దేవుని యొక్క సముదాయములోనికి రండి
దేవుని యొక్క సముదాయములోపల, మనము మంచి కాపరి యొక్క కావలి కాసి, పోషించే శ్రద్ధను అనుభూతి చెందుతాము మరియు ఆయన విమోచించే ప్రేమను అనుభవించడానికి దీవించబడ్డాము.
యౌవనస్తులైన తల్లిదండ్రులుగా సహోదరుడు, సహోదరి సమద్1 ఇండోనేషియాలోని సెమారాంగ్‌లో వారి సాధారణమైన రెండు గదుల ఇంటిలో యేసు క్రీస్తు యొక్క సువార్తను నేర్చుకున్నారు. దాని వెలుగు కంటే ఎక్కువగా దోమలతో గదిని నింపినట్లు అనిపించిన, మసక వెలుతురుతో, ఒక చిన్న బల్ల చుట్టూ కూర్చోని, ఇద్దరు యువ సువార్తికులు వారికి శాశ్వతమైన సత్యాలను బోధించారు. నిజాయితీగల ప్రార్థన మరియు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా, వారు బోధించిన దానిని నమ్మగలిగారు, బాప్తిస్మము తీసుకోవడానికి ఎన్నుకొని, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సభ్యులయ్యారు. ఆ నిర్ణయము మరియు అప్పటి నుండి వారి జీవన విధానం, సహోదర, సహోదరి సమద్ మరియు వారి కుటుంబాన్ని వారి జీవితంలోని ప్రతి అంశంలోనూ ఆశీర్వదించింది.2
ఇండోనేషియాలో ప్రాచీన అగ్రగ్రామ పరిశుద్ధుల మధ్య వారున్నారు. తరువాత వారు దేవాలయము యొక్క విధులను పొందారు మరియు సహోదరుడు సమద్ తన బాధ్యతలను నెరవేర్చడానికి మధ్య జావా అంతటా ప్రయాణిస్తూ శాఖాధ్యక్షునిగా, తరువాత జిల్లా అధ్యక్షునిగా సేవ చేసాడు. గత దశబ్దాముగా, అతడు ఇండోనేషియా సురాకార్టా స్టేకు యొక్క మొదటి గోత్ర జనకునిగా సేవ చేసాడు.
49 సంవత్సరాల క్రితం సామాన్యమైన, విశ్వాసము నిండిన గృహములో ఉన్న సువార్తీకులలో ఒకరిగా, మోర్మన్ గ్రంథములో రాజైన బెంజమిన్ బోధించిన దానిని నేను ప్రత్యక్షంగా చూసాను: “ఇంకను, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనువారి ఆశీర్వాదకరమైన, సంతోషకరమైన స్థితిని మీరు తలంచవలెనని నేను కోరుచున్నాను. ఏలయనగా వారు ఐహికమైన మరియు ఆత్మ సంబంధమైన విషయములన్నిటి యందు ఆశీర్వదింపబడియున్నారు.”3 యేసు క్రీస్తు యొక్క మాదిరి మరియు బోధనలు అనుసరించు వారి, ఆయన శిష్యుల మధ్య లెక్కించబడుటకు ఎన్నుకొను వారి జీవితాలలోనికి ప్రవహించే దీవెనలు విస్తారమైనవి, ఆనందకరమైనవి, మరియు నిత్యమైనవి.4
దేవుని యొక్క సముదాయము
మోర్మన్ యొక్క నీళ్ళ వద్ద సమావేశమైన వారికి ఆల్మా యొక్క బాప్తిస్మపు నిబంధన ఆహ్వానము ఇదే వాక్యభాగముతో ప్రారంభవుతుంది: “ఇప్పుడు మీరు దేవుని యొక్క సముదాయములోని రావలెనని కోరిక కలిగియున్నారు.”5
ఒక సముదాయము లేదా గొర్రెల దొడ్డి అనేది ఒక పెద్ద ఆవరణ, తరచుగా రాతి గోడలతో నిర్మించబడింది, ఇక్కడ గొఱ్ఱెలు రాత్రిపూట కాపాడబడతాయి. దానికి ఒకే ఒక ద్వారం ఉంటుంది. రోజు చివరిలో, గొఱ్ఱెల కాపరి గొఱ్ఱెలను పిలుస్తాడు. అతడి స్వరమును అవి ఎరుగును మరియు ద్వారము గుండా అవి మంద యొక్క భద్రతలోనికి ప్రవేశిస్తాయి.
గొఱ్ఱెలు ప్రవేశించినప్పుడు, అవి లెక్కించబడునట్లు మరియు వాటి గాయములు, రోగములు గుర్తించబడి, ఒక్కొక్కటి వ్యక్తిగతంగా గుర్తించబడి శ్రద్ధ చూపబడునట్లు దొడ్డి యొక్క ఇరుకైన ద్వారము వద్ద గొఱ్ఱెల కాపరులు నిలబడతారని ఆల్మా యొక్క జనులకు తెలుసు.6 గొఱ్ఱె యొక్క భద్రత మరియు క్షేమము మందలోనికి వచ్చి నిలిచియుండుటకు వాటి అంగీకారముపై ఆధారపడియుంటుంది.
మనమధ్యలో కొందరు తాము మంద అంచున ఉన్నామని భావించి ఉండవచ్చు, బహుశా వారు తక్కువ ఉపయోగము లేదా విలువ కలవారని లేదా తాము మందకు చెందినవారు కాదని భావించవచ్చు. గొఱ్ఱెల దొడ్డిలో ఉన్నట్లుగా, దేవుని యొక్క సముదాయములో మనము కొన్నిసార్లు ఇతరులను గాయపరచవచ్చు లేక బాధపెట్టి, పశ్చాత్తాపపడవలసిన లేక క్షమించవలసిన అవసరం ఉండవచ్చు.
కానీ మంచి కాపరి7—మన నిజమైన కాపరి—ఎల్లపుడు మంచివాడు. దేవుని యొక్క సముదాయములోపల మనము ఆయన కావలి కాసి, పోషించే శ్రద్ధను అనుభూతి చెందుతాము మరియు ఆయన విమోచించే ప్రేమను అనుభవించడానికి దీవించబడ్డాము. “నా యరచేతులమీదనే నిన్ను చెక్కియున్నాను; నీ ప్రాకారములు నిత్యము నా యెదుట నున్నవి”8 అని ఆయన అన్నారు. రక్షకుడు మన పాపములు, బాధలు, శ్రమలు9 మరియు జీవితములో అన్యాయమైన సమస్తమును ఎరిగియున్నాడు.10 వారు “రావలెనని కోరిక కలిగియుండి”11 మరియు సముదాయములోనికి రావడానికి ఎన్నుకొన్నప్పుడు ఈ దీవెనలు పొందడానికి అందరూ ఆహ్వానించబడుతున్నారు. కర్తృత్వము యొక్క వరము సరైన దానిని ఎన్నుకోవడానికి హక్కు మాత్రమే కాదు, కానీ అది సరైనది ఎన్నుకొనే అవకాశము. దొడ్డి యొక్క గోడలు ఆడ్డంకి కాదు కానీ ఆత్మీయ భద్రత యొక్క ఆధారము.
అక్కడ “మంద ఒక్కటియు గొఱ్ఱెల కాపరి ఒక్కడును అగును”12 అని యేసు బోధించారు. ఆయన చెప్పెను:
“ద్వారమున ప్రవేశించువాడు గొఱ్ఱెల కాపరి. …
ఇతర గొఱ్ఱెలు తన స్వరమును ఇంకను వింటాయి …,
“…గొఱ్ఱెలు అతడి స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును.”13
తరువాత రక్షించబడటానికి దేవుని యొక్క సముదాయములోనికి ఒకే ఒక మార్గమున్నదని యేసు స్పష్టంగా బోధిస్తూ, “నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడు”14 అని వ్యాఖ్యానించారు. అది యేసు క్రీస్తు చేత, ద్వారా జరుగును.15
దేవుని యొక్క సముదాయములోనికి వచ్చిన వారికి దీవెనలు కలుగును
సముదాయములోనికి ఎలా రావాలో దేవుని వాక్యము నుండి మనము నేర్చుకున్నాము,16 అది యేసు క్రీస్తు మరియు ఆయన ప్రవక్తల చేత బోధింపబడిన సిద్ధాంతము. మనము క్రీస్తు యొక్క సిద్ధాంతమును అనుసరించి, యేసు క్రీస్తునందు విశ్వాసము, పశ్చాత్తాపము, బాప్తిస్మము మరియు నిర్ధారణ ద్వారా సముదాయములోనికి వచ్చి, విశ్వాసమునందు కొనసాగినప్పుడు,17 నాలుగు ప్రత్యేకమైన, వ్యక్తిగతమైన దీవెనలను ఆల్మా వాగ్దానము చేసాడు. మీరు (1) “దేవుని చేత విమోచించబడతారు,” (2) “మొదటి పునరుత్థానముకు చెందిన వారితో లెక్కించబడతారు,” (3) “నిత్య జీవము కలిగియుంటారు,” (4) ప్రభువు “మీపై తన ఆత్మను అధిక విస్తారముగా క్రుమ్మరించును.”18
ఆల్మా ఈ దీవెనలను గూర్చి బోధించిన తరువాత, జనులు సంతోషంగా చప్పట్లు కొట్టారు. ఎందుకో ఇక్కడున్నది:
మొదటిది: విమోచించబడుట అనగా ఋణము చెల్లించుట లేదా బాధ్యత లేదా నిరాశను లేదా హాని కలిగించే దాని నుండి స్వేచ్ఛగా చేయబడుట19 అన్ని అర్థము. మన వంతుగా ఎలాంటి వ్యక్తిగత మెరుగుదల అయినా మనము చేసిన పాపములనుండి మనల్ని శుద్ధిగా చేయలేదు లేదా యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం లేకుండా మనం అనుభవించిన గాయాల నుండి పూర్తిగా స్వస్థపరచబడలేము. ఆయన మన విమోచకుడు.20
రెండవది: యేసు క్రీస్తు యొక్క పునరుత్థానము వలన, అందరూ పునరుత్థానము చెందుతారు.21 మన ఆత్మలు మన మర్త్య శరీరాలను విడిచిపెట్టిన తరువాత, మనము ప్రేమించేవారిని మరలా పునరుత్థాఃన శరీరముతో హత్తుకోవడానికి మనము నిస్సందేహంగా ఎదురుచూస్తాము. మొదటి పునరుత్థానముకు చెందిన వారిమధ్య ఉండటానికి మనము ఆతృతంగా ఎదురుచూస్తున్నాము.
మూడవది: నిత్య జీవితమనగా దేవునితో జీవించుట, ఆయన వలె జీవించుటని అర్థము. అది “దేవుని యొక్క అన్ని వరముల కంటే అత్యంత గొప్పది”22 మరియు సంపూర్ణ ఆనందాన్ని తెచ్చును.23 అది మన జీవితాల అంతిమ ప్రయోజనము మరియు ఉద్దేశము.
నాల్గవది: దైవసమూహముయొక్క సభ్యుడైన పరిశుద్ధాత్మ ఈ మర్త్య జీవితమందు ఎక్కువగా అవసరమైన నడిపింపును, ఓదార్పును అందించును.24
విచారము యొక్క కొన్ని కారణాలను పరిగణించండి: పాపము నుండి దైన్యము వచ్చును,25 ప్రియమైన వారి మరణము నుండి విచారము మరియు ఒంటరితనము మరియు మనము మరణించినప్పుడు ఏమి జరుగుతుందనే అనిశ్చయత వలన కలిగే భయము. కానీ మనము దేవుని యొక్క సముదాయములోనికి ప్రవేశించి, ఆయనతో మన నిబంధనలు పాటించినప్పుడు, క్రీస్తు మన పాపముల నుండి మనల్ని విమోచిస్తారని, మన ఆత్మ, శరీరము వేరు చేయబడుట మరింత త్వరగా ముగించబడుతుందని మరియు అత్యంత మహిమకరమైన విధానములో మనము దేవునితో శాశ్వతంగా జీవిస్తామని ఎరుగుట మరియు నమ్ముట నుండి శాంతిని అనుభవిస్తాము.
క్రీస్తునందు నమ్మకముంచండి మరియు విశ్వాసముతో పనిచేయండి
సహోదర సహోదరీలారా, లేఖనాలు రక్షకుని యొక్క అద్భుతమైన శక్తి మరియు ఆయన కరుణగల దయ, కృప యొక్క మాదిరులతో నింపబడియున్నవి. ఆయన భూలోక పరిచర్యయందు, స్వస్థపరచే ఆయన దీవెనలు ఆయనను నమ్మి మరియు విశ్వాసమందు ప్రవర్తించే వారికి కలిగాయి. ఉదాహరణకు, బెతెస్ద కోనేరు వద్ద వ్యాధిగల మనుష్యుడు “నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుము,” అన్న రక్షకుని ;ఆజ్ఞను అతడు విశ్వాసముతో అనుసరించినప్పుడు, అతడు నడిచాడు. సమృద్ధి దేశములో రోగులు లేదా ఏ విధము నందైనను బాధింపబడిన వారందరితో “కలిసి” “ముందుకు వెళ్ళినప్పుడు” 27 స్వస్థపరచబడ్డారు.
అదేవిధంగా, దేవుని యొక్క సముదాయములోనికి వచ్చిన వారికి వాగ్దానము చేయబడిన అద్భుతమైన దీవెనలు పొందడానికి—రావడానికి ఎంపిక చేయుటకు మనము దానినే చేయవలసియున్నది. చిన్నవాడైన ఆల్మా ఇలా బోధించాడు, “ఇప్పుడు మంచి కాపరి మిమ్ములను పిలుచుచున్నాడని నేను మీతో చెప్పుచున్నాను; మీరు ఆయన స్వరమును వినిన యెడల ఆయన మిమ్ములను తన మందలోనికి తెచ్చును.”28
కొన్ని సంవత్సరాల క్రితం, ప్రియమైన స్నేహితుడొకడు కాన్సరు చేత చనిపోయాడు. అతడి భార్య షానన్, అతడి వ్యాధి నిర్ధారణ గురించి మొదట వ్రాసినప్పుడు, ఆమె ఇలా చెప్పింది, “మేము విశ్వాసమును ఎన్నుకున్నాము. మన రక్షకుడైన యేసు క్రీస్తునందు విశ్వాసము. మన పరలోక తండ్రి యొక్క ప్రణాళికయందు విశ్వాసము, మరియు మన అవసరాలను ఆయన ఎరుగునని, ఆయన వాగ్దానములను నెరవేర్చుననే విశ్వాసము.”29
ప్రత్యేకంగా శోధన, వ్యతిరేకత, లేదా దుర్దశ కలిగినప్పుడు, దేవుని యొక్క సముదాయములోపల భద్రముగా ఉన్నామనే అంతర్ శాంతిని అనుభవించి షారోన్ వంటి అనేకమంది కడవరి దిన పరిశుద్ధులను నేను కలిసాను.30 వారు యేసు క్రీస్తునందు విశ్వాసము కలిగియుండుటకు మరియు ఆయన ప్రవక్తను అనుసరించడానికి ఎన్నుకున్నారు. మన ప్రియమైన ప్రవక్త అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా బోధించారు, “జీవితంలో ప్రతి మంచిది—నిత్యరాజ్య ప్రాధాన్యతగల శక్తివంతమైన ప్రతి ఆశీర్వాదము—విస్వాసముతోనే ప్రారంభమవుతుంది.”31
దేవుని యొక్క సముదాయములోనికి పూర్తిగా రండి
1847 లో మా ముత్తాత జేమ్స్ సాయర్ హోల్‌మన్ యూటాకు వచ్చాడు, కానీ అతడు జూలైలో బ్రిగమ్ యంగ్‌తో వచ్చిన వారిలో లేడు. అతడు సంవత్సరంలో తరువాత వచ్చాడు, కుటుంబ నివేదికల ప్రకారము గొఱ్ఱెలను తెచ్చే బాధ్యతను కలిగియున్నాడు. అతడు అక్టోబరు వరకు సాల్ట్‌లేక్ వేలీని చేరుకోలేదు, అయితే అతడు మరియు గొఱ్ఱెలు చేరుకున్నాయి.32
అలంకారికంగా చెప్పాలంటే, మనలో కొందరు ఇంకా మైదానాలలో ఉన్నాము. అందరూ మొదటి గుంపులో రారు. నా ప్రియమైన స్నేహితులారా, దయచేసి ప్రయాణము కొనసాగించండి—మరియు ఇతరులు దేవుని యొక్క సముదాయములోనికి పూర్తిగా రావడానికి సహాయపడండి. యేసు క్రీస్తు సువార్త సువార్త యొక్క దీవెనలు అపరిమితమైనవి ఎందుకనగా అవి శాశ్వతమైనవి.
యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సభ్యుడిగా ఉన్నందుకు నేను మిక్కిలి కృతజ్ఞత కలిగియున్నాను. మన పరలోకపు తండ్రి మరియు మన విమోచకుడైన యేసు క్రీస్తు యొక్క ప్రేమను గూర్చి మరియు వారి నుండి మాత్రమే వచ్చు శాంతి—అంతర్ శాంతి, మరియు దేవుని యొక్క సముదాయములో కనుగొనబడే దీవెనలను గూర్చి నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.