2024 రండి, నన్ను అనుసరించండి
జనవరి 29–ఫిబ్రవరి 4: “నేను మీ యెదుట మార్గమును సిద్ధపరిచెదను.” 1 నీఫై 16–22


“జనవరి 29–ఫిబ్రవరి 4: ‘నేను మీ యెదుట మార్గమును సిద్ధపరిచెదను.’ 1 నీఫై 16-22,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2024)

“జనవరి 29–ఫిబ్రవరి 4. 1 నీఫై 16–22,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2024)

చిత్రం
లియహోనాను పరీక్షిస్తున్న జనులు

జనవరి 29–ఫిబ్రవరి 4: “నేను మీ యెదుట మార్గమును సిద్ధపరిచెదను”

1 నీఫై 16–22

లీహై కుటుంబం వాగ్దానదేశం వైపు ప్రయాణిస్తుండగా, ప్రభువు వారికి ఈ వాగ్దానం చేసారు: “మీరు నా ఆజ్ఞలను పాటించియున్నంత కాలము నేను మీ యెదుట మార్గమును సిద్ధపరిచెదను” (1 నీఫై 17:13). స్పష్టంగా, ఆ వాగ్దానానికి అర్థం ప్రయాణం అంత సులభమని కాదు—కుటుంబ సభ్యులు ఇంకను విభేదించారు, విల్లులు విరిగిపోయాయి, జనులు శ్రమపడి, చనిపోయారు మరియు వారు ముడి పదార్థాల నుండి ఓడను నిర్మించవలసి వచ్చింది. ఏదేమైనా, కుటుంబం ప్రతికూలతను లేదా అసాధ్యమైనవిగా కనబడిన కార్యాలను ఎదుర్కొన్నప్పుడు, ప్రభువు ఎప్పుడూ దూరంగా లేరని నీఫై గుర్తించాడు. దేవుడు “[విశ్వాసులను] పోషించును, వారిని బలపరుచును మరియు ఆయన వారికి ఆజ్ఞాపించిన కార్యమును వారు నెరవేర్చగలుగునట్లు సాధనమును దయచేయును” అని అతడికి తెలుసు (1 నీఫై 17:3). నీఫై మరియు అతని కుటుంబం వంటి మంచి వ్యక్తులకు ఎందుకు చెడు జరుగుతుందని మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపడితే, మీరు ఈ అధ్యాయాలలో అంతర్‌జ్ఞానాలను కనుగొనవచ్చు. కానీ అంతకంటే ముఖ్యంగా, చెడు విషయాలు జరిగినప్పుడు మంచి వ్యక్తులు ఏమి చేస్తారో మీరు చూస్తారు.

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

చిత్రం
సెమినరీ చిహ్నము

1 నీఫై 16–18

జీవితపు సవాళ్ళను ఎదుర్కొనేందుకు రక్షకుడు నాకు సహాయం చేస్తారు.

మనందరిలాగానే నీఫై కుటుంబము కొన్ని కఠినమైన సవాళ్ళను ఎదుర్కొంది. యేసు క్రీస్తు యందు విశ్వాసంతో అపవాదిని ఎదుర్కోవడం గురించి నీఫై నుండి మీరు ఏమి నేర్చుకోగలరు? 1 నీఫై 16:17–32; 16:34–39; 17:7–16; 18:1–4; మరియు 18:9–22లో అతని అనుభవాల గురించి చదవండి. ఇటువంటి శీర్షికల క్రింద మీరు కనుగొనే వాటిని నమోదు చేయడాన్ని పరిగణించండి: “సవాలు,” “నీఫై ఎలా స్పందించాడు” మరియు “ప్రభువు ఎలా సహాయపడ్డారు.” మీరు ఎదుర్కొనే సవాళ్ళకు మీరు అన్వయించగలిగేలా మీరేమి నేర్చుకుంటారు?

నీఫై మరియు అతని కుటుంబము నుండి నేర్చుకున్న తర్వాత, మీరు అదనపు ఆలోచనలను ఈ శీర్షికల క్రింద వ్రాయవచ్చు: “నా సవాళ్ళు,” “నేనెలా స్పందిస్తాను” మరియు “ప్రభువు నాకెలా సహాయపడగలరు.” మీరు దానిని చేసినప్పుడు, ఇటువంటి లేఖనాలను మీరు సూచించవచ్చు: మత్తయి 11:28–30; యోహాను 14:26–27; మోషైయ 24:13–15.

ఆంటోనీ డి.పర్కిన్స్, “ఓ మా దేవా, బాధపడుచున్న నీ పరిశుద్ధులను జ్ఞాపకము చేసుకొనుము,” లియహోనా, నవ. 2021, 103–5 కూడా చూడండి.

1 నీఫై 16:10–16, 23–31; 18:11–22

ప్రభువు చిన్న మరియు సాధారణమైన సాధనాల ద్వారా నాకు నడిపింపునిస్తారు.

దేవుడు లీహై కుటుంబాన్ని అరణ్యంలోకి నడిపించినప్పుడు, సవివరమైన ప్రయాణ ప్రణాళికను ఆయన వారికి అందించలేదు. బదులుగా, అనుదినం వారికి నడిపింపునివ్వడానికి ఆయన వారికి లియహోనాను ఇచ్చారు. మీరు 1 నీఫై 16:10–16, 23–31 మరియు 18:10–22 చదువుతున్నప్పుడు, దేవుడు తన పిల్లలకు ఎలా నడిపింపునిస్తారో వివరించే సూత్రాల జాబితాను రూపొందించేందుకు ఆలోచించండి (ఉదాహరణకు, దేవుడు కొన్నిసార్లు ఊహించని మార్గాల్లో మనల్ని నడిపిస్తారని 1 నీఫై 16:10 బోధించగలదు). లియహోనా మరియు పరిశుద్ధాత్మ మధ్య మీరు ఏ పోలికలను చూస్తారు? ఏ “చిన్న సాధనాల” ద్వారా మీ జీవితంలో ఆయన “గొప్ప విషయాలను” జరిగించారు?

ఆల్మా 37:7, 38–47; సిద్ధాంతము మరియు నిబంధనలు 64:33–34 కూడా చూడండి.

చిత్రం
లియహోనాను ఉపయోగిస్తున్న లీహై

If Ye Are Prepared Ye Shall Not Fear [మీరు సిద్ధపడియుండిన యెడల మీరు భయపడనవసరము లేదు], క్లార్క్ కెల్లీ ప్రైస్ చేత

1 నీఫై 17:1–6, 17–22

నా శ్రమలు ఒక దీవెన కాగలవు.

నీఫై మరియు అతని సోదరులు అరణ్యంలో ఒకేరకమైన సవాళ్ళను కలిగియున్నప్పటికీ, వారి అనుభవాలు చాలా భిన్నమైనవి. అరణ్యంలో ప్రయాణించిన నీఫై వృత్తాంతానికి (1 నీఫై 17:1–6 చూడండి), అతని సహోదరుల వృత్తాంతానికి మధ్య మీరు భేదాలు చూపవచ్చు (1 నీఫై 17:17–22 చూడండి). విశ్వాసపూరితమైన దృక్పథాన్ని కలిగియుండడానికి అతనికి సహాయపడేలా నీఫైకి తెలిసినది లేదా అతడు చేసినది ఏమిటి? విశ్వాసము మరియు కృతజ్ఞతాపూర్వక దృక్పథంతో ఇటీవలి లేదా ప్రస్తుత సవాలు గురించి వ్రాయడాన్ని పరిగణించండి. దీని నుండి మీరేమి భావించారు లేదా నేర్చుకున్నారు?

ఏమీ ఎ. రైట్, “విరిగిన దానిని క్రీస్తు స్వస్థపరుస్తారు,” లియహోనా, మే 2022, 81–84 కూడా చూడండి.

నిశ్శబ్దంగా ప్రతిబింబించే సమయం. ఆలోచించడానికి, ధ్యానించడానికి, ప్రతిబింబించడానికి లేదా వ్రాయడానికి సమయాన్ని కేటాయించడం ప్రేరేపణకు దారితీయగలదు. సువార్త యొక్క సిద్ధాంతము లేదా సూత్రాలు మన జీవితాలతో ఎలా సంబంధం కలిగియుంటాయో చూడడానికి ఇది మనకు సహాయపడగలదు. మీరు ఇతరులకు బోధించినప్పుడు, ప్రతిబింబించడానికి మరియు వారి మనోభావాలను వ్రాయడానికి వారికి సమయాన్నివ్వండి. ఇతరులతో వారి ఆలోచనలు మరియు భావాలను పంచుకోవడానికి వారి సమ్మతిని కూడా ఇది పెంచగలదు.

1 నీఫై 19:22-24; 20–22

నేను “లేఖనములన్నిటిని నాతో పోల్చగలను”.

లేఖనాలు చాలా కాలం క్రితం వ్రాయబడ్డాయి గనుక, నేడు అవి మనకు సంబంధించినవి కాదని అనిపిస్తుంది. కానీ నీఫైకి బాగా తెలుసు. “అవి మాకు ప్రయోజనకరముగా ఉండునట్లు మరియు మేము నేర్చుకొనునట్లు లేఖనములన్నిటినీ మాతో పోల్చితిని” అని అతడు చెప్పాడు (1 నీఫై 19:23). లేఖనాలలో నీఫై చాలా ఆత్మీయ శక్తిని కనుగొనడానికి ఇది ఒక కారణం.

మీరు 1 నీఫై 20–22 చదువుతున్నప్పుడు, క్రింద ఉన్నటువంటి ప్రశ్నల గురించి ఆలోచించండి:

1 నీఫై 20:1–9.యెషయా కాలంలోని జనుల గురించి ఈ వచనాలు ఏమి బోధిస్తాయి? మీకు అన్వయించేలా మీరేమి కనుగొంటారు?

1 నీఫై 20:17–22.యెషయా కాలంలోని జనులను పరలోక తండ్రి ఎలా నడిపించారనే దాని గురించి ఈ వచనాలు ఏమి బోధిస్తాయి? ఆయనను అనుసరించమని ఆయన మిమ్మల్ని ఎలా ఆహ్వానిస్తారు?

మీరు మీతో “పోల్చుకోగలిగేలా” ఇంకా వేటిని మీరు 1 నీఫై 20–22లో కనుగొంటారు?

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

1 నీఫై 16:10, 28–29; 18:8-13, 20-22

నేను ఆజ్ఞలను పాటించినప్పుడు, ప్రభువు నాకు నడిపింపునిస్తారు.

  • మన దారి కనుగొనేలా మనకు సహాయపడేందుకు మీ దగ్గర ఒక దిక్సూచి, ఒక భౌగోళిక పటము లేదా మరేదైనా ఉన్నట్లయితే, దానిని మీరు మీ పిల్లలకు చూపించవచ్చు. 1 నీఫై 16:10, 28–29లో మనం చదివే లియహోనా గురించి ఒక చర్చను ప్రారంభించడానికి ఇది ఒక మంచి విధానం కాగలదు. ఒక దిక్సూచి లేదా ఒక భౌగోళిక పటము పని చేయకపోవడానికి గల కొన్ని కారణాలు ఏవి? లీహై కుటుంబం కొరకు కొన్నిసార్లు లియహోనా ఎందుకు పనిచేయలేదు? (1 నీఫై 18: 9–12, 20–22 చూడండి). తిరిగి ఆయన వద్దకు మనల్ని నడిపించడానికి నేడు పరలోక తండ్రి మనకు ఏమి ఇచ్చారు?

  • 1 నీఫై 16:10, 26–31; 18:8–22లో లియహోనా గురించి వారు నేర్చుకున్న దానిని అన్వయించడానికి మీ పిల్లలకు సహాయపడేందుకు, ఒక ముఖ్యమైన లేదా కష్టమైన నిర్ణయం గురించి ఆలోచించమని మీరు వారిని ఆహ్వానించవచ్చు. నేడు మనల్ని నడిపించడానికి లియహోనా వలె పనిచేసే దేనిని దేవుడు మనకిచ్చాడు? (ఉదాహరణకు, ఆల్మా 37:38–44 చూడండి.) పరలోక తండ్రి మీకు నడిపింపునిచ్చిన ఒక వ్యక్తిగత అనుభవాన్ని పంచుకోవడాన్ని పరిగణించండి.

1 నీఫై 16:21-32

నా కుటుంబానికి నేనొక మంచి మాదిరిగా ఉండగలను.

  • మీరు కలిసి 1 నీఫై 16:21–32 చదువుతున్నప్పుడు, నీఫై మాదిరి అతని కుటుంబాన్ని ఎలా దీవించిందో కనుగొనడానికి మీ పిల్లలకు సహాయపడండి. మనం నీఫై వలె ఎలా ఉండగలమనే దాని గురించి ఒక చర్చకు ఇది దారితీయవచ్చు. మిగతా కుటుంబ సభ్యులపై మంచి ప్రభావం చూపేలా వారు చేయగల ఒకదానిని ప్రణాళిక చేయమని మీ పిల్లలను ఆహ్వానించండి.

1 నీఫై 17:7-19; 18:1-4

కష్టమైన పనులు చేయడానికి పరలోక తండ్రి నాకు సహాయపడగలరు.

  • కథలు చెప్పడాన్ని పిల్లలు ఇష్టపడతారు. ఒక పడవ నిర్మించమని నీఫై ఆజ్ఞాపించబడిన కథను చెప్పడానికి మీకు సహాయపడేందుకు మీరు వారిని ఆహ్వానించవచ్చు (1 నీఫై 17:7–19; 18:1–4 చూడండి). పడవ నిర్మించడానికి ప్రయత్నిస్తున్నందుకు అతని సోదరులు అతడిని ఎగతాళి చేసినప్పుడు ధైర్యంగా ఉండేందుకు నీఫైకి సహాయపడినదేమిటి?

  • పడవ ఎలా నిర్మించాలో నీఫైకి తెలియదు, కాబట్టి అతడు ప్రభువు నుండి ఉపదేశంపై ఆధారపడ్డాడు. మీతో కలిసి 1 నీఫై 18:1 చదివిన తర్వాత, మీ పిల్లలు ఈ వారం ప్రోత్సాహ కార్యక్రమ పేజీ పూర్తిచేయవచ్చు. వారు దానిని చేసినప్పుడు, పరలోక తండ్రి నీఫైకి సహాయపడినట్లే, కష్టమైన పనులు చేయడానికి మనకు ఎలా సహాయపడగలరో వారితో మాట్లాడండి.

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

చిత్రం
పడవపై నీఫై మరియు అతని కుటుంబము

They Did Treat Me with Much Harshness [వారు నాతో చాలా కఠినముగా ప్రవర్తించారు], వాల్టర్ రానె చేత

ముద్రించు