క్రీస్తు మరియు ఆయన సువార్త పట్ల ఆశ్చర్యము
మన కన్నులు చూసిన మరియు మన హృదయాలు అనుభవించిన వాటి జ్ఞాపకం రక్షకుని ప్రాయశ్చిత్త త్యాగం పట్ల మన ఆశ్చర్యాన్ని పెంచేలా చేయును గాక.
తెలివైన, పదవీ విరమణ చేసిన విశ్వవిద్యాలయ ఆచార్యుడు, ఫలవంతమైన రచయిత మరియు అన్నిటిని మించి, యేసు క్రీస్తు యొక్క నిబద్ధత గల శిష్యుడైన ఒక మంచి స్నేహితుడ్ని నేను కలిగియున్నాను. అతడు సమావేశాలలో పాల్గొనడానికి, విద్యా పరిశోధన నిర్వహించడానికి మరియు పర్యటనలకు నాయకత్వం వహించడానికి కొన్ని డజన్లసార్లు పవిత్ర భూమిని సందర్శించాడు. అతడు చెప్పినదాని ప్రకారం, యేసు నడిచిన భూమిని స౦దర్శి౦చిన ప్రతిసారీ అతడు ఆశ్చర్యపోతాడు, ఎ౦దుక౦టే నిస్స౦దేహ౦గా రక్షకుని గురించి, ఆయన మర్త్య పరిచర్య మరియు ఆయన ప్రియమైన స్వదేశ౦ గురి౦చి ఏదో ఒక క్రొత్త, ఆశ్చర్యకరమైన మరియు మనోహరమైన దాన్ని అతడు నేర్చుకు౦టాడు. నా స్నేహితుడు పవిత్ర భూమిలో నేర్చుకున్నదానంతటి గురించి మాట్లాడినప్పుడు చూపించే ఆశ్చర్యము సంక్రమితమైనది; ఆయన జీవిత౦లో సాధి౦చిన గొప్ప విజయాలు, విద్యాస౦బ౦ధిత కార్యకలాపాల్లో ఈ ఆశ్చర్య౦ ప్రాథమిక౦గా ఉంటుంది.
నేను అతని అనుభవాలను విని, అతని ఉత్సాహాన్ని అనుభవించినప్పుడు, యేసు క్రీస్తు యొక్క సువార్త గురించి, అది మన శిష్యరికంలో మరియు నిత్య జీవం వైపు మన ప్రయాణంలో కలిగించే మార్పు కొరకు మనం ఎంత ఎక్కువ ఆధ్యాత్మిక అద్భుతమును అనుభూతి చెందగలమో మరియు చెందాలో అనేదానిపై నేను ప్రతిబింబించాను. నేను ప్రస్తావి౦చే ఆశ్చర్య౦, రక్షకుడు మరియు ఆయన బోధనలపై హృదయపూర్వక౦గా తమ జీవితాలను కే౦ద్రీకరిస్తున్న వారికి, తమ జీవితాల్లో ఆయన ఉనికిని వినయ౦గా గుర్తి౦చే వారందరికీ సర్వసాధారణ౦గా కలిగే భావోద్వేగ౦, విస్మయం లేదా ఆశ్చర్య౦. పరిశుద్ధాత్మ ప్రభావ౦తో ప్రేరేపి౦చబడిన అలా౦టి ఆశ్చర్యభావ౦ క్రీస్తు సిద్ధా౦తాన్ని ఆన౦ద౦గా జీవి౦చే ఉత్సాహాన్ని ప్రేరేపిస్తు౦ది.1
ఈ ఉద్వేగం ఏవిధంగా ప్రత్యక్షపరచబడుతుంది అనడానికి లేఖనాలలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకు, ప్రవక్తయైన యెషయా, ప్రభువునందు ఆనందించుట ద్వారా ఆయనకు కృతజ్ఞతాభావాన్ని వ్యక్త౦ చేసాడు.2 కపెర్నహూములోని సమాజమ౦దిర౦లో యేసు ప్రకటి౦చడాన్ని విన్నవారు ఆయన సిద్ధా౦తాన్ని మరియు బలంగా ఆయన బోధి౦చిన విధానాన్ని చూసి ఆశ్చర్యపోయారు.3 యౌవనుడైన జోసెఫ్ స్మిత్ బైబిలులో యాకోబు మొదటి అధ్యాయము నుండి చదివినప్పుడు, ఈ భావన అతడిపై శక్తివంతమైన ప్రభావం చూపించింది.4
నా సహోదర సహోదరీలారా, మన౦ నిజ౦గా యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త గురించి ఆశ్చర్యములో ఉన్నప్పుడు, మన౦ స౦తోష౦గా ఉంటాము, దేవుని పనిపట్ల మనకు మరి౦త ఉత్సాహ౦ కలుగుతుంది మరియు అన్ని విషయాల్లో ప్రభువు హస్తాన్ని మనం గుర్తిస్తాము. అదనంగా, దేవుని మాటల గురించి మన అధ్యయనం మరింత అర్థవంతముగా ఉంటుంది; మన ప్రార్థనలు మరింత ఉద్దేశపూర్వకంగా ఉంటాయి; మన ఆరాధన మరింత భక్తిపూర్వకముగా ఉంటుంది; దేవుని రాజ్యంలో మన సేవ మరింత శ్రద్ధతో కూడినదైయుంటుంది. పరిశుద్ధాత్మ ప్రభావము మన జీవితాల్లో తరచుగా ఉండడానికి ఈ చర్యలన్నీ దోహదం చేస్తాయి.5 ఆ విధంగా, రక్షకుడు మరియు ఆయన సువార్తను గూర్చి మన సాక్ష్యం బలపడుతుంది, మనం క్రీస్తు మనలో జీవించునట్లు చేస్తాము,6 మరియు మనం “ఆయనలో స్థిరపరచబడి, నిర్మించబడి, విశ్వాసంలో నెలకొల్పబడి, … కృతజ్ఞతతో దానిలో సమృద్ధిగా ఉండి”7 మన జీవితాలను జీవిస్తాము. మనం ఈ విధంగా జీవించినప్పుడు, మనం ఆధ్యాత్మికంగా మరింత హుషారుగా ఉంటాము మరియు ఆధ్యాత్మిక ఉదాసీనత యొక్క ఉచ్చులో పడకుండా రక్షించబడతాము.
అటువంటి ఉదాసీనత ప్రభువు యొక్క సువార్తలో పూర్తిగా నిమగ్నమవ్వాలనే మన ఉత్సాహాన్ని క్రమంగా కోల్పోవడం ద్వారా వర్గీకరించబడుతుంది. ఈ జీవితంలో మన ఆనందానికి అవసరమైన అన్నిరకాల జ్ఞానం మరియు ఆశీర్వాదాలను మనం ఇప్పటికే పొందినట్లు భావిస్తున్నప్పుడు ఇది సాధారణంగా ప్రారంభమవుతుంది. ఈ ఆత్మసంతృప్తి మనం సువార్త బహుమానాలను తేలికగా తీసుకునేలా చేస్తుంది మరియు అప్పటి నుండి, యేసు క్రీస్తు సువార్త యొక్క ఆవశ్యకమైన విషయాలలో మనం క్రమం తప్పకుండా మునిగిపోవడం8 మరియు మనం చేసిన నిబంధనలు రెండింటినీ విస్మరించే ప్రమాదం ఉంది. తత్ఫలితంగా, “ఆయనను వినే”9 మన సామర్థ్యాన్ని బలహీనపరుస్తూ, ఆయన పని యొక్క గొప్పతనం పట్ల ఉదాసీనంగా మరియు సున్నితంగా మారుతూ మనం క్రమంగా ప్రభువు నుండి దూరమవుతాము. మనము ఇప్పటికే పొందిన సత్యాల గురించిన సందేహం మన మనస్సులో మరియు హృదయంలో ప్రవేశించి, అపవాది యొక్క శోధనలచేత హాని కలిగిస్తుంది.10
పాస్టర్ ఐడెన్ విల్సన్ టోజర్, ప్రఖ్యాత రచయిత మరియు సాహసోపేత క్రైస్తవుడు ఇలా వ్రాసాడు, “సంతృప్తి అనేది అన్నివిధాలైన ఆధ్యాత్మిక అభివృద్ధికి ఘోరమైన శత్రువు.”11 క్రీస్తు జన్మించిన కొద్దికాలానికే నీఫై జనులకు సరిగ్గా ఇదే జరిగింది కదా? వారు “పరలోకము నుండి ఇవ్వబడిన సూచకక్రియ లేదా అద్భుతము యెడల అతితక్కువగా ఆశ్చర్యపడసాగిరి, [అపనమ్మకముతో] వారు విని మరియు చూచిన సమస్తమును సంశయించసాగిరి.” ఆ విధముగా సాతాను “వారి కన్నులను గ్రుడ్డిగా చేసి, క్రీస్తు సిద్ధాంతము మూర్ఖమైనదని, వ్యర్థమైనదని విశ్వసించుటకు వారిని నడిపించి వేసెను.”12
నా ప్రియమైన సహోదర సహోదరీలారా, రక్షకుడు తన పరిపూర్ణమైన మరియు అనంతమైన ప్రేమలో, మన మానవ స్వభావాన్ని ఎరిగియుండి13, ఆధ్యాత్మిక ఉదాసీనత యొక్క ఉచ్చులో పడకుండా ఉండేందుకు మనకు మార్గాన్ని ఏర్పాటు చేసారు. రక్షకుని ఆహ్వానం, ముఖ్యంగా మనం జీవిస్తున్న సంక్లిష్ట ప్రపంచాన్ని పరిగణనలోకి తీసుకొని మనకు విస్తృతమైన దృక్పథాన్ని ఇస్తుంది: “నా నుండి నేర్చుకొనుము, నా మాటలను వినుము; నా ఆత్మ యొక్క సాత్వీకములో నడువుము మరియు నా యందు నీవు శాంతిని కలిగియుందువు.”14 రక్షకుని ఆహ్వానాన్ని మనం అంగీకరించినప్పుడు, మనం మన వినయాన్ని, బోధింపబడగలిగే వారిగా ఉండాలనే మన కోరికను మరియు ఆయనలా మరింతగా మారాలనే మన నిరీక్షణను ప్రదర్శిస్తాము.15 ఈ ఆహ్వానంలో ఆయనను సేవించడం మరియు దేవుని పిల్లలకు “[మన] పూర్ణ హృదయము, శక్తి, మనస్సు మరియు బలముతో”16 పరిచర్య చేయడం కూడా ఇమిడి ఉంది. ఈ ప్రయాణంలో మన ప్రయత్నంలో ప్రధానమైనవి రెండు గొప్ప ఆజ్ఞలు: మన దేవుడైన ప్రభువును ప్రేమించడం మరియు మనవలె మన పొరుగువారిని ప్రేమించడం.17
ఈ రకమైన ప్రవర్తన యేసు యొక్క దైవిక గుణములో భాగము మరియు ఆయన తన భూసంబంధమైన పరిచర్య సమయంలో చేసిన ప్రతీదానిలో అది స్పష్టంగా కనిపించింది.18 కాబట్టి, ఉద్దేశపూర్వకంగా మరియు నిజంగా ఆయన వైపు చూడడానికి మరియు ఆయన పరిపూర్ణమైన మాదిరి నుండి నేర్చుకోవడానికి మనల్ని మనం అంకితం చేసుకున్నప్పుడు,19 మనం ఆయనను బాగా తెలుసుకోగలుగుతాము. మనం ఎలా జీవించాలి, మనం ఎటువంటి మాదిరిని చూపించాలి మరియు మనం గైకొనవలసిన ఆజ్ఞలేవి అనేదాని గురించిన అంతిమ ప్రమాణాన్ని మన జీవితాలలో అలవరచుకోవాలనే ఉత్సాహంతో మరియు కోరికతో మనం అభివృద్ధి చెందుతాము. దేవుడు మరియు మన పొరుగువారి పట్ల అదనపు అవగాహన, జ్ఞానం, దైవిక స్వభావం మరియు దయను కూడా మనం పొందుతాము.20 రక్షకుని ప్రభావాన్ని మరియు ప్రేమను అనుభవించే మన సామర్థ్యం మన జీవితాల్లో తీవ్రమవుతుందని, మన విశ్వాసాన్ని, నీతిగా ప్రవర్తించాలనే మన కోరికను, ఆయనను మరియు ఇతరులను సేవించాలనే ప్రేరణను పెంపొందించుకుంటామని నేను మీకు హామీ ఇస్తున్నాను.21 అదనంగా, మర్త్యజీవితంలో మనం అనుభవించే ఆశీర్వాదాలు మరియు సవాళ్ళపట్ల మన కృతజ్ఞతాభావం దృఢంగా మారుతుంది మరియు మన నిజమైన ఆరాధనలో భాగమవుతుంది.22
నా ప్రియమైన స్నేహితులారా, ఇవన్నీ మన సువార్త యొక్క ఆధ్యాత్మిక ఆశ్చర్యాన్ని బలపరుస్తాయి మరియు మనం అనుభవించే పరీక్షలు మరియు సవాళ్ళ మధ్య కూడా ప్రభువుతో మనం చేసే నిబంధనలను ఆనందంగా పాటించడానికి మనల్ని పురికొల్పుతాయి. వాస్తవానికి ఇవి జరగాలంటే, విశ్వాసముతో మరియు నిజమైన ఉద్దేశ్యంతో మనం రక్షకుని బోధనలలో లీనమై ఉండాలి23 మరియు ఆయన లక్షణాలను మన ప్రవర్తనలో, మన జీవితంలో చేర్చడానికి కృషి చేయాలి.24 అదనంగా, మన పశ్చాత్తాపం,25 మన జీవితాలలో ఆయన క్షమాపణను మరియు ఆయన విమోచన శక్తిని కోరడం మరియు ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారా మనం ఆయనకు దగ్గరవ్వాలి. మన స్వంత అవగాహనపై ఆధారపడకుండా, మన పూర్ణ హృదయాలతో ఆయనను విశ్వసిస్తూ, మన మార్గాలన్నిటిలో ఆయనను అంగీకరిస్తే, మన మార్గాలను నిర్దేశిస్తానని ప్రభువు స్వయంగా వాగ్దానం చేసారు.26
నేను ఇటీవల కలుసుకున్న ఒకతని పేరు వెస్, అతడు ఈరోజు సమావేశానికి హాజరయ్యాడు. క్రీస్తు గురించి మరియు ఆయన సువార్త గురించి తెలుసుకోవడానికి క్రీస్తు యొక్క ఆహ్వానాన్ని అతడు అంగీకరించాడు మరియు 27 సంవత్సరాలు నిబంధన మార్గం నుండి తననుతాను దూరం చేసుకున్న తర్వాత ఆయన ప్రేమ యొక్క అద్భుతాన్ని అనుభవించడం ప్రారంభించాడు. ఒక రోజు సువార్తికుడైన ఎల్డర్ జోన్స్ తనను ఫేస్‌బుక్ ద్వారా సంప్రదించాడని, అతడు పనామాలో తనకు మొదట కేటాయించిన సువార్తసేవకు వెళ్ళే ముందు వెస్ ఉన్న ప్రాంతానికి తాత్కాలికంగా నియమించబడ్డాడని అతడు నాతో చెప్పాడు. వెస్ యొక్క వ్యక్తిగత వివరాలను ఎల్డర్ జోన్స్ చూసినప్పుడు, అతడు అప్పటికే సంఘ సభ్యుడిగా ఉన్నాడని తెలియకపోయినప్పటికీ, అతడు పరిశుద్ధాత్మ యొక్క మార్గదర్శకత్వాన్ని అనుభవించాడు మరియు అతను వెంటనే వెస్‌ను సంప్రదించాలని తెలుసుకున్నాడు. అతడు ఈ ప్రేరేపణను వెంటనే అనుసరించాడు. ఈ ఊహించని పరిచయానికి వెస్ ఆశ్చర్యపోయాడు మరియు అతడు నిబంధన మార్గం నుండి దూరంగా ఉన్నప్పటికీ, ప్రభువుకు తన గురించి తెలుసని గ్రహించడం ప్రారంభించాడు.
అప్పటి నుండి, వెస్ మరియు సువార్తికులు తరచుగా సంభాషించడం ప్రారంభించారు. ఎల్డర్ జోన్స్ మరియు అతని సహచరుడు వారానికొకసారి సేవా కార్యక్రమాలు మరియు ఆధ్యాత్మిక సందేశాలను అందించారు, అది వెస్‌కు రక్షకుడు మరియు ఆయన సువార్త పట్ల ఉన్న తన ఆశ్చర్యాన్ని తిరిగి పొందడంలో సహాయపడింది. ఇది సత్యాన్ని గురించిన అతని సాక్ష్యాన్ని మరియు అతడి పట్ల రక్షకుని ప్రేమను పునరుద్ధరించింది. ఆదరణకర్త నుండి వచ్చే శాంతిని వెస్ అనుభవించాడు మరియు అతడు సంఘములోనికి తిరిగి రావడానికి అవసరమైన శక్తిని పొందాడు. ఈ అనుభవం తనను ఆధ్యాత్మికంగా మరియు మానసికంగా తిరిగి జీవంలోకి తీసుకువచ్చిందని మరియు తాను ఎదుర్కొన్న కష్టమైన అనుభవాల కారణంగా సంవత్సరాలుగా పేరుకుపోయిన చేదు భావాలను తొలగించడానికి తనకు సహాయపడిందని అతడు నాకు చెప్పాడు.
నేను ఇంతకుముందు పేర్కొన్న ఆలోచనాపరుడైన ఆచార్య స్నేహితుడు గమనించినట్లుగా, యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త గురించి తెలుసుకోవడానికి ఎల్లప్పుడూ అద్భుతమైనది మరియు మనోహరమైనది ఏదో ఒకటి ఉంటుంది. 27 మనతో సహా, ప్రభువు గురించి తెలుసుకోవాలని మరియు ఆయన మాటలను వారి జీవితాల్లో చేర్చుకోవాలని కోరుకునే వారందరికీ ఆయన అద్భుతమైన వాగ్దానాలు చేసారు. హనోకుతో ఆయన ఇలా చెప్పారు, “ఇదిగో నా ఆత్మ నీమీద [ఉండును], కాబట్టి నీ మాటలన్నిటిని నేను నిర్దోషమైనవిగా యెంచెదను; పర్వతములు నీ యెదుట పారిపోవును, నదులు వాటి మార్గమునుండి మరలును; నీవు నాయందును నేను నీయందును నిలిచియుందుము.”28 తన సేవకుడు, రాజైన బెంజమిన్ ద్వారా ఆయన ఇలా ప్రకటించారు, “మీరు క్రీస్తు యొక్క సంతానమని, ఆయన కుమారులు, కుమార్తెలని పిలువబడుదురు; ఏలయనగా ఈ దినమున ఆయన మిమ్ములను ఆత్మీయముగా కనియున్నాడు; ఆయన నామమందు విశ్వాసము ద్వారా మీ హృదయములు మారినవని మీరు చెప్పుచున్నారు; కావున, మీరు ఆయన ద్వారా జన్మించియున్నారు మరియు ఆయన కుమారులు, కుమార్తెలైయున్నారు.”29
కాబట్టి, రక్షకుని గురించి తెలుసుకోవడానికి మరియు ఆయన మాదిరిని అనుసరించడానికి మనం యథార్థంగా మరియు నిరంతరం కృషి చేస్తున్నప్పుడు, ఆయన దివ్య లక్షణాలు మన మనస్సులలో మరియు హృదయాలలో వ్రాయబడతాయని,30 మనం ఎక్కువగా ఆయనను పోలి ఉంటామని మరియు మనము ఆయనతో నడుస్తామని31 ఆయన నామంలో నేను మీకు వాగ్దానం చేస్తున్నాను.
నా ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసు క్రీస్తు మరియు ఆయన సంపూర్ణమైన, అనంతమైన, పరిపూర్ణమైన ప్రేమ పట్ల మనం నిరంతరం ఆశ్చర్యముతో ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. మన కన్నులు చూసిన మరియు మన హృదయాలు అనుభవించిన వాటి జ్ఞాపకం రక్షకుని ప్రాయశ్చిత్త త్యాగం పట్ల మన ఆశ్చర్యాన్ని పెంచేలా చేయును గాక, ఇది మన ఆధ్యాత్మిక మరియు భావోద్వేగ గాయాల నుండి మనకు స్వస్థత చేకూర్చగలదు మరియు ఆయనకు దగ్గరవ్వడానికి మనకు సహాయపడగలదు. తండ్రి చేతుల్లో ఉన్న మరియు నమ్మకమైన వారి కోసం ఆయన సిద్ధం చేసిన గొప్ప వాగ్దానాలను చూసి మనం ఆశ్చర్యపోదాం:
“పరలోకరాజ్యము, దాని దీవెనలు, నిత్యత్వపు ఐశ్వర్యములు మీవైయున్నవి.
“అన్ని విషయములను కృతజ్ఞతాభావముతో స్వీకరించువాడు మహిమకరముగా చేయబడును.”32
యేసు ప్రపంచం యొక్క విమోచకుడు మరియు ఇది ఆయన సంఘము. మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క విస్మయపరిచే, పవిత్రమైన మరియు ఉన్నతమైన నామంలో ఈ సత్యాల గురించి నేను సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.