సర్వసభ్య సమావేశము
ప్రణాళిక పనిచేస్తోందా?
2022 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


12:17

ప్రణాళిక పనిచేస్తోందా?

సంతోష ప్రణాళిక పనిచేస్తుందని నేను సాక్ష్యమిస్తున్నాను. మిమ్మల్ని ప్రేమించే మీ పరలోక తండ్రి చేత అది సృష్టించబడింది.

ప్రణాళిక పనిచేస్తోందా?

ఈమధ్య నేను, అనేక సంవత్సరాల క్రితం సువార్తసేవ చేసి, ఇప్పుడు తన వృత్తిపరమైన పనిలో నిమగ్నమై ఉన్న వ్యక్తితో సంభాషించాను. కొన్ని విధాలుగా, అతడి జీవితం సజావుగా సాగుతోంది. కానీ అతని విశ్వాసం క్షీణిస్తోంది. రక్షకుడు మరియు ఆయన సంఘము గురించి సందేహాల సముద్రంలో అతడు మునిగిపోతున్నాడు. పునఃస్థాపించబడిన సువార్త నుండి తాను ఆశించిన దీవెనలను పొందడం లేదని అతడు వివరించాడు. రక్షణ ప్రణాళిక అతడి జీవితంలో పనిచేస్తున్నట్లు అతడు భావించలేదు.

ఈనాటి నా సందేశము ఇలాంటి భావనలు కలిగియున్న వారికోసం. ఒకనాడు “విమోచించు ప్రేమ గీతము పాడవలెననిపించి,” “ఇప్పుడు అలా భావించని”1 వారితో నేను మాట్లాడుతున్నాను.

మన పరలోక తండ్రి మన నిత్య సంతోషం కోసం ఒక అద్భుతమైన ప్రణాళికను సిద్ధపరిచారు. కానీ జీవితం మనము ఆశించిన విధానములో సాగనప్పుడు, ప్రణాళిక పని చేయనట్లుగా కనబడవచ్చు.

యేసు యొక్క శిష్యులు పడవలో ఉన్నప్పుడు, “దరికి దూరముగ నుండగా గాలి యెదురైనందున అలల వలన కొట్టబడినప్పుడు”2 భావించినట్లుగా బహుశా మనము భావిస్తాము.

అప్పుడు, తెల్లవారుజామున:

“యేసు సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను.

“ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, … భయము చేత కేకలు వేసిరి.

“వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడకుడని వారితో చెప్పెను.

“పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను.

“ఆయన రమ్మనగానే, పేతురు దోనె దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ళమీద నడిచెను గాని,

“గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను.

“వెంటనే యేసు చెయ్యిచాపి అతని పట్టుకొని, అల్పవిశ్వాసీ, యెందుకు సందేహపడితివని అతనితో చెప్పెను.” 3

పేతురు నుండి నేను నేర్చుకొన్న మూడు సూత్రములను నేను పంచుకోవచ్చా? వారి జీవితాలలో రక్షణ ప్రణాళిక పని చేయడంలేదని భావించే వారెవరికైనా ఈ సూత్రములు సహాయపడాలని నేను ప్రార్థిస్తున్నాను.

మొదటిది, యేసు క్రీస్తునందు విశ్వాసముతో పనిచేయండి.

పేతురు యొక్క విశ్వాసమును బట్టి నేను ఆశ్చర్యపడుతున్నాను. “రమ్ము,” అనే యేసు యొక్క సరళమైన ఆహ్వానముతో, అతడు తుఫానుతో కొట్టబడుతున్న పడవను విడిచిపెట్టాడు. ఏదైనా చేయమని యేసు క్రీస్తు అతడిని ఆహ్వానించినట్లయితే—అతడు దానిని చేయగలడని అతడికి తెలిసినట్లుగా అనిపిస్తున్నది.4 పేతురు తన పడవను నమ్ముట కంటే ఎక్కువగా రక్షకుడిని నమ్మాడు. ఆ విశ్వాసము ఒత్తిడిగల, భయపెట్టే పరిస్థితియందు ధైర్యముతో పని చేయడానికి అతడికి శక్తిని ఇచ్చింది.

పేతురు యొక్క విశ్వాసము, ఎల్డర్ జోస్ ఎల్. ఆలెన్సో నుండి నేను వినిన ఒక అనుభవాన్ని నాకు గుర్తు చేస్తుంది. ఎల్డర్ ఆలెన్సో కొడుకు చిన్న పిల్లలగల కుటుంబాన్ని వదిలి చనిపోయిన వెంటనే, పిల్లలు ఇలా మాట్లాడుకోవడాన్ని ఎల్డర్ ఆలెన్సో విన్నాడు.

“మనము ఏమి చేయబోతున్నాము?” అని వారు అడిగారు.

“నాన్న బాగానే ఉంటాడు. ఆయన యేసు క్రీస్తు సువార్తను బోధిస్తున్నాడు,” అని తొమ్మిదేళ్ళ కూతురు జవాబిచ్చింది.

పేతురు వలే, ఈ చిన్న పాప తన సవాళ్ళను మించి చూసింది, యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తమునందు నమ్మకముంచింది. రక్షకునియందు విశ్వాసము ముందుకు సాగిపోవడానికి శాంతిని, బలమును తెస్తుంది.

మీరు మీ జీవితంలో వెనుదిరిగి చూసినట్లయితే, అనేకసార్లు మీరు విశ్వాసమును సాధన చేసారని మీరు చూస్తారని నేను నమ్ముతున్నాను. సంఘములో చేరుట అనేది ఒక విశ్వాసపు క్రియ. ప్రార్థనలో పరలోక తండ్రితో మాట్లాడుట ఒక విశ్వాసపు క్రియ. లేఖనాలు చదవడం ఒక విశ్వాసపు క్రియ. ఈ సర్వసభ్య సమావేశములో నా సందేశాన్ని వినడం ఒక విశ్వాసపు చర్య. అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ చెప్పినట్లుగా, “ఇదివరకే మీకున్న విశ్వాసాన్ని తగ్గించుకోకండి.”5

పేతురు నుండి నేను నేర్చుకొనే మరొక పాఠము ఇది:

కష్ట సమయాలలో, వెంటనే యేసు క్రీస్తు వైపు తిరగండి.

పేతురు రక్షకుని వైపు నడిచినప్పుడు, అతడు గాలి చేత భయపడ్డాడు మరియు మునిగిపోసాగాడు. కానీ జరుగుతున్న దానిని పేతురు గ్రహించినప్పుడు, అతడు తన స్వంతంగా నీళ్ళను దాటడానికి లేక పడవ వద్దకు ఈదుకొని వెళ్ళడానికి ప్రయత్నించలేదు. అతడు క్రీస్తునందు తన విశ్వాసమును వదులుకోవడానికి బదులుగా, ఇంకా గట్టిగా పట్టుకొని, “ప్రభువా, నన్ను రక్షించమని” కేకలు వేసాడు.

“వెంటనే యేసు చెయ్యిచాపి అతడిని పట్టుకున్నారు.”6

మనమందరం మన విశ్వాసమును కదిలించి, మనం మునిగిపోయేలా చేసే పెనుగాలులను ఎదుర్కొంటాము. అలా జరిగినప్పుడు, పరలోక తండ్రి యొక్క సంతోషపు ప్రణాళికకు మరొక పేరు—విమోచన యొక్క ప్రణాళిక అని దయచేసి జ్ఞాపకముంచుకోండి. ఆ ప్రణాళిక మనల్ని ఎప్పుడూ ఒడిదుడుకులకు గురికాకుండా, ఎప్పుడూ మునిగిపోకుండా, ఎల్లప్పుడూ చిరునవ్వుతో మన జీవితంలో తేలికగా దూసుకుపోయేలా చేసేది కాదు. మనము విమోచించబడాలని పరలోక తండ్రికి తెలుసు. అందుకే ఆయన విమోచన ప్రణాళికను సిద్ధపరిచారు.7 అందుకే ఆయన ఒక విమోచకుడిని పంపారు. ఏ కారణము వలనైనా మనము శ్రమ పడుతున్నప్పుడు—ప్రణాళిక పనిచేయడం లేదని దానర్థం కాదు. అప్పుడే మనకు ప్రణాళిక ఎక్కువగా అవసరము!

ఆ క్షణాల్లో, పేతురు యొక్క మాదిరిని అనుసరించండి. వెంటనే రక్షకుని వైపు తిరగండి.

“ఇదే మీ రక్షణ దినము మరియు సమయము. … మీ పశ్చాత్తాప దినమును వాయిదా వేయకండి.”8

మనము ఎక్కడ ఉన్నను, ఇంతకుముందు ఎక్కడ ఉన్నప్పటికీ, పశ్చాత్తాపమే ముందుకు సాగే మార్గము. అధ్యక్షులు నెల్సన్ ఇలా బోధించారు:

“పశ్చాత్తాపము పైన క్రమం తప్పకుండా, అనుదినం కేంద్రీకృతం చెయ్యడము కంటే మరేది కూడా మిక్కిలి స్వేచ్ఛనిచ్చేది, ఘనత చేకూర్చేది లేదా మన వ్యక్తిగత అభివృద్ధికి మిక్కిలి ఆవశ్యకమైనది ఏదియు లేదు. …

“మీరు నిబంధన మార్గములో శ్రద్ధతో ముందుకు వెళ్తున్నప్పటికీ, నిబంధన మార్గము నుండి జారిపోయి లేదా ప్రక్కకు వెళ్ళి లేదా మీరు ఇప్పుడు ఉన్న చోటునుండి నిబంధన మార్గమును చూడలేకపోయినప్పటికీ, పశ్చాత్తాపపడమని నేను మిమ్ములను వేడుకొనుచున్నాను. అనుదినము ఇంకొంచెము ఉత్తమముగా చేయుచు, ఇంకొంచెం ఉత్తమముగా ఉంటూ—అనుదిన పశ్చాత్తాపము యొక్క బలపరచు శక్తిని అనుభవించండి.”9

క్రీస్తు నొద్దకు వచ్చుట అనగా, ఆయన గురించి ఆలోచించడం లేదా ఆయన గురించి మాట్లాడడం లేదా ఆయనను ప్రేమించడం కంటే ఎక్కువైనది. దాని అర్థము ఆయనను వెంబడించడం. దాని అర్థము మనము జీవించాలని ఆయన బోధించిన విధంగా జీవించడం. మనందరి కొరకు దాని అర్థము, ఆలస్యము చేయకుండా పశ్చాత్తాపపడడం.

నా కుమార్తెలలో ఒకామె సువార్తికుల శిక్షణా కేంద్రములో పనిచేసేది. తాను బోధించిన ఒక సువార్తికుని గురించి ఆమె నాతో చెప్పింది, అతడు మోర్మన్ గ్రంథము సత్యమని తనకు ఖచ్చితంగా తెలియదని ఆమెకు చెప్పాడు. ఆత్మీయ సాక్ష్యము కోసం అతడు మళ్ళీ మళ్ళీ ప్రార్థన చేసాడు, కానీ అతడికి జవాబు రాలేదు.

ఈ సువార్తికునికి సహాయపడడానికి ఆమె చేయాల్సిన దానిని తెలుసుకోవడానికి నా కూతురు ప్రార్థించింది. ఆమె పొందిన భావన ఏమిటంటే, లేఖనాలు మనము చదవడానికి మరియు సాక్ష్యము పొందడానికి మాత్రమే ఇవ్వబడలేదు, కానీ దేవుని ఆజ్ఞలను పాటించడాన్ని మనకు బోధించడానికి కూడా అవి ఇవ్వబడ్డాయి. నా కూతురు సువార్తికునితో ఈ ఆలోచనను పంచుకుంది.

తరువాత, ఆమె ఈ సువార్తికుని మరలా చూసినప్పుడు ఎక్కువ సంతోషంగా కనిపించాడు. చివరికి అతడు మోర్మన్ గ్రంథము నిజమనే సాక్ష్యాన్ని పొందాడని ఆమెతో చెప్పాడు. మోర్మన్ గ్రంథము బోధించే దానిని చేయడానికి అతడు బాగా ప్రయత్నిస్తున్నందున ఈ సాక్ష్యము కలిగిందని అతడికి తెలుసు.

కష్ట సమయాల్లో రక్షకుని వైపు తిరుగుటలో పేతురు యొక్క మాదిరిని మనము అనుసరిద్దాము. మీ స్వంత జ్ఞానము, బలముపై ఆధారపడుటకు బదులుగా యేసు క్రీస్తును అనుసరించండి. ఆయన లేకుండా మీరు ఎంతకాలంగా నీళ్ళను దాటడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆయనను సమీపించడానికి సమయం మించిపోలేదు. ప్రణాళిక పనిచేస్తుంది!

ఇది పేతురు మరియు అతడి అనుభవం నుండి నేను నేర్చుకొనే మూడవ సూత్రము:

ప్రభువు యెదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, ఆయన గొప్ప విషయాలలో మిమ్మల్ని పైకెత్తుతారు.

నీళ్ళపై నడుస్తున్నప్పుడు, అతడికి అవసరమైనప్పుడు రక్షకుడిని సమీపించడంలో పేతురు విశ్వాసము చూపించాడు. అయినప్పటికీ, పేతురులో ఇంకా ఎక్కువ సామర్థ్యాన్ని రక్షకుడు చూసారు. “ఓ, అల్పవిశ్వాసీ,” “యెందుకు సందేహపడుతున్నావు?” 10 అని ఆయన అన్నారు.

పేతురు ఈ గద్దింపును తిరస్కరించియుండవచ్చు. కానీ అతడు దానిని సవినయంగా అంగీకరించాడు. అతడు యేసు క్రీస్తునందు అధిక విశ్వాసాన్ని వెదకుటను కొనసాగించాడు. విశ్వాసమును వృద్ధిచేసే అనేక అదనపు అనుభవాలు—వాటిలో కొన్ని చాలా చాలా కష్టమైనవి—వాటి ద్వారా పేతురు చివరకు ప్రభువు ఆశించినట్లుగా అత్యంత బలమైన నాయకునిగా మారాడు. అతడు ప్రభువు యొక్క సేవలో గొప్ప విషయాలను సాధించాడు.

మీరు ఏ గొప్ప విషయాలను సాధించాలని ప్రభువు కోరుతున్నారు? ఆయన సంఘము మరియు రాజ్యములో, రక్షకుడు చేసినట్లుగా ఇతరులకు సేవ చేయడానికి, పరిచర్య చేయడానికి అనేక అవకాశాలున్నాయి. ఆయన గొప్ప కార్యములో మీరు భాగమవ్వాలని ఆయన కోరుతున్నారు. ఇతరులు దానిని జీవించడానికి మీరు సహాయపడినప్పటి కంటే, ఎన్నడూ సంతోష ప్రణాళిక మీకు వాస్తవంగా మారదు.

నా స్వంత విశ్వాసాన్ని వృద్ధిచేసుకోవడంలో, ఆల్మా యొక్క ఈ మాటలు జీవితాన్ని మార్చివేసాయి: “తగ్గించబడుటకు బలవంతము చేయబడకుండా తమనుతాము తగ్గించుకొను వారు ధన్యులు.”11 యేసు క్రీస్తు మనల్ని పైకెత్తి, నడిపించి, మన సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోగలిగే స్థితిలో మనల్ని మనం సవినయంగా ఉంచుకుందాం.12

సంతోష ప్రణాళిక పనిచేస్తుందని నేను సాక్ష్యమిస్తున్నాను. మిమ్మల్ని ప్రేమించే మీ పరలోక తండ్రి చేత అది సృష్టించబడింది. ఇది పనిచేస్తుంది, ఎందుకంటే యేసు క్రీస్తు తన ప్రాయశ్చిత్తము ద్వారా పాపమును, మరణమును జయించారు. ఆయన వద్దకు రండి, ఆయనను వెంబడించండి మరియు “వెంటనే విమోచన యొక్క గొప్ప ప్రణాళిక మీ కొరకు పని చేయును.”13 యేసు క్రీస్తు నామములో, ఆమేన్.