లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 56


56వ ప్రకరణము

1831 జూన్ 15న, ఒహైయోలోని కర్ట్లాండ్‌లో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. అతడు నివసించిన ఫ్రెడ్రిక్ విలియమ్స్ పొలముకు సంబంధించి తన బాధ్యతల గురించి థైర్‌ను ఆదేశిస్తూ అతని కొరకు ముందుగా ఇవ్వబడిన (8వ వచనములో “ఆజ్ఞగా” పేర్కొనబడిన) బయల్పాటును గైకొననందుకు ఈ బయల్పాటు ఎజ్రా థైర్‌ను మందలించును. ఈ బయల్పాటు థామస్ బి. మార్ష్‌తో కలిసి మిస్సోరికి ప్రయాణము చేయవలెనన్న థైర్ యొక్క పిలుపును రద్దుచేయును (ప్రకరణము 52:22 చూడుము).

1–2, రక్షణ పొందుటకు పరిశుద్ధులు తమ సిలువను ఎత్తుకొని, ప్రభువును వెంబడించవలెను; 3–13, ప్రభువు ఆజ్ఞాపించును మరియు రద్దుచేయును, అవిధేయులు వెళ్ళగొట్టబడుదురు; 14–17, బీదలకు సహాయము చేయని ధనికులకు శ్రమ, విరగని హృదయాలు గల పేదలకు శ్రమ; 18–20, హృదయశుద్ధి గల బీదలు ధన్యులు, వారు భూలోకమును స్వాస్థ్యముగా పొందుదురు.

1 నా నామమును ఆరోపించు జనులారా, ఆలకించుడని దేవుడైన మీ ప్రభువు సెలవిచ్చుచున్నాడు; ఏలయనగా ఇదిగో, తిరుగుబాటుదారులకు విరోధముగా నా కోపము రగులుకొనియున్నది మరియు జనములమీద నా ఉగ్రతను దర్శించు దినమున నా బాహువును, నా న్యాయపు తీర్పును వారు తెలుసుకొందురు.

2 తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించక, నా ఆజ్ఞలను గైకొననివాడు రక్షించబడడు.

3 ఇదిగో, ప్రభువైన నేను ఆజ్ఞాపించుచున్నాను; నేను ఆజ్ఞాపించిన తరువాత ఆ ఆజ్ఞను అతిక్రమించి, గైకొననివాడు నా యుక్త కాలమందు కొట్టివేయబడును.

4 కాబట్టి, ప్రభువైన నేను నా దృష్టికి అనుకూలమైనట్లుగా ఆజ్ఞాపించుదును మరియు రద్దుచేయుదును; ఇదంతయు తిరుగుబాటుదారుల తలలపైన మోపబడునని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

5 కాబట్టి, నేను నా సేవకులైన థామస్ బి. మార్ష్ మరియు ఎజ్రా థైర్‌లకు ఇవ్వబడిన ఆజ్ఞను రద్దుచేసి, నా సేవకుడైన థామస్‌కు ఒక క్రొత్త ఆజ్ఞనిచ్చుచున్నాను, అదేమనగా అతడు వేగముగా మిస్సోరి ప్రదేశమునకు ప్రయాణము చేయవలెను మరియు నా సేవకుడైన సెలా జె. గ్రిఫ్ఫిన్ కూడా అతనితో వెళ్ళవలెను.

6 ఏలయనగా, థాంప్సన్‌లోనున్న నా జనుల మూర్ఖత్వము, వారి తిరుగుబాటులకు పర్యవసానముగా నా సేవకులైన సెలా జె. గ్రిఫ్ఫిన్, న్యూయెల్ నైట్‌లకివ్వబడిన ఆజ్ఞను నేను రద్దుచేయుచున్నాను.

7 కాబట్టి, నా సేవకుడైన న్యూయెల్ నైట్ వారితోనుండవలెను; నా యెదుట నలిగినవారు ఎంతమంది వెళ్ళగోరుదురో, అంతమంది వెళ్ళవచ్చును మరియు నేను నియమించిన ప్రదేశమునకు అతని చేత నడిపించబడవలెను.

8 మరలా, నా సేవకుడైన ఎజ్రా థైర్ తన గర్వము, స్వార్థము గురించి పశ్చాత్తాపపడి, అతడు నివశించుచున్న ప్రదేశమును గూర్చి అతనికి మొదట నేను ఇచ్చియున్న ఆజ్ఞను గైకొనవలెనని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

9 అతడు దీనిని చేసిన యెడల, ఆ స్థలము విభజించబడదు గనుక, ఇంకను మిస్సోరికి వెళ్ళుటకు అతడు నియమించబడును;

10 లేనియెడల అతడు చెల్లించిన ధనమును అతడు పొంది, ఆ ప్రదేశమును వదిలివెళ్ళవలెను మరియు అతడు నా సంఘము నుండి కొట్టివేయబడునని సైన్యములకు అధిపతియగు దేవుడైన ప్రభువు సెలవిచ్చుచున్నాడు;

11 ఆకాశములు, భూమియు గతించినను, ఈ మాటలు గతించవు గాని నెరవేరును.

12 నా సేవకుడు జోసెఫ్ స్మిత్ జూ. ఆ ధనమును చెల్లించవలసిన యెడల, ప్రభువైన నేను మిస్సోరిలో అతనికి మరలా చెల్లించెదను, తద్వారా ఎవరి యొద్దనుండి అతడు పొందునో, వారు ఇచ్చిన దానిని బట్టి వారు మరలా బహుమానమును పొందుదురు;

13 ఏలయనగా వారు చేయుదానిని బట్టి తమ స్వాస్థ్యముగా వారు భూములను పొందుదురు.

14 ఇదిగో, ప్రభువు నా జనులకు ఈలాగు సెలవిచ్చుచున్నాడు—మీరు చేయవలసిన మరియు పశ్చాత్తాపపడవలసిన విషయములు అనేకమున్నవి; ఏలయనగా, మీరు మీ స్వంత మార్గములలో ఉపదేశమిచ్చుటకు వెదకుచున్నారు గనుక, మీ పాపములు నా యొద్దకు వచ్చియున్నవి, అవి క్షమించబడలేదు.

15 మీ హృదయములు సంతృప్తి చెందలేదు. మీరు సత్యమును గైకొనరు గాని, దుర్నీతియందు ఆనందమును కలిగియుందురు.

16 మీ ఆస్థులను బీదలకు ఇవ్వని ధనవంతులైన మీకు శ్రమ, ఏలయనగా మీ ధనము మీ ఆత్మలను చెరిపివేయును; ఉగ్రత, తీర్పు మరియు దర్శన దినమున ఇది మీ విలాపమైయుండును: కోతకాలము గతించినది, వేసవి ముగిసినది మరియు నా ఆత్మ రక్షించబడలేదు!

17 హృదయములు విరుగక, ఆత్మలు నలుగక, కడుపులు తృప్తి చెందక, ఇతర మనుష్యుల వస్తువులను తీసుకొనకుండా తమ చేతులను కాచుకొనక, దురాశతో కన్నులు నిండియుండి, తమ స్వహస్తాలతో పనిచేయని బీదలైన మీకు శ్రమ!

18 కానీ హృదయశుద్ధి కలిగి, విరిగిన హృదయములు నలిగిన ఆత్మలు గలిగిన బీదలు ధన్యులు, ఏలయనగా విడిపించుటకు శక్తితో, గొప్ప మహిమతో దేవుని రాజ్యము వచ్చుటను వారు చూచెదరు; భూమి యొక్క సారము వారిదగును.

19 ఏలయనగా ప్రభువు వచ్చును, ఆయన సిద్ధపరచిన జీతము ఆయన వద్దనుండును, ఆయన ప్రతివానికి ప్రతిఫలమిచ్చును మరియు బీదలు సంతోషించెదరు;

20 తరతరాలకు, ఎప్పటికీ వారి తరములు భూమిని స్వాస్థ్యముగా పొందుదురు. ఇప్పుడు నేను మీతో మాటలాడుటను ముగించుచున్నాను. అలాగే జరుగును గాక. ఆమేన్.