ప్రవక్తలు పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత మాట్లాడతారు
ప్రవక్తలను కలిగియుండుట ఆయన పిల్లల కొరకు దేవుని యొక్క ప్రేమకు సూచనగా ఉన్నది. వారు వాగ్దానములను, దేవుని యొక్కయు మరియు యేసు క్రీస్తు యొక్క నిజ స్వరూపమును తెలియజేస్తారు.
నా ప్రియమైన సహోదర, సహోదరిలారా, మీరు ఎక్కడ ఉన్నప్పటికిని, నిన్నమీరు ఆమోదించిన సమ్మతి కొరకు నా మనఃపూర్వకమైన మరియు లోతైన కృతజ్ఞతను వ్యక్తపరచాలని నేను కోరుచున్నాను. నేను మాట నేర్పరిని కాని మరియు నాలుక మంద్యముగల వానిగా భావించినప్పటికిని మోషే వలే, అతడికి ప్రభువు యొక్క మాటలు నన్ను ఓదార్చుచున్నవి:
“మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? లేక మూగవానినే గాని చెవిటి వానినే గాని దృష్టిగల వానినేగాని గ్రుడ్డి వానినేగాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే గదా?
“కాబట్టి వెళ్లుము, నేను నీ నోటికి తోడైయుండి, నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించెదనని అతనితో చెప్పెను” (నిర్గమకాండము 4:11–12;10 కూడా చూడుము ).
నా ప్రియమైన భార్య యొక్క ప్రేమ మరియు సహకారము చేత నేను ఓదార్చబడ్డాను. ఆమె మంచితనము, ప్రేమ నాకు, నా కుటుంబానికి పూర్తి సమర్పణ యొక్క మాదిరిగా ఉన్నది. నేను ఆమెను పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాను, మరియు ఆమె నాపై, నా కుటుంబముపై కలిగియున్న మంచి ప్రభావము కొరకు నేను కృతజ్ఞుడను.
సహోదర, సహోదరిలారా, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ భూమి మీద దేవుని యొక్క ప్రవక్త అని నేను మీకు సాక్ష్యమివ్వాలని కోరుచున్నాను. ఆయన కంటే ఎక్కువ దయ మరియు ప్రేమగల వ్యక్తిని నేను ఎన్నడూ చూడలేదు. ఈ పరిశుద్ధ పిలుపు కొరకు నేను సరిపోనట్లు భావించినప్పటికిని, ఆయన మాటలు, ఆ బాధ్యతను అప్పగించబడినప్పుడు ఆయన కన్నులలో దయగల భావన రక్షకుని ప్రేమ చేత చుట్టబడి, నింపబడినట్లు నేను భావించాను. అధ్యక్షులు నెల్సన్, మీకు ధన్యవాదములు. నేను మిమ్మల్ని ఆమోదిస్తున్నాను మరియు నేను ప్రేమిస్తున్నాను.
మనము జీవిస్తున్న ఈ కడవరి దినాలలో భూమిమీద ప్రభువు యొక్క చిత్తమును తెలుసుకొనుటకు కోరు ప్రవక్తలు, దీర్ఘదర్శులు మరియు బయల్పాటుదారులను కలిగియుండుట ఒక దీవెనకాదా? జీవితములో మనము ఎదుర్కొనే సవాళ్లను లక్ష్యపెట్టకుండా, లోకములో మనము ఒంటరిగాలేమని తెలుసుకొనుట ఓదార్పును కలిగించును. ప్రవక్తలను కలిగియుండుట ఆయన పిల్లల కొరకు దేవుని యొక్క ప్రేమకు సూచన. వారు దేవుని యొక్కయు మరియు యేసు క్రీస్తు యొక్క వాగ్దానములను మరియు నిజ స్వరూపమును వారి జనులకు తెలియజేస్తారు. దానిని నా వ్యక్తిగత అనుభవాల ద్వారా నేను నేర్చుకున్నాను.
పదిహేను సంవత్సరాల క్రితం, అప్పుడు ప్రథమ అధ్యక్షత్వములో రెండవ సలహాదారునిగా ఉన్న అధ్యక్షులు జేమ్స్ ఈ. ఫౌస్ట్ నుండి నా భార్యకు, నాకు ఒక ఫోను వచ్చింది. ఆయన మమ్మల్ని పోర్చుగల్‌లో మిషను అధ్యక్షునిగా, సహవాసిగా సేవ చేయమని కోరారు. మేము మిషను ప్రారంభించుటకు మాకు ఆరు వారాలు మాత్రమే ఉన్నాయని ఆయన మాతో చెప్పారు. మేము సిద్ధపడనట్లుగా, సరిపోనట్లు భావించినప్పటికిని, మేము పిలుపును అంగీకరించాను. ఆ సమయమందు మా అతి ముఖ్యమైన ఆలోచన ఆ దేశములో సేవ చేయుటకు అవసరమైన వీసాలు పొందాలి, ఎందుకనగా గత అనుభవము ప్రకారము, ప్రక్రియ పూర్తగుటకు ఆరునుండి ఎనిమిది నెలలు పట్టునని మేము ఎరుగుదుము.
అప్పుడు మాకు విశ్వాసమున్న యెడల ప్రభువు ఒక అద్భుతము చేయగలడని మరియు వీసా సమస్యను మేము పరిష్కరించుకోగలమని అధ్యక్షులు ఫౌస్ట్ చెప్పారు. మా జవాబు బలముగా “అవును,” మరియు వెంటనే ఏర్పాట్లు చేయుటకు ప్రారంభించాము. మేము వీసా కోసం పత్రాలను సిద్ధపరిచాము, మా ముగ్గురు చిన్న పిల్లలను తీసుకొని వెళ్ళి, మాకు సాధ్యమైనంత వేగంగా, దౌత్యవేత్త కార్యాలయానికి వెళ్లాము. అక్కడ ఒక మంచి స్త్రీ మమ్మల్ని కలుసుకున్నది. మా పత్రాలను సమీక్షించుటలో, పోర్చుగీసుతో మేము చేయబోవు దానితో తెలుసుకొనుటకు, ఆమె మా వైపు తిరిగి మమ్మల్ని ఇలా అడిగింది, “మీరు నా దేశ జనులకు సహాయపడబోవుచున్నారా!” “అవును,” అని మేము స్థిరముగా జవాబిచ్చాము, మరియు మేము యేసు క్రీస్తుకు ప్రతినిధిగా ఉంటామని, ఆయనను గూర్చి, లోకములో ఆయన దైవిక మిషను గూర్చి సాక్ష్యమిస్తామని వివరించాము. నాలుగు వారముల తరువాత మేము తిరిగి వెళ్లాము, మా వీసాలను పొందాము, మరియు ప్రభువు యొక్క ప్రవక్త మమ్మల్ని అడిగినట్లుగా ఆరు వారాలలోపు మిషను ప్రాంతములో అడుగుపెట్టాము.
సహోదర, సహోదరిలారా, ప్రవక్తలు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతారని నా హృదయపు లోతులలోనుండి నేను సాక్ష్యమిస్తున్నాను. వారు క్రీస్తును గూర్చి మరియు భూమి మీద ఆయన దైవిక మిషను గూర్చి సాక్ష్యమిస్తారు. వారు ప్రభువు యొక్క మనస్సు మరియు హృదయమును సూచిస్తున్నారు మరియు ఆయనకు ప్రతినిధులుగా పిలవబడ్డారు, దేవుని మరియు ఆయన కుమారుడైన, యేసు క్రీస్తు సన్నిధిలో జీవించుటకు తిరిగి వెళ్లుటకు మనము చేయాల్సిన దానిని మనకు బోధిస్తారు. మనము మన విశ్వాసమును సాధన చేసి మరియు వారి బోధనలను అనుసరించినప్పుడు మనము దీవించబడతాము. వారిని వెంబడించుట ద్వారా, మన జీవితాలు సంతోషముగా మరియు తక్కువ జటిలమైనవిగా ఉంటాయి, మన కష్టాలు మరియు సమస్యలు భరించుటకు తేలికగా ఉంటాయి, మరియు మన కాలములోని శత్రువు ముట్టడులనుండి మనల్ని కాపాడునట్లు మన చుట్టూ ధరించుటకు ఆత్మీయ భద్రతను మనము కల్పిస్తాము.
ఈ ఈస్టరు దినమున యేసు క్రీస్తు లేచియున్నాడని, జీవిస్తున్నాడని మరియు భూమి మీద ఆయన సంఘమును తన ప్రవక్తలు, దీర్ఘదర్శులు, మరియు బయల్పాటుదారుల ద్వారా ఆయన నడిపిస్తున్నాడని నేను గంభీరముగా సాక్ష్యమిస్తున్నాను. ఆయన లోక రక్షకుడు, విమోచకుడని మరియు ఆయన ద్వారా మనము రక్షించబడతామని మరియు మన ప్రియమైన దేవుని స్థితిలో మహోన్నత స్థితిని పొందుతామని నేను సాక్ష్యమిస్తున్నాను. నేను ఆయనను ప్రేమిస్తున్నాను, నేను ఆయనను పూజిస్తున్నాను. నేను ఆయనను అనుసరించాలని మరియు ఆయన వలే కావాలని కోరుతున్నాను. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో నేను ఈ విషయాలను వినయముగా చెప్పుచున్నాను, ఆమేన్.