సర్వసభ్య సమావేశము
హృదయమందు బలమైన మార్పు: “నీకివ్వడానికి నా దగ్గర ఇంకేమీ లేదు”
2022 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


10:57

హృదయమందు బలమైన మార్పు:

“నీకివ్వడానికి నా దగ్గర ఇంకేమీ లేదు”

హృదయము యొక్క ఈ మార్పు ఒక సంఘటన కాదు; అది జరగడానికి విశ్వాసం, పశ్చాత్తాపం మరియు నిరంతర ఆత్మీయ కార్యము అవసరము.

పరిచయము

1588, అక్టోబరు 28 శుక్రవారం నాడు, గ్రేట్ స్పానిష్ అర్మడాకు చెందిన లా గిరోనా అనే ఓడ చుక్కాని విరిగిపోయి కేవలం తెడ్ల చేత నడిపించబడి, ఉత్తర ఐర్లాండ్‌లోని లకాడా పాయింట్ వద్ద బండరాళ్ళను ఢీకొంది.1

ఓడ బోల్తాపడింది. మునిగిపోతున్న వారిలో బ్రతకడానికి ప్రయత్నిస్తున్న ఒకతను కొద్దినెలల క్రితం అతని భార్య ఇచ్చిన బంగారు ఉంగరాన్ని ధరించాడు, దాని మీద “నీకివ్వడానికి నా దగ్గర ఇంకేమీ లేదు” అని చెక్కబడి ఉంది.2

“నీకివ్వడానికి నా దగ్గర ఇంకేమీ లేదు,” అనే వాక్యము మరియు హృదయాన్ని పట్టుకొన్న చేయి రూపంతో ఉన్న ఉంగరము, తన భర్త కొరకు ఒక భార్య ప్రేమ యొక్క వ్యక్తీకరణ.

లేఖన సంబంధము

నేను ఈ కథ చదివినప్పుడు, అది నాపై లోతైన ముద్రవేసింది మరియు “మీరు విరిగిన హృదయమును, నలిగిన ఆత్మను బలిగా నాకు అర్పించెదరు” అని రక్షకుని చేత చేయబడిన అభ్యర్థన గురించి నేను ఆలోచించాను.3

రాజైన బెంజమిన్ మాటలకు జనుల స్పందన గురించి కూడా నేను ఆలోచించాను: “అవును, నీవు మాతో చెప్పిన మాటలన్నిటినీ మేము నమ్ముచున్నాము; …, మేము చెడు చేయుటకు ఇక ఏ మాత్రము కోరుకొనక నిరంతరము మంచి చేయుటకు కోరిక కలిగియుండునట్లు ఆ ఆత్మ మా యందు లేదా మా హృదయములందు గొప్ప మార్పు కలుగజేసెను.”4

వ్యక్తిగత సంబంధము

నేను 12 సంవత్సరాలు ఉన్నప్పుడు కలిగిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటాను, దాని ప్రభావం ఈనాటికీ నిలిచియుంది.

“ఎడ్వార్డో, త్వరగా రా. మనం సంఘ సమావేశాలకు ఆలస్యమవుతున్నాము,” అంది మా అమ్మ.

“అమ్మా, నేను ఈ రోజు నాన్నతో ఉండిపోతున్నాను,” అన్నాను నేను.

“నిజంగానా? నువ్వు నీ యాజకత్వ సమూహ సమావేశానికి హాజరవ్వాలి,” అంది ఆమె.

“పాపం నాన్న! ఆయన ఒంటరిగా ఉంటారు. నేను ఈ రోజు ఆయనతో ఉండిపోతాను,” అన్నాను.

నాన్న యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క సభ్యుడు కాదు.

మా అమ్మ మరియు అక్కచెల్లెళ్ళు ఆదివారం సమావేశాలకు వెళ్ళారు. కాబట్టి, నేను మా నాన్నను కలవడానికి ఆయన కర్మాగారానికి వెళ్ళాను, ఆదివారాలు అక్కడ ఉండేందుకు ఆయన ఇష్టపడతారు మరియు నేను మా అమ్మతో చెప్పినట్లుగా ఆయనతో కొంతసేపు గడిపిన తర్వాత, “నాన్న, అంతా బాగానే ఉందా?” అని అడిగాను.

ఆయన అలవాటు ప్రకారం రేడియోలు, గడియారాలు బాగుచేసుకుంటూ, నన్ను చూసి నవ్వారు.

అప్పుడు, “నేను నా స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్తున్నాను” అని ఆయనతో చెప్పాను.

తలెత్తి చూడకుండానే నాన్న నాతో, “ఈ రోజు ఆదివారం. నువ్వు సంఘానికి వెళ్ళాలి కదా? అన్నారు.

“అవును, కానీ నేను ఈ రోజు వెళ్ళనని అమ్మతో చెప్పాను,” అన్నాను నేను. నాన్న తన పనిలో మునిగిపోయారు మరియు నాకు అది వెళ్ళడానికి అనుమతివ్వడం వంటిది.

ఆరోజు ప్రొద్దున ఒక ముఖ్యమైన సాకర్ ఆట ఉంది మరియు నేను దాని నుండి తప్పుకోలేనని నా స్నేహితులు నాతో చెప్పారు, ఎందుకంటే మేము ఆ ఆట గెలవాలి.

నా సమస్య ఏమిటంటే, సాకర్ మైదానానికి వెళ్ళాలంటే నేను సంఘ భవనం ముందు నుండి వెళ్ళాలి.

నిర్ణయించుకొని నేను సాకర్ మైదానం వైపు కదిలాను మరియు పెద్ద ఆటంకమైన సంఘ భవనం ముందు ఆగాను. దారికి అటువైపునున్న పెద్ద చెట్ల వద్దకు నేను పరుగెత్తాను మరియు ఎవ్వరూ చూడకుండా వాటి మధ్య పరుగెత్తాలని నిర్ణయించుకున్నాను, ఎందుకంటే సభ్యులు సమావేశాలకు వచ్చే సమయమది.

సరిగ్గా ఆట ప్రారంభమయ్యే సమయానికి నేను చేరుకున్నాను. మా అమ్మ ఇంటి వచ్చే సమయానికి నేను ఆట ఆడి, ఇంటికి వెళ్ళిపోగలిగాను.

అంతా బాగానే జరిగింది; మా జట్టు గెలిచింది మరియు నాకు చాలా ఉత్సాహంగా అనిపించింది. కానీ మైదానం వైపుకు బాగా అమలుపరచిన ఆ పరుగు పరిచారకుల సమూహపు సలహాదారుని కంట్లో పడింది.

ఎవరి కంటా పడకుండా చెట్టు నుండి చెట్టుకు త్వరగా పరిగెడుతున్న నన్ను సహోదరుడు ఫీలిక్స్ ఎస్పినోజా చూసారు.

వారం ప్రారంభంలో, సహోదరుడు ఎస్పినోజా మా ఇంటికి వచ్చి, నాతో మాట్లాడాలని అడిగారు. ఆదివారం ఆయన చూసిన దాని గురించి ఆయన ఏమీ మాట్లాడలేదు, నేను సమావేశానికి ఎందుకు రాలేదని కూడా నన్ను అడగలేదు.

ఆయన ఒక పుస్తకం ఇచ్చి, ఇలా అన్నారు: “ఆదివారం నువ్వు యాజకత్వ తరగతికి బోధించాలని నేను కోరుతున్నాను. నీ కోసం ఒక పాఠాన్ని నేను గుర్తించాను. అది అంత కష్టమైనదేమీ కాదు. నువ్వు దానిని చదవాలని నేను కోరుతున్నాను. ఆ పాఠం కొరకు సిద్ధపడడంలో నీకు సహాయం చేయడానికి రెండు రోజుల్లో నేను తిరిగివస్తాను.” ఆ మాట చెప్పి, ఆయన పుస్తకాన్ని నా చేతికిచ్చి వెళ్ళిపోయారు.

తరగతికి బోధించాలని నేను కోరుకోవడం లేదు, కానీ చేయనని ఆయనతో నేను చెప్పలేను. ఆ ఆదివారం మళ్ళీ మా నాన్నతో ఉండిపోవాలని నేను ప్రణాళిక చేసాను, దానర్థం మరొక ముఖ్యమైన సాకర్ ఆట ఉంది.

యౌవనులు ఆరాధించే వ్యక్తి సహోదరుడు ఎస్పినోజా.5 ఆయన పునఃస్థాపించబడిన సువార్తను కనుగొని తన జీవితాన్ని, మరొకమాటలో చెప్పాలంటే తన మనస్సును మార్చుకున్నారు.

శనివారం మధ్యాహ్నం అయినప్పుడు, “సరే, రేపు ప్రొద్దున నేను ఆరోగ్యం బాగోలేనట్లుగా నటిస్తాను, అప్పుడు నేను సంఘానికి వెళ్ళనక్కరలేదు” అనుకున్నాను. నన్ను కలవరపెట్టింది సాకర్ ఆట కాదు; నేను బోధించవలసిన తరగతి, ప్రత్యేకించి సబ్బాతు దినము గురించిన పాఠం.

ఆదివారం వచ్చింది, ఎప్పటికంటే ఆరోగ్యంగా నేను మేల్కొన్నాను. నా దగ్గర ఏ సాకు లేదు—ఏవిధంగా తప్పించుకోలేను.

నేను పాఠాన్ని బోధించడం అదే మొదటిసారి, కానీ సహోదరుడు ఎస్పినోజా నా ప్రక్కనే నిలిచారు మరియు అది నా హృదయంలో బలమైన మార్పు జరిగిన రోజు.

ఆ క్షణం నుండి నేను సబ్బాతు దినాన్ని పరిశుద్ధంగా పాటించడం మొదలుపెట్టాను మరియు కొంతకాలానికి, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ చెప్పినట్లుగా, సబ్బాతు దినము ఆనందంగా మారింది.6

“ప్రభువా, నేను అన్నీ నీకిస్తాను; నీకివ్వడానికి నా దగ్గర ఇంకేమీ లేదు.”

పొందడం

హృదయమందు ఆ బలమైన మార్పును మనం ఎలా పొందుతాము? అది మొదలుపెట్టబడింది మరియు క్రమంగా సంభవిస్తుంది

  1. యేసు క్రీస్తు యందు మన విశ్వాసాన్ని బలపరిచే జ్ఞానాన్ని పొందడానికి మనం లేఖనాలను చదివినప్పుడు, అది మార్పుచెందాలనే కోరికను పుట్టిస్తుంది;7

  2. ప్రార్థన మరియు ఉపవాసము ద్వారా మనం ఆ కోరికను వృద్ధిచేసినప్పుడు;8

  3. మనం చదివిన లేదా పొందిన వాక్యం ప్రకారం మనం పనిచేసినప్పుడు మరియు రాజైన బెంజమిన్ జనుల వలె మన హృదయాలను ఆయనకు లోబరుస్తామని నిబంధన చేసినప్పుడు.9

గుర్తింపు మరియు నిబంధన

మన హృదయం మారుతోందని మనకెలా తెలుస్తుంది?10

  1. అన్ని విషయాలలో మనం దేవుడిని సంతోషపెట్టాలని కోరుకున్నప్పుడు.11

  2. ఇతరులను ప్రేమతో, గౌరవంతో మరియు ఆలోచనతో ఆదరించినప్పుడు.12

  3. క్రీస్తు యొక్క లక్షణాలు మన స్వభావంలో భాగంగా మారుతున్నాయని మనం చూసినప్పుడు.13

  4. నిరంతరం పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును మనం అనుభవించినప్పుడు.14

  5. విధేయత చూపడానికి మనకు కష్టమనిపించిన ఒక ఆజ్ఞను మనం పాటించినప్పుడు మరియు దానిని పాటించడాన్ని కొనసాగించినప్పుడు.15

మనం మన నాయకుల సలహాను శ్రద్ధగా విని, సంతోషంగా దానిని పాటించడానికి నిర్ణయించుకున్నప్పుడు, మనం హృదయమందు ఒక బలమైన మార్పును అనుభవించలేదా?

“ప్రభువా, నేను అన్నీ నీకిస్తాను; నీకివ్వడానికి నా దగ్గర ఇంకేమీ లేదు.”

నిర్వహణ మరియు లాభాలు

బలమైన మార్పును మనమెలా నిలుపుకోగలము?

  1. ప్రతీవారం మనం సంస్కారములో పాలుపొందినప్పుడు, మనపైన క్రీస్తు నామమును తీసుకొంటామని, ఎల్లప్పుడూ ఆయనను జ్ఞాపకముంచుకుంటామని, ఆయన ఆజ్ఞలను పాటిస్తామనే నిబంధనను క్రొత్తదిగా చేసినప్పుడు.16

  2. మన జీవితాలను దేవాలయము వైపు త్రిప్పినప్పుడు.17 మనం విధులలో పాల్గొనినప్పుడు, నూతనంగా మరియు క్రొత్తదిగా చేయబడిన హృదయాన్ని నిలుపుకోవడానికి క్రమంతప్పక దేవాలయానికి హాజరవడం మనకు సహాయపడుతుంది.

  3. పరిచర్య కార్యక్రమాలు మరియు సువార్త పరిచర్య ద్వారా మనం మన పొరుగువారిని ప్రేమించి, సేవ చేసినప్పుడు.18

అప్పుడు మనం అధికంగా ఆనందించేలా ఆ అంతర్గత మార్పు బలపరచబడుతుంది మరియు అది సత్‌క్రియలయందు విస్తరించే వరకు వ్యాపిస్తుంది.19

హృదయమందు ఈ బలమైన మార్పు మనకు స్వేచ్ఛ, నమ్మకం మరియు శాంతి భావాలను తెస్తుంది.20

హృదయము యొక్క ఈ మార్పు ఒక సంఘటన కాదు; అది జరగడానికి విశ్వాసం, పశ్చాత్తాపం మరియు నిరంతర ఆత్మీయ కార్యము అవసరము. మన చిత్తాన్ని ప్రభువుకు లోబరచాలని మనం కోరుకున్నప్పుడు అది ప్రారంభమవుతుంది మరియు ఆయనతో నిబంధనలలోకి ప్రవేశించి, వాటిని పాటించినప్పుడు అది సంభవిస్తుంది.

ఆ వ్యక్తిగత చర్య మన పైన మరియు మన చుట్టూ ఉన్న వారిపైన సానుకూల ప్రభావం చూపుతుంది.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారి మాటలలో, “మనమందరము యేసు క్రీస్తును అనుసరించి, ఆయన బోధనలను వినాలని ఎంచుకున్నట్లయితే, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వినాశకర యుద్ధాలు మరియు మన వ్యక్తిగత జీవితాల్లోనివి ఎంత త్వరగా పరిష్కరించబడతాయో ఊహించండి.”21 రక్షకుని బోధనలను అనుసరించడమనే ఈ చర్య హృదయమందు ఒక బలమైన మార్పుకు దారితీస్తుంది.

ప్రియమైన సహోదర సహోదరీలారా, యౌవనులారా, పిల్లలారా, ఈ వారాంతం మనము సమావేశంలో పాల్గొనినప్పుడు, బలమైన మార్పును అనుభవించేలా ప్రభువు నుండి వచ్చే మన ప్రవక్తల మాటలు మన హృదయాలలోనికి ప్రవేశించనివ్వండి.

ప్రభువు యొక్క పునఃస్థాపించబడిన సంఘములో ఇంకా చేరని వారి కొరకు, దేవుడు మీ నుండి ఏమి ఆశిస్తున్నాడో తెలుసుకొనేందుకు మనఃపూర్వకమైన కోరికతో సువార్తికులను వినమని మరియు ఆ అంతర్గత మార్పును అనుభవించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.22

ప్రభువైన యేసు క్రీస్తును అనుసరించాలని నిర్ణయించవలసిన రోజు ఇదే. “ప్రభువా, నేను అన్నీ నీకిస్తాను; నీకివ్వడానికి నా దగ్గర ఇంకేమీ లేదు.”

ధ్వంసమైన ఓడ నుండి ఉంగరం తిరిగి పొందబడినట్లు, మనం మన హృదయాలను దేవునికి ఇచ్చినప్పుడు మనం ఈ జీవితపు సమస్యల నుండి కాపాడబడతాము, ఆ ప్రక్రియలో మనం మెరుగుపెట్టబడతాము, క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా శుద్ధిచేయబడతాము మరియు ఆత్మీయంగా “ఆయన ద్వారా జన్మించి, క్రీస్తు యొక్క సంతానము” అవుతాము.23 దీనిని గూర్చి నేను యేసు క్రీస్తు నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.