లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 94


94వ ప్రకరణము

1833, ఆగష్టు 2న కర్ట్‌లాండ్, ఒహైయోలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. హైరం స్మిత్, రేనాల్డ్స్ కహూన్, జెరెడ్ కార్టర్ సంఘ నిర్మాణ కార్యవర్గముగా నియమించబడిరి.

1–9, అధ్యక్షత్వము పనిచేయుటకు ఒక మందిరమును నిర్మించుటకు సంబంధించి ప్రభువు ఒక ఆజ్ఞనిచ్చును; 10–12, ఒక ముద్రణాలయము నిర్మించబడవలసియున్నది; 13–17, కొన్ని నిర్దిష్టమైన స్వాస్థ్యములు నియమించబడినవి.

1 మరలా నా స్నేహితులైన మీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను, నేను మీకొక ఆజ్ఞనిచ్చుచున్నాను, అదేమనగా ఇక్కడ కర్ట్‌లాండ్ ప్రదేశమునందు, నా మందిరము నుండి మొదలుపెట్టి సీయోను గుడార పట్టణపు నమూనాను తయారుచేయుటకు, దానిని ప్రారంభించుటకు, పునాదివేయుటకు సిద్ధముచేయు ఒక పనిని మీరు ఆరంభించవలెను.

2 ఇదిగో, నేను మీకిచ్చిన విధానము ప్రకారము అది జరుగవలెను.

3 దక్షిణమునున్న మొదటి భూభాగము అధ్యక్షత్వము కొరకు, అధ్యక్షత్వము పనిచేయుట కొరకు, బయల్పాటులను పొందుటకు; సంఘమునకు దేవుని రాజ్యమునకు సంబంధించిన అన్ని విషయములలో అధ్యక్షత్వము పరిచర్య ధర్మము జరిగించుటకై ఒక మందిరమును నిర్మించుటకు నాకు సమర్పించబడవలెను;

4 లోపలి ఆవరణమునందు దాని వెడల్పు యాభై ఐదు అడుగులు, దాని పొడవు అరవై ఐదు అడుగులుగా అది నిర్మించబడవలెనని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

5 ఇకమీదట మీకు ఇవ్వబోవు విధానమును బట్టి ఒక దిగువ ఆవరణము, ఒక ఎగువ ఆవరణము ఉండవలెను.

6 యాజకత్వపు క్రమమును బట్టి, ఇకమీదట మీకు ఇవ్వబోవు విధానమును బట్టి దాని పునాది నుండి అది ప్రభువుకు అంకితమియ్యబడవలెను.

7 అధ్యక్షత్వము పనిచేయుటకు అది పూర్తిగా ప్రభువుకు అంకితమియ్యబడవలెను.

8 అపవిత్రమైనదేదియు దానియొద్దకు రాకుండునట్లు మీరు చూడవలెను; అక్కడ నా మహిమయు, నా సన్నిధియునుండును.

9 కానీ అపవిత్రమైనది ఏదైనను లోపలికి వచ్చిన యెడల, అక్కడ నా మహిమ ఉండదు; నా సన్నిధి దానిలోనికి రాదు.

10 మరలా నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, దక్షిణమునున్న రెండవ భూభాగము నాకు ఒక మందిరమును నిర్మించుటకు, నా లేఖనముల అనువాదమును, మరియు నేను ఆజ్ఞాపించు వాటన్నిటిని ముద్రించుటకు అంకితమియ్యబడవలెను.

11 లోపలి ఆవరణమునందు దాని వెడల్పు యాభై ఐదు అడుగులు, దాని పొడవు అరవై ఐదు అడుగులుగా నిర్మించబడవలెను; ఒక దిగువ ఆవరణము, ఒక ఎగువ ఆవరణము ఉండవలెను.

12 పరిశుద్ధముగా, పవిత్రముగానుండుటకు అన్ని విషయములందు మీకు ఇవ్వబడు విధానమును బట్టి నేను ఆజ్ఞాపించు అన్ని విషయములను ముద్రించుట కొరకు ఈ మందిరము దాని పునాది నుండి పూర్తిగా ప్రభువు కొరకు అంకితమియ్యబడవలెను.

13 మూడవ భూభాగములో నా సేవకుడైన హైరం స్మిత్ తన స్వాస్థ్యమును పొందవలెను.

14 ఉత్తరమున మొదటి, రెండవ భూభాగములలో నా సేవకులు రేనాల్డ్స్ కహూన్, జెరెడ్ కార్టర్ తమ స్వాస్థ్యములను పొందవలెను—

15 తద్వారా దేవుడును, ప్రభువునైన నేను మీకు ఇచ్చిన ఆజ్ఞను బట్టి నా మందిరములను నిర్మించుటకు ఒక కార్యవర్గముగా ఉండుటకు నేను వారికి అప్పగించిన పనిని వారు చేయవచ్చును.

16 వాటిని గూర్చి నేను మీకొక ఆజ్ఞనిచ్చు వరకు ఈ రెండు మందిరములు నిర్మించబడకూడదు.

17 ఈ సమయములో నేను మీకు ఇంకేమియు ఇవ్వను. ఆమేన్.