లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 72


72వ ప్రకరణము

1831 డిసెంబరు 4న, ఒహైయోలోని కర్ట్లాండ్‌లో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. వారి బాధ్యతను నేర్చుకొనుటకు, సంఘ బోధనలయందు మరింత ఆత్మీయాభివృద్ధిని పొందుటకు అనేకమంది పెద్దలు, సభ్యులు సమావేశమయ్యిరి. ఒకే దినమున పొందబడిన మూడు బయల్పాటుల సంపుటీకరణమే ఈ ప్రకరణము. 1 నుండి 8 వచనాలు బిషప్పుగా న్యూయెల్ కె. విట్నీ పిలుపును తెలియజేయును. తరువాత అతడు పిలువబడి నియమించబడెను, దాని తరువాత బిషప్పు బాధ్యతలను గూర్చి అదనపు సమాచారమును ఇచ్చుచు 9 నుండి 23 వచనాలు పొందబడినవి. ఆ తరువాత, సీయోనుకు కూడివచ్చుట గురించి సూచనలు ఇచ్చుచు 24 నుండి 26 వచనాలు ఇవ్వబడినవి.

1–8, పెద్దలు తమ గృహనిర్వాహకత్వపు లెక్క బిషప్పునకు అప్పగించవలెను; 9–15, బిషప్పు గిడ్డంగిని నిర్వహించి బీదలను, అవసరతలోనున్న వారిని సంరక్షించును; 16–26, బిషప్పులు పెద్దల యోగ్యతను ధృవీకరించవలెను.

1 సంఘ ప్రధాన యాజకులైయుండి, మీయంతట మీరే సమావేశమైయున్న మీరు ఆలకించుడి, ప్రభువు స్వరమును వినుడి; మీకు పరలోకరాజ్యమును, శక్తియు ఇవ్వబడియున్నవి.

2 ఏలయనగా ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీ కొరకు లేదా మీలో నుండి ప్రభువు ద్రాక్షతోటలోని ఈ భాగములో సంఘమునకు ఒక బిషప్పు ఏర్పాటు చేయబడుట నా యందు యుక్తమైయున్నది.

3 ఈ విషయములో మీరు తెలివిగా నడుచుకొనిరి, ఏలయనగా ప్రతి గృహనిర్వాహకుడు ఈ లోకములోను, నిత్యత్వములోను తన గృహనిర్వాహకత్వపు లెక్కను అప్పగించుట ప్రభువుకు కావలసియుండెను.

4 ఏలయనగా ఈ సమయములో ఎవడైతే నమ్మకముగా, తెలివిగానుండునో అతడు, అతని కొరకు నా తండ్రి చేత సిద్ధపరచబడిన నివాసములను స్వాస్థ్యముగా పొందుటకు యోగ్యునిగా యెంచబడును.

5 నా ద్రాక్షతోటలోని ఈ భాగములో సంఘపెద్దలు నా ద్రాక్షతోటలోని ఈ భాగములో నా చేత నియమించబడు బిషప్పునకు వారి గృహనిర్వాహకత్వపు లెక్క అప్పగించవలెనని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

6 సీయోనులో బిషప్పుకు అప్పగించబడుటకు ఈ సంగతులు గ్రంథములలో వ్రాయబడవలెను.

7 ఇవ్వబడిన ఆజ్ఞల ద్వారా, సమావేశ తీర్మానము ద్వారా బిషప్పు యొక్క బాధ్యత తెలియజేయబడును.

8 ఇప్పుడు, ఈ స్థానమునకు నియమించబడు మనుష్యుడు నా సేవకుడైన న్యూయెల్ కె. విట్నీయేనని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదియే దేవుడైన మీ ప్రభువు, మీ విమోచకుని చిత్తము. అలాగే జరుగును గాక. ఆమేన్.

9 ద్రాక్షతోటలోని ఈ భాగములో సంఘమునకు నియమించబడిన బిషప్పు యొక్క బాధ్యతను తెలియపరచుటకు ఇవ్వబడిన ధర్మశాస్త్రమునకు అదనముగా ప్రభువు వాక్యము నిశ్చయముగా ఇదే—

10 ప్రభువు గిడ్డంగిని నిర్వహించుట; ద్రాక్షతోటలోని ఈ భాగములో సంఘ విరాళములను స్వీకరించుట;

11 ముందుగా ఆజ్ఞాపించబడిన విధముగా పెద్దల లెక్క తీసుకొనుట; వారి అవసరతలను తీర్చుట, వారు చెల్లించగలిగినంతమట్టుకు వారు పొందిన దానికి బదులుగా పెద్దలు చెల్లించెదరు;

12 తద్వారా ఇది కూడా సంఘము యొక్క మేలుకొరకు బీదలకు, అవసరతలో ఉన్నవారికి సమర్పించబడవచ్చును.

13 చెల్లించుటకు ఏమి లేనివాని నుండి ఒక వివరణ తీసుకొనబడి, సీయోను యొక్క బిషప్పునకు ఇవ్వబడవలెను, అతడు ప్రభువు తన చేతులలో పెట్టిన దానినుండి అప్పు చెల్లించును.

14 సువార్తను, పరలోకరాజ్య సంగతులను సంఘమునకు, లోకమునకు అందించుటకు ఆత్మీయ విషయములందు పనిచేయు విశ్వాసుల పనులు, సీయోనులోనున్న బిషప్పుకు అప్పు క్రింద జమ కట్టబడును;

15 అది సంఘమునుండి వచ్చును, ఏలయనగా సీయోనుకు వచ్చు ప్రతి మనుష్యుడు ధర్మశాస్త్రమును బట్టి అన్నింటిని సీయోనులోనున్న బిషప్పు యెదుట ఉంచవలెను.

16 ఇప్పుడు నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనగా, ద్రాక్షతోట యొక్క ఈ భాగములోనున్న ప్రతి పెద్ద తన గృహనిర్వాహకత్వపు వృత్తాంతమును ద్రాక్షతోట యొక్క ఈ భాగములోనున్న బిషప్పుకు ఇవ్వవలసియుండగా—

17 ద్రాక్షతోట యొక్క ఈ భాగములోనున్న న్యాయాధిపతి లేదా బిషప్పు నుండి సీయోనులోనున్న బిషప్పుకు తెచ్చు ఒక ధృవపత్రము ప్రతి మనుష్యుడు అంగీకరించబడునట్లు చేయును, స్వాస్థ్యము కొరకు సమస్త సంగతులకు సమాధానము చెప్పును మరియు అది తెలివైన గృహనిర్వాహకునిగా, నమ్మకమైన పనివానిగా పొందబడవలసియున్నది;

18 లేనియెడల అతడు సీయోను యొక్క బిషప్పు చేత అంగీకరించబడడు.

19 ఇప్పుడు నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ద్రాక్షతోట యొక్క ఈ భాగములోనున్న బిషప్పుకు వృత్తాంతమును ఇచ్చు ప్రతి పెద్ద, అతడు పనిచేయు సంఘము లేదా సంఘములచేత సిఫార్సు చేయబడవలెను, తద్వారా అతడు మరియు అతని వృత్తాంతములు అన్ని విషయములలో అంగీకరించబడునట్లు అతడు చేయవచ్చును.

20 మరలా, నా సంఘము యొక్క సాహిత్యసంబంధ ప్రచురణలపై గృహనిర్వాహకులుగా నియమించబడిన నా సేవకులు సహాయము కొరకు బిషప్పు లేదా బిషప్పులను అడుగవలెను—

21 తద్వారా బయల్పాటులు ప్రచురించబడి, భూదిగంతముల వరకు వెళ్ళవచ్చును; సంఘమునకు అన్ని విషయములలో ప్రయోజనకరముగా ఉండునట్లు నిధులు సమీకరించబడవచ్చును;

22 తద్వారా వారు సమస్త విషయములందు అంగీకరించబడి, తెలివైన గృహనిర్వాహకులుగా లెక్కించబడుదురు.

23 ఇప్పుడు, నా సంఘము యొక్క విస్తరించబడిన శాఖలు ఏ ప్రదేశములో స్థాపించబడినను వాటికిది మాదిరికరముగా నుండును. ఇంతటితో నా మాటలను ముగించెదను. ఆమేన్.

24 సంఘ సభ్యులను గూర్చి పరలోకరాజ్య నియమములకు అదనముగా కొద్ది మాటలు—సీయోనుకు వెళ్ళుటకు పరిశుద్ధాత్మ ద్వారా నియమించబడిన వారు, సీయోనుకు వెళ్ళుటకు విశేషాధికారము గలవారు—

25 సంఘము యొక్క ముగ్గురు పెద్దల నుండి ఒక ధృవపత్రమును లేదా బిషప్పు నుండి ఒక ధృవపత్రమును బిషప్పు వద్దకు తీసుకొని వెళ్ళవలెను;

26 లేనియెడల సీయోను ప్రదేశమునకు వెళ్ళువాడు తెలివైన గృహనిర్వాహకునిగా లెక్కించబడడు. ఇది కూడా ఒక మాదిరిగానుండును. ఆమేన్.