లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 70


70వ ప్రకరణము

1831 నవంబరు 12న, ఒహైయోలోని కర్ట్లాండ్‌లో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. నవంబరు 1 నుండి 12 వరకు మొత్తం నాలుగు సమావేశములు జరిగెనని ప్రవక్త యొక్క చరిత్ర తెలుపును: 40వ ప్రకరణపు శీర్షికను చూడుము. ఈ సమావేశములలో చివరి దానిలో, మొదట Book of Commandments (ఆజ్ఞల గ్రంథము) అని, తరువాత సిద్ధాంతము మరియు నిబంధనలుగా పిలువబడు బయల్పాటుల యొక్క గొప్ప ప్రాముఖ్యత పరిగణించబడినది; బయల్పాటులు “సంఘమునకు ఈ భూలోకమంతటనున్న ఐశ్వర్యమంత విలువైనవని” సమావేశము సమ్మతించిన తరువాత ఈ బయల్పాటు ఇవ్వబడెను: పీఠికలో 8వ పేరా చూడుము. “మన రక్షకుని రాజ్యపు మర్మముల తాళపుచెవులు మరలా మనుష్యునికి ఇవ్వబడెనని చూపుచూ ఈ అంత్యదినములలో సంఘపునాదిగా, లోకమునకు ప్రయోజనకారిగా” ఈ బయల్పాటులను జోసెఫ్ స్మిత్ చరిత్ర సూచించెను.

1–5, బయల్పాటులను ప్రచురించుటకు గృహనిర్వాహకులు నియమించబడిరి; 6–13, ఆత్మీయ విషయములందు శ్రమించువారు వారి జీతమునకు పాత్రులగుదురు; 14–18, లౌకిక విషయములందు పరిశుద్ధులు సమానముగా ఉండవలెను.

1 ఓ సీయోను వాసులారా, సుదూరములో నున్న నా సంఘ జనులారా, ఇదిగో ఆలకించుడి, నా సేవకుడైన జోసెఫ్ స్మిత్ జూ. నకు, నా సేవకుడైన మార్టిన్ హారిస్‌నకు, నా సేవకుడైన ఆలీవర్ కౌడరీకి, నా సేవకుడైన జాన్ విట్మర్‌కు, నా సేవకుడైన సిడ్నీ రిగ్డన్‌కు, నా సేవకుడైన విలియం డబ్ల్యు. ఫెల్ఫ్స్‌నకు ఆజ్ఞాపూర్వకముగా నేను ఇచ్చు ప్రభువు వాక్యమును వినుడి.

2 ఏలయనగా వారికి నేనొక ఆజ్ఞనిచ్చుచున్నాను; కాబట్టి ఆలకించి, వినుడి, ఏలయనగా వారితో ప్రభువు యీలాగు సెలవిచ్చుచున్నాడు—

3 ప్రభువైన నేను వారిని నియమించితిని, నేను వారికి ఇచ్చియున్న మరియు వారికి ఇకముందు ఇవ్వబోవు బయల్పాటులకు, ఆజ్ఞలకు గృహనిర్వాహకులుగా వారిని నియమించితిని;

4 ఈ గృహనిర్వాహకత్వపు లెక్కను తీర్పుదినమందు నేను వారినుండి కోరెదను.

5 కాబట్టి వారిని నేను నియమించియున్నాను మరియు వాటిని, వాటి సమస్యలను, వాటి లాభములను నిర్వహించుటయే దేవుని సంఘములో వారి పనియైయున్నది.

6 కాబట్టి, వారు ఈ సంగతులను సంఘమునకు గాని, లోకమునకు గాని ఇవ్వకూడదని వారికి నేనొక ఆజ్ఞనిచ్చుచున్నాను;

7 అయినప్పటికీ, వారు తమ అవసరాలకు మించి ఎక్కువ పొందినప్పుడు, అది నా గిడ్డంగికి ఇవ్వబడవలెను;

8 రాజ్యపు నియమముల ప్రకారము వారు వారసులైయున్నంత వరకు సీయోను వాసులకు మరియు వారి తరములకు వాటి లాభములు సమర్పించబడవలెను.

9 ఇదిగో, ప్రభువైన నేను నియమించియున్న లేదా ఏ మనుష్యునికైనా ఇకముందు నియమించబడే విధముగా తన గృహనిర్వాహకత్వములో ప్రతి మనుష్యుని నుండి ప్రభువు కోరునది ఇదియే.

10 ఇదిగో, సజీవుడగు దేవుని సంఘమునకు చెందిన వారెవరును ఈ నియమము నుండి మినహాయించబడరు;

11 బిషప్పుయైనను, దేవుని గిడ్డంగిని నిర్వహించు ప్రతినిధియైనను, లౌకిక విషయములపై గృహనిర్వాహకునిగా నియమించబడిన ఎవరైనను మినహాయించబడరు.

12 ఆత్మీయ విషయములను నిర్వహించుటకు నియమించబడిన వాడు లౌకిక విషయాలను నిర్వహించుటకు గృహనిర్వాహకత్వమునకు నియమించబడిన వానివలే తన జీతమునకు యోగ్యుడు;

13 అవును, అతడికి మరింత సమృద్ధిగా ఇవ్వబడును, ఆ సమృద్ధి వారికి ఆత్మీయ ప్రత్యక్షతల వలన రెట్టింపగును.

14 అయినప్పటికీ, మీ లౌకిక విషయములందు మీరు సమానముగా ఉండవలెను మరియు ఇది అయిష్టముగా చేయబడకూడదు, లేనియెడల ఆత్మీయ ప్రత్యక్షతల సమృద్ధి ఉపసంహరించబడును.

15 ఇప్పుడు, ఈ ఆజ్ఞను వారి లాభము నిమిత్తము, వారి శిరస్సులపై నా దీవెనల ప్రత్యక్షత నిమిత్తము, వారి శ్రద్ధ, వారి సంరక్షణ నిమిత్తము;

16 ఆహారము, వస్త్రము, స్వాస్థ్యము, గృహములు మరియు స్థలముల నిమిత్తము, ప్రభువైన నేను వారిని ఏ పరిస్థితులలో ఉంచెదనో, ప్రభువైన నేను వారిని ఎక్కడికి పంపెదనో దానిని బట్టి నా సేవకులకు నేను ఇచ్చుచున్నాను.

17 ఏలయనగా వారు అనేక విషయములలో నమ్మకముగా నుండిరి మరియు వారు పాపము చేయనంత వరకు వారు ఉత్తమముగా చేసిరి.

18 ఇదిగో, ప్రభువైన నేను కరుణగలిగి వారిని ఆశీర్వదించెదను మరియు ఈ సంగతుల ఆనందములో వారు ప్రవేశించెదరు. అలాగే జరుగును గాక. ఆమేన్.