతులను ఎంచుకున్నారని మీరు కనుగొంటారు.
కవితలు అద్భుతమైన స్నేహితులు కాగలవు ఎందుకనగా అవి మన భావాలు, అనుభవాలను గ్రహించడానికి మనకు సహాయపడతాయి. పాత నిబంధన కవితలు ప్రత్యేకంగా ప్రశస్తమైనవి, ఎందుకంటే అవి దేవునితో మన అనుబంధముతో సంబంధించిన—మన అత్యంత ముఖ్యమైన భావాలను, అనుభవాలను గ్రహించడానికి మనకు సహాయపడతాయి.
పాత నిబంధనలో కవిత్వమును మీరు అధ్యయనం చేసినప్పుడు, లేఖన అధ్యయనము మనల్ని యేసు క్రీస్తు యొద్దకునడిపించినప్పుడు అది అత్యంత విలువైనదని జ్ఞాపకముంచుకోండి. ఆయనయందు మన విశ్వాసమును వృద్ధి చేసే చిహ్నములు, ఊహాచిత్రములు మరియు సత్యముల కొరకు వెదకండి. మీరు అధ్యయనం చేసినప్పుడు పరిశుద్ధాత్మ నుండి ప్రేరేపణల కొరకు ఆలకించండి.