తుఫానుల్లో స్థిరంగా ఉండుట
జీవితంలో తుఫానులు వచ్చినప్పుడు మీరు స్థిరంగా ఉండగలరు, ఎందుకంటే యేసు క్రీస్తు నందు మీ విశ్వాసమనే బండపైన మీరు నిలబడ్డారు.
నా ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ రోజు ప్రేరేపించబడిన దేవుని సేవకులు ఇచ్చిన సలహా మరియు ప్రోత్సాహాన్ని వినడానికి మనం దీవించబడ్డాము. మనం ఎక్కడ ఉన్నప్పటికీ, పెరుగుతున్న అపాయకరమైన కాలంలో మనం జీవిస్తున్నామని మనలో ప్రతీఒక్కరికి తెలుసు. మనం ఎదుర్కొనే తుఫానుల్లో శాంతియుత హృదయంతో స్థిరంగా ఉండడానికి నేను మీకు సహాయపడాలని ప్రార్థిస్తున్నాను.1
ముందుగా మనము జ్ఞాపకముంచుకోవలసింది, మనలో ప్రతీఒక్కరు దేవుని ప్రియమైన బిడ్డయని మరియు ఆయన ప్రేరేపించబడిన సేవకులను కలిగియున్నారని. దేవుని యొక్క ఆ సేవకులు మనం జీవించబోయే కాలాన్ని ముందుగానే చూసారు. “అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము,”2 అని అపొస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసాడు.
కాలముల చిహ్నాలను చూచు కన్నులను మరియు ప్రవక్తల మాటలను విను చెవులను కలిగియున్నవారు అది నిజమని తెలుసుకుంటారు. అత్యంత ప్రమాదకరమైన అపాయాలు దుష్టశక్తుల నుండి మనకు వస్తాయి. ఆ శక్తులు పెరుగుతున్నాయి. కాబట్టి, యేసు క్రీస్తు యొక్క సువార్తను జీవించడానికి మనం తప్పక చేయవలసిన మరియు పాటించవలసిన నిబంధనలను గౌరవించడం మరింత కష్టమవుతుంది, సులువుగా ఉండదు.
మనలో మన గురించి, మనం ప్రేమించేవారి గురించి చింత ఉన్నవారికి, రాబోయే తుఫానుల నుండి రక్షించడానికి దేవుడు మనకొక ప్రదేశాన్ని సిద్ధపరిచారనే వాగ్దానంలో నిరీక్షణ ఉంది.
ఆ ప్రదేశం గురించి ఇక్కడ వర్ణించబడింది. అది జీవించియున్న ప్రవక్తల చేత మళ్ళీ మళ్ళీ వివరించబడింది. ఉదాహరణకు, మోర్మన్ గ్రంథములో నమోదు చేయబడినట్లుగా, ప్రేరేపించబడిన ప్రియమైన ఒక తండ్రి ముందుముందు రాబోయే తుఫానుల్లో స్థిరంగా నిలబడేందుకు తమనుతాము ఎలా బలపరచుకోవాలో తన కొడుకులకు చెప్పాడు: “ఇప్పుడు నా కుమారులారా! జ్ఞాపకముంచుకొనుడి, మీరు మీ పునాదిని దేవుని కుమారుడైన క్రీస్తు మరియు మన విమోచకుని యొక్క బండపై కట్టవలెనని జ్ఞాపకముంచుకొనుడి; అపవాది తన బలమైన గాలులను, సుడిగాలి యందు అతని బాణములను పంపునప్పుడు, అతని సమస్త వడగళ్ళు మరియు బలమైన గాలివాన మిమ్ములను కొట్టునప్పుడు, దౌర్భాగ్యపు అగాధము మరియు అంతము లేని శ్రమకు మిమ్ములను క్రిందికి లాగుకొనిపోవుటకు అది మీపై ఏ శక్తి కలిగియుండదు, ఏలయనగా మీరు కట్టబడిన ఆ పునాది ఒక నిశ్చయమైన పునాది మరియు మనుష్యులు ఆ పునాదిపై కట్టబడిన యెడల ఎన్నటికీ పడిపోరు.”3
అతడు చెప్పిన దౌర్భాగ్యము మరియు అంతము లేని శ్రమ అనేవి పాపముల యొక్క భయంకరమైన ప్రభావాలు, వాటి గురించి మనం పూర్తిగా పశ్చాత్తాపపడవద్దా? పెరుగుతున్న తుఫానులు అనేవి శోధనలు మరియు పెరుగుతున్న సాతాను దాడులు. ఆ నిశ్చయమైన పునాదిపై ఎలా నిర్మించాలో గ్రహించడం ఇప్పుడున్నంత ముఖ్యంగా ఇంతకుముందు ఎన్నడూ లేదు. నామట్టుకు, మోర్మన్ గ్రంథములో కూడా నమోదు చేయబడిన రాజైన బెంజమిన్ చివరి ప్రసంగాన్ని చూడడం కంటే మంచి ప్రదేశం మరొకటి లేదు.
రాజైన బెంజమిన్ యొక్క ప్రవచనాత్మక వాక్యాలు నేడు మనకు అన్వయించబడతాయి. తన స్వంత అనుభవం నుండి ఆయనకు యుద్ధం యొక్క భయాలు తెలుసు. దేవుని శక్తిపై ఆధారపడి, అతడు యుద్ధంలో తన జనులను కాపాడాడు. శోధించడానికి, జయించాలని ప్రయత్నించడానికి, దేవుని పిల్లలను నిరుత్సాహపరచడానికి లూసిఫరు ఉపయోగించే భయంకరమైన శక్తులను అతడు స్పష్టంగా చూసాడు.
నిశ్చయమైన రక్షణ బండ, అనగా రక్షకునిపై మాత్రమే నిర్మించాలని అతడు తన జనులను, మనల్ని ఆహ్వానించాడు. మనం తప్పు ఒప్పుల మధ్య ఎంచుకోవడానికి స్వతంత్రులమని మరియు మన ఎంపికల యొక్క ఫలితాలను మనం తప్పించుకోలేమని అతడు స్పష్టం చేసాడు. అతడు సూటిగా మరియు తీక్షణంగా మాట్లాడాడు, ఎందుకంటే తన హెచ్చరికలను వినని, ఆలకించని వారికి ఎటువంటి బాధ కలుగుతుందో అతనికి తెలుసు.
ఆత్మ యొక్క ప్రేరేపణలను అనుసరించడానికి లేదా మనల్ని శోధించి, నాశనం చేయాలనే ఉద్దేశ్యమున్న సాతాను నుండి వచ్చే చెడు సందేశాలను అనుసరించడానికి మనం చేసే ఎంపిక వలన కలిగే ఫలితాలను అతడిలా వివరించాడు:
“ఏలయనగా ఆ ఆత్మకు లోబడుటకు కోరుకొను వానిపై ఒక శాపము ప్రకటించబడియున్నది; దానికి లోబడుటకు కోరుకొని, తన పాపముల యందు నిలిచి మరణించిన వాడు తన స్వంత ఆత్మకు శిక్షను పానము చేయును; ఏలయనగా తన స్వంత జ్ఞానమునకు వ్యతిరేకముగానున్న దేవుని ధర్మశాస్త్రమును అతిక్రమించినవాడై అతడు తన జీతముగా శాశ్వత శిక్షను పొందును. …
“కాబట్టి ఆ మనుష్యుడు పశ్చాత్తాపపడకుండా దేవునికి శత్రువుగా నిలిచి మరణించిన యెడల, దైవిక న్యాయము యొక్క అక్కరలు అమర్త్యమైన అతని ఆత్మను అతని స్వంత దోషము యొక్క సజీవమైన భావమునకు మేలుకొల్పును, అది అతడిని దేవుని సన్నిధి నుండి కృంగిపోవునట్లు చేసి, అతని మనస్సును దోషము, బాధ మరియు వేదనతో నింపును, అది ఆరని అగ్ని వలే ఉండి దాని జ్వాల నిరంతరము ఆరోహణమగును.”
రాజైన బెంజమిన్ ఇంకా ఇలా చెప్పసాగాడు: “మీరు గ్రహించగలుగునట్లు నేను మీతో సరళముగా మాట్లాడియున్నందున నా మాటలను గ్రహించగలిగిన ముసలివారు, యౌవనస్థులు మరియు చిన్న పిల్లలు అందరు అతిక్రమములో పడియున్న వారి భయంకరమైన స్థితి యొక్క జ్ఞాపకమునకు మేలుకొనవలెనని నేను ప్రార్థించుచున్నాను.”4
నామట్టుకు, పశ్చాత్తాపపడమనే ఆ హెచ్చరిక యొక్క శక్తి, ఈ జీవితం తర్వాత రక్షకుని ముందు మీరు, నేను నిలబడే నిశ్చయమైన సమయం యొక్క చిత్రాన్ని నా మనస్సులో రూపొందిస్తున్నది. కృంగిపోవడానికి బదులుగా ఆయన వైపు చూసి, ఆయన చిరునవ్వును చూసి, “భళా, నమ్మకమైన మంచి దాసుడా: … [లోనికి] రమ్ము”5 అని ఆయన అనగా వినాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటాము.
యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా మన స్వభావాలు మార్చుకోవడానికి మనం ఈ జీవితంలో మార్గాన్ని కనుగొన్నట్లయితే, ఆ మాటలు వినడానికి కావలసిన నిరీక్షణను మనం ఎలా పొందగలమనే దాని గురించి రాజైన బెంజమిన్ స్పష్టం చేస్తాడు. నిశ్చయమైన పునాదిపై మనం కట్టబడి, రాబోయే శోధనలు మరియు శ్రమల తుఫానులలో స్థిరంగా నిలబడగల ఏకైక మార్గమది. మన స్వభావాలలో ఆ మార్పును ఒక అందమైన ఉపమానంతో రాజైన బెంజమిన్ వివరించడం నా మనసు చూరగొంది. అది సహస్రాబ్దిపాటు ప్రవక్తలు మరియు ప్రభువు చేత ఉపయోగించబడింది. అది: మనం తప్పక ఒక బిడ్డవలె—ఒక చిన్న బిడ్డవలె మారాలి.
కొంతమందికి దానిని అంగీకరించడం అంత సులభంగా ఉండదు. మనలో చాలామంది బలంగా ఉండాలని కోరుకుంటాము. ఒక బిడ్డవలె ఉండడం అంటే బలహీనంగా ఉండడమని అనుకుంటాము. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఎప్పుడు పిల్లచేష్టలు తగ్గిస్తారా అని ఎదురుచూస్తారు. కానీ, ఒక బిడ్డవలె ఉండడం అంటే పిల్లచేష్టలు చేయడం కాదని, బలం మరియు ధైర్యం గల వ్యక్తి అంటే ఏమిటో అర్థం చేసుకున్న వ్యక్తిగా రాజైన బెంజమిన్ మనకు స్పష్టం చేస్తాడు. అది తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మరియు తన తండ్రి యొక్క పిల్లలందరి పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి బలం కొరకు తన తండ్రికి ప్రార్థన చేసి, ఆ తర్వాత దానిని నెరవేర్చిన రక్షకునివలె ఉండడం వంటిది. అపాయకరమైన కాలాల్లో స్థిరంగా ఉండి, శాంతితో ఉండేందుకు మనం తప్పక కలిగియుండవలసిన బలాన్ని పొందడానికి మన స్వభావాలు తప్పకుండా మారి, ఒక బిడ్డవలె కావాలి.
ఆ మార్పు ఎలా వస్తుందనే దాని గురించి రాజైన బెంజమిన్ యొక్క ఉత్తేజపరిచే వర్ణన ఇది: “ఏలయనగా పరిశుద్ధాత్మ ప్రేరేపణలకు లోబడి ప్రకృతి సంబంధియైన మనుష్యుని విసర్జించి, ప్రభువైన క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా పరిశుద్ధుడైయుండి, చిన్నపిల్లవాని వలె విధేయుడై, సాత్వికుడై, వినయము మరియు సహనము కలిగి ప్రేమతో నిండి, పిల్లవాడు తన తండ్రికి లోబడునట్లుగా అతనిపై విధించుటకు తగినవని ప్రభువు చూచు విషయములన్నిటికి లోబడుటకు ఇష్టపడు పిల్లవాని వలె అయితే తప్ప ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవునికి శత్రువైయున్నాడు, ఆదాము యొక్క పతనము నుండి ఉండియున్నాడు మరియు నిరంతరముండును.”6
దేవునితో నిబంధనలు చేసి, మళ్ళీ వాటిని క్రొత్తవిగా చేసినప్పుడు మనం ఆ మార్పును పొందుతాము. మన హృదయాలలో మార్పును అనుమతించడానికి క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త శక్తిని అది తెస్తుంది. ప్రతీసారి మనం సంస్కారంలో పాలుపొందినప్పుడు, మరణించిన పూర్వీకుల కొరకు దేవాలయ విధి నిర్వహించినప్పుడు, రక్షకునికి సాక్షిగా సాక్ష్యమిచ్చినప్పుడు లేదా క్రీస్తు యొక్క శిష్యునిగా అవసరంలో నున్న వారిపట్ల శ్రద్ధ చూపినప్పుడు మనం దానిని అనుభవించగలము.
ఆ అనుభవాలలో, కొంతకాలానికి మనం ప్రేమించే మరియు లోబడే మన సామర్థ్యంలో ఒక బిడ్డవలె మారతాము. నిశ్చయమైన పునాదిపై మనం నిలబడతాము. యేసు క్రీస్తు నందు మన విశ్వాసము మనల్ని పశ్చాత్తాపానికి గురిచేస్తుంది మరియు ఆయన ఆజ్ఞలు పాటించేలా చేస్తుంది. మనం లోబడతాము, శోధనను ఎదుర్కోవడానికి శక్తి పొందుతాము మరియు వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ సహవాసాన్ని మనం పొందుతాము.
ఒక చిన్న బిడ్డవలె మారి, దేవునికి లోబడి, మరింత ప్రేమించేలా మన స్వభావాలు మారతాయి. ఆ మార్పు, పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే బహుమానాలను ఆనందించడానికి మనల్ని అర్హులుగా చేస్తుంది. పరిశుద్ధాత్మ సహవాసాన్ని కలిగియుండడం మనల్ని ఓదార్చి, నడిపింపునిచ్చి, బలపరుస్తుంది.
దేవుని ముందు మనం ఒక చిన్న బిడ్డవలె మారగలమని అతడు చెప్పినప్పుడు రాజైన బెంజమిన్ ఉద్దేశ్యమేమిటో కొంతవరకు నేను తెలుసుకోగలిగాను. పరిశుద్ధాత్మ తరచూ నిమ్మళమైన స్వరంలో మాట్లాడతాడని, ఒకరి హృదయం ఒక బిడ్డవలె సాత్వీకంగా, అణకువతో ఉన్నప్పుడు చాలా సులువుగా ఆయనను వినగలరని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. వాస్తవానికి, “నీవు కోరేదే నాకు కావాలి. అదేమిటో నాకు చెప్పు. నేను దానిని చేస్తాను,” అనే ప్రార్థన పనిచేస్తుంది.
జీవితంలో తుఫానులు వచ్చినప్పుడు మీరు స్థిరంగా ఉండగలరు, ఎందుకంటే యేసు క్రీస్తు నందు మీ విశ్వాసమనే బండపైన మీరు నిలబడ్డారు. ఆ విశ్వాసము మిమ్మల్ని అనుదిన పశ్చాత్తాపానికి మరియు నిరంతరం నిబంధనలు పాటించడానికి నడిపిస్తుంది. అప్పుడు మీరు ఆయనను ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకుంటారు. ద్వేషం మరియు దుష్టత్వం యొక్క తుఫానుల గుండా మీరు స్థిరంగా మరియు ఆశావహంగా భావిస్తారు.
అంతకుమించి, మీతోపాటు ఇతరులను మీరు సురక్షితంగా బండపై చేర్చడానికి సమీపిస్తున్నట్లు కనుగొంటారు. యేసు క్రీస్తు నందు విశ్వాసము ఎల్లప్పుడూ గొప్ప నిరీక్షణకు మరియు ఇతరులపట్ల క్రీస్తు యొక్క నిజమైన ప్రేమయైన దాతృత్వ భావాలకు దారితీస్తుంది.
“నాయొద్దకు రండి”7 అని ప్రభువైన యేసు క్రీస్తు మీకు ఆహ్వానమిచ్చారని నేను గంభీరంగా మీకు సాక్ష్యమిస్తున్నాను. మీ కొరకు మరియు మీరు ప్రేమించే వారి కొరకు, ఈ జీవితంలో శాంతి మరియు రాబోయే జీవితంలో నిత్యజీవం కొరకు ఆయన యొద్దకు రమ్మని ఆయన మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. సంతోష ప్రణాళికలో భాగంగా మీ పరీక్షలో మీరు ఎదుర్కొనే తుఫానులు ఆయనకు పరిపూర్ణంగా తెలుసు.
రక్షకుని ఆహ్వానాన్ని అంగీకరించమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. సాత్వికమైన, ప్రియమైన బిడ్డవలె ఆయన సహాయాన్ని అంగీకరించండి. యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘములో ఆయన అందించే నిబంధనలను చేసి, పాటించండి. అవి మిమ్మల్ని బలపరుస్తాయి. ఆయన వద్దకు మరియు మన పరలోక తండ్రి వద్దకు ఇంటికి వెళ్ళే దారిలో తుఫానులు మరియు సురక్షిత ప్రదేశాలు రక్షకునికి తెలుసు. ఆయనకు మార్గము తెలుసు. ఆయనే మార్గము. ఈవిధంగా నేను యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.