మీ హృదయమును పైకెత్తి, సంతోషించుము
ఇశ్రాయేలును సమకూర్చుట అనే దైవిక ఉద్దేశ్యము కొరకు ఈ సమయమందు మనము జన్మించాము.
ప్రభువు అప్పుడే పరివర్తన చెందిన థామస్ బి. మార్ష్‌తో మాట్లాడుతూ, “నీ హృదయమును పైకెత్తి, సంతోషించుము, నీ పరిచర్య గడియ వచ్చియున్నది” (సిద్ధాంతము మరియు నిబంధనలు 31:3) అని ప్రోత్సహిస్తూ చెప్పారు.
ఈ ఆహ్వానము సంఘ సభ్యులందరి కొరకు ఒక ప్రేరేపణగా సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను. ఏదేమైనా, తెరకు ఇరువైపులా ఇశ్రాయేలీయులను సమకూర్చే కార్యమును మనలో ప్రతిఒక్కరం మన పరలోక తండ్రి నుండి పొందియున్నాము.
అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా అన్నారు, “ఆ సమకూర్పు నేడు భూమి మీద జరుగుతున్న అత్యంత ముఖ్యమైన విషయము. దాని పరిమాణంతో వేరే ఏదీ పోల్చబడదు, దాని ప్రాముఖ్యతతో ఏదీ పోల్చబడదు, దాని ఘనతకు ఏదీ సరిపోల్చబడదు.”1
నిశ్చయముగా, లోకములో యోగ్యతగల ఉద్దేశ్యాలు అనేకమున్నాయి. వాటన్నిటిని పేర్కొనడం అసాధ్యము. కానీ, మీ సహకారము ముఖ్యమైన వ్యత్యాసాన్ని చూపే చోట మీ పరిధిలో ఒక గొప్ప ఉద్దేశ్యంలో పాల్గొనడానికి మీరు ఇష్టపడరా? సమకూర్పు అందరికి ఒక నిత్య వ్యత్యాసాన్ని చూపుతుంది. వారి పరిస్థితులు మరియు వారు ఎక్కడ నివసిస్తున్నారో లక్ష్యపెట్టకుండా అన్ని వయస్సులవారు ఈ ఉద్దేశ్యంలో పాల్గొనగలరు. ప్రపంచములో ఇంతకు మించి చేర్చుకొనే ఉద్దేశ్యం మరొకటి లేదు.
ప్రత్యేకంగా యువతతో మాట్లాడుతూ అధ్యక్షులు నెల్సన్ ఇలా అన్నారు: “మన పరలోక తండ్రి తన మిక్కిలి ఘనమైన ఆత్మలలో అనేకమందిని—బహుశా … ఆయన ఉత్తమమైన జట్టును—ఈ చివరి దశ కొరకు దాచి ఉంచారు. ఆ ఘనమైన ఆత్మలు—ఆ ఉత్తమమైన ఆటగాళ్ళు, ఆ నాయకులు— మీరే!”2
అవును, మీరు ఈ జీవితానికి ముందు నుండి సిద్ధపరచబడ్డారు మరియు ఈ కడవరి దినాలలో తెరకు ఇరువైపుల ఇశ్రాయేలును సమకూర్చే గొప్ప కార్యములో పాల్గొనడానికి ఇప్పుడు పుట్టారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 138:53–56 చూడండి).
ఈ ఉద్దేశ్యము ఎందుకు ముఖ్యమైనది? ఎందుకనగా “ఆత్మల విలువ దేవుని దృష్టిలో గొప్పది” (సిద్ధాంతము మరియు నిబంధనలు 18:10). మరియు “(యేసు క్రీస్తు) యందు విశ్వాసముంచి, బాప్తిస్మము పొందువాడు రక్షింపబడును మరియు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనును” (3 నీఫై 11:33). ఇంకను, ఆయన విధులను పొంది, ఆయన నిబంధనలను పాటించువారికి “తండ్రికి కలిగిన సమస్తము ఇవ్వబడును” (సిద్ధాంతము మరియు నిబంధనలు 84:38). అదనముగా, “పనివారు కొందరే” (లూకా 10:2).
యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘములో మాత్రమే మనము శక్తిని, అధికారమును మరియు జీవిస్తున్న లేదా మరణించిన ఇతరులకు అటువంటి దీవెనను ఇవ్వడానికి మార్గమును కనుగొనగలము.
అధ్యక్షులు నెల్సన్ చెప్పినట్లుగా: “ఏ సమయంలోనైనా మీరు చేసేది ఏదైనా అదితెరకు ఇరువైపుల ఎవరికైనా—దేవునితో నిబంధనలు చేయుట వైపు మరియు వారికి ఆవశ్యకమైన బాప్తిస్మపు నిబంధనలు, దేవాలయ నిబంధనలు పొందుట వైపు ఒక అడుగు వేయుటకు సహాయపడిన యెడల, ఇశ్రాయేలును సమకూర్చుటకు మీరు సహాయపడుతున్నట్లే. అది అంత సులభమైనది.”3
సమకూర్చుటలో సహాయపడడానికి అనేక విధానాలు ఉన్నప్పటికీ, ప్రత్యేకంగా ఒకదాని గురించి మాట్లాడాలని నేను కోరుతున్నాను: పూర్తి-కాల సువార్తికునిగా సేవ చేయుట. మీలో అనేకులకు దీని అర్థము, బోధించే సువార్తికునిగా ఉండడం. అనేకమంది ఇతరులకు దీని అర్థము, సేవ చేసే సువార్తికునిగా ఉండడం. కానీ, భయం మరియు అభద్రతలను ఉపయోగించి యువతను ఈ అత్యంత పవిత్రమైన బాధ్యత నుండి మరల్చడానికి ప్రపంచం ప్రయత్నిస్తుంది.
మహమ్మారిని ఎదుర్కోవడం, మంచి ఉద్యోగాన్ని వదిలివేయడం, చదువును నిలిపివేయడం లేదా ప్రేమలో ఎవరైనా ఒకరిపై ప్రత్యేక ఆసక్తి చూపడం వంటివి కొన్ని ఇతర పరధ్యానాలు. ఫ్రతీఒక్కరు తమ స్వంత సవాళ్ళను కలిగియుంటారు. ప్రభువు యొక్క సేవను ప్రారంభించే సమయంలో అటువంటి పరధ్యానాలు ఖచ్చితంగా రావచ్చు మరియు తరువాత స్పష్టంగా కనిపించే ఎంపికలు ఆ సమయంలో అంత సులభం కాదు.
అటువంటి యువకుని మనస్సులో కలత నాకు అనుభవము ద్వారా తెలుసు. సువార్తసేవకు వెళ్ళడానికి నేను సిద్ధపడుతున్నప్పుడు, కొన్ని ఆశ్చర్యకరమైన శక్తులు నన్ను నిరాశపరచడానికి ప్రయత్నించాయి. వారిలో ఒకరు నా దంత వైద్యుడు. నేను ఒక సువార్తికునిగా ఉండబోతున్నానని అతడు గ్రహించినప్పుడు, సేవ చేయకుండా నిరోధించడానికి అతడు ప్రయత్నించాడు. నా దంత వైద్యుడు సంఘానికి వ్యతిరేకమనే విషయం నాకు ఏమాత్రం తెలియలేదు.
నా విద్యను మధ్యలో ఆపడం కూడా క్లిష్టమైంది. నా విశ్వవిద్యాలయ కార్యక్రమం నుండి రెండు-సంవత్సరాల సెలవును నేను అడిగినప్పుడు, అది సాధ్యము కాదని నాకు తెలియజేయబడింది. ఒక సంవత్సరము తరువాత నేను తిరిగి రాకపోతే విశ్వవిద్యాలయములో నా స్థానాన్ని నేను కోల్పోతాను. బ్రెజిల్‌లో, విశ్వవిద్యాలయ కార్యక్రమంలో ప్రవేశానికి ఏకైక ప్రమాణం చాలా కష్టమైన పోటీ పరీక్ష అయినందున ఇది చాలా తీవ్రమైనది.
పలుమార్లు పట్టుబట్టిన తర్వాత, ఒక సంవత్సరం పాటు గైర్హాజరైన తర్వాత, అసాధారణ కారణాలతో నేను మినహాయింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అయిష్టంగానే నాకు తెలియజేయబడింది. అది అనుమతించబడవచ్చు లేదా లేకపోవచ్చు. నా చదువుకు దూరమైన రెండు సంవత్సరాలు తరువాత ఆ కష్టతరమైన ప్రవేశ పరీక్షను మళ్ళీ వ్రాయాలనే ఆలోచనకే నేను భయపడ్డాను.
నేను ఒక యువతిని ప్రత్యేకంగా ఇష్టపడ్డాను కూడా. నా స్నేహితులలో చాలామంది అదే ఇష్టాన్ని కలిగియున్నారు. “నేను సువార్తసేవకు వెళితే, నేను అపాయములో పడతాను” అని నాలో నేను ఆలోచించాను.
కానీ, నా పూర్ణ హృదయముతో ఆయనను సేవించడానికి నేను ప్రయాసపడినప్పుడు, భవిష్యత్తు గురించి భయపడరాదనడానికి ప్రభువైన యేసు క్రీస్తు నాకు గొప్ప ప్రేరేపణగా ఉన్నారు.
ఆయన కూడా ఒక నియమితకార్యాన్ని నెరవేర్చవలసి వచ్చింది. ఆయన స్వంత మాటలలో, ఆయనిలా వివరించారు, “నా యిష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని” (యోహాను 6:38). ఆయన నియమితకార్యము సులువైనదా? అస్సలు కాదు. ఆయన నియమితకార్యములో ముఖ్య భాగమైన ఆయన బాధ, “ఆ శ్రమ అందరికంటే గొప్పవాడైన దేవుడైన ఆయనను బాధ వలన వణికి, ప్రతి స్వేద రంధ్రము నుండి రక్తము కారి, శరీరము, ఆత్మ శ్రమపడునట్లు చేసెను—ఆ చేదు పాత్రను త్రాగకుండా [ఆయన] వెనుదిరగాలని అనుకొనెను—
“అయినప్పటికీ, తండ్రికి మహిమ కలుగును గాక, మరియు [ఆయన] త్రాగి, నరుల సంతానము కొరకైన [తన] సిద్ధపాటులను ముగించాడు” (సిద్ధాంతము మరియు నిబంధనలు 19:18--19).
పూర్తి-కాల సువార్తసేవ చేయడం మనకు కష్టమైనదిగా అనిపించవచ్చు. బహుశా, కొంతకాలము ముఖ్యమైన విషయాలను వదిలివేయడం దానికి అవసరం కావచ్చు. నిశ్చయంగా ప్రభువుకు ఇది తెలుసు మరియు ఆయన ఎల్లప్పుడూ మన పక్షాన ఉంటారు.
వాస్తవానికి, నా సువార్తను ప్రకటించుడిలో సువార్తికులకు వారి సందేశములో, ప్రథమ అధ్యక్షత్వము ఇలా వాగ్దానమిస్తున్నారు, “మీరు వినయముగా, ప్రార్థనాపూర్వకంగా ఆయనకు సేవ చేసినప్పుడు ప్రభువు మీకు బహుమానమిస్తాడు మరియు గొప్పగా దీవిస్తాడు.”4 ఒక విధంగా లేదా మరొక విధంగా దేవుని పిల్లలందరూ దీవించబడుతున్నారనుట సత్యము, కానీ దీవించబడుట మరియు ఆయన సేవలో ఘనంగా దీవించబడుట మధ్య వ్యత్యాసమున్నది.
నా సువార్తసేవకు ముందు నేను ఎదుర్కొన్నానని అనుకొన్న సవాళ్ళు గుర్తున్నాయా? నా దంత వైద్యుడు? నేను మరొకరిని కనుగొన్నాను. నా విశ్వవిద్యాలయము? వారు నాకు మినహాయింపు ఇచ్చారు. ఆ యువతి మీకు గుర్తుందా? ఆమె నా మంచి స్నేహితులలో ఒకరిని వివాహము చేసుకుంది.
కానీ దేవుడు నిజంగా నన్ను గొప్పగా దీవించాడు. మనము ఆశించిన దానికంటే భిన్నమైన విధానాలలో ప్రభువు యొక్క దీవెనలు వస్తాయని నేను నేర్చుకున్నాను. ఏదేమైనా, ఆయన ఆలోచనలు మన ఆలోచనల వంటివి కాదు (యెషయా 55:8–9 చూడండి).
పూర్తి-కాల సువార్తికునిగా ఆయనకు సేవ చేసినందుకు ఆయన నాకిచ్చిన అనేక గొప్ప దీవెనలలో ఒకటి, యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తమునందు గొప్ప విశ్వాసము, ఆయన బోధనలను గూర్చి బలమైన సాక్ష్యము మరియు జ్ఞానము, ఆవిధంగా నేను “ప్రతీ సిద్ధాంతపు గాలి” (ఎఫెసీయులకు 4:14) చేత సులభంగా కదిలించబడను. బోధించడానికి నాకు భయం పోయింది. ఆశావాదంతో సవాళ్ళను ఎదుర్కొనే నా సామర్థ్యము పెరిగింది. ఒక సువార్తికునిగా నేను కలిసిన లేదా బోధించిన వ్యక్తులు మరియు కుటుంబాలను గమనించుట ద్వారా, పాపము నిజమైన సంతోషాన్ని తేదని, దేవుని ఆజ్ఞలకు విధేయత భౌతికంగా, ఆత్మీయంగా రెండువిధాలా వృద్ధి చెందడానికి మనకు సహాయపడుతుందని చెప్పిన దేవుని బోధనలు సత్యమని నేను తెలుసుకున్నాను (మోషైయ 2:41; ఆల్మా 41:10 చూడండి). దేవుడు అద్భుతాలు చేసే దేవుడని నాకై నేను తెలుసుకున్నాను (మోర్మన్ 9 చూడండి).
సాధ్యమయ్యే వివాహం మరియు పితృత్వము, సంఘ సేవ, వృత్తిపరమైన మరియు సమాజ జీవితంతో సహా వయోజన జీవితానికి నా సిద్ధపాటులో ఈ విషయాలన్నీ సాధనంగా ఉన్నాయి.
నా సువార్తసేవ తర్వాత, నేను యేసు క్రీస్తు మరియు ఆయన సంఘము యొక్క నమ్మకమైన అనుచరునిగా, అన్ని పరిస్థితులలో మరియు ప్రజలందరికీ నన్ను చూపించడానికి పెరిగిన నా ధైర్యం నుండి ప్రయోజనం పొందాను. సద్గుణవంతురాలు, తెలివైన, సరదాయైన మరియు ప్రియమైన నిత్య సహవాసి, నా జీవితానికి సంతోషాన్ని తెచ్చిన ఒక అందమైన స్త్రీతో కూడా సువార్తను పంచుకున్నాను.
అవును, దేవుడు “నమ్రతతో మరియు ప్రార్థనపూర్వకంగా తనను సేవించే” వారందరినీ ఎలాగైతే దీవిస్తాడో, అలాగే నేను ఊహించిన దానికంటే గొప్పగా నన్ను ఆశీర్వదించాడు. ఆయన మంచితనము కొరకు దేవునికి నేను శాశ్వతంగా ఋణపడియున్నాను.
నా సువార్తసేవ నా జీవితంపై బలమైన ప్రభావాన్ని కలిగియున్నది. దేవునియందు నమ్మకముంచడం, ఆయన జ్ఞానము, కనికరమునందు మరియు ఆయన వాగ్దానములందు నమ్మకముంచడానికి ప్రయత్నించడం విలువైనదని నేను నేర్చుకున్నాను. ఏదేమైనా, ఆయన మన తండ్రి, నిస్సందేహంగా ఆయన మన కొరకు శ్రేష్టమైనది కోరతాడు.
ప్రపంచమంతటా ఉన్న ప్రియమైన యువతా, మన ప్రవక్తయైన అధ్యక్షులు నెల్సన్ మీ అందరికి చేసిన అదే ఆహ్వానాన్ని నేను మీకిస్తున్నాను, “ఇశ్రాయేలును సమకూర్చడానికి సహాయపడుటలో ప్రభువు యొక్క యువ సేనలో చేరండి.” అధ్యక్షులు నెల్సన్ ఇలా చెప్పారు:
“ఇంతకుమించిన పర్యవసానము ఏదీ లేదు. ఖచ్చితంగా ఏదీ లేదు.
“ఈ సమకూర్పు అనేది మీకు సమస్తమైనదిగా ఉండాలి. ఈ కార్యము కొరకు మీరు భూమి మీదకు పంపబడ్డారు.”5
ఇశ్రాయేలును సమకూర్చుట అనే దైవిక ఉద్దేశ్యము కొరకు ఈ సమయమందు మనము జన్మించాము. పూర్తి-కాల సువార్తికులుగా మనము సేవ చేసినప్పుడు, కొన్నిసార్లు మనము సవాలు చేయబడతాము, కానీ అటువంటి పరిస్థితులలో స్వయంగా ప్రభువే మనకు గొప్ప ఉదాహరణ మరియు మాదిరిగా ఉన్నారు. ఎటువంటి కష్టమైన కార్యమో ఆయన అర్థము చేసుకుంటారు. ఆయన సహాయముతో, మనం కష్టమైనది చేయగలము. ఆయన మన పక్షాన ఉంటారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 84:88 చూడండి), మరియు మనము వినయంగా ఆయనను సేవించినప్పుడు ఆయన మనల్ని గొప్పగా దీవిస్తారు.
ఈ కారణాలన్నిటి మూలంగా, ప్రభువు థామస్ బి. మార్ష్ తో మరియు మనందరితో, “నీ హృదయమును పైకెత్తి, సంతోషించుము, నీ పరిచర్య గడియ వచ్చియున్నది” అని చెప్పడం నాకు ఆశ్చర్యం కలిగించలేదు. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.