సర్వసభ్య సమావేశము
మనము యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము
2022 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


10:0

మనము యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము

సంఘము అనేది భవనాలు, ధార్మిక నిర్మాణాలను మించినది; సంఘము అంటే మనము, సభ్యులము, క్రీస్తును అధిపతిగా మరియు ప్రవక్తను ఆయన ప్రతినిధిగా కలిగియున్నాము.

“వచ్చి చూడండి”1 అనే ఆహ్వానాన్ని పొందిన తర్వాత, మొదటిసారిగా నేను 26 ఏళ్ళ వయస్సులో యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘానికి హాజరయ్యాను. అంతకుముందే నేను నా మొదటి భర్త నుండి విడిపోయాను. నాకు మూడేళ్ళ కొడుకు ఉన్నాడు. భయంతో నేను శక్తిహీనురాలిగా భావించాను. నేను భవనంలోకి ప్రవేశించినప్పుడు, నా చుట్టూ ఉన్నవారి విశ్వాసాన్ని, ఆనందాన్ని చూసి ఉత్సాహంతో నింపబడ్డాను. అది నిజంగా “గాలివాన తగులకుండా ఆశ్రయముగానున్నది.”2 మూడు వారాల తర్వాత, నేను పరలోక తండ్రితో బాప్తిస్మపు నిబంధన చేసాను మరియు ఆ ప్రయాణంలో నా జీవితం పరిపూర్ణంగా లేనప్పటికీ, క్రీస్తు యొక్క శిష్యురాలిగా నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను.

నేను ఆ నిత్య దీవెనలను పొందడానికి అనేక భౌతిక, ఆత్మీయ అంశాలు వాటి సరైన స్థానంలో ఉండవలసి వచ్చింది. యేసు క్రీస్తు యొక్క సువార్త పునఃస్థాపించబడి, ప్రకటించబడింది; ఆ సమావేశ మందిరం నిర్మించబడి, నిర్వహించబడింది; అక్కడ ప్రవక్త నుండి స్థానిక నాయకుల వరకు ధార్మిక నిర్మాణమున్నది; మేము రక్షకుని వద్దకు తీసుకురాబడినప్పుడు నన్ను, నా బిడ్డను అంగీకరించడానికి నిబంధన సభ్యులతో నిండియున్న ఒక శాఖ సిద్ధంగా ఉంది, మేము “దేవుని సువార్త ద్వారా పోషింపబడి,”3 సేవ చేయడానికి అవకాశాలు ఇవ్వబడ్డాము.4

ఆది నుండి “[మనకు] అమర్త్యత్వమును, నిత్యజీవమును ఇచ్చుటకే”6 దేవుడు తన పిల్లలను సమకూర్చి, వ్యవస్థీకరించాలని కోరారు.5 ఆ ఉద్దేశ్యాన్ని మనస్సులో ఉంచుకొని, ఆరాధనా స్థలాలను నిర్మించమని ఆయన మనకు సూచించారు,7 అక్కడ మనం జ్ఞానాన్ని, రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క విధులను పొందుతాము; యేసు క్రీస్తుతో మనల్ని బంధించే నిబంధనలను చేసి, పాటిస్తాము;8 “దైవత్వపు శక్తి” చేత దీవించబడతాము;9 మరియు యేసును జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయనలో ఒకరినొకరు బలపరచుకోవడానికి తరచు సమకూడుతాము.10 సంఘ నిర్మాణము మరియు దాని భవనాలు మన ఆత్మీయ లాభం కొరకు ఉన్నాయి. “సంఘము … మనం నిర్మించే నిత్య కుటుంబాలకు తాత్కాలిక కట్టడం లాంటిది.”11

కష్టంలో ఉన్న ఒక స్నేహితుడితో మాట్లాడుతున్నప్పుడు, ఆర్థికంగా అతడు ఎలా నెట్టుకొస్తున్నాడని నేను అడిగాను. ఉపవాస అర్పణ నిధులను ఉపయోగించి బిషప్పు అతనికి సహాయం చేస్తున్నారని కన్నీళ్ళతో అతడు జవాబిచ్చాడు. “సంఘము లేకపోయినట్లయితే నేను, నా కుటుంబము ఏమైపోయేవారమో” అని అతడు అన్నాడు. “సంఘము అంటే సభ్యులు. అవసరంలో ఉన్న మనలాంటి వారికి సహాయపడేందుకు ఇష్టపూర్వకంగా, ఆనందంగా ఉపవాస అర్పణలు ఇచ్చేది వారే. వారి విశ్వాసం మరియు యేసు క్రీస్తును అనుసరించాలనే దృఢసంకల్పం యొక్క ఫలితాలను నువ్వు పొందుతున్నావు” అని నేను చెప్పాను.

క్రీస్తు యొక్క నా సహ శిష్యులారా, మనలో బలహీనతలు ఉన్నప్పటికీ, ఆయన సంఘమైన మన ద్వారా ప్రభువు చేస్తున్న అద్భుతకార్యాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. కొన్నిసార్లు మనం ఇచ్చేవారము, మరికొన్నిసార్లు మనం పొందేవారము, కానీ క్రీస్తునందు మనమందరము ఒకే కుటుంబము. మనము ఆయనను ఆరాధిస్తూ, ఒకరికొకరు సేవ చేసుకుంటున్నప్పుడు మనల్ని నడిపించి, దీవించడానికి ఆయన ఇచ్చిన నిర్మాణమే ఆయన సంఘము.

కొంతమంది సహోదరీలు ప్రాథమికలో లేదా యువతులతో సేవచేస్తున్న కారణంగా తాము ఉపశమన సమాజంలో క్రియాశీలక సభ్యులుగా ఉండడం లేదని అనుకుంటూ నాకు క్షమాపణలు చెప్పారు. ఆ సహాదరీలు ఉపశమన సమాజం యొక్క అత్యంత క్రియాశీలక సభ్యులలో ఉన్నారు, ఎందుకంటే అమూల్యమైన మన పిల్లలు మరియు యువతకు యేసు క్రీస్తు యందు తమ విశ్వాసాన్ని బలపరచుకోవడంలో వారు సహాయపడుతున్నారు.

ఉపశమన సమాజము ఒక భవనంలో ఒక గదికి, ఆదివారపు పాఠానికి, ఒక ప్రోత్సాహ కార్యక్రమానికి, స్థానిక లేదా పై స్థాయిలో గల అధ్యక్షత్వానికి పరిమితం కాదు. ఉపశమన సమాజము అంటే సంఘము యొక్క నిబంధన స్త్రీలు; అంటే మనముమనలో ప్రతీఒక్కరు మరియు మనమందరము. అది “దయ మరియు సేవ యొక్క మన అంతర్జాతీయ సమాజము.”12 ఉపశమనం: “పేదరికం నుండి ఉపశమనం, రోగం నుండి ఉపశమనం; సందేహం నుండి ఉపశమనం, అజ్ఞానము నుండి ఉపశమనం—ఆనందం మరియు వృద్ధిని ఆటంకపరిచే … వాటన్నిటి నుండి ఉపశమనాన్ని”14 అందించడం ద్వారా వ్యక్తిగతమైన, అలాగే సమిష్టి విధానాలలో13 దేవుని కార్యాన్ని సాధించాలని స్త్రీల కొరకు గల దాని దైవిక ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి మనం ప్రయత్నిస్తున్నప్పుడు, మనం వెళ్ళే ప్రతీచోట మనం ఎల్లప్పుడూ ఉపశమన సమాజంలో భాగమవుతాము.

అదేవిధమైన అనుబంధం పెద్దల సమూహాలలో, మన పిల్లలు మరియు యువతతో పాటు అన్ని వయస్సుల వారి కొరకు గల సంఘ నిర్మాణాలలో ఉంటుంది. సంఘము అనేది భవనాలు, ధార్మిక నిర్మాణాలను మించినది; సంఘము అంటే మనము, సభ్యులము. మనము యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము, క్రీస్తును అధిపతిగా మరియు ప్రవక్తను ఆయన ప్రతినిధిగా కలిగియున్నాము. ప్రభువు ఇలా చెప్పారు:

“ఇదిగో, ఇది నా సిద్ధాంతము—ఎవరైతే పశ్చాత్తాపపడి నా యొద్దకు వచ్చెదరో, అట్టివారే నా సంఘమువారు. …

“మరియు … ఎవడైనా నా సంఘమునకు చెందియుండి, నా సంఘములో అంతము వరకు సహించినయెడల, వానిని నేను నా బండపై నిర్మించెదను.”15

సహోదర సహోదరీలారా, యేసు క్రీస్తు యొక్క సంఘానికి చెందియున్నందుకు మనమెంత అదృష్టవంతులమో తెలుసుకుందాం, ఆయన గొప్ప అద్భుతాలను చేయడానికి అక్కడ మనం మన విశ్వాసాన్ని, హృదయాలను, బలాలను, మనస్సులను మరియు చేతులను ఏకం చేయగలము. “[క్రీస్తు సంఘము యొక్క] శరీరమొక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది.”16

ఒక యౌవనుడు తన తల్లితో ఇలా చెప్పాడు, “నా చిన్నప్పుడు, దశమభాగం కొరకు నేను ఒక డాలరు ఇచ్చిన ప్రతీసారి ఆ ఒక్క డాలరుతో పూర్తి సమావేశ మందిరం నిర్మించబడుతుందని నేను అనుకొనేవాడిని. ఎంత అవివేకము?”

మనస్సున తాకబడిన ఆమె ఇలా అంది, “అది ఎంతో బాగుంది! వాటిని నీ మనస్సులో నువ్వు ఊహించుకున్నావా?”

“అవును!” “అవి అందంగా ఉన్నాయి మరియు అవి లక్షల్లో ఉన్నాయి!” అని అతడు గట్టిగా చెప్పాడు.17

నా ప్రియమైన స్నేహితులారా, ఒక బిడ్డకున్న విశ్వాసాన్ని మనం కలిగియుందాం మరియు మన అతిచిన్న ప్రయత్నాలు కూడా దేవుని రాజ్యంలో చెప్పుకోదగిన మార్పును కలుగజేస్తాయని తెలుసుకొని ఆనందిద్దాం.

ఒకరినొకరం క్రీస్తునొద్దకు తీసుకురావడమే ఆయన రాజ్యములో మన ఉద్దేశ్యము అయ్యుండాలి. మనం లేఖనాలలో చదివినట్లుగా, రక్షకుడు నీఫైయులకు ఈ ఆహ్వానాన్ని అందించారు:

“మీ మధ్య రోగులెవరైనా ఉన్నారా? వారిని ఇక్కడకు తీసుకురండి. ఏ విధముగానైనా బాధింపబడిన వారు మీలోనున్నారా? వారిని ఇక్కడకు తీసుకురండి, నేను వారిని స్వస్థపరిచెదను, ఏలయనగా నేను మీ యెడల కనికరము కలిగియున్నాను; నా ఆంత్రములు కనికరముతో నిండియున్నవి.

“… నేను మిమ్ములను స్వస్థపరచుటకు మీ విశ్వాసము చాలునని నేను చూచుచున్నాను.”18

రక్షకుని పాదాల వద్దకు తీసుకొని రాబడగల బాధలను మనమందరము కలిగియుండలేదా? మనలో కొందరు శారీరక సవాళ్ళను కలిగియున్నారు, అనేకమంది మానసిక యుద్ధం చేస్తున్నారు, ఇతరులు సామాజిక బంధాలను నిలుపుకోవడానికి శ్రమిస్తున్నారు మరియు మన ఆత్మలు సవాలు చేయబడినప్పుడు మనమందరం విశ్రాంతి కోరుకుంటాము. మనమందరము ఏదో ఒక విధంగా బాధింపబడినవారము.

“సమూహమంతా కలిసి వారి రోగులను మరియు … ఏ విధముగానైనను బాధింపబడిన వారందరిని తీసుకొని ముందుకు వెళ్ళిరి; ఆయన యొద్దకు వారిని తీసుకురాగా, ఆయన వారిలో ప్రతివానిని స్వస్థపరిచెను.

“వారందరు, అనగా స్వస్థపరచబడినవారు మరియు ఆరోగ్యముగా ఉన్నవారు ఇరువురు ఆయన పాదములవద్ద మోకరించి, ఆయనను ఆరాధించిరి”19 అని మనము చదువుతాము.

విశ్వాసంతో దశమభాగం చెల్లించే చిన్నపిల్లవాడికి, ప్రభువు యొక్క అధికారమిచ్చు కృప అవసరమైన ఒంటరి తల్లికి, తన కుటుంబాన్ని పోషించడానికి శ్రమిస్తున్న తండ్రికి, రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క విధులు అవసరమైన మన పూర్వీకులకు, ప్రతీవారం దేవునితో నిబంధనలను మళ్ళీ క్రొత్తగా చేస్తున్న మనలో ప్రతీఒక్కరికి, ఒకరికి ఒకరం అవసరం మరియు మనం ఒకరిని ఒకరం రక్షకుని యొక్క విమోచించు స్వస్థతకు తీసుకురాగలము.

నా ప్రియమైన సహోదర సహోదరీలారా, మనల్ని మరియు మన బాధలను ఆయన వద్దకు తీసుకురమ్మనే యేసు క్రీస్తు యొక్క ఆహ్వానాన్ని మనం అనుసరిద్దాం. మనం ఆయన వద్దకు వచ్చినప్పుడు మరియు మనం ప్రేమించే వారిని ఆయన వద్దకు తీసుకువచ్చినప్పుడు, ఆయన మన విశ్వాసాన్ని చూస్తారు. ఆయన వారిని స్వస్థపరుస్తారు మరియు ఆయన మనల్ని స్వస్థపరుస్తారు.

“క్రీస్తు యొక్క సమాధానకరమైన శిష్యులుగా,”20 “ఏక హృదయమును, ఏక మనస్సును కలిగియున్నవారిగా ”21 కావడానికి మరియు వినయ విధేయతలు కలిగి, మృదువుగానుండి, సుళువుగా లోబడునట్లుండి, సహనము మరియు దీర్ఘశాంతముతో నిండి, సమస్త విషయములలో మితముగానుండి, అన్ని సమయములలో దేవుని ఆజ్ఞలు గైకొనుట యందు శ్రద్ధగా ఉండి, విశ్వాసము, నిరీక్షణ మరియు దాతృత్వము కలిగియుండి, సత్‌క్రియల యందు వర్థిల్లడానికి మనం ప్రయత్నిస్తున్నాము.22 మనం యేసు క్రీస్తు వలె కావడానికి ప్రయత్నిస్తున్నాము.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించినట్లుగా, క్రీస్తు యొక్క సంఘముగా మన ద్వారా “మన రక్షకుడు, విమోచకుడైన యేసు క్రీస్తు ఇప్పుడు మరియు ఆయన మరల తిరిగి వచ్చే సమయానికి మధ్య ఆయన అద్భుతకార్యములలో కొన్నిటిని నెరవేరుస్తారని”23 నేను సాక్ష్యమిస్తున్నాను.

ప్రభువు ఇలా చెప్పారు:

“ఇదిగో, తగిన కాలమందు నా కార్యమును నేను త్వరపెట్టుదును.

“నేను … మీకు ఒక ఆజ్ఞ ఇచ్చుచున్నాను, అదేమనగా మీకు మీరుగా కూడివచ్చి, మిమ్ములను మీరు ఏర్పరచుకొనుడి, మీకు మీరు సిద్ధపడుడి, మిమ్ములను మీరు పరిశుద్ధపరచుకొనుడి; అవును, నేను మిమ్ములను పవిత్రులుగా చేయుటకు మీ హృదయములను శుద్ధిచేసుకొనుడి, మీ చేతులను, మీ పాదములను కడుగుకొనుడి.”24

మనం ఈ దైవిక ఆహ్వానానికి స్పందించాలని, ఆనందంగా మనల్ని మనం కూడుకొని, ఏర్పరచుకొని, సిద్ధపరచుకొని, పరిశుద్ధపరచుకోవాలని నేను వినయపూర్వకంగా యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్.