లేఖనములు
సిద్ధాంతము మరియు నిబంధనలు 89


89వ ప్రకరణము

1833, ఫిబ్రవరి 27న కర్ట్‌లాండ్, ఒహైయోలో ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ద్వారా ఇవ్వబడిన బయల్పాటు. సంఘములో మొదటి సహోదరులు వారి సమావేశాలలో పొగాకును ఉపయోగించుట వలన, ఈ విషయముపై ధ్యానించుటకు ప్రవక్త నడిపించబడెను; అందువలన, దానిని గూర్చి అతడు ప్రభువును విచారించెను. దాని ఫలితమే జ్ఞానవాక్యముగా పిలువబడు ఈ బయల్పాటు.

1–9, ద్రాక్షారసము, మద్యము, పొగాకు, వేడి పానీయముల ఉపయోగము నిషేధించబడెను; 10–17, ఆకుకూరలు, ఫలములు, మాంసము, ధాన్యములు మనుష్యుని యొక్క మరియు జంతువుల యొక్క ఉపయోగము కొరకు నియమించబడినవి; 18–21, జ్ఞానవాక్యముతో పాటు సువార్త చట్టమునకు విధేయత లౌకిక మరియు ఆత్మీయ దీవెనలను తెచ్చును.

1 కర్ట్లాండ్‌లో కూడుకొనిన ప్రధాన యాజకుల సలహామండలి, సంఘము మరియు సీయోనులోనున్న పరిశుద్ధుల ప్రయోజనము కొరకు ఒక జ్ఞానవాక్యము

2 బయల్పాటు ద్వారా చివరి దినాలలో పరిశుద్ధులందరి లౌకిక రక్షణయందు దేవుని క్రమము మరియు చిత్తమును తెలియజేయుచు జ్ఞానవాక్యము ఒక శుభవచనముగా పంపబడెను, కానీ ఆజ్ఞాపూర్వకముగా లేదా నిర్బంధముగా కాదు.

3 వాగ్దానముతో కూడిన సూత్రముగా ఇవ్వబడి, పరిశుద్ధులందరిలో బలహీనులు, మిక్కిలి బలహీనులుగానుండి, పరిశుద్ధులుగా పిలువబడు లేదా పిలువబడగలిగిన వారి సామర్థ్యమునకు సవరించబడెను.

4 ఇదిగో, నిశ్చయముగా ప్రభువు మీతో ఈలాగు సెలవిచ్చుచున్నాడు: చివరి దినములలో రహస్యముగా దుష్టాలోచనలు చేయు మనుష్యుల హృదయాలలో ఉండు, ఉండబోవు దుష్టత్వము మరియు ప్రణాళికలకు పర్యవసానముగా బయల్పాటు ద్వారా ఈ జ్ఞానవాక్యమును ఇచ్చుట ద్వారా నేను మిమ్ములను హెచ్చరించితిని, మరియు ముందుగా హెచ్చరించుచున్నాను—

5 మీలో ఎవడైనను ద్రాక్షారసమును గాని మద్యమును గాని త్రాగుచున్నయెడల, ఇదిగో ఇది మంచిది కాదు, మీ తండ్రి దృష్టిలో సరియైనది కాదు, ఆయన యెదుట సంస్కారమును అర్పించుటకు మీయంతట మీరు కూడినప్పుడు మాత్రమే అది తగును.

6 ఇదిగో, ఇదే ద్రాక్షారసముగా ఉండవలెను, అవును, ద్రాక్షావల్లి యొక్క ద్రాక్షలనుండి మీయంతట మీరు తీసిన స్వచ్ఛమైన ద్రాక్షారసము.

7 మరలా ఘాటైన పానీయములు కడుపు కొరకు కాదు, కానీ మీ శరీరములను కడుగుకొనుట కొరకే.

8 మరలా, పొగాకు శరీరము కొరకు కాదు, కడుపు కొరకును కాదు, అది మనుష్యునికి మంచిది కాదు, కానీ గాయములకు, జబ్బుపడిన పశువులకు అది ఔషధము, దానిని ఆలోచనతోను, నైపుణ్యముతోను ఉపయోగించవలెను.

9 వేడి పానీయములు శరీరము కొరకు లేదా కడుపు కొరకు కావు.

10 దేవుడు ఆరోగ్యకరమైన ఆకుకూరలను పర్యావరణము, ప్రకృతి, మనుష్యుని ఉపయోగము కొరకు నియమించెనని మరలా నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను—

11 ప్రతి ఆకుకూరను తగిన కాలములో, ప్రతి ఫలమును తగిన కాలములో నియమించెను; వీటన్నిటిని వివేకముతో, కృతజ్ఞతతో ఉపయోగించవలెను.

12 జంతువుల యొక్కయు, ఆకాశ పక్షుల యొక్కయు మాంసమును మనుష్యుడు కృతజ్ఞతతో ఉపయోగించుటకు ప్రభువైన నేను నియమించితిని; అయినప్పటికీ వాటిని మితముగా ఉపయోగించవలెను;

13 శీతాకాలములో లేదా చలిగాఉన్న సమయాలలో లేదా కరువు కాలములో మాత్రమే వాటిని ఉపయోగించుట నాకు సంతోషకరము.

14 ధాన్యములన్నియు జీవనాధారముగా ఉండుటకు మనుష్యుని యొక్కయు, జంతువుల యొక్కయు ఉపయోగము కొరకు నియమించబడెను, మనుష్యునికి మాత్రమే కాదు, కానీ పొలములోనుండు పశువులకు, ఆకాశ పక్షులకు, భూమి మీద పరుగెత్తు లేదా నడుచు క్రూరమృగములన్నిటి కొరకు నియమించబడెను;

15 దేవుడు వీటిని కరువు, అధిక ఆకలిగల సమయాలలో మాత్రమే నరుని ఉపయోగము కొరకు చేసియుండెను.

16 అన్నిరకముల ధాన్యములు, అలాగే ద్రాక్షాఫలములు, మంటిలోనైనను లేదా నేలపైనయైనను ఫలమునిచ్చునవి మనుష్యుని ఆహారమునకు మంచివే—

17 అయినప్పటికీ, మనుష్యుని కొరకు గోధుమలు, ఎద్దుల కొరకు జొన్నలు, గుఱ్ఱముల కొరకు వోటు ధాన్యము, పక్షులకు, పందులకు, పొలములోనుండు పశువులన్నిటికి కాయధాన్యము, ఉపయోగకరమైన జంతువులన్నిటి కొరకు తేలికపాటి పానీయముల కొరకు బార్లీ, ఇతర ధాన్యములు మంచివి.

18 ఈ మాటలను పాటించుటకు, అనుసరించుటకు జ్ఞాపకముంచుకొనుచు ఆజ్ఞలకు విధేయులై నడుచుకొను పరిశుద్ధులందరు వారి నాభిలో ఆరోగ్యమును, ఎముకలలో మూలుగును పొందుదురు;

19 జ్ఞానమును, జ్ఞానము యొక్క గొప్ప నిధులను అనగా దాచబడిన నిధులను కనుగొందురు;

20 పరుగెత్తెదరు కానీ అలయకయుందురు, నడిచెదరు కానీ సొమ్మసిల్లరు.

21 ప్రభువైన నేను వారికి ఒక వాగ్దానమును ఇచ్చుచున్నాను, అదేమనగా నాశనము చేయు దూత ఇశ్రాయేలు సంతానమును దాటివెళ్ళిన విధముగా వారిని దాటివెళ్ళును కానీ వారిని సంహరించదు. ఆమేన్.