సర్వసభ్య సమావేశము
దేవునితో మన సంబంధము
2022 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


13:17

దేవునితో మన సంబంధము

మన మర్త్య అనుభవం ఏమైనప్పటికీ, మనం దేవుడిని విశ్వసించగలము మరియు ఆయనలో ఆనందాన్ని పొందగలము.

పాత నిబంధనలో యోబు వలె, శ్రమ కాలంలో దేవుడు తమను విడిచిపెట్టారని కొందరు భావించవచ్చు. ఏ బాధనైనా నివారించే లేదా తొలగించే శక్తి దేవునికి ఉందని మనకు తెలుసు కాబట్టి, ఆయన దానిని చేయకపోతే ఫిర్యాదు చేయడానికి మనం శోధింపబడవచ్చు, బహుశా ఇలా ప్రశ్నించవచ్చు, “నేను ప్రార్థించి అడిగే సహాయం దేవుడు ఇవ్వకపోతే, నేను ఆయనపై ఎలా విశ్వాసం ఉంచగలను?” తన తీవ్రమైన పరీక్షలలో ఒక సమయంలో, నీతిమంతుడైన యోబు ఇలా అన్నాడు:

“ఆలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసెననియు తన వలలో నన్ను చిక్కించుకొనెననియు మీరు తెలిసికొనుడి.

“‘నామీద బలాత్కారము జరుగుచున్నదని’ నేను మొఱ్ఱపెట్టుచున్నాను! గాని నా మొఱ్ఱ అంగీకరింపబడదు; సహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను గాని న్యాయము దొరకదు.”1

యోబుకు తన ప్రతిస్పందనలో, దేవుడు ఇలా అపేక్షించును, “నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నామీద అపరాధము మోపుదువా?”2 లేదా మరో మాటలో చెప్పాలంటే, “నన్ను కూడా తప్పిదములో పడవేయుదువా?” “నీతిమంతుడవని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుదువా?”3 యెహోవా తన సర్వశక్తి మరియు సర్వజ్ఞత గురించి యోబుకు బలవంతంగా గుర్తుచేస్తారు మరియు దేవుడు కలిగియున్న జ్ఞానం, శక్తి మరియు నీతికి దగ్గరగా ఏదీ తాను కలిగిలేడని మరియు సర్వశక్తిమంతుని తీర్పులో నిలబడలేడని లోతైన వినయంతో యోబు ఒప్పుకుంటాడు:

“నీవు సమస్తక్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలిసికొంటిని.

“… ఆలాగున వివేచనలేనివాడనైన నేను ఏమియు నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడితిని. …

“కావున నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను బూడిదెలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను.”4

చివరికి, యోబుకు ప్రభువును చూసే భాగ్యం లభించింది మరియు “యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటె మరి అధికముగా ఆశీర్వదించెను.”5

మన మర్త్య హ్రస్వదృష్టితో మనం దేవుడిని తీర్పు తీర్చాలని భావించడం, ఉదాహరణకు, “నేను సంతోషంగా లేను, కాబట్టి దేవుడు ఏదో తప్పు చేస్తున్నాడు” అని ఆలోచించడం నిజంగా మూర్ఖత్వం. గతం, వర్తమానం మరియు భవిష్యత్తు గురించి చాలా తక్కువగా తెలిసిన, పతనమైన ప్రపంచంలో దేవుని మర్త్య సంతానమైన మనకు ఆయన ఇలా ప్రకటించారు,“అన్ని విషయములు నాతోనున్నవి, ఏలయనగా వాటన్నిటిని నేను యెరిగియున్నాను.”6 జేకబ్ తెలివిగా హెచ్చరించాడు: “ప్రభువుకు సలహా ఇచ్చుటకు ప్రయత్నించవద్దు, కానీ ఆయన నుండి సలహా తీసుకొనుటకు ప్రయత్నించుడి. ఏలయనగా, ఆయన సమస్త సృష్టిపై వివేకమందు, న్యాయమందు, గొప్ప కనికరమందు సలహా ఇచ్చునని మీకై మీరు ఎరుగుదురు.”7

ఆయనకు విధేయత చూపడం వలన నిర్ణీత కాలపరిధులలో నిర్దిష్ట ఫలితాలు వస్తాయని కొందరు దేవుని వాగ్దానాలను అపార్థం చేసుకుంటారు. వారు ఇలా అనుకోవచ్చు, “నేను పూర్తి-కాల సువార్తసేవను శ్రద్ధగా చేస్తే, దేవుడు నాకు సంతోషకరమైన వివాహాన్ని మరియు పిల్లలను అనుగ్రహిస్తారు,” లేదా “నేను విశ్రాంతి దినమున పాఠశాలపని చేయడం మానివేస్తే, దేవుడు నన్ను మంచి శ్రేణితో ఆశీర్వదిస్తారు,” లేదా “ నేను దశమభాగము చెల్లిస్తే, నేను కోరుకున్న ఆ పనిని దేవుడు నాకు అనుగ్రహిస్తారు.” జీవితం ఖచ్చితంగా ఈ విధంగా లేకుంటే లేదా ఊహించిన కాలపట్టిక ప్రకారం జరగకపోతే, వారు దేవునిచేత మోసగించబడినట్లు భావించవచ్చు. కానీ దేవునితో విషయాలు వాటంతటవే లేదా సాధారణ మార్గంలో జరగవు. మనం (1) కోరుకున్న ఆశీర్వాదాన్ని ఎంచుకుని, (2) అవసరమైన మంచి పనుల మొత్తాన్ని చొప్పించి, (3) ఆజ్ఞ ఇచ్చిన తక్షణమే అందించబడే కాస్మిక్ వెండింగ్ యంత్రం‌గా దేవుని ప్రణాళికను మనం భావించకూడదు.8

దేవుడు మనలో ప్రతీఒక్కరితో చేసిన తన నిబంధనలను మరియు వాగ్దానాలను నిజంగా గౌరవిస్తారు. దాని గురించి మనం చింతించవలసిన అవసరం లేదు.9 అన్నిటికంటే క్రిందకు దిగి, తరువాత పైకి ఆరోహణమై10, పరలోకములో మరియు భూలోకములో11 సర్వశక్తిని కలిగియున్న యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త శక్తి దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చగలరని మరియు నెరవేరుస్తారని నిర్ధారిస్తుంది. మనం ఆయన చట్టాలను గౌరవించడం మరియు పాటించడం చాలా అవసరం, అయితే చట్టానికి విధేయత చూపడంపై ఆధారపడియున్న ప్రతీ దీవెన12 మన అంచనాలకు అనుగుణంగా రూపొందించబడదు, రూపకల్పన చేయబడదు మరియు సమయం నిర్ణయించబడదు. మనము మన వంతు కృషి చేస్తాము, కానీ లౌకిక మరియు ఆత్మీయ దీవెనల నిర్వహణను ఆయనకు అప్పగించాలి.

తన విశ్వాసం నిర్దిష్ట ఫలితాలు లేదా ఆశీర్వాదాలపై నిర్మించబడలేదని, యేసు క్రీస్తుతో తనకున్న సాక్ష్యం మరియు సంబంధంపై నిర్మించబడిందని అధ్యక్షులు బ్రిగమ్ యంగ్ వివరించారు. ఆయన ఇలా అన్నారు: “నా విశ్వాసం ప్రభువు సముద్ర ద్వీపాల మీద పని చేయడంపై, ప్రజలను ఇక్కడికి తీసుకురావడంపై, … లేదా ఆయన ఈ ప్రజలకు లేదా ఆ ప్రజలకు అందించే అనుగ్రహంపై ఉంచబడలేదు, మనం ఆశీర్వదించబడ్డామా లేదా అనే దానిపై కాదు, కానీ నా విశ్వాసం ప్రభువైన యేసు క్రీస్తుపై మరియు ఆయన నుండి నేను పొందిన జ్ఞానంపై ఉంచబడింది.”13

మన పశ్చాత్తాపం మరియు విధేయత, మన త్యాగాలు మరియు మన మంచి పనులు ముఖ్యమైనవి. ఈథర్ వివరించినట్లుగా “ఎల్లప్పుడు సత్‌క్రియలయందు విస్తరించు”14 వారిలో మనం కూడా ఉండాలనుకుంటాము. అంతేకాని సిలెస్టియల్ ఖాతా పుస్తకాలలో ఎక్కించబడే కొన్ని లెక్కల కారణంగా సత్‌క్రియలు చేయము. ఈ విషయాలు ముఖ్యమైనవి, ఎందుకంటే అవి మనల్ని దేవుని పనిలో నిమగ్నం చేస్తాయి మరియు ప్రకృతిసంబంధియైన మనుష్యుని నుండి పరిశుద్ధునిగా మనం పరివర్తన చెందుటలో మనము ఆయనతో సహకరించే సాధనాలు ఇవి.15 మన పరలోక తండ్రి తనను, తన కుమారుడిని మరియు మన విమోచకుడైన యేసు క్రీస్తు యొక్క దయ మరియు మధ్యవర్తిత్వం ద్వారా వారితో సన్నిహితమైన, శాశ్వతమైన సంబంధాన్ని మనకు అందిస్తున్నారు.

మనము దేవుని పిల్లలము మరియు అమర్త్యత్వము, నిత్య జీవము కొరకు ప్రత్యేకించబడ్డాము. ఆయన వారసులుగా, “క్రీస్తుతోడి వారసులుగా”16 కావడమే మన గమ్యస్థానము. మన తండ్రి మన వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా మరియు ఆయనతో మన అంతిమ ఆనందం కోసం ఆయన ప్రణాళికకు అనుగుణంగా రూపొందించిన దశలతో మనలో ప్రతీఒక్కరిని తన నిబంధన మార్గంలో నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. తండ్రి మరియు కుమారునిపై పెరుగుతున్న నమ్మకం మరియు విశ్వాసం, వారి ప్రేమ గురించి పెరుగుతున్న భావం, పరిశుద్ధాత్మ యొక్క స్థిరమైన ఓదార్పు మరియు మార్గదర్శకత్వాన్ని మనం ఊహించవచ్చు.

అయినప్పటికీ, ఈ మార్గం మనలో ఎవరికీ సులభం కాదు. అది సులువుగా ఉండాలంటే చాలా ఎక్కువ శుద్ధి అవసరం. యేసు ఇలా చెప్పారు:

“నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు.

“నాలో ఫలింపని ప్రతి తీగెను [తండ్రి] తీసి పారవేయును; ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును.”17

దేవుడు నిర్దేశించిన ప్రక్షాళన మరియు శుద్ధి ప్రక్రియ, అవసరాన్ని బట్టి, కొన్ని సమయాల్లో విపరీతంగా మరియు బాధాకరంగా ఉంటుంది. పౌలు యొక్క వ్యక్తీకరణను జ్ఞాపకము చేసుకుంటూ మనము “ క్రీస్తుతోకూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతోడి వారసులము.”18

కాబట్టి, ఈ కంసాలి అగ్ని మధ్యలో ఉన్నప్పుడు, దేవునిపై కోపపడుటకు బదులు, దేవునికి దగ్గరవ్వండి. కుమారుని నామములో తండ్రిని ప్రార్థించండి. అనుదినము ఆత్మ యందు వారితో నడవండి. కాలక్రమేణా మీ పట్ల వారి విశ్వసనీయతను వ్యక్తపరచడానికి వారిని అనుమతించండి. వారిని తెలుసుకోవడం కోసం మరియు మిమ్మల్ని మీరు తెలుసుకోవడం కోసం నిజంగా ముందుకు రండి.19 దేవునికి మిక్కిలి ప్రాధాన్యతనివ్వండి.20 రక్షకుడు మనకు మరలా ఇలా అభయమిస్తున్నారు:

“ఇలా చెప్పుచూ తండ్రితో మీ న్యాయవాదిగానుండి, ఆయన యెదుట మిమ్ములను గూర్చి బ్రతిమాలుచున్న వానిని ఆలకించుము—

“తండ్రీ, ఏ పాపము చేయని వాని శ్రమలను, మరణమును చూడుము, వానియందు నీవు అధికముగా ఆనందించితివి; చిందించబడిన నీ కుమారుని రక్తమును, నీవు మహిమపరచబడునట్లు నీవిచ్చిన అతని రక్తమును చూడుము;

కాబట్టి తండ్రీ, వారు నా యొద్దకు వచ్చి, నిత్య జీవమును పొందునట్లు నా నామమందు విశ్వాసముంచు ఈ నా సహోదరులను [మరియు నా సహోదరీలను] కాపాడుము.”21

దేవుడు వాగ్దానం చేసిన దీవెనలు జీవములోను లేదా మరణములోను వారిపై ఉంటాయని ధైర్యంగా ఉండి, ఆయనను నమ్మిన విశ్వాసులైన స్త్రీ పురుషుల ఉదాహరణలను పరిశీలించండి. దేవుడు ఒక నిర్దిష్ట సందర్భంలో లేదా క్షణంలో ఏమి చేసారు లేదా ఏమి చేయలేదు అనే దానిపై వారి విశ్వాసం ఆధారపడలేదు, కానీ ఆయనను తమ దయగల తండ్రిగా మరియు యేసు క్రీస్తును తమ నమ్మకమైన విమోచకునిగా తెలుసుకోవడంపై ఆధారపడింది.

అబ్రాహాము ఎల్కానా యొక్క ఐగుప్తు యాజకుని చేత బలి ఇవ్వబడబోతున్నప్పుడు, రక్షించమని అతడు దేవునికి మొరపెట్టగా, దేవుడు రక్షించారు.22 విశ్వాసులకు తండ్రిగా అగుటకు అబ్రాహాము జీవించాడు, అతడి సంతానం ద్వారా భూమిపైనున్న కుటుంబాలన్నీ ఆశీర్వదించబడతాయి.23 ఇంతకుముందు, ఇదే బలిపీఠం మీద, అదే యాజకుడు ముగ్గురు కన్యలను అర్పించాడు, వారు “తమ సుగుణము వలన బలిగా అర్పించబడిరి … కొయ్య లేదా రాతి ప్రతిమలకు వారు సాగిలపడుటకు ఇష్టపడలేదు.”24 వారక్కడ హతసాక్షులుగా మరణించారు.

పూర్వకాలపు యోసేపు, యౌవనుడిగా ఉన్నప్పుడు తన సహోదరులు చేత బానిసగా అమ్మివేయబడ్డాడు, తన బాధలో దేవుని వైపు తిరిగాడు. క్రమంగా, అతను ఐగుప్తులోని తన యజమాని ఇంట్లో ప్రాముఖ్యతను సంతరించుకున్నాడు, అయితే పోతీఫరు భార్య యొక్క తప్పుడు ఆరోపణల కారణంగా అతని అభివృద్ధి అంతా తుడిచిపెట్టుకుపోయింది. “కాబట్టి, పవిత్రత యొక్క చట్టాన్ని పాటించినందుకు నాకు జైలు శిక్ష” అని యోసేపు అనుకుని ఉండవచ్చు. కానీ బదులుగా అతడు మళ్ళీ దేవుని వైపు తిరిగాడు మరియు జైలులో కూడా వర్ధిల్లాడు. యోసేపుకు వాగ్దానం చేసినప్పటికీ, అతనితో స్నేహం చేసిన ఖైదీ, ఫరో ఆస్థానంలో తన స్థానానికి పునరుద్ధరించబడిన తర్వాత అతడి గురించి అంతా మర్చిపోయినప్పుడు యోసేపు మరింత తీవ్రమైన నిరాశకు గురయ్యాడు. తగిన సమయంలో, మీకు తెలిసినట్లుగా, ప్రభువు యోసేపును ఫరో ప్రక్కన నమ్మకం మరియు అధికారం గల అత్యున్నత స్థానంలో ఉంచడానికి చొరవ చూపించారు, ఇశ్రాయేలీయులను రక్షించడానికి యోసేపును సమర్థుడిని చేసారు. “దేవుని ప్రేమించువారికి మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని”25 నిశ్చయంగా యోసేపు ధృవీకరించగలడు.

అబినడై తన దైవిక ఆజ్ఞను నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. “కానీ, నేను నా సందేశమును ముగించెదను; నేను రక్షింపబడిన యెడల, [నాకు ఏమి జరుగునో] అనునది ముఖ్యము కాదు”26 అని అతడు చెప్పాడు. అతడు హతసాక్షి మరణం నుండి తప్పించుకోలేదు, కానీ అతడు ఖచ్చితంగా దేవుని రాజ్యంలో రక్షింపబడ్డాడు మరియు అతని యొక్క విలువైన పరివర్తకుడైన ఆల్మా, క్రీస్తు రాకడకు దారితీసిన నీఫైయుల చరిత్రను మార్చాడు.

వారి అభ్యర్థనకు సమాధానంగా ఆల్మా మరియు అమ్యులెక్ అమ్మోనైహాలోని చెరసాల నుండి విడుదల చేయబడ్డారు మరియు వారిని హింసించినవారు చంపబడ్డారు.27 అయితే అంతకుముందు, ఇదే వేధింపుదారులు నమ్మిన స్త్రీలను మరియు పిల్లలను ఉగ్రమైన అగ్నిలో పడవేసారు. వేదనతో కూడిన భయంకరమైన దృశ్యాన్ని చూసిన ఆల్మా, మహిమలో దేవునిచేత వారు స్వీకరించబడునట్లు29 “వారిని జ్వాలల నుండి రక్షించుటకు”28 దేవుని శక్తిని ఉపయోగించకూడదని ఆత్మచేత నిరోధించబడ్డాడు.

చలికాలం యొక్క తీవ్రమైన చలిలో దోచుకోబడి, వారి ఇండ్ల నుండి తరిమివేయబడిన పరిశుద్ధులకు సహాయం చేయలేని స్థితిలో ప్రవక్త జోసెఫ్ స్మిత్ మిస్సోరిలోని లిబర్టీ చెరసాలలో కొట్టుమిట్టాడాడు. “ఓ దేవా, నీవెక్కడ ఉన్నావు?” అని జోసెఫ్ మొరపెట్టాడు. ఎంతకాలము నీ హస్తము నిలిచియుండును?” 30 ప్రత్యుత్తరముగా, ప్రభువు వాగ్దానము చేసారు: “నీ లేమి నీ కష్టములు కొంతకాలమే ఉండును; దానిని నీవు సహించిన యెడల, దేవుడు నిన్ను ఉన్నతమునకు హెచ్చించును … నీవింకను యోబు వలే కాలేదు.”31

చివరికి, జోసెఫ్ యోబుతో కలిసి ఇలా ప్రకటించగలిగాడు, “ఇదిగో [దేవుడు] నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను.”32

సహోదరి ప్యాట్రీసియా పార్కిన్సన్ యొక్క కథను ఎల్డర్ బ్రూక్ పి. హేల్స్ వివరించారు, ఆమె సాధారణ కంటి చూపుతో జన్మించింది, కానీ 11 సంవత్సరాల వయస్సులో అంధురాలిగా మారింది.

ఎల్డర్ హేల్స్ ఇలా వివరించారు: “చాలా సంవత్సరాలుగా నాకు ప్యాట్ తెలుసు, ఆమె ఎల్లప్పుడు సానుకూలముగా, సంతోషముగా ఉండే వాస్తవమును నేను మెచ్చుకుంటున్నానని ఇటీవల ఆమెతో చెప్పాను. దానికి ఆమె ఇలా స్పందించింది, ‘అవును, మీరు నాతో యింటిలో ఎన్నడూ లేరు కదా? నాకు కూడా విచారకరమైన గడియలు ఉన్నాయి. నాకు తీవ్రమైన నిరాశగల పోరాటములు కలిగాయి మరియు నేను చాలా ఏడ్చాను.’ అయినప్పటికీ, ఆమె ఇలా చెప్పింది, “నా చూపును కోల్పోతున్న సమయము నుండి చాలా విచిత్రముగా ఉంది, కానీ పరలోక తండ్రి మరియు రక్షకుడు నాతోను, నా కుటుంబముతోను ఉన్నారు. నేను గ్రుడ్డిదానిని కాబట్టి నేను కోపముగా ఉంటానా అని అడిగే వారికి నా సమాధానము ఇదే: ‘నేనెవరిమీద కోపంగా ఉండాలి? పరలోక తండ్రి దీనియంతటిలో నాతో ఉన్నారు; నేను ఒంటరిగా లేను. పరలోక తండ్రి ఎల్లప్పుడూ నాతో ఉన్నారు.’”33

అంతిమంగా మనం కోరుకునేది ఏమిటంటే, తండ్రి మరియు కుమారునితో సన్నిహితమైన మరియు స్థిరమైన సంబంధం యొక్క దీవెన. ఇది అన్ని మార్పులకు కారణమవుతుంది మరియు శాశ్వతంగా విలువైనది. “మన యెడల ప్రత్యక్షము కాబోవు మహిమ యెదుట ఇప్పటి [మర్త్య] కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను”34 అని పౌలుతో పాటు మనము కూడా సాక్ష్యమిస్తాము. మన మర్త్య అనుభవం ఏమైనప్పటికీ, మనం దేవుడిని విశ్వసించగలము మరియు ఆయనలో ఆనందాన్ని పొందగలమని నేను సాక్ష్యమిస్తున్నాను.

“నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము.

“నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.”35

యేసు క్రీస్తు నామములో, ఆమేన్.