విరిగిన దానిని క్రీస్తు స్వస్థపరుస్తారు
దేవునితో తెగిన సంబంధాలను, ఇతరులతో తెగిన సంబంధాలను, మనలోని విరిగిన భాగాలను ఆయన స్వస్థపరచగలరు.
కొన్ని సంవత్సరాల క్రితం, ఒక కుటుంబ కూడికలో అప్పుడు ఎనిమిదేళ్ళ వయస్సున్న నా మేనల్లుడు విలియం మా పెద్ద అబ్బాయి బ్రిటన్‌ను బంతి ఆట ఆడతావా అని అడిగాడు. బ్రిటన్ ఉత్సాహంగా, “ఆడతాను! నాకిష్టం!” అని చెప్పాడు. కొంతసేపు వాళ్ళు ఆడుకున్న తర్వాత, బంతి బ్రిటన్ చేతుల్లో నుండి వెళ్ళి ప్రమాదవశాత్తూ తన తాతమామ్మల పురాతన పూలకుండీని విరుగగొట్టింది.
బ్రిటన్ చాలా భయపడ్డాడు. అతను విరిగిన ముక్కలను నెమ్మదిగా ఏరుతున్నప్పుడు, విలియం తన అన్న దగ్గరకు వచ్చి ప్రేమగా అతని వీపు తట్టాడు. తర్వాత అతడు ఇలా ఓదార్చాడు, “బాధపడకు, బ్రిటన్. ఒకసారి తాత మామ్మల ఇంట్లో నేను ఏదో పగులగొట్టినప్పుడు, మామ్మ తన చేతిని నా చుట్టూ వేసి, ‘ఫరవాలేదు విలియం. నువ్వు కేవలం ఐదేళ్ళ వాడివి’ అంది.”
దానికి బ్రిటన్, “కానీ, విలియం, నా వయస్సు 23!” అన్నాడు.
మన వయస్సుతో సంబంధం లేకుండా, మన జీవితాలలోని కష్టసమయాల్లో మన రక్షకుడైన యేసు క్రీస్తు విజయవంతంగా మనకు ఎలా సహాయపడతారనే దాని గురించి మనం లేఖనాల నుండి ఎంతో నేర్చుకోగలము. దేవునితో తెగిన సంబంధాలను, ఇతరులతో తెగిన సంబంధాలను, మనలోని విరిగిన భాగాలను ఆయన స్వస్థపరచగలరు.
దేవునితో తెగిన సంబంధాలు
రక్షకుడు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు, శాస్త్రులు మరియు పరిసయ్యుల చేత ఒక స్త్రీ ఆయన వద్దకు తీసుకురాబడింది. ఆమె పూర్తి కథ మనకు తెలియదు, ఆమె “వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను” అని మాత్రమే తెలుసు.1 తరచూ లేఖనాలు ఒకరి జీవితంలో కొంతభాగం మాత్రమే తెలుపుతాయి, ఆ భాగంపై ఆధారపడి మనం కొన్నిసార్లు ప్రశంసిస్తాము లేదా ఖండిస్తాము. ఒక అద్భుతమైన క్షణం లేదా ఒక దురదృష్టకరమైన బహిరంగ నిస్పృహ చేత ఏ ఒక్కరి జీవితం అర్థం చేసుకోబడలేదు. ఈ లేఖన వృత్తాంతాల ఉద్దేశ్యమేమనగా, అప్పుడు మరియు ఇప్పుడు క్రీస్తే సమాధానమని చూడడానికి మనకు సహాయం చేయడం. ఆయనకు మన పూర్తి కథ తెలుసు, మనం ఎలా బాధపడుతున్నామో ఖచ్చితంగా తెలుసు, అలాగే మన సామర్థ్యాలు మరియు దుర్భలత్వాలు తెలుసు.
దేవుని యొక్క ఈ అమూల్యమైన కుమార్తెకు క్రీస్తు ఇచ్చిన సమాధానం, “నేనును నీకు శిక్ష విధింపను; నీవు వెళ్ళి ఇక పాపము చేయకుము.”2 “వెళ్ళి, ఇక పాపము చేయకుము” అని చెప్పడానికి మరొక విధానం, “వెళ్ళి, మార్పుచెందుము” అని కావచ్చు. పశ్చాత్తాపపడమని, తన ప్రవర్తనను, తన సహవాసాలను, తన గురించి తాను భావించేదానిని, తన హృదయాన్ని మార్చుకోమని రక్షకుడు ఆమెను ఆహ్వానిస్తున్నారు.
క్రీస్తు మూలంగా, “వెళ్ళి, మార్పుచెందాలి” అనే మన నిర్ణయం “వెళ్ళి, స్వస్థపడడానికి” కూడా మనల్ని అనుమతించగలదు, ఎందుకంటే మన జీవితాల్లో చితికిన వాటన్నిటిని స్వస్థపరిచే మూలాధారం ఆయనే. గొప్ప మధ్యవర్తిగా, తండ్రితో న్యాయవాదిగా క్రీస్తు శుద్ధిచేస్తారు మరియు తెగిన సంబంధాలను—మరీ ముఖ్యంగా, దేవునితో మన సంబంధాన్ని పునరుద్ధరిస్తారు.
ఆ స్త్రీ రక్షకుని సలహాను అనుసరించి తన జీవితాన్ని మార్చుకుందని జోసెఫ్ స్మిత్ అనువాదం మనకు స్పష్టం చేస్తుంది: “ఆ సమయం నుండి ఆ స్త్రీ దేవుడిని మహిమపరచి, ఆయన నామమును విశ్వసించింది.”3 ఆమె పేరు లేదా ఆ సమయం తర్వాత ఆమె జీవితం గురించి వివరాలు మనకు తెలియకపోవడం దురదృష్టకరం, ఎందుకంటే ఆమె పశ్చాత్తాపపడి, మార్పుచెందడానికి దృఢనిశ్చయం, వినయం మరియు ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసం అవసరమైయుండవచ్చు. ఆయన అనంతమైన, నిత్య త్యాగాన్ని చేరుకొనే స్థితిలో ఆమె ఉందనే గ్రహింపుతో ఆమె, “ఆయన నామముపై విశ్వసించిన” స్త్రీ అని మాత్రమే మనకు తెలుసు.
ఇతరులతో తెగిన సంబంధాలు
లూకా 15వ అధ్యాయములో, ఇద్దరు కొడుకులను కలిగియున్న ఒక వ్యక్తి ఉపమానం గురించి మనం చదువుతాము. తన వంతు ఆస్తి కోసం చిన్నకొడుకు తన తండ్రిని అడిగాడు మరియు దూర దేశమునకు ప్రయాణమై పోయి, అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారమువలన పాడుచేసాడు.4
“అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరవు రాగా వాడు ఇబ్బంది పడసాగి,
“వెళ్ళి ఆ దేశస్థులలో ఒకనిచెంత జేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను.
“వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని యెవడును వానికేమియు ఇయ్యలేదు.
“అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవుచున్నాను.
“నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి--తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని;
“ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను; నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని,
“లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, పరుగెత్తి వాని మెడమీదపడి ముద్దుపెట్టుకొనెను.”5
తండ్రి తన కుమారుడి వద్దకు పరిగెత్తుకొని వెళ్ళాడనే వాస్తవం ముఖ్యమైనదని నేను నమ్ముతున్నాను. కుమారుడు తన తండ్రికి కలిగించిన వ్యక్తిగత బాధ తప్పకుండా లోతైనది మరియు తీవ్రమైనది అయ్యుండవచ్చు. అదేవిధంగా, తన కుమారుని చర్యల వలన తండ్రి అచ్చంగా ఇబ్బంది పడియుండవచ్చు.
కాబట్టి, తన కుమారుడు క్షమాపణ అడిగేవరకు తండ్రి ఎందుకు వేచియుండలేదు? క్షమాపణను, ప్రేమను చూపడానికి ముందు, పూర్వస్థితికి వచ్చినట్లు మరియు సమాధానపడినట్లు చూపేవరకు అతడు ఎందుకు ఆగలేదు? నేను తరచూ ధ్యానించింది దీని గురించే.
ఇతరులను క్షమించడం అనేది సార్వత్రిక ఆజ్ఞయని ప్రభువు మనకు బోధిస్తారు: “ప్రభువైన నేను, ఎవరిని క్షమించెదనో వారిని క్షమించెదను, కానీ మీరైతే మనుష్యులందరిని క్షమించవలసిన అవసరమున్నది.”6 క్షమాపణను అందించడానికి చాలా ధైర్యము మరియు వినయము కావాలి. సమయం కూడా పట్టవచ్చు. మన హృదయాలలోని భావాలకు లెక్క అప్పగించవలసియున్నదని మనం అనుకున్నప్పుడు, దానికోసం మన విశ్వాసాన్ని, నమ్మకాన్ని ప్రభువు నందు ఉంచవలసి వస్తుంది. ఇక్కడే మన కర్తృత్వము యొక్క ప్రాముఖ్యత మరియు శక్తి ఉంటుంది.
తప్పిపోయిన కుమారుని ఉపమానములో ఉన్న ఈ తండ్రి యొక్క వర్ణనతో, క్షమాపణ అనేది మనం ఒకరికి ఒకరం మరియు ప్రముఖంగా మనకి మనం ఇవ్వగల ఘనమైన బహుమానాల్లో ఒకటని రక్షకుడు ఉద్ఘాటించారు. క్షమాపణ ద్వారా మన హృదయాలపై భారం మోపకుండా ఉండడం ఎల్లప్పుడూ సులువు కాదు, కానీ యేసు క్రీస్తు యొక్క సాధ్యపరచు శక్తి ద్వారా అది సాధ్యమవుతుంది.
మనలోని విరిగిన భాగాలు
పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక మనుష్యుని గురించి అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము లో మనం నేర్చుకుంటాము. “వాడు దేవాలయములోనికి వెళ్ళువారిని బిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి.”7
కుంటివాడైన ఆ భిక్షగాడు 40 ఏళ్ళ పైవయస్సు గలవాడు8 మరియు కోరుకోవడం, వేచిచూడడం అనే ఎన్నడూ అంతంకాని స్థితిలో తన పూర్తి జీవితం గడిపేసాడు, ఎందుకంటే అతడు ఇతరుల దయ మీద ఆధారపడియున్నాడు.
ఒకరోజు “పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడిగెను.
“పేతురును, యోహానును వానిని తేరి చూచి—మా తట్టు చూడమనిరి.
“వాడు వారి యొద్ద ఏమైనా దొరకునని కనిపెట్టుచు వారియందు లక్ష్యముంచెను.
“అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పెను.
“వాడి కుడిచెయ్యి పట్టుకొని లేవనెత్తెను: వెంటనే వాని పాదములును చీలమండలును బలము పొందెను.
“వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను; నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితోకూడ దేవాలయములోనికి వెళ్ళెను.”9
ఓర్పుతో—లేదా కొన్నిసార్లు ఓర్పు లేకుండా—“యెహోవా కొరకు ఎదురు చూస్తూ” దేవాలయ ద్వారం వద్దనున్న కుంటి భిక్షగాని స్థానంలో మనల్ని మనం మన జీవితాలంతటా తరచూ కనుగొనగలము.10 భౌతికంగా లేదా మానసికంగా స్వస్థపరచబడుటకు వేచియుండుట. మన హృదయాల లోతులలోనికి చొచ్చుకొనిపోవు జవాబుల కొరకు వేచియుండుట. ఒక అద్భుతం కొరకు వేచియుండుట.
యెహోవా కొరకు ఎదురు చూడడం ఒక పవిత్ర ప్రదేశం కాగలదు—అది శుభ్రపరచి, మెరుగుపెట్టే ప్రదేశం, అక్కడ మనం ఉన్నతమైన వ్యక్తిగత విధానంలో రక్షకుడిని తెలుసుకోగలము. యెహోవా కొరకు ఎదురు చూడడమనేది, “ఓ దేవా, నీవెక్కడున్నావు?” అని మనం అడగడాన్ని మనం కనుగొనే ప్రదేశం కూడా కావచ్చు11—అది ఒక ప్రదేశం, అక్కడ ఆత్మీయ నిలకడ కోసం మళ్ళీ మళ్ళీ ఉద్దేశపూర్వకంగా ఆయనను ఎంచుకోవడం ద్వారా యేసు క్రీస్తు నందు విశ్వాసాన్ని మనం సాధన చేయడం అవసరం. నాకు ఈ పరిస్థితి తెలుసు మరియు ఈ రకంగా వేచియుండడం నాకు అర్థమైంది.
క్యాన్సర్ చికిత్సా కేంద్రంలో స్వస్థపరచబడేందుకు పరితపిస్తున్న అనేకమంది ఇతరులతో పాటు కలిసి బాధపడుతూ నేను లెక్కలేనన్ని గంటలు గడిపాను. కొంతమంది జీవించారు; ఇతరులు మరణించారు. మన శ్రమల నుండి విడుదల అనేది ప్రతీఒక్కరికి భిన్నంగా ఉంటుందని, కాబట్టి మనం విడిపించబడిన విధానంపై తక్కువగా కేంద్రీకరించి, విడిపించేవాని మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలని గంభీరమైన విధానంలో నేను నేర్చుకున్నాను. మన ఉద్ఘాటన ఎల్లప్పుడూ యేసు క్రీస్తుపై ఉండాలి!
క్రీస్తు నందు విశ్వాసాన్ని సాధన చేయడమంటే అర్థము, దేవుని చిత్తంపై మాత్రమే కాదు కానీ ఆయన సమయంలో కూడా నమ్మకముంచడం. ఎందుకంటే మనకు ఏమి కావాలి మరియు అది ఎప్పుడు కావాలి అనేది ఖచ్చితంగా ఆయనకు తెలుసు. మనం ప్రభువు యొక్క చిత్తానికి లోబడినప్పుడు, ప్రధానంగా చివరకు మనం కోరుకున్న దానికంటే ఎక్కువే పొందుతాము.
నా ప్రియ మిత్రులారా, మనందరి జీవితాల్లో విరిగినది, చక్కదిద్దవలసిన, మరమ్మతు చేయవలసిన లేదా బాగుచేయవలసిన అవసరమున్న ఏదో ఒకదానిని మనం కలిగియున్నాము. మనం రక్షకుని వైపు తిరిగి, మన హృదయాలను, మనస్సులను ఆయనతో సమన్వయం చేసి, పశ్చాత్తాపపడినప్పుడు, మన వద్దకు ఆయన “తన రెక్కలలో ఆరోగ్యముతో”12 వచ్చి, మన చుట్టూ ప్రేమతో తన చేయి వేసి, “ఫరవాలేదు. ఇంకా నీ వయస్సు కేవలం 5—లేదా 16, 23, 48, 64, 91. మనందరము కలిసి దీనిని బాగుచేయగలము!” అని అంటారు.
యేసు క్రీస్తు యొక్క స్వస్థపరచు శక్తి, విమోచనాశక్తి మరియు సాధ్యపరచు శక్తిని మించి విరిగిపోయినది ఏదీ మీ జీవితంలో లేదని నేను మీకు సాక్ష్యమిస్తున్నాను. స్వస్థపరచుటకు శక్తిగల యేసు క్రీస్తు యొక్క పవిత్రమైన మరియు పరిశుద్ధ నామములో, ఆమేన్.