సర్వసభ్య సమావేశము
మన హృదయపూర్వకంగా మనం కలిగియున్న సమస్తము
2022 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


14:16

మన హృదయపూర్వకంగా మనం కలిగియున్న సమస్తము

రక్షకుడు మనల్ని పరలోకమువైపు లేవనెత్తాలని మనం కోరుకుంటే, ఆయన పట్ల మరియు ఆయన సువార్త పట్ల మన నిబద్ధత సాధారణంగా లేదా సందర్భానుసారంగా ఉండకూడదు.

ఆయనకు ఒక అర్పణ

ఆయన మన కోసం తన ప్రాణాన్ని అర్పించే కొద్ది రోజుల ముందు, యేసు క్రీస్తు యెరూషలేములోని దేవాలయంలో ఉండి, జనులు దేవాలయపు కానుకపెట్టెలో విరాళాలు వేయడం చూస్తున్నారు. “ధనవంతులైనవారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి,” కానీ, ఒక బీద విధవరాలు వచ్చి, “రెండు కాసులు వేసెను.” ఇది చాలా చిన్న మొత్తం గనుక, ఇది గ్రంథాలలో నమోదు చేసేంత విలువైనది కాదు.

రెండు నాణెములను సమర్పిస్తున్న ఒక విధవరాలు

అయినప్పటికీ, నిష్ప్రయోజనముగా కనిపించే ఈ విరాళం రక్షకుని దృష్టిని ఆకర్షించింది. నిజానికి, అది ఆయనను ఎంతగా ఆకట్టుకుందంటే, “ఆయన తన శిష్యులను పిలిచి–కానుకపెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటె ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను:

“వారందరు తమకు కలిగిన సమృద్ధిలోనుండి వేసిరి గాని, యీమె తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవనమంతయు వేసెనని చెప్పెను.”1

ఈ సరళమైన పరిశీలనతో, తన రాజ్యంలో అర్పణలు ఎలా కొలవబడతాయో రక్షకుడు మనకు బోధించారు మరియు ఇది మనం సాధారణంగా వస్తువులను కొలిచే విధానానికి భిన్నంగా ఉంది. ప్రభువుకైతే, విరాళం విలువ కానుకపెట్టెపై చూపే ప్రభావంతో కాకుండా దాత హృదయంపై చూపే ప్రభావంతో కొలవబడుతుంది.

ఈ నమ్మకమైన విధవరాలిని ప్రశంసిస్తూ, రక్షకుడు మన శిష్యత్వాన్ని దాని వ్యక్తీకరణలన్నింటిలో కొలవడానికి ఒక ప్రమాణాన్ని ఇచ్చారు. మన సమర్పణ పెద్దది కావచ్చు లేదా చిన్నది కావచ్చు, కానీ అది మన హృదయపూర్వకంగా మనం కలిగియున్న సమస్తమై ఉండాలి అని యేసు బోధించారు.

ఈ సూత్రం మోర్మన్ గ్రంథ ప్రవక్తయైన అమలేకి యొక్క అభ్యర్థనలో ప్రతిధ్వనించబడింది: “మీరు ఇశ్రాయేలు పరిశుద్ధుడైన క్రీస్తునొద్దకు రావలెనని, ఆయన రక్షణ యందు, ఆయన విమోచన శక్తి యందు పాలుపొందవలెనని నేను కోరుదును. ఆయన యొద్దకు రండి, మీ పూర్ణాత్మలను ఆయనకు ఒక అర్పణముగా అర్పించుడి.”2

కానీ, ఇది ఎలా సాధ్యము? మనలో చాలామంది మన పూర్ణాత్మలను రక్షకునికి అప్పగించలేమని భావిస్తారు. మన దృష్టిని మరియు ప్రయత్నాలను కోరుకునే అనేక విషయాలు ఇప్పటికే మనకు ఉన్నాయి. మన పూర్ణాత్మలను ప్రభువుకు సమర్పించాలనే మన కోరికలతో జీవితంలోని అనేక అక్కరలను ఎలా సమతుల్యం చేయవచ్చు?

బహుశా మనకున్న సవాలు ఏమిటంటే, సమతుల్యత అంటే పోటీపడుతున్న మన ఆసక్తుల మధ్య మన సమయాన్ని సమానంగా విభజించడం అని మనము భావించడం. ఈ విధంగా చూస్తే, యేసు క్రీస్తు పట్ల మనకున్న నిబద్ధత మన తీరికలేని పనుల జాబితాలో ఇమిడిపోయే అనేక విషయాలలో ఒకటి. కానీ దానిని చూడడానికి బహుశా మరొక మార్గం ఉంది.

సమతుల్యంగా ఉండండి: సైకిల్ త్రొక్కుతున్నట్లుగా

నా భార్య హ్యారియెట్ మరియు నేను కలిసి సైకిల్ తొక్కడాన్ని ఇష్టపడతాం. కలిసి సమయాన్ని గడిపేటప్పుడు కొంత వ్యాయామం చేయడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. మేము సైకిల్ త్రొక్కుతున్నప్పుడు మరియు నేను ఎక్కువగా అలసిపోనప్పుడు, మేము మా చుట్టూ ఉన్న అందమైన ప్రపంచాన్ని ఆనందిస్తాము మరియు ఆహ్లాదకరమైన సంభాషణలో కూడా పాల్గొంటాము. మా సైకిల్‌‌ను సమతుల్యంలో ఉంచుకోవడంపై చాలా అరుదుగా మేము శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మేము దాని గురించి ఆలోచించకుండా చాలాకాలం నుండి సైకిల్ త్రొక్కుతున్నాము, కాబట్టి ఇది మాకు సహజంగా మరియు సాధారణంగా మారింది.

కానీ ఎవరైనా మొదటిసారి సైకిల్ త్రొక్కడం నేర్చుకుంటున్నారని నేను చూసినప్పుడల్లా, ఆ రెండు ఇరుకైన చక్రాలపై మిమ్మల్ని మీరు సమతుల్యంలో ఉంచుకోవడం అంత సులభం కాదని నాకు గుర్తు చేయబడుతుంది. దానికి సమయం పడుతుంది. దానికి సాధన కావాలి. దానికి సహనం కావాలి. ఒకటి లేదా రెండుసార్లు పడిపోవడం కూడా అవసరమే.

అన్నింటికంటే, సైకిల్‌‌ను సమతుల్యంలో ఉంచడంలో విజయం సాధించిన వారు ఈ ముఖ్యమైన చిట్కాలను నేర్చుకుంటారు:

మీ పాదాలను చూడకండి.

ముందుకు చూడండి.

మీ దృష్టిని మీ ముందు ఉన్న రహదారిపై ఉంచండి. మీ గమ్యస్థానంపై దృష్టి పెట్టండి. పెడల్‌ను త్రొక్కడం కొనసాగించండి. సమతుల్యంలో ఉండడం అంటే ముందుకు వెళ్ళడమే.

యేసు క్రీస్తు శిష్యులుగా మన జీవితాల్లో సమతుల్యతను కనుగొనే విషయంలో ఇలాంటి సూత్రాలు వర్తిస్తాయి. మీ అనేక ముఖ్యమైన పనుల మధ్య మీ సమయాన్ని మరియు శక్తిని ఏవిధంగా పంపిణీ చేయాలనేది వ్యక్తిని బట్టి మరియు జీవితంలోని కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కానీ మన సమగ్ర, ఉమ్మడి లక్ష్యం ఏమిటంటే, మన బోధకుడైన యేసు క్రీస్తు మార్గాన్ని అనుసరించడం మరియు మన ప్రియమైన పరలోక తండ్రి సన్నిధికి తిరిగి వెళ్ళడం. మనం ఎవరమైననూ, మన జీవితంలో ఏమి జరుగుతున్ననూ, ఈ లక్ష్యం స్థిరంగా మరియు నిలకడగా ఉండాలి.3

పైకెత్తండి: విమానాన్ని నడుపుతున్నట్లుగా

ఇప్పుడు, సైకిల్‌పై ఆసక్తి ఉన్నవారికి, శిష్యత్వాన్ని సైకిల్ నడపడంతో పోల్చడం సహాయక సారూప్యత కావచ్చు. సైకిల్‌పై ఆసక్తి లేని వారు చింతించకండి. నా దగ్గర మరొక సాదృశ్యము ఉన్నది, ప్రతీ పురుషుడు, స్త్రీ మరియు బిడ్డ దానిని పోల్చుకోగలరని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.

శిష్యరికం, జీవితంలోని చాలా విషయాలవలె, విమానాన్ని నడపడంతో పోల్చబడవచ్చు.

ఒక భారీ ప్రయాణికుల విమానం నిజంగా భూమి నుండి పైకి ఎగరడం ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ఎగిరే యంత్రాలను ఆకాశంలో సొగసుగా ఎగురవేస్తూ, మహాసముద్రాలు మరియు ఖండాలను దాటేలా చేస్తున్నది ఏమిటి?

ఒక్కమాటలో చెప్పాలంటే, విమానం రెక్కలపై గాలి కదులుతున్నప్పుడు మాత్రమే అది ఎగురుతుంది. ఆ కదలిక గాలి పీడనంలో తేడాలను సృష్టిస్తుంది, అది విమానాన్ని పైకిలేపుతుంది. పైకిలేపేంత బలాన్ని సృష్టించడానికి రెక్కల మీదుగా తగినంత గాలిని మీరు ఎలా పొందగలరు? సమాధానం--ముందుకు ఒత్తిడి కలిగించడం.

విమానం రన్‌వేపై కూర్చున్నంత వరకు ఎత్తుగా ఎగురలేదు. గాలులు వీస్తున్న రోజు కూడా, విమానాన్ని వెనుకకు నెట్టి ఉంచే శక్తులను ఎదుర్కోవడానికి తగినంత ఒత్తిడితో అది ముందుకు కదిలేంత వరకు అది పైకి ఎగురదు.

ముందుకుసాగే గతిబలము సైకిల్‌ను సమతుల్యంగా మరియు నిటారుగా ఉంచినట్లే, ముందుకు కదలడం విమానం గురుత్వాకర్షణను మరియు వెనుకకు నెట్టబడే బలాన్ని అధిగమించడంలో సహాయపడుతుంది.

యేసు క్రీస్తు శిష్యులుగా మనకు దీని అర్థం ఏమిటి? మనం జీవితంలో సమతుల్యతను కనుగొనాలనుకుంటే మరియు రక్షకుడు మనల్ని పరలోకానికి ఎత్తాలని మనం కోరుకుంటే, ఆయన పట్ల మరియు ఆయన సువార్త పట్ల మన నిబద్ధత సాధారణంగా లేదా సందర్భానుసారంగా ఉండకూడదు. యెరూషలేములోని విధవరాలి వలె, మనము మన ఆత్మలను ఆయనకు అర్పించాలి. మన సమర్పణ చిన్నదే కావచ్చు, కానీ అది మన హృదయం మరియు ఆత్మ నుండి రావాలి.

యేసు క్రీస్తు యొక్క శిష్యునిగా ఉండుట అనగా నా జీవితంలో ఆయనను మొదటగా ఉంచుట అని అర్థము. రక్షకుడు మనం చేసే ప్రతీదాని వెనుక ప్రేరేపించే శక్తి. మనం వేరే పని చేయనప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక విషయాలను చేయకూడదు. ఆధ్యాత్మిక పనులు చేయడం అనేది మనం అప్పుడప్పుడు ఆనందించే పనిగా ఉండకూడదు. ఆయనే “మార్గమును, సత్యమును, జీవమును; [యేసు క్రీస్తు] ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.”4 అదే మార్గము మరియు మన అంతిమ గమ్యస్థానము.

“క్రీస్తునందు నిలకడతో పరిపూర్ణమైన ప్రకాశవంతమైన నిరీక్షణ కలిగియుండి, దేవుని యొక్కయు మనుష్యులందరి యొక్కయు ప్రేమను కలిగియుండి మీరు శ్రద్ధగా ముందుకు సాగుట”5 వలన సమతుల్యం మరియు పైకి ఎగిరే శక్తి కలుగుతుంది.

త్యాగం మరియు సమర్పణ

మన జీవితాలను తీరికలేకుండా మార్చే అనేక పనులు మరియు బాధ్యతల సంగతేమిటి? ప్రియమైనవారితో సమయం గడపడం, పాఠశాలకు వెళ్ళడం లేదా వృత్తికి సిద్ధపడడం, జీవనోపాధి పొందడం, కుటుంబాన్ని చూసుకోవడం, సమాజంలో సేవ చేయడం—వీటన్నింటిని మనం ఎలా సమతుల్యం చేసుకోవచ్చు? రక్షకుడు మనకు భరోసా ఇస్తున్నారు:

“ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోక తండ్రికి తెలియును.”

“కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.”6

కానీ దానర్థం, అది సులభం అని కాదు.7 దానికి త్యాగం మరియు సమర్పణ రెండూ అవసరము.

అందుకు కొన్ని విషయాలను విడిచిపెట్టడం మరియు ఇతర విషయాలను వృద్ధి చేయడం అవసరం.

త్యాగం మరియు సమర్పణ అనేవి రెండు పరలోక చట్టాలు, వీటిని పాటిస్తామని మనం పవిత్ర దేవాలయంలో నిబంధన చేస్తాము. ఈ రెండు చట్టాలు పోలిక కలిగి ఉంటాయి, కానీ సారూప్యంగా ఉండవు. త్యాగం చేయడం అంటే మరింత విలువైన దాని కోసం ఏదైనా వదులుకోవడం. పూర్వకాలంలో, రాబోయే మెస్సీయ గౌరవార్థం దేవుని ప్రజలు తమ మందలోని తొలిచూలును బలిగా అర్పించారు. చరిత్ర అంతటా, విశ్వాసపాత్రులైన పరిశుద్ధులు రక్షకుని కోసం వ్యక్తిగత కోరికలు, సౌకర్యాలు మరియు తమ జీవితాలను కూడా త్యాగం చేసారు.

యేసు క్రీస్తును పూర్తిగా అనుసరించడానికి మనం త్యాగం చేయవలసిన పెద్ద మరియు చిన్న విషయాలు కలవు.8 మన త్యాగాలు మనం నిజంగా వేటికి విలువిస్తామో చూపుతాయి. త్యాగాలు పవిత్రమైనవి మరియు దేవునిచే గౌరవించబడతాయి.9

సమర్పణ అనేది కనీసం ఒక్క ముఖ్యమైన విషయంలో త్యాగం కంటే భిన్నంగా ఉంటుంది. మనం దేనినైనా సమర్పణ చేసినప్పుడు, బలిపీఠం మీద దహించి వేయబడడానికి దానిని వదిలిపెట్టము. బదులుగా, మనము దానిని ప్రభువు సేవలో ఉపయోగిస్తాము. మనము దానిని ఆయనకు మరియు ఆయన పవిత్ర ప్రయోజనాలకు అంకితం చేస్తాము.10 ప్రభువు మనకు ఇచ్చిన ప్రతిభలను మనం పొందుతాము మరియు వాటిని అనేక రెట్లు పెంచడానికి, ప్రభువు రాజ్యాన్ని నిర్మించడంలో మరింత సహాయకారిగా మారడానికి ప్రయత్నిస్తాము.11

మనలో చాలా కొద్దిమంది మాత్రమే రక్షకుని కోసం తమ జీవితాలను త్యాగం చేయమని అడుగబడతారు. కానీ మన జీవితాలను ఆయనకు సమర్పించమని మనమందరం ఆహ్వానించబడ్డాము.

ఒక పని, ఒక ఆనందం, ఒక ఉద్దేశ్యం

మన జీవితాలను శుద్ధి చేసుకోవడానికి కోరినప్పుడు మరియు ప్రతీ ఆలోచనలో క్రీస్తు వైపు చూస్తున్నప్పుడు12 , మిగతావన్నీ సమలేఖనం కావడం ప్రారంభిస్తాయి. జీవితం ఇకపై బలహీనమై ఉండే తక్కెడలో ఉన్న ప్రత్యేక ప్రయత్నాల యొక్క సుదీర్ఘ జాబితాగా భావించబడదు.

కాలక్రమేణా, మనం చేసే ప్రతిదీ ఒకే పనిగా అవుతుంది.

ఒకే ఆనందం.

ఒకే పరిశుద్ధ ఉద్దేశ్యం.

ఇది దేవుడిని ప్రేమించి, సేవించే కార్యము. ఇది దేవుని పిల్లలను ప్రేమించి, సేవించడము.13

మన జీవితాల్ని చూసి, మనం చేయవలసిన వంద పనులను చూస్తే, ముంచివేయబడినట్లు మనం భావిస్తాము. దేవుడిని మరియు ఆయన పిల్లలను వంద రకాలుగా ప్రేమించడం మరియు సేవించడం అనే ఒక విషయాన్ని మనం చూసినప్పుడు, మనం ఆనందంతో వాటిపై పనిచేయగలము.

మనల్ని వెనక్కి నెట్టివేసే దేనినైనా త్యాగం చేయడం ద్వారా మరియు మిగిలిన వాటిని ప్రభువుకు మరియు ఆయన ఉద్దేశాలకు సమర్పించడం ద్వారా మనం మన పూర్ణాత్మలను సమర్పిస్తాము.

ప్రోత్సాహపు మాట మరియు సాక్ష్యము

నా ప్రియమైన సహోదర, సహోదరీలారా మరియు నా ప్రియమైన స్నేహితులారా, మీరు ఇంకా ఎక్కువ చేయాలని కోరుకునే సందర్భాలు ఉంటాయి. పరలోకంలో ఉన్న మీ ప్రేమగల తండ్రికి మీ హృదయం తెలుసు. మీరు చేయాలని మీ హృదయం కోరినదంతా మీరు చేయలేరని ఆయనకు తెలుసు. కానీ మీరు దేవుడిని ప్రేమించి, సేవించగలరు. ఆయన ఆజ్ఞలను పాటించడానికి మీ వంతు ప్రయత్నము మీరు చేయగలరు. మీరు ఆయన పిల్లలను ప్రేమించి, సేవించగలరు. మీ ప్రయత్నాలు మీ హృదయాన్ని శుద్ధి చేస్తున్నాయి మరియు అద్భుతమైన భవిష్యత్తు కోసం మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాయి.

దేవాలయపు కానుకపెట్టె వద్ద ఉన్న విధవరాలికి ఇది అర్థమైనట్లుంది. తన సమర్పణ ఇశ్రాయేలు యొక్క అదృష్టాన్ని మార్చదని ఆమెకు ఖచ్చితంగా తెలుసు, కానీ అది ఆమెను మార్చి, దీవించగలదు, ఎందుకంటే చిన్న మొత్తము అయినప్పటికీ, అది ఆమెకున్న సమస్తము.

కాబట్టి, నా ప్రియమైన మిత్రులారా మరియు యేసు క్రీస్తు యొక్క ప్రియమైన తోటి శిష్యులారా, “మంచి చేయుట యందు విసుగులేకయుండుడి,” ఏలయనగా మీరు “ఒక గొప్ప కార్యమునకు పునాది వేయుచున్నారు.” చిన్నవిషయముల నుండి “గొప్ప సంగతులు” సంభవించును.14

ఇది నిజమని నేను సాక్ష్యమిస్తున్నాను, యేసు క్రీస్తు మన బోధకుడు, మన విమోచకుడు మరియు పరలోకంలో ఉన్న మన ప్రియమైన తండ్రి వద్దకు తిరిగి వెళ్ళే ఏకైక మార్గం అని కూడా నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో, ఆమేన్.

వివరణలు

  1. మార్కు 12:41-44.

  2. ఓంనై 1:26.

  3. మన పిల్లలు మరియు యౌవనస్థులు యేసు క్రీస్తును అనుసరిస్తూ సమతుల్య మార్గంలో ఎదగాలని ఆహ్వానించబడ్డారు, ఆయన యౌవనస్థుడిగా “జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్థిల్లుచుండెను.” (లూకా 2:52).

  4. యోహాను 14:6.

  5. 2 నీఫై 31:20.

  6. 3 నీఫై 13:32–33; మత్తయి 6:32–33 కూడా చూడండి. జోసెఫ్ స్మిత్ అనువాదం, మత్తయి 6:38 అదనపు అంతర్దృష్టిని అందిస్తుంది: “ఈ లోకవిషయములను వెదుకవద్దు కానీ మీరు మొదట దేవుని రాజ్యమును నిర్మించుటకు, ఆయన నీతిని స్థాపించుటకు వెదకుడి” (మత్తయి 6:33లో, పాదవివరణ ).

  7. ఒక ఉదాహరణ మన ప్రవక్త, అధ్యక్షులైన రస్సెల్ ఎమ్. నెల్సన్ నుండి వచ్చింది. ఆయన గుండె శస్త్రవైద్యునిగా ఉన్నప్పుడు తన వృత్తి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు, ఆయనను స్టేక్ అధ్యక్షునిగా పిలిచారు. ఎల్డర్ స్పెన్సర్ డబ్ల్యు. కింబల్ మరియు ఎల్డర్ లీగ్రాండ్ రిచర్డ్స్ ఆ పిలుపునిచ్చారు. ఆయన వృత్తిపరమైన జీవితంలోని అవసరా‌లను గుర్తించి, వారు ఆయనతో, “మీరు తీరికలేకుండా ఉన్నారని మరియు పిలుపును అంగీకరించకూడదని మీకు అనిపిస్తే, అది మీకున్న విశేషాధికారము” అన్నారు. పిలువబడినప్పుడు సేవ చేయాలా, వద్దా అనే దాని గురించి నా నిర్ణయం చాలాకాలం క్రితం నేను మరియు నా భార్య ప్రభువుతో దేవాలయ నిబంధనలను చేసుకున్నప్పుడే తీసుకున్నానని ఆయన సమాధానం చెప్పారు. “ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుటకు” [మత్తయి 6:33] అప్పుడు మేము ఒక ఒడంబడిక చేసాము, ప్రభువు వాగ్దానం చేసినట్లుగా అన్నియు మాకనుగ్రహింపబడుననే నమ్మకాన్ని భావించాము”(Russell Marion Nelson, From Heart to Heart: An Autobiography [1979], 114).

  8. అధ్యక్షులు నెల్సన్ ఇటీవల మాట్లాడుతూ, “మన జీవితంలోని పాత శిధిలాలను రక్షకుని సహాయంతో మనలో ప్రతీఒక్కరూ తొలగించాల్సిన అవసరం ఉంది. … “మీరు మీ జీవితం నుండి తొలగించాల్సిన శిధిలాలను గుర్తించడానికి ప్రార్థించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, తద్వారా మీరు మరింత యోగ్యత పొందగలరు” అని చెప్పారు (“స్వాగత సందేశము,” లియహోనా, మే 2021, 7).

  9. దేవునికి, మన విజయాల కంటే మన త్యాగాలు చాలా పవిత్రమైనవి అని లేఖనాలు చెబుతున్నాయి (సిద్ధాంతము మరియు నిబంధనలు 117:13 చూడండి). ధనవంతుల సహకారం కంటే విధవరాలి కాసులను ప్రభువు విలువైనవిగా భావించడానికి ఇది ఒక కారణం కావచ్చు. మునుపటిది త్యాగం, అది ఇచ్చేవారిపై శుద్ధి చేసే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. రెండోది, అది మరింత ద్రవ్యపరంగా సాధించినప్పటికీ, అది త్యాగం కాదు, మరియు అది ఇచ్చేవారిని మార్చలేదు.

  10. మనలో చాలా కొద్దిమంది మాత్రమే రక్షకుని కోసం తమ జీవితాలను త్యాగం చేయమని అడుగబడతారు. కానీ మన జీవితాలను ఆయనకు సమర్పించమని మనమందరం ఆహ్వానించబడ్డాము.

  11. మత్తయి 25:14-30 చూడండి.

  12. సిద్ధాంతము మరియు నిబంధనలు 6:36 చూడండి.

  13. ఈ విధంగా, అపొస్తలుడైన పౌలు యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పును మన జీవితంలో మనం చూస్తాము: “ఈ సంకల్పమునుబట్టి ఆయన పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద ఉన్నవే గాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలోతాను నిర్ణయించుకొనెను” (ఎఫెసీయులకు 1:10).

  14. సిద్ధాంతము మరియు నిబంధనలు 64:33.