మీ దైవిక స్వభావము మరియు నిత్య గమ్యము
మీ జీవితాన్ని యేసు క్రీస్తుపై కేంద్రీకరించమని మరియు యువతుల ఇతివృత్తంలోని మూలాధార సత్యాలను గుర్తుంచుకోమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.
ప్రియమైన సహోదరీలారా, ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలు. సర్వసభ్య సమావేశం యొక్క స్త్రీల సభలో పాల్గొనడాన్ని నేను గౌరవసూచకంగా భావిస్తున్నాను. అప్పుడప్పుడు యువతుల తరగతులకు హాజరయ్యేందుకు నాకు అవకాశం కలిగింది. కానీ, నేను యవ్వనంలో లేనని మరియు స్త్రీని కాదని మీకు స్పష్టం చేస్తున్నాను! అయినప్పటికీ, యువతులతో కలిసి యువతుల ఇతివృత్తం వల్లించగలిగినప్పుడు, నేను చెందియుండలేదనే భావన తక్కువగా ఉన్నట్లు తెలుసుకున్నాను. యువతుల ఇతివృత్తం1లో బోధించబడిన గంభీరమైన సిద్ధాంతము యువతులకు ముఖ్యమైనది, కానీ అది మనలో యువతులు కాని వారితోపాటు అందరికీ అన్వయించబడుతుంది.
“నేను పరలోక తల్లిదండ్రుల యొక్క ప్రియమైన కుమార్తెను, దైవిక స్వభావము మరియు నిత్య గమ్యమును కలిగియున్నాను”2 అని యువతుల ఇతివృత్తం ప్రారంభమవుతుంది. ఈ వ్యాఖ్యానం నాలుగు ముఖ్య సత్యాలను కలిగియుంది. మొదటిది, మీరు ప్రియమైన కుమార్తె. మీరు చేసేది—లేదా చేయనిది—ఏదీ దానిని మార్చలేదు. మీరు ఆయన ఆత్మీయ కుమార్తె, కాబట్టి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. కొన్నిసార్లు మనం ఆయన ప్రేమను అనుభవించలేము, కానీ అది ఎల్లప్పుడూ ఉంటుంది. దేవుని ప్రేమ పరిపూర్ణమైనది.3 కానీ దానిని గ్రహించడానికి మన సామర్థ్యం పరిపూర్ణమైనది కాదు.
దేవుని ప్రేమను మనకు తెలియజేయడంలో ఆత్మ ముఖ్య పాత్ర పోషిస్తుంది.4 అయినప్పటికీ, “కోపం, ద్వేషం, …(లేదా) భయం వంటి బలమైన భావాలచేత పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం కప్పివేయబడగలదు … మిరపకాయ తింటూ ద్రాక్ష రుచిని ఆస్వాదించాలని ప్రయత్నిస్తున్నట్లుగా. … [ఒక రుచి] పూర్తిగా మరొకదానిని అణచివేస్తుంది.”5 అదే విధంగా, పాపముతో పాటుగా పరిశుద్ధాత్మ నుండి మనల్ని దూరం చేసే ప్రవర్తనలు6 మన కోసం దేవుడు కలిగియున్న ప్రేమను చూడడాన్ని కష్టతరం చేస్తాయి.
అలాగే, ఇతర విషయాలతో పాటు సవాళ్ళతో కూడిన పరిస్థితులు మరియు శారీరక లేదా మానసిక వ్యాధిచేత దేవుని ప్రేమ గురించి మన గ్రహింపు బలహీనపరచబడవచ్చు. ఈ సందర్భాలన్నిటిలో, నమ్మకమైన నాయకులు లేదా నిపుణుల సలహా తరచు లాభదాయకం కాగలదు. “దేవుని పట్ల నా ప్రేమ శాశ్వతమైనదా లేదా మంచి సమయాల్లో నేను ఆయనను ప్రేమించి, చెడు సమయాల్లో అంతగా ప్రేమించకుండా ఉంటున్నానా?” అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం ద్వారా మనం దేవుని ప్రేమను గ్రహించడాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించవచ్చు.
రెండవ సత్యము, మనం పరలోక తల్లిదండ్రులను, ఒక తండ్రిని, ఒక తల్లిని కలిగియున్నాము.7 పరలోక తల్లి యొక్క సిద్ధాంతము బయల్పాటు ద్వారా వస్తుంది మరియు అది కడవరి దిన పరిశుద్ధుల మధ్య గల విలక్షణమైన నమ్మకం. ఈ సత్యం యొక్క ప్రాముఖ్యత గురించి అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ వివరించారు: “మన వేదాంతం పరలోక తల్లిదండ్రులతో మొదలవుతుంది. వారిలా ఉండడమే మన అత్యున్నత అభిలాష.”8
పరలోక తల్లి గురించి చాలా తక్కువ బయల్పరచబడింది, కానీ మనకు తెలిసినది మన సువార్త గ్రంథాలయ అన్వయములో కనుగొనబడే సువార్త అంశాల వ్యాసాలలో సంక్షిప్తపరచబడింది.9 అక్కడున్న దానిని మీరు ఒకసారి చదివితే, ఆ విషయం గురించి నాకు తెలిసినదంతా మీరు తెలుసుకుంటారు. నాకు ఇంకొంత తెలిసి ఉంటే బాగుండేది. మీకు కూడా ఇంకా ప్రశ్నలు ఉండియుండవచ్చు మరియు మరిన్ని జవాబులు కనుగొనాలని కోరవచ్చు. అధిక గ్రహింపును కోరడమనేది మన ఆత్మీయ వృద్ధిలో ముఖ్యభాగము, కానీ దయచేసి జాగ్రత్త వహించండి. బయల్పాటు స్థానంలో తర్కము ఉంచబడలేదు.
ఊహాకల్పిత వాదన అధిక ఆత్మీయ జ్ఞానానికి దారితీయదు, కానీ మోసానికి దారితీయగలదు లేదా బయల్పరచబడిన దాని నుండి మన దృష్టిని మరలించగలదు.10 ఉదాహరణకు, “ఎల్లప్పుడూ తండ్రికి నా నామమున ప్రార్థన చేయవలెను”11 అని రక్షకుడు తన శిష్యులకు బోధించారు. మనం ఈ మాదిరిని అనుసరించి, యేసు క్రీస్తు నామములో మన పరలోక తండ్రిని ఆరాధిస్తాము మరియు పరలోక తల్లికి ప్రార్థన చేయము.12
దేవుడు ప్రవక్తలను నియమించినప్పటి నుండి వారు ఆయన తరఫున మాట్లాడడానికి అధికారమివ్వబడ్డారు. కానీ వారు “[తమ] అంతట తామే కల్పించిన సిద్ధాంతాలను ప్రకటించరు”13 లేదా బయల్పరచబడని వాటిని బోధించరు. పాత నిబంధన ప్రవక్తయైన బిలాము మాటలను పరిగణించండి, మోయాబుకు లాభం చేకూరేలా ఇశ్రాయేలీయులను శపించమని అతనికి లంచం ఇవ్వజూపారు. “[మోయాబు రాజు] తన యింటెడు వెండి బంగారములను నాకిచ్చినను కొద్దిపనినైనను గొప్పపనినైనను చేయునట్లు నేను నా దేవుడైన యెహోవా నోటిమాట మీరలేను”14 అని బిలాము చెప్పాడు. కడవరి దిన ప్రవక్తలు అదేవిధంగా నిరోధించబడ్డారు. దేవుని నుండి బయల్పాటును గట్టిగా అడగడం అహంకారపూరితమైనది మరియు నిరర్థకమైనది. దానికి బదులుగా, ఆయన ఏర్పరచిన విధానాల ద్వారా తన సత్యాలను బయల్పరచడానికి ప్రభువు కొరకు మరియు ఆయన యుక్తకాలము కొరకు మనం వేచియుంటాము.15
యువతుల ఇతివృత్తము యొక్క మొదటి పేరాలోని మూడవ సత్యము, మనము “దైవిక స్వభావము” కలిగియున్నాము. ఇదే మన అసలైన గుర్తింపు. ఇది ఆత్మీయంగా “జన్యుపరమైనది,” మన పరలోక తల్లిదండ్రుల నుండి వారసత్వంగా వచ్చినది16 మరియు మన వంతుగా ఏ ప్రయత్నము అవసరం లేనిది. మనల్ని మనం ఏవిధంగా గుర్తించాలని అనుకున్నప్పటికీ, ఇది మన అతిముఖ్యమైన గుర్తింపు. ఈ గంభీరమైన సత్యాన్ని గ్రహించడం ప్రతీఒక్కరికి ముఖ్యము, ప్రత్యేకించి చారిత్రాత్మకంగా అట్టడుగున ఉన్న, అణచివేయబడిన లేదా లొంగదీసుకోబడిన సమూహాలకు చెందిన వ్యక్తులకు మరీ ముఖ్యమైనది. మీ అతి ముఖ్యమైన గుర్తింపు దేవుని బిడ్డగా మీ దైవిక స్వభావానికి సంబంధించినదని గుర్తుంచుకోండి.
మనము ఒక “నిత్య గమ్యాన్ని” కలిగియున్నామనేది నాల్గవ సత్యము. అటువంటి గమ్యము మనపై బలవంతంగా రుద్దబడదు. మరణించిన తర్వాత, మనము దేనికి అర్హులైయున్నామో దానిని పొందుతాము మరియు “[మనము] పొందడానికి సమ్మతించిన దానిని [మాత్రమే] ఆనందిస్తాము”17. మన నిత్య గమ్యము మన ఎంపికలపైనే ఆధారపడియున్నదని తెలుసుకుంటాము. దానికి పరిశుద్ధ నిబంధనలు చేసి, పాటించడం అవసరం. ఈ నిబంధన బాట మనం క్రీస్తు యొద్దకు రావడానికి మార్గము, ఇది ఖచ్చితమైన సత్యము మరియు నిత్యమైన, మార్పుచెందని చట్టముపై ఆధారపడియుంది. మన స్వంత బాటను నిర్మించుకొని, దేవుడు వాగ్దానం చేసిన ఫలితాలను మనం ఆశించలేము. ఆయన దీవెనలు ఆధారపడియున్న నిత్య చట్టాలను అనుసరించకుండా వాటిని ఆశించడం18 భ్రమ, అది వేడి పొయ్యిని తాకి, కాల్చబడకుండా ఉండాలని “నిర్ణయించుకోవడం” వంటిది.
నేను గుండె జబ్బులు గల రోగులను చూసేవాడినని మీకు తెలిసియుండవచ్చు. వారి మంచి ఫలితాలు ఏర్పాటు చేయబడిన, సాక్ష్యాధారిత చికిత్స విధానాలను అనుసరించడం ద్వారా పొందబడ్డాయి. ఈ విషయం తెలిసి కూడా కొద్దిమంది రోగులు భిన్నమైన చికిత్స విధానాన్ని అనుసరించమని చర్చించడానికి ప్రయత్నించారు. “ఇన్ని మందులు నేను వాడదలచుకోలేదు” లేదా “ఇన్ని పరీక్షలు నేను చేయించుకోదలచుకోలేదు” అని వారు చెప్పారు. రోగులు తమ స్వంత నిర్ణయాలు తీసుకోవడానికి స్వతంత్రులు, కానీ అనుకూలమైన చికిత్సా విధానాల నుండి వారు ప్రక్కకు తొలగినప్పుడు, వారి ఫలితాలు అడ్డగించబడ్డాయి. గుండె వైఫల్యంతో ఉన్న రోగులు నాసిరకమైన విధానాన్ని ఎంచుకొని, ఆ తర్వాత నాసిరకమైన ఫలితాలు వచ్చాయని వైద్యుడిని నిందించలేరు.
మన విషయంలో కూడా అదే వర్తిస్తుంది. పరలోక తండ్రి నిర్దేశించిన మార్గము మంచి నిత్య ఫలితాలకు దారితీస్తుంది. మనం ఎన్నుకోవడానికి స్వతంత్రులం, కానీ బయల్పరచబడిన మార్గాన్ని అనుసరించకపోవడం వలన కలిగే పర్యవసానాలను మనం ఎంచుకోలేము.19 “ధర్మశాస్త్రమును మీరి, ధర్మశాస్త్రము వలన జీవింపక, దానంతట అదే ధర్మశాస్త్రముగా అగుటకు ప్రయత్నించుచు ఉండునది, … ధర్మశాస్త్రము వలనైనను, కరుణ, న్యాయము, తీర్పువలననైనను పరిశుద్ధపరచబడలేదు20 అని ప్రభువు చెప్పారు. పరలోక తండ్రి మార్గం నుండి ప్రక్కకు తొలగి, ఆ తర్వాత నాసిరకమైన ఫలితాలు వచ్చాయని మనం ఆయనను నిందించలేము.
యువతుల ఇతివృత్తంలో రెండవ పేరాలో ఇలా చదువుతాము: “యేసు క్రీస్తు యొక్క శిష్యురాలిగా, నేను ఆయనవలే అగుటకు ప్రయాసపడతాను. వ్యక్తిగత బయల్పాటును నేను వెదకి, ఆ ప్రకారము చేసి, ఆయన పరిశుద్ధ నామములో ఇతరులకు పరిచర్య చేస్తాను.” విశ్వాసంతో పనిచేస్తూ మనం యేసు క్రీస్తు గురించి సాక్ష్యాన్ని వృద్ధిచేయగలము.21 “యేసు క్రీస్తు దేవుని కుమారుడని, ఆయన లోకపాపముల కొరకు సిలువ వేయబడెనని తెలుసుకోవడానికి” మనం ఆత్మీయ బహుమానాన్ని కోరగలము. లేదా మనకై మనం తెలుసుకొనే వరకు తెలుసుకున్న వారి మాటలను నమ్మే బహుమానాన్ని మనం పొందగలము.22 మనం రక్షకుని బోధనలను అనుసరించగలము మరియు ఇతరులు ఆయన యొద్దకు రావడానికి సహాయపడగలము. ఈ విధంగా, మనం ఆయన కార్యములో ఆయనతో చేరుతాం.23
“నేను అన్ని సమయాలందు, అన్ని విషయాలందు, అన్ని స్థలములందు దేవునికి ఒక సాక్షిగా నిలబడతాను,” అని యువతుల ఇతివృత్తం కొనసాగుతుంది. అపొస్తలులు మరియు డెబ్బదులు క్రీస్తు నామమునకు ప్రత్యేక సాక్షులుగా నియమించబడినప్పటికీ,25 సంఘ సభ్యులందరు దేవునికి సాక్షులుగా ఉండడం అవసరం.24 గోల్ కీపర్ మాత్రమే గోల్‌ను కాపాడుతున్న ఒక హాకీ ఆటను ఊహించుకోండి. జట్టులోని ఇతర ఆటగాళ్ళ సహాయం లేకుండా, గోల్ కీపర్ తగినంతగా గోల్‌ను కాపాడలేడు మరియు జట్టు ఎప్పుడూ ఓడిపోతుంది. అలాగే, ప్రభువు యొక్క జట్టులో ప్రతీఒక్కరూ అవసరం.26
“ఉన్నతస్థితి కొరకు అర్హురాలినగుటకు నేను ప్రయాసపడినప్పుడు, పశ్చాత్తాపము యొక్క బహుమానాన్ని నేను ఆనందిస్తాను మరియు ప్రతీరోజు మెరుగుపడాలని కోరతాను,” అని యువతుల ఇతివృత్తం యొక్క చివరి పేరా మొదలవుతుంది. రక్షకుని ప్రాయశ్చిత్త త్యాగము వలన మనం పశ్చాత్తాపపడగలము, మన తప్పుల నుండి నేర్చుకోగలము మరియు వాటి చేత ఖండించబడము. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా బోధించారు: “చాలామంది జనులు పశ్చాత్తాపమును ఒక శిక్షగా పరిగణిస్తారు. … కానీ శిక్ష విధించబడినట్లు కలిగే ఈ భావము సాతాను ద్వారా కల్పించబడింది. స్వస్థపరచుటకు, క్షమించుటకు, శుద్ధిచేయుటకు, బలపరచుటకు, నిర్మలము చేయుటకు మరియు పవిత్రము చేయుటకు సమ్మతితో, ఆశతో తన బాహువులు తెరచి నిలబడియున్న యేసు క్రీస్తు వైపునకు మనం చూడకుండా అడ్డుపడుటకు సాతాను ప్రయత్నిస్తాడు.”27
మనం ఏమి చేసినప్పటికీ, అది ఎంత తీవ్రమైనప్పటికీ లేదా మనం ఎన్నిసార్లు దాన్ని మళ్ళీ మళ్ళీ చేసినప్పటికీ, మనం మనఃపూర్వకంగా పశ్చాత్తాపపడినప్పుడు ఎటువంటి ఆత్మీయ మచ్చ మిగలదు.28 ఎంత తరచుగా మనం పశ్చాత్తాపపడి, నిజమైన ఉద్దేశ్యంతో క్షమాపణ కోరతామో అంత తరచుగా మనం క్షమించబడగలము.29 మన రక్షకుడైన యేసు క్రీస్తు నుండి ఎంత గొప్ప బహుమానమది!30 మనం క్షమించబడ్డామని పరిశుద్ధాత్మ మనకు అభయమివ్వగలడు. మనం ఆనందాన్ని, శాంతిని అనుభవించినప్పుడు31 అపరాధ భావన తొలగిపోతుంది,32 ఇకపై మనం మన పాపము చేత బాధించబడము.33
మనఃపూర్వకంగా పశ్చాత్తాపపడిన తర్వాత కూడా మనం తప్పులు చేస్తాం. తప్పులు చేయడం అంటే అర్థం పశ్చాత్తాపము తగినంతగా లేదని కాదు, అది కేవలం మానవ బలహీనతను చూపుతుంది. “ప్రభువు తిరుగుబాటును చూసే దానికంటే భిన్నంగా బలహీనతను [చూస్తారు]” అని తెలుసుకోవడం ఎంతో ఓదార్పునిస్తుంది. మన బలహీనతలలో మనకు సహాయం చేయడానికి రక్షకుని సామర్థ్యాన్ని మనం సందేహించకూడదు, ఎందుకంటే “ప్రభువు బలహీనతల గురించి మాట్లాడినప్పుడు, అది ఎల్లప్పుడూ కరుణతో కూడినదైయుంటుంది.”34
“విశ్వాసముతో నేను నా గృహమును, కుటుంబమును బలపరుస్తాను, పరిశుద్ధ నిబంధనలను చేసి పాటిస్తాను, పరిశుద్ధ దేవాలయము యొక్క విధులను, దీవెనలను పొందుతాను” అని యువతుల ఇతివృత్తం ముగుస్తుంది. గృహమును, కుటుంబమును బలపరచడం అంటే అర్థము విశ్వాసమనే గొలుసులో మొదటి కొక్కెమునకు నకలుగా విశ్వాసపు వారసత్వాన్ని కొనసాగించడం లేదా దానిని పునరుద్ధరించడం కావచ్చు.35 దానితో సంబంధం లేకుండా, యేసు క్రీస్తు నందు విశ్వాసం ద్వారా మరియు పరిశుద్ధ నిబంధనలు చేయడం ద్వారా బలం వస్తుంది.
మనం ఎవరమో మరియు ఎక్కడ ఉండేవారమో అని దేవాలయంలో మనం నేర్చుకుంటాము. రోమన్ తత్వవేత్త సిసిరో ఇలా చెప్పాడు, “మీరు పుట్టకముందు ఏమి జరిగిందనే దాని జ్ఞానము లేకపోవడం అంటే ఎప్పటికీ చిన్నపిల్లగానే ఉండిపోవడం.”36 అతడు లౌకిక చరిత్రను ఉదహరిస్తున్నప్పటికీ, వివేకవంతమైన అతని పరిశీలన విస్తరింపబడగలదు. దేవాలయాల్లో పొందబడే నిత్య దృష్టి గురించి మనకు తెలియకపోతే మనం ఎప్పటికీ చిన్నపిల్లలుగానే జీవిస్తాము. అక్కడ మనం ప్రభువు నందు ఎదుగుతాము, “పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణతను పొందుతాము,”37 మరియు రక్షకుని శిష్యులుగా మరింత సంపూర్ణంగా నిబద్ధులమవుతాము.38 మనం మన నిబంధనలను పాటించినప్పుడు, మన జీవితాలలో దేవుని యొక్క శక్తిని మనం పొందుతాము.39
మీ జీవితాన్ని యేసు క్రీస్తుపై కేంద్రీకరించమని మరియు యువతుల ఇతివృత్తంలోని మూలాధార సత్యాలను గుర్తుంచుకోమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీకు సమ్మతమైతే, పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయనకు వారసులు అవ్వమని మరియు ఆయన కలిగియున్న దానంతటిని పొందమని మన పరలోక తండ్రి మిమ్మల్ని కోరుతున్నారు.40 దానికి మించి ఆయన మీకు ఇవ్వలేరు. అంతకుమించి ఆయన మీకు వాగ్దానం చేయలేరు. మీకు తెలిసిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మరియు మీరు ఈ జీవితంలో, రాబోయే జీవితంలో సంతోషంగా ఉండాలని కోరుతున్నారు. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.