2010–2019
డెబ్బది ఏళ్ళ మారులమట్టుకు
ఏప్రిల్ 2018


2:3

డెబ్బది ఏళ్ళ మారులమట్టుకు

అడ్డంకులు, లోపాలతో నిండియున్న జీవితంలో, రెండవ అవకాశముల కొరకు మనందరం కృతజ్ఞత కలిగియున్నాము.

తప్పులు ప్రతీ జీవితములో జరుగుతాయి. వేలకొలది---ఇంకా మిలియను తప్పులు చేస్తే తప్ప, నైపుణ్యంతో పియానో వాయించడం నేర్చుకోవడం అసాధ్యం. ఒక పరాయి భాష నేర్చుకోవడానికి ఒకరు వేలకొలది---ఇంకా మిలియను తప్పులు చేసి ఇబ్బందిని ఎదుర్కోవలసి రావచ్చు. ప్రపంచపు గొప్ప క్రీడాకారులు కూడా తప్పులు చేయకుండా ఉండరు.

“గెలుపు” అనేది “ఓటమి లేకపోవడం కాదు, కానీ ఓటమి నుండి ఓటమికి ఉత్సాహాన్ని కోల్పోకుండా ముందుకుసాగడం”1 అని చెప్పబడింది.

లైటు బల్బు ఆవిష్కరణతో, “నేను 1000 సార్లు ఓడిపోలేదు. లైటు బల్బు 1000 ప్రయత్నాలతో కూడిన ఆవిష్కరణ” 2 అని థామస్ ఎడిసన్ ఉద్దేశ్యపూర్వకంగా చెప్పారు. ఓటములు “మనం సాధించాలనుకున్న దానిని సరిగ్గా తెలుసుకొనేందుకు సహాయపడే సంఘటనలు,”3 అన్నారు చార్లెస్ ఎఫ్. కెట్టరింగ్. మనం చేసే ప్రతి తప్పు అడ్డంకులను అభివృద్ధి మార్గాలుగా మారుస్తూ ఒక గుణపాఠం కావాలని ఆశిద్దాం.

నీఫై యొక్క అచంచల విశ్వాసము, కంచు పలకలను పొందేవరకు ఓటమి నుండి ఓటమికి ముందుకుసాగేలా అతనికి సహాయపడింది. ఇశ్రాయేలీయులతో ఐగుప్తు నుండి పారిపోవడంలో చివరకు గెలుపొందడానికి మోషే 10 సార్లు ప్రయత్నించవలసి వచ్చింది.

నీఫై మరియు మోషే ఇద్దరూ ప్రభువు యొక్క పనిమీద ఉన్నప్పుడు, ప్రభువు మధ్యలో కల్పించుకొని, వారు మొదటి ప్రయత్నంలోనే గెలుపొందేలా ఎందుకు చేయలేదని--- మనం ఆశ్చర్యపోవచ్చు. కష్టాలను ఎదుర్కోవడానికి, గెలుపు కోసం చేసే ప్రయత్నాల్లో ఓడిపోవడానికి---వారిని ఆయన ఎందుకు అనుమతించారు---ఆయన మనల్ని ఎందుకు అనుమతిస్తారు? ఆ ప్రశ్నకు గల అనేక ముఖ్యమైన జవాబుల్లో కొన్ని ఇక్కడున్నాయి:

  • మొదటిది, “ఇవన్నీ (మనకు) అనుభవాన్నిస్తాయని, (మన) మేలు కోసమేనని,”4 ప్రభువుకు తెలుసు.

  • రెండవది, “మంచిని మెచ్చుకోవడం (మనము) తెలుసుకొనులాగున, శ్రమలను అనుభవించేందుకు,”5 మనల్ని అనుమతించడానికి.

  • మూడవది, “యుద్ధము యెహోవాదే,” 6 అని మరియు కేవలము ఆయన కృపను బట్టియే మనము ఆయన కార్యమును నెరవేర్చగలమని మరియు ఆయన వలె కాగలము అని నిరూపించడానికి.7

  • నాల్గవది, క్రీస్తు వంటి లక్షణాలలో అనేకమును పొందేలా, వృద్ధిచేసుకొనేలా మనకు సహాయపడేందుకు, ఆ లక్షణాలను “శ్రమల కొలిమిలోను,”9 వ్యతిరేకత8 ద్వారా తప్ప అది శుద్ధి చేయబడదు.

కాబట్టి, అడ్డంకులు లోపాలతో నిండియున్న జీవితంలో, రెండవ అవకాశం కొరకు మనందరం కృతజ్ఞత కలిగియున్నాము.

1970లో, బి వై యు లో క్రొత్తగా నేను చేరినప్పుడు, భౌతిక శాస్త్ర ఆవశ్యకాలపై ప్రారంభ కోర్సులో నేను చేరాను, దానిని జే బాల్లిఫ్ అనే గొప్ప ప్రొఫెసరు బోధించేవారు. ప్రతి పాఠము యొక్క విభాగము పూర్తి చేసిన తర్వాత ఆయన పరీక్ష పెట్టేవారు. ఒక విద్యార్థి సి గ్రేడు పొంది, ఇంకా మంచి మార్కులు తెచ్చుకోవాలని కోరుకున్నట్లయితే, అదే పాఠం కవరు చేస్తూ మార్చబడిన పరీక్ష రాయడానికి విద్యార్థిని ప్రొఫెసరు బాల్లిఫ్ అనుమతించేవారు.ఒకవేళ రెండో ప్రయత్నంలో విద్యార్ధి బి గ్రేడు పొంది, ఇంకా తృప్తి చెందకపోతే, అతడు లేక ఆమె పరీత్రను మూడవసారి, నాల్గవసారి కూడా, ఇంకా పరీక్ష రాయవచ్చు. నాకు అనేక రెండవ అవకాశాలనిచ్చుట ద్వారా, నేను వృద్ధిచెంది చివరికి ఆయన తరగతిలో ఎ గ్రేడు తెచ్చుకొనేలా ఆయన నాకు సహాయపడ్డారు.

ప్రొఫెసరు జే బాల్లిఫ్

ఆయన ఒక అసాధారణమైన తెలివితేటలు గల ప్రొఫెసరు ---ఓటమిని గుణపాఠంగా అనుకోవాలే తప్ప ఆపదలా కాదని, ఓటమికి భయపడక దాని నుండి నేర్చుకోవాలని---ప్రయత్నిస్తూనే ఉండమని తన విద్యార్థులను ఆయన ప్రేరేపించి, ప్రోత్సహించేవారు.

ఆయన భౌతిక శాస్త్రం చదివిన 47 సంవత్సరాల తరువాత, ఇటీవల నేను ఈ గొప్ప వ్యక్తికి ఫోను చేసాను. వారి మార్కులను వృద్ధి చేసుకోవడానికి విద్యార్థులకు అపరిమితమైన అవకాశాలను ఆయన ఎందుకు ఇచ్చేవారని నేను అడిగాను: దానికి ఆయన జవాబు,“గెలుపొందేవరకు నేను విద్యార్థుల వైపే ఉండాలని నేను కోరుతున్నాను.”

మనస్సు తప్పులు లేదా ఓటముల తర్వాత రెండవ అవకాశాల కోసం మనం ప్రేరేపించబడి, కృతజ్ఞత కలిగియున్నప్పుడు, పాపము, లేదా హృదయ వైఫల్యములందు మనకు రెండవ అవకాశాలను ఇవ్వడంలో రక్షకుని యొక్క కృపను బట్టి మనము ఆశ్చర్యపడతాము.

మనం గెలవాలని రక్షకుడు కోరుకున్నంతగా ఎవరూ కోరుకొనరు. మనల్ని మనం నిరూపించుకోవడానికి మళ్ళీ మళ అవకాశాలను తీసుకోవడానికి ఆయన మనల్ని అనుమతిస్తారు. ప్రకృతి సంబంధియైన మనుష్యునితో, మన అనుదిన శ్రమలలో ఆయన వలె కావడానికి లెక్కలేనన్నిరెండవ అవకాశాలు అవసరమవుతాయి, అవి కోరికలను అదుపు చేసుకోవడం, సహనాన్ని క్షమాపణను నేర్చుకోవడం, బద్ధకాన్ని జయించుట, చేయవలసిన దానిని చేయకుండా చేయటం ద్వారా పాపము చేయుట వంటివి, ఆ శ్రమలలో కొన్ని. తప్పు చేయడం మనిషి స్వభావం అయితే, మన స్వభావం ఇకపై మనిషిలా కాకుండా దేవునిలా మారడానికి మనము ఎన్నిసార్లు ఓటమిపాలు కావలసివస్తుంది? వెయ్యిసార్లా? మిలియనుసార్లు కావచ్చు.

తిన్నని, ఇరుకైన మార్గము శ్రమలతో పరచబడుయుండునని ఎరిగి, ఓటములు మనకు ప్రతీరోజు ఎదురవుతాయని తెలిసి, మన మర్త్య శిక్షణలో గెలుపొందడానికి కావలసినన్ని అవకాశాలను మనకివ్వడానికి రక్షకుడు అనంతమైన వెల చెల్లించారు. ఆయన అనుమతించే వ్యతిరేకత తరచుగా అధిగమించలేనిదిగా మరియు దాదాపు భరించుటకు అసాధ్యమైనది కనబడవచ్చు, అయినప్పటికిని, ఆయన మనల్ని నిరీక్షణ లేకుండా విడిచిపెట్టలేదు.

జీవితపు సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడు మన నిరీక్షణను దృఢంగా నిలుపుకోవడానికి, రక్షకుని యొక్క కృప ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది మరియు ఎల్లప్పుడూ హాజరై ఉంటుంది. ఆయన కృపయే “సహాయము లేక బలము కొరకు ఒక దైవిక మార్గము, . . .తమ శాయశక్తులను వెచ్చించిన తర్వాత నిత్యజీవితమును ఉన్నతస్థితిని సంపాదించుటకు స్త్రీ పురుషులను అనుమతించు శక్తి.”10. ఆయన ప్రేరేపిస్తూ, భారములను తేలిక చేస్తూ, బలపరుస్తూ, విడిపిస్తూ, కాపాడుతూ, స్వస్థపరుస్తూ లేదా తిన్నని ఇరుకైన మార్గంలో వారు తొట్రుపడుచున్నప్పటికీ “తన జనులను ఆదరిస్తూ” ఉండగా, మన ప్రయాణమంతటా ఆయన కృప మరియు ప్రేమగల ఆయన దృష్టి మనపై నిలుస్తుంది.11

పశ్చాత్తాపము అనేది దేవుని ఎప్పటికీ అందుబాటులో ఉన్నవరము, మరియు అది ఓటమి నుండి ఓటమికి ఉత్సాహాన్ని కోల్పోకుండా ముందుకుసాగేలా సాధ్యపరచును. పశ్చాత్తాపమనేది మనం ఓడిపోతామేమోనని ఆయనిచ్చిన ప్రత్యామ్నాయ ప్రణాళిక కాదు. మనం ఓడిపోతామని తెలిసి ఆయనిచ్చిన ప్రణాళికయే పశ్చాత్తాపము. ఇదియే పశ్చాత్తాపము యొక్క సువార్త మరియు అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గమనించినట్లుగా, అది “జీవితకాలపు ప్రణాళిక.” 12

పశ్చాత్తాపము యొక్క ఈ జీవితకాల ప్రణాళికలో, ఆయన క్షమాపణకు నిరంతరము వీలుకల్పించేందుకు ప్రభువు ఏర్పాటుచేసిన మార్గమే సంస్కారము. విరిగిన హృదయము మరియు నలిగిన ఆత్మతో మనము దానిలో పాలుపంచుకున్నట్లయితే, నిబంధన మార్గములో ఓటమి నుండి ఓటమికి మనము ముందుకు సాగుతుండగా ఆయన మనకు ప్రతీవారం క్షమాపణను అందిస్తారు. ఏలయనగా “వారి పాపములతో సంబంధం లేకుండా, ఆయన ప్రేగులు వారి వైపు కనికరముతో నిండియున్నవి.”13

కానీ ఎన్నిసార్లు ఆయన మనల్ని క్షమిస్తారు? ఆయన దీర్ఘశాంతము ఎంతకాలముండును? ఒక సందర్భములో పేతురు---“ప్రభువా, నా సహోదరుడు నా యెడల తప్పిదము చేసినయెడల నేనెన్నిమారులు అతని క్షమింపవలెను? ఏడు మారులమట్టుకా?”14 అని రక్షకుడిని అడిగాడు.

పేతురు మరియు యేసు

బహుశా, అనేకమార్లు క్షమించడం అవివేకమని, మంచితనానికి కూడా హద్దుండాలని నొక్కిచెప్పడానికి ఏడు అనేది తగినంత పెద్ద సంఖ్యయని నిస్సందేహంగా పేతురు భావించాడు. దానికి జవాబుగా, లెక్కపెట్టరాదని---క్షమించడానికి హద్దులు ఏర్పరచరాదని రక్షకుడు అత్యావశ్యకముగా పేతురుతో చెప్పారు.

“యేసు అతనితో ఇట్లనెను---ఏడుమారులుమట్టుకే కాదు, డెబ్బది ఏళ్ళ మారులమట్టుకని నీతో చెప్పుచున్నాను.” 15

స్పష్టంగా, రక్షకుడు గరిష్ట పరిమితిని 490 సార్లుగా స్థాపించలేదు.అది సంస్కారంలో 490 సార్లు మాత్రమే పాలుపంచుకోవాలని, తరువాత 491వ సారి, పరలోకములో లెక్కచూసేవారు కల్పించుకొని, “క్షమించండి, మీ పశ్చాత్తాప పత్రం కాలం తీరిపోయింది---ఇకమీదట, మీ సంగతి మీరు చూసుకోవాలి” అంటారని చెప్పడంతో పోల్చినట్లవుతుంది.

ఆయన అంతములేని ప్రాయశ్చిత్తము, హద్దులు లేని ప్రేమ, మరియు అనంతమైన కృపకు చిహ్నంగా ప్రభువు డెబ్బది ఏళ్ళ మారులు అని లెక్కలు ఉపయోగించారు. “అవును, ఎంత తరచుగా నా ప్రజలు పశ్చాత్తాపము పొందుదురో అంతగా నాకు వ్యతిరేకముగా వారి అతిక్రమములను నేను క్షమించెదను.” 16

సంస్కారము పాపమునకు అనుమతిగా అవుతుందని దాని అర్ధము కాదు. ఈ కారణము చేతనే ఈ వాక్యమును మొరోనై గ్రంథములో చేర్చబడింది: “కానీ నిజమైన ఉద్దేశముతో ఎంత తరచుగా వారు పశ్చాత్తాపము పొంది క్షమాపణ కోరిన వారు క్షమింపబడుదురు.”17

నిజమైన ఉద్దేశము అనేది నిజమైన ప్రయత్నమును మరియు నిజమైన మార్పును సూచిస్తుంది. పశ్చాత్తాపమును నిర్వచించడానికి లేఖన మార్గదర్శి ఉపయోగించు ముఖ్య పదము “మార్పు”: “హృదయము మరియు మనస్సు యొక్క మార్పు, అది దేవుడిపట్ల, వ్యక్తిపట్ల, సహజంగా జీవితం పట్ల క్రొత్త దృక్పథాన్నిస్తుంది.”18 అటువంటి మార్పు మూలంగా ఆత్మీయ వృద్ధ. కలుగుతుంది. అప్పుడు, మన గెలుపు ఓటమి నుండి ఓటమికి వెళ్ళడం లేదు, కానీ ఓటమి నుండి ఓటమికి ఉత్సాహాన్ని కోల్పోకుండా వృద్ధిచెందుతోంది.

మార్పుకు సంబంధించి ఈ సాధారణ అంతరదృష్టిని పరిశీలించండి: “మారని విషయాలు అదేవిధంగా నిలిచియుంటాయి.” ఈ స్పష్టమైన నిజము మిమ్మల్ని కించపరచడానికి ఉద్దేశించినది కాదు, కానీ అధ్యక్షులు బాయిడ్ కె. పాకర్ గారి లోతైన జ్ఞానమిది, తరువాత ఆయన దానికి ఇలా చేర్చారు, “మనం మారటం ఆగిపోయినప్పుడు---మన వృద్ధి ఆగిపోతుంది.19

మన రక్షకుని వలె మనము అయ్యేంత వరకు,20 మనము ఆగిపోవాలని కోరము కనుక, మన బలహీలనతలను లక్ష్యపెట్టకుండా ఎదుగుతూ మరియు అభివృద్ధి చెందాలనే కోరికతో, మనము పడిపోయినమైన ప్రతీసారి, పైకి లేచుటకు కొనసాగించాల్సినవసరమున్నది. మన బలహీనతలో, “నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది,”21 అని ఆయన మనకు అభయమిస్తున్నారు.

కాలాన్నంతటినీ ఒకేసారి చూస్తూనో లేక వృద్ధి పటాల ద్వారానో మన భౌతిక వృద్ధిని మనం గ్రహిస్తాము. అదేవిధంగా, గతంలోకి తొంగిచూస్తే తప్ప సాధారణంగా మన ఆత్మీయ వృద్ధిని అంచనా వేయలేము. మన వృద్ధిని గుర్తించడానికి మరియు “అందువలన, క్రీస్తునందు ఒక నిలకడతో పరిపూర్ణమైన ప్రకాశవంతమైన నిరీక్షణ కలిగియుండి, ముందుకు త్రోసుకు వెళ్లుటకు” మనల్ని ప్రేరేపించడానికి క్రమం తప్పకుండా ఆత్మ విమర్శ చేసుకొనుట తెలివైన పనవుతుంది. 22

పరలోక తల్లిదండ్రులు మరియు వారి సమక్షానికి తిరిగి వెళ్ళే ప్రయాణంలో మనకు లెక్కలేనన్ని రెండవ అవకాశాలనిచ్చే రక్షకుని ప్రేమగల దయ, సహనము, మరియు దీర్ఘశాంతము కొరకు నేను శాశ్వతంగా కృతజ్ఞత కలిగియున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.