మనలో ప్రతీఒక్కరికి ఒక కథ ఉంది
దయచేసి రండి, మీ కుటుంబాన్ని, మీ తరాలన్నిటిని కనుగొని, వారిని ఇంటికి తీసుకురండి.
స్నేహితులారా, సహోదర సహోదరీలారా, మనలో ప్రతీఒక్కరికి ఒక కథ ఉంది. మన కథను మనం తెలుసుకున్నప్పుడు, మనం సంబంధం కలిగియుంటాము, చెందియుంటాము, అవుతాము.
నా పేరు గెరిట్ వాల్టర్ గాంగ్. గెరిట్ అనేది డచ్ పేరు, వాల్టర్ (మా నాన్న పేరు) అనేది అమెరికన్ పేరు మరియు గాంగ్ అనేది చైనీయుల పేరు.
నిపుణుల అంచనా ప్రకారం 7000–11000 కోట్లమంది జనులు భూమిపైన జీవించారు. బహుశా ఒకరికే గెరిట్ వాల్టర్ గాంగ్ అని పేరు పెట్టబడింది.
మనలో ప్రతీఒక్కరికి ఒక కథ ఉంది. “the rain on my face and the wind as it rushes by” అనే పాట నాకిష్టం.1 అంటార్క్‌టికాలో పెంగ్విన్‌లతోపాటు నేను ఊగిసలాడుతూ నడిచాను. గ్వాటమాలాలోని అనాథలకు, కంబోడియాలోని వీధిబాలలకు, ఆఫ్రికన్ మారాలోని మాసాయ్ స్త్రీలకు వారి మొదటి స్వీయ చిత్రాన్ని నేను ఇచ్చాను.
మా పిల్లలలో ప్రతీఒక్కరు పుట్టినప్పుడు నేను ఆసుపత్రి దగ్గర వేచియున్నాను—ఒకసారి డాక్టరు నన్ను సహాయం చేయనిచ్చారు.
నేను దేవుడిని నమ్ముతాను. “[మనము] సంతోషము కలిగియుండునట్లు [మనము] ఉనికి లోనికి వచ్చామని,”2 ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదని నేను నమ్ముతాను.3
మీ కథ మీకు తెలుసా? మీ పేరుకు అర్థమేమిటి? ప్రపంచ జనాభా 1820లో 110 కోట్ల నుండి 2020లో సుమారు 780 కోట్లకు పెరిగింది.4 1820వ సంవత్సరం చరిత్రలో ముఖ్యమైన సమయంగా అనిపిస్తోంది. 1820 తర్వాత పుట్టిన చాలామంది తమ కుటుంబంలో అనేక తరాలను గుర్తించడానికి తగిన గ్రంథాలను, సజీవ వ్యక్తులను కలిగియున్నారు. ఒక తాత, మామ్మతో లేదా ఇతర కుటుంబ సభ్యులతో గల ఒక ప్రత్యేకమైన మధుర జ్ఞాపకం గురించి మీరు ఆలోచించగలరా?
భూమిపైన జీవించిన మొత్తం వ్యక్తుల సంఖ్య ఏదైనప్పటికీ, అది పరిమితమైనది, ఒకసారి ఒక వ్యక్తి చొప్పున లెక్కింపదగినది. మీరు, నేను, ప్రతీఒక్కరు ముఖ్యమే.
దయచేసి దీనిని పరిగణించండి: మనకు వారి గురించి తెలిసినా, తెలియకపోయినా, మనలో ప్రతీఒక్కరం ఒక అమ్మకు నాన్నకు పుట్టాము. మరియు ప్రతీ అమ్మ, నాన్న మరొక అమ్మకు నాన్నకు పుట్టారు.5 పుట్టుక లేదా దత్తత వంశక్రమము చేత, అంతిమంగా మానవ కుటుంబంలో మరియు దేవుని కుటుంబంలో మనం అందరం సంబంధం కలిగియున్నాము.
క్రీ.శ. 837లో పుట్టిన మా 30వ ముత్తాతయైన మొదటి డ్రాగన్ గాంగ్, దక్షిణ చైనాలో మా కుటుంబ గ్రామాన్ని ప్రారంభించారు. మొదటిసారి నేను గాంగ్ గ్రామానికి వెళ్ళినప్పుడు, జనులు “Wenhan huilaile” (“గెరిట్ తిరిగివచ్చాడు”) అన్నారు.
మా అమ్మగారి వైపు, మా సజీవ కుటుంబ వృక్షంలో వేలకొలది ఇంటి పేర్లు ఉన్నాయి, ఇంకా ఎన్నో కనుగొనవలసి ఉంది.6 మాలో ప్రతీఒక్కరం సంబంధం కలిగియుండవలసిన కుటుంబం ఇంకా చాలా ఉంది. మీ బంధువొకరు మీ కుటుంబ వంశావళి మొత్తాన్ని పూర్తిచేసారని మీరు అనుకుంటే, దయచేసి మీ బంధువులను మరియు బంధువుల బంధువులను కనుగొనండి. FamilySearch ఇప్పుడు ఆన్‌లైన్ సంగ్రహంలో కలిగియున్న దాని 1000 కోట్ల శోధింపదగిన పేర్లతో మరియు దాని కుటుంబ వృక్షంలోని 130 కోట్లమంది వ్యక్తులతో సజీవంగా ఉన్న మీ ఇంటి పేర్లను జతచేయండి.7
ఒక సజీవ వృక్షాన్ని గీయమని స్నేహితులను లేదా కుటుంబాన్ని అడగండి. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించినట్లుగా, సజీవ వృక్షాలు వేర్లను మరియు కొమ్మలను కలిగియున్నాయి.8 మీరు—తెలిసిన మీ మొదటి లేదా 10వ తరమైనప్పటికీ, రేపటి కోసం నిన్నటిని జతచేయండి. సజీవంగా ఉన్న మీ కుటుంబ వృక్షంలో వేర్లను, కొమ్మలను జతచేయండి.9
“మీరు ఎక్కడి నుండి వచ్చారు?” అనే ప్రశ్న వంశక్రమాన్ని, జన్మస్థలాన్ని, మాతృదేశాన్ని లేదా స్వదేశాన్ని అడుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా, మాలో 25 శాతం మంది చైనాను, 23 శాతం మంది ఇండియాను, 17 శాతం మంది ఇతర ఆసియా పసిఫిక్‌ను, 18 శాతం మంది యూరోపును, 10 శాతం మంది ఆఫ్రికాను మరియు 7 శాతం మంది అమెరికాలను మా స్వదేశంగా గుర్తించాము.10
“మీరు ఎక్కడి నుండి వచ్చారు?” అనే ప్రశ్న మన దైవిక గుర్తింపును, జీవితంలో ఆత్మీయ ఉద్దేశ్యాన్ని కనుగొనమని కూడా మనల్ని ఆహ్వానిస్తుంది.
మనలో ప్రతీఒక్కరికి ఒక కథ ఉంది.
నాకు తెలిసిన ఒక కుటుంబము కెనడాలోని విన్నిపెగ్‌లో వారి పాత ఇంటికి వెళ్ళినప్పుడు, వారి కుటుంబంలోని ఐదు తరాలతో జతచేయబడ్డారు. అక్కడ, తమ కుటుంబాన్ని శాశ్వతంగా మార్చివేస్తూ ఇద్దరు సువార్తికులు (ఆయన వారిని పరలోక దూతలని పిలిచారు) యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్తను తెచ్చిన రోజు గురించి తాత తన మనవళ్ళకు చెప్పాడు.
వారి తాతమ్మను ఆమె చిన్ననాటి అనుభవాల గురించి అడగమని నాకు తెలిసిన ఒక తల్లి తన పిల్లలను మరియు వారి బంధువులను ఆహ్వానించింది. తాతమ్మ సాహసాలు మరియు జీవిత పాఠాలు ఇప్పుడు తరతరాలను కలిపే అమూల్యమైన కుటుంబ పుస్తకమయ్యాయి.
నాకు తెలిసిన ఒక యువకుడు “నాన్న దినచర్య పుస్తకాన్ని” సంగ్రహిస్తున్నాడు. చాలా సంవత్సరాల క్రితం, ఒక కారు అతని తండ్రిని గుద్ది చంపేసింది. ఇప్పుడు, తన తండ్రి గురించి తెలుసుకోవడానికి ఈ ధీర యువకుడు కుటుంబము మరియు స్నేహితుల నుండి చిన్ననాటి జ్ఞాపకాలను, కథలను భద్రపరుస్తున్నాడు.
జీవితానికి అర్థం ఎక్కడ వస్తుందని అడుగబడినప్పుడు, ఎక్కువమంది మొదటి స్థానాన్ని కుటుంబానికి ఇచ్చారు.11 ఇది జీవించియున్న మరియు మరణించిన కుటుంబాన్ని కలిపియుంది. మనం చనిపోయినప్పుడు, మనం ఉనికిలో లేకుండా పోము. మనం తెరకు అవతలి వైపు జీవించడాన్ని కొనసాగిస్తాము.
ఇంకా బ్రతికియున్నట్లుగానే మన పూర్వీకులను గుర్తుంచుకోవాలి.12 నోటితో చెప్పిన చరిత్రలు, వంశ గ్రంథాలు, కుటుంబ కథలు, జ్ఞాపకచిహ్నాలు లేదా గుర్తుంచుకొనే ప్రదేశాలు, వేడుకలలోని ఫోటోలు, ఆహారాలు లేదా ప్రియమైన వారిని మనకు గుర్తు చేసే వస్తువుల ద్వారా మన వారసత్వాన్ని మనం గుర్తుంచుకుంటాము.
మీరు నివసించే ప్రదేశం గురించి ఆలోచించండి—సేవ మరియు త్యాగం చేసిన పూర్వీకులు, కుటుంబము, ఇతరులను మీ దేశం మరియు సమాజం జ్ఞాపకముంచుకోవడం మరియు గౌరవించడం అద్భుతం కాదా? ఉదాహరణకు, ఇంగ్లండులో డివన్షైర్‌లోని సౌత్ మౌల్టన్‌లో శరదృతువు యొక్క కోత స్మరణ సమయంలో, తరతరాలుగా మా బాడెన్ పూర్వీకులు నివసించిన సమాజాన్ని, చిన్న సంఘాన్ని కనుగొనడాన్ని సహోదరి గాంగ్ మరియు నేను ఇష్టపడ్డాము. దేవాలయము మరియు కుటుంబ చరిత్ర కార్యము13 ద్వారా పరలోకాలను తెరవడం చేత మరియు మన తరతరాల గొలుసులో ఒక కొక్కెముగా14 కావడం చేత మనం మన పూర్వీకులను గౌరవిస్తాము.15
“నేను అనే స్వార్థం” ఉన్న ఈ కాలంలో, తరతరాలు అర్థవంతమైన విధానాల్లో జత కలిసినప్పుడు సమాజాలు లబ్ధిపొందుతాయి. రెక్కలు కావాలంటే మనకు వేర్లు—నిజమైన అనుబంధాలు, అర్థవంతమైన సేవ, అశాశ్వతమైన సామాజిక మాధ్యమ మెరుపులను మించిన జీవితం కావాలి.
మన పూర్వీకులతో సంబంధం కలిగియుండడం మన జీవితాలను ఆశ్చర్యకరమైన రీతిలో మార్చగలదు. వారి కష్టాలు మరియు విజయాల నుండి మనం విశ్వాసాన్ని, బలాన్ని పొందుతాము.16 వారి ప్రేమ మరియు త్యాగాల నుండి మనం క్షమించడాన్ని, ముందుకు సాగడాన్ని నేర్చుకుంటాము. మన పిల్లలు హుషారుగా మారతారు. మనం రక్షణను, శక్తిని పొందుతాము. పూర్వీకులతో బంధాలు కుటుంబ అన్యోన్యతను, కృతజ్ఞతను, అద్భుతాలను పెంచుతాయి. అటువంటి బంధాలు తెరకు అవతలి వైపు నుండి సహాయాన్ని తీసుకురాగలవు.
కుటుంబాలలోకి ఆనందాలు వచ్చినట్లే, బాధలు వస్తాయి. ఏ వ్యక్తి పరిపూర్ణుడు కాడు, ఏ కుటుంబము పరిపూర్ణము కాదు. మనల్ని ప్రేమించి, పోషించి, రక్షించవలసిన వారు అలా చేయడంలో విఫలమైనప్పుడు, మనం విడిచిపెట్టబడినట్లుగా, కలవరంగా, బాధింపబడినట్లుగా భావిస్తాము. కుటుంబం చిల్లపెంకుగా మారగలదు. అయినప్పటికీ, పరలోకపు సహాయంతో మనం మన కుటుంబాన్ని అర్థం చేసుకోగలము మరియు ఒకరితో ఒకరం సమాధానపడగలము.17
కొన్నిసార్లు స్థిరమైన కుటుంబ బంధాల పట్ల దృఢమైన నిబద్ధత కష్టమైన వాటిని సాధించడానికి మనకు సహాయపడుతుంది. కొన్ని సందర్భాలలో, సమాజము కుటుంబంగా మారుతుంది. తరచు స్థలమార్పు చేస్తూ శ్రమలలో ఉన్న కుటుంబాన్ని కలిగియున్న ఒక విశేష యువతి తాను ఎక్కడ ఉన్నా తనను పోషించి, స్థలమిచ్చే ప్రియమైన సంఘ కుటుంబాన్ని కనుగొంది. జన్యుపరమైన మరియు కుటుంబ మాదిరులు ప్రభావం చూపిస్తాయి, కానీ మనల్ని నిర్ధారించవు.
మన కుటుంబాలు సంతోషంగా, శాశ్వతంగా ఉండాలని దేవుడు కోరుతున్నారు. మనం ఒకరిని ఒకరం బాధపెట్టుకుంటే, శాశ్వతం అనేది సుదీర్ఘమైనది. ప్రేమతో కూడిన బంధాలు ఈ జీవితంతోనే ఆగిపోతే, సంతోషం అనేది చాలా చిన్నది. పరిశుద్ధ నిబంధనల ద్వారా, యేసు క్రీస్తు మనల్ని మార్చడానికి తన ప్రేమ, శక్తి మరియు కృపను అందిస్తారు 18 మరియు మన బంధాలను స్వస్థపరుస్తారు. ప్రియమైన వారి కొరకు చేసే నిస్వార్థమైన దేవాలయ సేవ మన రక్షకుని యొక్క ప్రాయశ్చిత్తాన్ని మన కొరకు, వారి కొరకు నిజం చేస్తుంది. పరిశుద్ధపరచబడి, మనం నిత్యము ఏకం చేయబడిన కుటుంబాలుగా దేవుని సమక్షానికి ఇంటికి తిరిగి వెళ్ళగలము.19
ఊహాతీతమైన సాధ్యతలతో మనం కనుగొని, సృష్టించి, మారుతుండగా మన కథలలో ప్రతీది ఇంకా కొనసాగుతున్న ప్రయాణమే.
ప్రవక్త జోసెఫ్ స్మిత్ ఇలా చెప్పారు, “భూమిమీద లిఖించు లేదా బంధించు అధికారము పరలోకములోను బంధించును అనునది మనము చెప్పుకొను నిర్భయమైన సిద్ధాంతమని కొందరికి అనిపించవచ్చును.”20 ఇక్కడ మనం సృష్టించే సమాజ వ్యవస్థయే అక్కడ నిత్య మహిమతో ఉండగలదు.21 వాస్తవానికి, “[మన కుటుంబ సభ్యులు] లేకుండా మనము పరిపూర్ణులము కాలేము; అలాగే మనము లేకుండా వారు పరిపూర్ణులు కాలేరు,” అనగా “మొత్తము అంతయు పరిపూర్ణముగా ఐక్యము కాలేము.”22
ఇప్పుడు మనము ఏమి చేయగలము?
ముందుగా, నిత్యత్వము యొక్క రెండు అద్దాల మధ్య ముందుకు వెనుకకు మీ రూపం ప్రతిబింబించిందని ఊహించుకోండి. ఒక దిశలో మిమ్మల్ని మీరు ఒక కూతురు, మనవరాలు, ముని మనవరాలిగా ఊహించుకోండి; మరొక దిశలో ఒక అత్తగా, తల్లిగా, మామ్మగా మిమ్మల్ని మీరు చూసుకొని చిరునవ్వు చిందించండి. సమయం ఎంత త్వరగా గడిచిపోతుంది! ప్రతీ సమయంలో, పాత్రలో మీతో ఎవరున్నారో గమనించండి. వారి ఫోటోలు, దినచర్య పుస్తకాలు సేకరించండి; వారి జ్ఞాపకాలను నిజం చేయండి. వారి పేర్లను, అనుభవాలను, ముఖ్యమైన తేదీలను నమోదు చేయండి. వారు మీ కుటుంబము—మీకున్న కుటుంబము మరియు మీరు కోరుకున్న కుటుంబము.
కుటుంబ సభ్యుల కోసం మీరు దేవాలయ విధులు నిర్వహించినప్పుడు, ఏలీయా ఆత్మ, “కుటుంబం యొక్క దైవిక స్వభావానికి సాక్ష్యమిచ్చే పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత” 23 మీ తండ్రులు, తల్లులు మరియు పిల్లల హృదయాలను ప్రేమలో కలిపి ముడివేస్తుంది.24
రెండవది, కుటుంబ చరిత్ర యొక్క సాహసకృత్యం ఉద్దేశపూర్వకమైనదిగా, స్వాభావికంగా ఉండనివ్వండి. మీ అమ్మమ్మ లేదా నానమ్మకు ఫోన్ చేయండి. క్రొత్తగా పుట్టిన ఆ బిడ్డ కళ్ళలోకి లోతుగా చూడండి. మీ ప్రయాణంలోని ప్రతీ దశలో నిత్యత్వాన్ని కనుగొనడానికి సమయాన్ని వెచ్చించండి. మీ కుటుంబ వారసత్వాన్ని తెలుసుకొని కృతజ్ఞతతో, నిజాయితీతో స్వీకరించండి. వేడుక చేసుకోండి మరియు అనుకూలంగా మారండి, అవసరమైన చోట ప్రతికూలతను బదిలీచేయకుండా అణకువతో సాధ్యమైన ప్రతీదానిని చేయండి. మంచి విషయాలు మీతో ప్రారంభం కానివ్వండి.
మూడవది, FamilySearch.org దర్శించండి. ఉపయోగించదగిన మొబైల్ యాప్‌లను డౌన్‌లోడ్ చేయండి. అవి ఉచితము మరియు సరదాగా ఉంటాయి. కనుగొనండి, సంబంధం కలిగియుండండి, చెందియుండండి. ఒక గదిలో ఉన్న జనులతో మీరు ఎలా సంబంధం కలిగియున్నారో చూడండి; మీ సజీవ కుటుంబ వృక్షానికి పేర్లను జతచేయడం, మీ వేర్లను, కొమ్మలను కనుగొని, దీవించడం ఎంత సులభం మరియు ప్రతిఫలదాయకమో చూడండి.
నాల్గవది, నిత్యము కుటుంబాలను ఏకం చేయడానికి సహాయపడండి. పరలోకము యొక్క జనసంఖ్యకు సంబంధించిన విషయాలు జ్ఞాపకముంచుకోండి. ఈ వైపు కంటే ఎంతో ఎక్కువమంది తెరకు అవతలి వైపు ఉన్నారు. అనేక దేవాలయాలు మనకు దగ్గరగా వస్తుండగా, దేవాలయ విధుల కొరకు వేచియున్న వారికి దయచేసి వాటిని పొందే అవకాశాన్ని కల్పించండి.
ఈస్టరునాడు మరియు ఎల్లప్పుడూ ఉన్న వాగ్దానమేదనగా, యేసు క్రీస్తు యందు మరియు ద్వారానే మనము మన ఉత్తమ కథగా మారగలము మరియు మన కుటుంబాలు సంతోషంగా, శాశ్వతంగా మారగలవు. మన తరాలన్నిటిలో, యేసు క్రీస్తు విరిగిన హృదయాలను స్వస్థపరుస్తారు, చెరలో ఉన్నవారిని విడిపిస్తారు, గాయపడిన వారికి స్వేచ్ఛ కల్పిస్తారు.25 దేవునితో మరియు ఒకరితో ఒకరు నిబంధన సంబంధం కలిగియుండడం 26 అనేది పునరుత్థానములో మన ఆత్మ, శరీరం తిరిగి ఏకమవుతాయని మరియు మన అత్యంత విలువైన బంధాలు మరణాన్ని మించి సంపూర్ణ ఆనందంతో కొనసాగుతాయని తెలుసుకోవడాన్ని కలిపియుంది.27
మనలో ప్రతీఒక్కరికి ఒక కథ ఉంది. రండి, మీ కథను కనుగొనండి. రండి, ఆయనలో మీ స్వరాన్ని, మీ పాటను, మీ సమతాళాన్ని కనుగొనండి. దేవుడు పరలోకాలను, భూమిని సృష్టించడానికి మరియు అవి మంచివని చూడడానికి గల ముఖ్య ఉద్దేశ్యము ఇదే.28
దేవుని యొక్క సంతోష ప్రణాళికను, యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తాన్ని,ఆయన సువార్తలో నిరంతర పునఃస్థాపనను మరియు సంఘాన్ని అభినందించండి. దయచేసి రండి, మీ కుటుంబాన్ని, మీ తరాలన్నిటిని కనుగొని, వారిని ఇంటికి తీసుకురండి. యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన మరియు పవిత్రమైన నామములో, ఆమేన్.