దేవుని యొక్క చిత్తమునకు పరివర్తన చెందుట
మన వ్యక్తిగత పరివర్తనలో యేసు క్రీస్తు సువార్తను ప్రపంచంతో పంచుకునే బాధ్యత ఇమిడి ఉంటుంది.
సువార్తసేవకు అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ యొక్క శక్తివంతమైన ప్రవచనాత్మక పిలుపు మరియు అధ్యక్షులు ఎమ్. రస్సెల్ బల్లార్డ్ మరియు ఎల్డర్ మార్కోస్ ఎ. ఐదుకైటిస్ ఈరోజు ఇచ్చిన స్ఫూర్తిదాయకమైన సువార్తసేవ సందేశాలకు నేను కృతజ్ఞుడను.
గత సంవత్సరం చివర్లో గ్రేట్ బ్రిటన్‌లో సువార్తసేవ చేయడానికి నియమించబడడం, ఒక సువార్తికునిగా సేవ చేయాలనే నా నిర్ణయానికి పునాది అయిన అమూల్యమైన ఆధ్యాత్మిక సంఘటనల గురించి ఆలోచించేందుకు నన్ను అనుమతించింది.1 నేను 15 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, నా ప్రియమైన అన్నయ్య జో వయస్సు 20 సంవత్సరాలు—అప్పట్లో సువార్తసేవ చేయడానికి అర్హతగల వయస్సు అది. కొరియా వివాదం కారణంగా, సంయుక్త రాష్ట్రాలలో చాలా కొద్దిమంది మాత్రమే సేవ చేయడానికి అనుమతించబడ్డారు. ప్రతీ వార్డు నుండి సంవత్సరానికి ఒకరిని మాత్రమే పిలవవచ్చు.2 మా నాన్నతో కలిసి ఈ అవకాశాన్ని అన్వేషించమని మా బిషప్పు జోని కోరడం అప్పుడు మాకు ఆశ్చర్యంగా అనిపించింది. జో మెడికల్ స్కూల్ కోసం దరఖాస్తులను సిద్ధం చేస్తున్నాడు. సంఘములో చురుకుగా లేని మా నాన్న, అతనికి సహాయం చేయడానికి ఆర్థిక సన్నాహాలు చేసాడు మరియు జో సువార్తసేవకు వెళ్ళడం ఆయనకు ఇష్టం లేదు. జో మెడికల్ స్కూల్‌కి వెళ్ళడం ద్వారా ఎక్కువ మంచి చేయవచ్చని నాన్న సూచించారు. ఇది మా కుటుంబంలో పెద్ద సమస్యగా మారింది.
తెలివైన మరియు ఆదర్శప్రాయమైన నా అన్నయ్యతో విశేషమైన చర్చలో, సువార్తసేవ చేసి అతని విద్యను ఆలస్యం చేయాలా అనే దానిపై అతని నిర్ణయం మూడు ప్రశ్నలపై ఆధారపడి ఉందని మేము నిర్థారించాము: (1) యేసు క్రీస్తు దైవమా? (2) మోర్మన్ గ్రంథము దేవుని వాక్యమా? మరియు (3) జోసెఫ్ స్మిత్ పునఃస్థాపన యొక్క ప్రవక్తా? ఈ ప్రశ్నలకు సమాధానం అవును అయితే, త్వరగా డాక్టరుగా మారడం కంటే, యేసు క్రీస్తు సువార్తను ప్రపంచానికి తెలియజేయడం ద్వారా జో మరింత మేలు చేయగలడని స్పష్టమైంది.3
ఆ రాత్రి నేను హృదయపూర్వకంగా మరియు నిజమైన ఉద్దేశ్యంతో ప్రార్థించాను. కాదనలేని శక్తివంతమైన రీతిలో ఆత్మ ఈ మూడు ప్రశ్నలకు సమాధానము అవునని నాకు ధృవీకరించింది. ఇది నాకు ప్రభావశీలమైన విషయం. నా జీవితాంతం నేను తీసుకునే ప్రతీ నిర్ణయం ఈ సత్యాలచేత ప్రభావితమవుతుందని నేను గ్రహించాను. అవకాశం దొరికితే నేను సువార్తసేవ చేస్తానని కూడా నాకు తెలుసు. జీవితకాల సేవ మరియు ఆత్మీయ అనుభవాలతో, దేవుని చిత్తాన్ని జాగరూకతతో అంగీకరించడం వల్ల కలిగే ఫలితమే నిజమైన పరివర్తన అని మరియు పరిశుద్ధాత్మ ద్వారా మన చర్యలలో మనం నడిపింపు పొందవచ్చని నేను అర్థం చేసుకున్నాను.
ప్రపంచ రక్షకునిగా యేసు క్రీస్తు యొక్క దైవత్వానికి సంబంధించిన సాక్ష్యాన్ని నేను అప్పటికే కలిగి ఉన్నాను. ఆ రాత్రి నేను మోర్మన్ గ్రంథము4 మరియు ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ గురించి ఆత్మీయ సాక్ష్యాన్ని పొందాను.
జోసెఫ్ స్మిత్ ప్రభువు హస్తములలో ఒక సాధనమైయున్నాడు.
ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ ప్రభువు హస్తములలో ఒక సాధనం అని మీ ప్రార్థనల ద్వారా మీ హృదయంలో మీరు తెలుసుకున్నప్పుడు మీ సాక్ష్యం బలపడుతుంది. గత ఎనిమిదేళ్ళలో, పన్నెండుమంది అపొస్తలులలో నాకు ఇవ్వబడిన బాధ్యతలలో ఒకటి, జోసెఫ్ స్మిత్ యొక్క విశేష పత్రాలు, లిఖితాలు మరియు పరిశుద్ధులు సంపుటీల ప్రచురణకు దారితీసిన పరిశోధనలు అన్నింటిని సమీక్షించి చదవడం.5 ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ జీవితానికి సంబంధించిన స్పూర్తిదాయకమైన వివరాలను మరియు ముందుగా నిర్ణయించిన ప్రవక్త పరిచర్యను చదివిన తరువాత ఆయన గురించి నా సాక్ష్యం మరియు ప్రశంసలు గొప్పగా బలోపేతం చేయబడ్డాయి మరియు మెరుగుపరచబడ్డాయి.
దేవుని బహుమానము మరియు శక్తి ద్వారా మోర్మన్ గ్రంథానికి జోసెఫ్ చేసిన అనువాదం పునఃస్థాపనకు పునాది.6 మోర్మన్ గ్రంథము అంతర్గతంగా స్థిరంగా ఉండి, అందంగా వ్రాయబడింది మరియు జీవితంలోని గొప్ప ప్రశ్నలకు సమాధానాలను కలిగి ఉంది. అది యేసు క్రీస్తు యొక్క మరియొక నిబంధన. జోసెఫ్ స్మిత్ నీతిమంతుడని, విశ్వాసంతో నిండి ఉన్నాడని మరియు మోర్మన్ గ్రంథాన్ని వెలుగులోనికి తీసుకురావడంలో ప్రభువు హస్తములలో ఒక సాధనమైయున్నాడని నేను సాక్ష్యమిస్తున్నాను.
సిద్ధాంతము మరియు నిబంధనలలో నమోదు చేయబడిన బయల్పాటులు మరియు సంఘటనలు రక్షణకు మరియు ఉన్నతస్థితికి అవసరమైన తాళపుచెవులు, విధులు మరియు నిబంధనలను అందిస్తాయి. అవి సంఘాన్ని స్థాపించడానికి అవసరమైన వాటిని మాత్రమే కాకుండా, జీవిత ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవడానికి మనల్ని అనుమతించే లోతైన సిద్ధాంతాన్ని కూడా అందిస్తాయి మరియు మనకు నిత్య దృష్టినిస్తాయి.
జోసెఫ్ స్మిత్ యొక్క ప్రవచనాత్మక పాత్ర యొక్క అనేక ఉదాహరణలలో ఒకటి సిద్ధాంతము మరియు నిబంధనలు 76వ ప్రకరణములో కనుగొనబడుతుంది. ఇది మహిమ రాజ్యాలతో కలిపి పరలోకము గురించిన దర్శనము యొక్క స్పష్టమైన వృత్తాంతము, దానిని ప్రవక్తయైన జోసెఫ్ మరియు సిడ్నీ రిగ్డన్‌లు 1832 ఫిబ్రవరి 16న పొందుటకు దీవించబడ్డారు. ఆ సమయంలో, రక్షకుని ప్రాయశ్చిత్తం చాలామందికి రక్షణను ఇవ్వదని పలు సంఘాలు బోధించాయి. కొంతమంది రక్షింపబడతారని మరియు అత్యధికులు నరకానికి మరియు అణచివేతకు గురవుతాని, అంతములేని హింసలతో సహా అత్యంత భయంకరమైన మరియు చెప్పలేని వేదనకు గురవుతారని నమ్మబడింది.7
76వ ప్రకరణములో ఉన్న బయల్పాటు మహిమ దశల యొక్క అద్భుతమైన దర్శనాన్ని అందిస్తుంది, ఇక్కడ తమ పూర్వమర్త్య స్థితిలో పరాక్రమవంతులుగా ఉన్న పరలోక తండ్రి యొక్క పిల్లల్లో అత్యధికులు అంతిమ తీర్పు తరువాత అధికంగా దీవించబడతారు.8 మూడు మహిమ దశల యొక్క దర్శనము, వాటిలో అత్యంత అల్పమైనది, “సమస్త జ్ఞానమును మించినది,”9 ఎక్కువమంది నరకానికి మరియు శాపానికి గురవుతారు అనే బలమైనది కానీ తప్పైన సిద్ధాంతాన్ని ప్రత్యక్షంగా ఖండించింది.
కేవలం 26 సంవత్సరాల వయస్సు , పరిమిత విద్యాభ్యాసం గల జోసెఫ్ స్మిత్‌కు బైబిలు అనువదించబడిన సాంప్రదాయిక భాషలతో అంతగా పరిచయం లేదని మీరు గ్రహించినప్పుడు, అతడు నిజంగా ప్రభువు హస్తములలో ఒక సాధనమని తెలుస్తుంది. 76వ ప్రకరణములోని 17వ వచనములో, యోహాను సువార్తలో ఉపయోగించిన “శిక్ష” అనే పదానికి బదులుగా “అనీతిమంతులు” అనే పదాన్ని ఉపయోగించాలని అతడు ప్రేరేపించబడ్డాడు.10
45 సంవత్సరాల తరువాత ఆంగ్లికన్ సంఘ నాయకుడు మరియు విద్యాపరంగా గుర్తింపు పొందిన శాస్త్రీయ పండితుడు11 , ది లైఫ్ ఆఫ్ క్రైస్ట్ వ్రాసిన ఫ్రెడ్రిక్ డబ్ల్యు. ఫర్రార్,12 బైబిలు యొక్క కింగ్ జేమ్స్ అనువాదములో శిక్ష యొక్క నిర్వచనం హెబ్రీ మరియు గ్రీకు భాష నుండి ఆంగ్లంలోకి అనువదించినప్పుడు కలిగిన దోషాల ఫలితం అని నొక్కిచెప్పడం ఆసక్తికరం.13
మన కాలంలో చాలామంది పాపానికి పర్యవసానాలు ఉండకూడదనే భావనను స్వీకరించారు. వారు పశ్చాత్తాపం లేకుండా పాపం యొక్క షరతులు లేకుండా క్షమించబడడాన్ని సమర్థిస్తారు. బయల్పరచబడిన మన సిద్ధాంతం చాలామంది ప్రజలు నరకానికి మరియు శిక్షకు గురవుతారనే ఆలోచనను తిరస్కరించడమే కాకుండా, రక్షకుని ప్రాయశ్చిత్తంలో పాలుపంచుకోవడానికి మరియు సిలెస్టియల్ రాజ్యాన్ని వారసత్వంగా పొందేందుకు వ్యక్తిగత పశ్చాత్తాపం తప్పనిసరి అని నిర్థారిస్తుంది.14 ప్రభువు సువార్త యొక్క పునఃస్థాపనను తీసుకురావడంలో ఆయన హస్తాలలో జోసెఫ్ స్మిత్ నిజంగా ఒక సాధనం అని నేను సాక్ష్యమిస్తున్నాను!
యేసు క్రీస్తు సువార్త పునఃస్థాపన కారణంగా, పశ్చాత్తాపం మరియు “నీతి కార్యములు”15 రెండింటి ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకున్నాము. రక్షకుని ప్రాయశ్చిత్తము మరియు దేవాలయంలో నిర్వహించబడే వాటితో పాటు ఆయన రక్షణ విధులు మరియు నిబంధనలకు సంబంధించిన అధిక ప్రాముఖ్యతను మనము అర్థం చేసుకున్నాము.
“నీతి కార్యములు” పరివర్తన నుండి ఉద్భవించాయి మరియు అవి దాని యొక్క ఫలాలు. దేవుని చిత్తాన్ని అనుసరించడానికి ఇష్టపూర్వకమైన సమ్మతి మరియు నిబద్ధత ద్వారా నిజమైన పరివర్తన తేబడుతుంది.16 పరివర్తన ఫలితంగా కలిగే అనేకమైన పరిణామాలు మరియు ఆశీర్వాదాలు నిజమైనవి మరియు అవి జీవితంలో కష్టాలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ శాశ్వతమైన శాంతి మరియు అంతిమ ఆనందం15 యొక్క వ్యక్తిగత హామీని ఇస్తాయి.
రక్షకుని వైపు పరివర్తన చెందడం ప్రకృతిసంబంధియైన మనిషిని పవిత్రమైన, మళ్ళీ జన్మించిన, శుద్ధి చేయబడిన వ్యక్తిగా మారుస్తుంది—క్రీస్తు యేసులో ఒక క్రొత్త జీవిగా మారుస్తుంది.18
అనేకులు సత్యమును ఎక్కడ కనుగొనవలెనో తెలియకపోవుట వలన దానిని యెరుగకయున్నారు
పరివర్తన వలన వచ్చే బాధ్యతలేవి? లిబర్టీ చెరసాలలో ప్రవక్తయైన జోసెఫ్ గమనించింది ఏమిటంటే, చాలామంది “ సత్యమును ఎక్కడ కనుగొనవలెనో తెలియకపోవుట వలన దానిని యెరుగకయున్నారు.”19
సిద్ధాంతము మరియు నిబంధనలకు ప్రభువు ముందుమాటలో, మన పట్ల ప్రభువు ఉద్దేశ్యాన్ని గురించిన దృక్పథ ప్రకటన చేయబడింది. ఆయన ఇలా ప్రకటించారు,“కాబట్టి, ప్రభువైన నేను, భూలోక నివాసులందరిపైకి రాబోవు విపత్తునెరిగి, నా సేవకుడైన జోసెఫ్ స్మిత్ జూ. ను పిలిచి, పరలోకము నుండి మాట్లాడి, ఆజ్ఞలనిచ్చితిని.” ఇంకా ఆయన ఇలా ఉపదేశించారు, “నా సంపూర్ణ సువార్త భూదిగంతముల వరకు బలహీనులు, సామాన్యులచేత ప్రకటింపబడాలి.”20 అందులో పూర్తి-కాల సువార్తికులు కూడా ఉన్నారు. అందులో మనలో ప్రతీఒక్కరము ఉన్నాము. ఇది దేవుని చిత్తానికి పరివర్తనతో దీవించబడిన ప్రతీఒక్కరికీ ఎక్కువ దృష్టి సారింపుగా ఉండాలి. రక్షకుడు దయతో మనలను తన స్వరముగా మరియు తన చేతులుగా ఉండమని ఆహ్వానిస్తున్నారు.21 రక్షకుని ప్రేమ మనకు మార్గదర్శక వెలుగుగా ఉంటుంది. రక్షకుడు తన శిష్యులకు ఇలా బోధించారు, “కాబట్టి మీరు వెళ్ళి, సమస్త జనములకు బోధించుడి.”22 జోసెఫ్ స్మిత్‌కు ఆయన ఇలా ప్రకటించారు, “నా సువార్తను పొందని ప్రతి జీవికి దానిని బోధించుము.”23
కర్ట్‌లాండ్ దేవాలయాన్ని ప్రతిష్ఠించిన ఒక వారం తర్వాత ఈస్టర్ ఆదివారం మరియు పస్కా పండుగ అయిన 1836, ఏప్రిల్ 3న, ప్రభువు జోసెఫ్ మరియు ఆలీవర్ కౌడరీలకు అద్భుతమైన దర్శనంలో కనిపించారు. ప్రభువు దేవాలయాన్ని స్వీకరించి, ఇలా ప్రకటించారు,“నా జనుల శిరస్సులపై క్రుమ్మరించబడబోవు దీవెనకు ఇది ఆరంభము.” 24
ఈ దర్శనం ముగిసిన తర్వాత, మోషే ప్రత్యక్షమై “భూమి యొక్క నలుమూలల నుండి ఇశ్రాయేలీయులను పోగుచేయుటకు మరియు ఉత్తర దిక్కునున్న ప్రదేశమునుండి పది గోత్రములను నడిపించుటకు తాళపుచెవులను ఇచ్చెను.”25
నేడు ఈ తాళపుచెవులను కలిగియున్న మన ప్రియమైన ప్రవక్త, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఈ ఉదయం ఇలా బోధించారు: “వాగ్దానం చేయబడిన ఇశ్రాయేలీయుల సమకూర్పు జరుగుతున్న ఈ సమయం కోసం యువకులైన మీరు ప్రత్యేకించబడ్డారు. మీరు సువార్తసేవ చేస్తున్నప్పుడు, ఈ అపూర్వమైన సంఘటనలో మీరు కీలక పాత్ర పోషిస్తారు!”26
మనం ఎవరిలో భాగం కావాలనే దానికోసం సువార్తను పంచుకోవాలనే రక్షకుని ఆదేశం నిమిత్తం మనం దేవుని చిత్తానికి పరివర్తన చెందాలి; మనం మన పొరుగువారిని ప్రేమించాలి, యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపించబడిన సువార్తను పంచుకోవాలి మరియు వచ్చి, చూడమని అందరినీ ఆహ్వానించాలి. సంఘ సభ్యులుగా, 1842లో చికాగో డెమోక్రాట్ సంపాదకుడైన జాన్ వెంట్‌వర్త్‌కి ప్రవక్తయైన జోసెఫ్ ఇచ్చిన సమాధానాన్ని మనము ఎంతో గౌరవిస్తాము. అతడు సంఘము గురించి సమాచారాన్ని అభ్యర్థిస్తున్నాడు. పదమూడు విశ్వాస ప్రమాణాలకు ముందుమాటగా “సత్య ప్రమాణము”ను ఉపయోగించడం ద్వారా జోసెఫ్ తన ప్రతిస్పందనను ముగించాడు. ఏమి సాధించాలి అనేదానిని ఈ ప్రమాణం సంక్షిప్తంగా తెలియజేస్తుంది:
“అపవిత్రమైన ఏ చెయ్యి ఈ పని పురోగమించకుండా ఆపలేదు; హింసలు చెలరేగవచ్చు, అల్లరిమూకలు ఏకముకావచ్చు, సైన్యాలు సమీకరించబడవచ్చు, అపకీర్తి పరువు తీయవచ్చు, కాని దేవుని సత్యము ప్రతి ఖండములోనికి చొచ్చుకుపోయే వరకు, ప్రతి వాతావరణాన్ని సందర్శించే వరకు, ప్రతి దేశాన్ని తుడిచిపెట్టి, ప్రతి చెవిలో వినిపించే వరకు, దేవుని ఉద్దేశ్యాలు నెరవేరే వరకు, మరియు గొప్ప యెహోవా ఆ పని పూర్తయిందని చెప్పేవరకు ధైర్యంగా, ఘనంగా, స్వతంత్రంగా ముందుకు సాగుతుంది.”27
ఇది తరతరాలుగా కడవరి దిన పరిశుద్ధులకు, ముఖ్యంగా సువార్తికులకు స్పష్టమైన పిలుపుగా ఉన్నది. “సత్య ప్రమాణము” యొక్క స్ఫూర్తితో, ప్రపంచవ్యాప్త మహమ్మారి మధ్య నమ్మకమైన సువార్తికులు సువార్తను పంచుకున్నందుకు మేము కృతజ్ఞులము. సువార్తికులారా, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము! మన మాటలలో మరియు చేతలలో తన సువార్తను పంచుకోమని ప్రభువు మనలో ప్రతీఒక్కరిని అడుగుతున్నారు. మన వ్యక్తిగత పరివర్తనలో యేసు క్రీస్తు సువార్తను ప్రపంచంతో పంచుకునే బాధ్యత ఇమిడి ఉంటుంది.
సువార్తను పంచుకోవడం వలన కలిగే దీవెనలలో, దేవుని చిత్తానికి మన పరివర్తనను వృద్ధిచేసుకోవడం మరియు మన జీవితాలలో దేవునికి ప్రాముఖ్యతనివ్వడం కలిపి ఉన్నాయి.28 హృదయము యొక్క “శక్తివంతమైన మార్పును”29 అనుభవించాలని ఇతరులను మనము దీవిస్తున్నాము. ఆత్మలను క్రీస్తు వద్దకు తీసుకురావడానికి సహాయం చేయడంలో నిజంగా శాశ్వతమైన ఆనందం ఉంది.30 తన మరియు ఇతరుల పరివర్తన కోసం శ్రమించడం గొప్ప కార్యమైయున్నది.31 ఆవిధంగా నేను యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.