2010–2019
ఇదిగో ఈ మనుష్యుడు!
ఏప్రిల్ 2018


ఇదిగో ఈ మనుష్యుడు!

నిజముగా ఈ మనుష్యుని చూచుటకు ఒక మార్గమును కనుగొనేవారు, జీవితము యొక్క గొప్ప ఆనందాలకు ద్వారమును మరియు జీవితము యొక్క మిక్కిలి జరురైన నిరాశలకు మందును కనుగొంటారు.

నా ప్రియమైన సహోదర, సహోదరిలారా, ప్రియమైన స్నేహితులారా, ఈ అద్భుతమైన సర్వసభ్య సమావేశము వారంతమున మీతో ఉన్నందుకు నేను కృతజ్ఞుడను. పన్నెండుమంది అపొస్తులుల కోరము యొక్క సభ్యులుగా ఎల్డర్లు గాంగ్ మరియు సోరెస్‌లను మరియు ఈ సర్వసభ్య సమావేశమందు ముఖ్యమైన క్రొత్త పిలుపులను పొందిన అనేకమంది సహోదర, సహోదరీలను ఆమోదించుటలో మీతోచేరి హారియట్ మరియు నేను ఆనందిస్తున్నాము.

నా ప్రియమైన స్నేహితులు అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్‌ను నేను కోల్పోయినప్పటికిని, మన ప్రవక్త మరియు అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మరియు ఆయన ఘనులైన సలహాదారులను నేను ప్రేమిస్తున్నాను, ఆమోదిస్తున్నాను, మరియు బలపరుస్తున్నాను.

పన్నెండుమంది అపొస్తులుల కోరముకు చెందిన నా ప్రియమైన తోటి సహోదరులతో మరింత దగ్గరగా మరొకసారి పనిచేయుటకు నేను కృతజ్ఞుడను మరియు గౌరవించబడ్డాను.

అన్నిటికంటే, యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘము యొక్క సభ్యునిగా ఉన్నందుకు నేను చాలా దీనునిగా, మిక్కిలి సంతోషముగా ఉన్నాను, అక్కడ మిలియన్లమంది పురుషులు, స్త్రీలు, మరియు పిల్లలు వారు నిలబడిన చోట---ఏ పిలుపు లేక స్థాయిలో ఉన్నను పైకెత్తుటకు సమ్మతిస్తున్నారు---మరియు దేవునికి, మరియు ఆయన పిల్లలకు సేవ చేయుటకు, దేవుని యొక్క రాజ్యమును నిర్మించుటకు ప్రయాసపడుచున్నారు.

ఈరోజు పరిశుద్ధమైన దినము. అది ఈస్టరు ఆదివారము, మన రక్షకుడు మరణ బంధకాలను1 విరచి మరియు సమాధినుండి విజయునిగా ఉద్భవించినప్పుడు ఆ మహిమకరమైన ఉదయమును మనము జరుపుకుంటున్నాము.

చరిత్రలో గొప్ప దినము

ఇటీవల నేను “చరిత్ర గమనమును మార్చిన దినమేది?” అని ఇంటర్నెట్‌ను అడిగాను.

 జవాబులు, ఆశ్చర్యకరమైనవి, క్రొత్తవి, తెలివైన మరియు ఆలోచనను రేకెత్తించేవిగా క్రమముగా ఉన్నాయి. వాటి మధ్యలో, చరిత్రకు ముందు యుకాటాన్ పెనిన్సులాను ఉల్క తాకినప్పుడు, లేక 1440లో జాన్సన్ గుటెన్‌బర్గ్ తన ముద్రణా యంత్రమును పూర్తిచేసినప్పుడు, మరియు స్పష్టముగా, 1903 లో రైట్ సహోదరులు మనిషి నిజముగా ఎగరగలడని ప్రపంచమునకు చూపిన దినము.

అదే ప్రశ్నను నేను మిమ్మల్ని అడిగిన యెడల, మీరేమి చెప్తారు?

నా మనస్సులో జవాబు స్పష్టముగా ఉన్నది.

చరిత్రలో అతి ముఖ్యమైన దినమును కనుగొనుటకు, మనము దాదాపు 2,000 సంవత్సరాల క్రితం గెత్సేమనే వనములో యేసు క్రీస్తు మోకరించి గంభీరమైన ప్రార్థన చేసి, మన పాపములకు పరిహారముగా తనను తాను అర్పించుకొన్నప్పుడు, ఆ సాయంత్రమునకు తిరిగి వెళ్లాలి. శరీరము మరియు ఆత్మయందు రెండిటి లో అసాధారణమైన బాధ యొక్క ఈ గొప్ప మరియు అంతములేని త్యాగమును చేసే సమయములో, యేసు క్రీస్తు, దేవుడైనా కూడా, ప్రతీ రంథ్రమునుండి రక్తము కార్చెను. పరిపూర్ణమైన ప్రేమతో, ఆయన మనము సమస్తమును పొందునట్లు సమస్తమును ఇచ్చివేసెను. గ్రహించుటకు కష్టమైన ఆయన దైవిక త్యాగము, మన పూర్ణ హృదయము మరియు మనస్సుతో మాత్రమే అనుభవించబడును, ఆయన దైవిక వరము కొరకు మనము క్రీస్తుకు ఋణపడియున్న విశ్వవ్యాప్తమైన కృతజ్ఞతను మనకు జ్ఞాపకము చేయును.

తరువాత ఆ రాత్రి, యేసును ఎగతాళి చేసి, ఆయనను కొట్టిన మతపరమైన, రాజకీయ అధికారుల యెదుటకు తేబడెను, మరియు సిగ్గుకరమైన మరణమునకు ఆయనకు శిక్ష విధించెను.చివరకు “సమాప్తమయ్యె,”2 వరకు ఆయన తీవ్రమైన వేదనలో సిలువపై వ్రేలాడదీయబడెను. ఆయన ప్రాణములేని శరీరము అరువుగా తేబడిన సమాధిలో ఉంచబడినది. మరియు తరువాత, మూడవ దినమున ఉదయము, సర్వశక్తిమంతుడైన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు, సమాధినుండి మహిమకరమైన, తేజస్సు, కాంతి మరియు ప్రభావముగల పునరుత్థానము చెందిన ప్రాణిగా బయటకు వచ్చెను.

అవును, చరిత్ర అంతటా రాజ్యములు మరియు జనుల యొక్క గమ్యమును లోతుగా ప్రభావితం చేసిన అనేక సంఘటనలున్నాయి. కానీ వాటన్నటిని జతపరిస్తే, మొదటి ఈస్టరు ఉదయమును జరిగిన దాని ముఖ్యమైన దానితో వాటిని పోల్చుటకు ప్రారంభించలేము.

చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఘటన యేసు క్రీస్తు యొక్క అంతములేని త్యాగము మరియు పునరుత్థానమును---ప్రపంచ యుద్ధములు, విప్లవాత్మక వైపరిత్యాలు, మరియు జీవితమును మార్చు విజ్ఞానపరమైన ఆవిష్కరణలను ఎక్కువ ప్రభావవంతముగా చేసేదేమిటి?

యేసు క్రీస్తు వలన, మనము తిరిగి జీవించగలము

మనలో ప్రతిఒక్కరు ఎదుర్కొనే రెండు గొప్ప, అధిగమించలేని సమస్యలందు జవాబున్నది.

మొదట, మనమందరము మరణిస్తాము. మీరు ఎంత చిన్నవారు, అందమైనవారు, ఆరోగ్యకరమైన వారు, లేక జాగ్రత్తగా ఉన్నప్పటికినీ, ఎదోఒకరోజు మీ శరీరము నిర్జీవమగును. స్నేహితులు మరియు కుటుంబము మీ గురించి దుఃఖిస్తారు. కానీ వారు మిమ్మల్ని వెనక్కి తీసుకొనిరాలేరు.

అయినప్పటికినీ, యేసు క్రీస్తు వలన, మీ మరణము తాత్కాలికమైనదగును. ఒకరోజు మీ ఆత్మ మీ శరీరముతో తిరిగి ఏకమగును. ఈ పునరుత్థాన శరీరము మరణమునకు లోబడదు,3 మరియు మీరు బాధ మరియు శారీరక బాధనుండి స్వతంత్రులవుతారు.4

 యేసు క్రీస్తు తన ప్రాణమును ఇచ్చి, దానిని మరలా తీసుకొనుట వలన ఇది సంభవించెను.

ఆయన దీనిని ఆయన యందు విశ్వాసముంచు వారందరి కొరకు చేసెను.

ఆయన దీనిని ఆయన యందు విశ్వాసముంచని వారందరి కొరకు చేసెను.

ఆయన తన నామమును ఎగతాళి చేసి, దూషించి మరియు శపించిన వారి కొరకు దానిని చేసెను.5

యేసు క్రీస్తు వలన, మనము దేవునితో జీవించగలము

రెండవది, మనమందరము పాపము చేసాము. మన పాపములు మనము దేవునితో జీవించుట నుండి శాశ్వతంగా ఆపేస్తాయి , ఎందుకనగా “అపరిశుద్ధమైన ఏ వస్తువు ఆయన రాజ్యములోనికి ప్రవేశించదు.”6

యేసు క్రీస్తు, నిర్దోషమైన గొఱ్ఱెపిల్ల, మన పాపముల కొరకు తన ప్రాణమును క్రయధనముగా ఇచ్చేంత వరకు ---- ఫలితంగా, ప్రతీ పురుషుడు, స్త్రీ, మరియు బిడ్డ ఆయన సన్నిధి నుండి నిలిపివేయబడ్డారు. యేసుకు న్యాయము మరియు కనికరము అవసరములేదు కనుక, ఆయన ప్రతీ ఆత్మ కొరకు న్యాయపు అక్కరలను తీర్చుటకు మన ఋణమును ఆయన తీర్చగలిగాడు. మరియు దానికి మిమ్మల్ని, నన్ను చేర్చును.

యేసు క్రీస్తు మన పాపముల కొరకు వెల చెల్లించాడు.

వాటన్నిటికి.

చరిత్రలో ఆ ముఖ్యమైన దినమున, యేసు క్రీస్తు మరణపు ద్వారములను తెరచి, శాశ్వత జీవితము యొక్క పరిశుద్ధమైన మరియు అతిపవిత్రమైన గదులలోనికి వెళ్లుట నుండి ఆపివేయు అడ్డంకులను ప్రక్కన పెట్టాడు. మన ప్రభువును మరియు రక్షకుని వలన, మీరు, నేను మన గతమును లక్ష్యపెట్టకుండా, మిక్కిలి ప్రశస్తమైన మరియు అమూల్యమైన వరమును దయచేయబడ్డాము, మనము పశ్చాత్తాపపడగలము మరియు పరలోక తండ్రి యొక్క విశ్వాసులైన పిల్లల చేత చుట్టుముట్టబడి సిలెస్టియల్ వెలుగు మరియు మహిమకు నడిపించు బాటను అనుసరించగలము.

మనము ఎందుకు ఆనందిస్తాము

మనము ఈస్టరు ఆదివారమున జరుపుకునేది అదే---మనము జీవమును జరుపుకుంటాము!

యేసు క్రీస్తు వలన, మనము మరణము యొక్క నిరాశ నుండి లేపబడతాము మరియు మిక్కిలి ఆనందభాష్పాలను రాల్చుచూ, కృతజ్ఞతతో నింపబడి, మనము ప్రేమించిన వారిని హత్తుకుంటాము . యేసు క్రీస్తు వలన, మనము నిత్య ప్రాణులుగా, అంతములేని లోకములుగా ఉంటాము.

యేసు క్రీస్తు వలన, మనము పాపములు తుడిచి వేయబడుట మాత్రమే కాదు; అవి మరచిపోబడతాయి.

మనము పరిశుద్ధపరచబడతాము మరియు ఉన్నతస్థితిని పొందగలము.

పరిశుద్ధమైన

మన ప్రియమైన రక్షకుని వలన, ఊహించని మహిమ మరియు పరిపూర్ణమైన సంతోషమందు, మనము నిత్యజీవమునకై ఊరెడు నీటిబుగ్గనుండి శాశ్వతంగా త్రాగుతాము.7 మన నిత్య రాజు యొక్క సౌధములలో శాశ్వతముగా నివసిస్తాము.

“మనము ఆ మనుష్యుని చూస్తున్నామా”?

ఇవన్నీ ఉన్నప్పటికిని, నేటి ప్రపంచములో అనేకులు, యేసు క్రీస్తు మనకిచ్చిన ప్రశస్తమైన వరమునందు నమ్ముటలేదు లేక ఎరిగియుండరు. వారు యేసు క్రీస్తు గురించి వినియుండవచ్చు, మరియు చరిత్రలో ప్రముఖమైన వ్యక్తిగా ఆయనను ఎరిగియుండవచ్చు, కానీ వారు ఆయన ఎవరోనని ఆయనను నిజముగా చూచుటలేదు.

దీనిగురించి నేను ఆలోచించినప్పుడు, రక్షకుని యొక్క మరణానికి కేవలము కొన్ని గంటల ముందు, యూదా యొక్క రోమా అధికారి పొంతుపిలాతు యెదుట నిలబడిన రక్షకుని గూర్చి నేను జ్ఞాపకము చేయబడ్డాను.

పిలాతు యేసును ఖచ్చితంగా లోకసంబంధమైన దృష్టికోణమునుండి చూసాడు. పిలాతు చేయటానికి పని కలిగియున్నాడు, మరియు అది రెండు పెద్ద కార్యములను చేర్చియున్నది: రోమా కొరకు పన్నులు సేకరించుట మరియు శాంతిని కాపాడుట. ఇప్పుడు యూదా సన్నిహిద్రోను అతడి యెదుటకు ఒక వ్యక్తిని తీసుకొచ్చారు, ఆయన ఈ రెండిటికి ఆటంకముగా ఉన్నాడని వారు చెప్పారు.8

ఖైదీను ప్రశ్నించిన తరువాత, పిలాతు ప్రకటించాడు, “ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరమును కనబడలేదననెను.”9 కానీ యేసును దూషించిన వారిని ప్రసన్నం చేసుకోవాలని అతడు భావించాడు, కనుక పిలాతు ఇశ్రాయేలు ఆచారమును పిలిచి, పస్కాపండుగ నాడు ఒక ఖైదీని విడుదల చేయుటకు అనుమతించాడు. ఆ క్రూరుడైన దొంగ మరియు హంతకుడైన బరబ్బాకు బదులుగా వారు యేసును విడుదల చేయరా? 10

దుండగుల సమూహము బరబ్బా విడుదల చేయబడవలెనని మరియు యేసు సిలువ వేయాలని డిమాండు చేసారు.

“ఎందుకు?” “అతడే చెడుకార్యము చేసెనని?” పిలాతు అడిగెను

“వానిని సిలువ వేయుము!” 11 అని మరి ఎక్కువగా కేకలు వేసిరి.

అల్లరిమూకను తృప్తిపరచే ఒక చివరి ప్రయత్నములో, యేసును సిలువ వేయమని పిలాతు తన మనుష్యులకు ఆజ్ఢాపించాడు.12 రక్తము చిందిస్తూ, గాయములతో ఉన్న ఆయనను వదలుతూ, దానిని వారు చేసారు. వారు ఆయనను ఎగతాళి చేసారు, ఆయన తలపై ముండ్ల కిరీటము ఉంచారు, మరియు ఒక ఊదారంగు వస్త్రమును ఆయనకు ధరింపచేసారు.13

బహుశా రక్తము కొరకు అల్లరిమూక యొక్క కోరికను ఇది తృప్తి పరచునని పిలాతు అనుకున్నాడు. బహుశా వారు ఆయనమీద జాలి పడవచ్చు. “ఇదిగో ఈయనయందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియునట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసికొని వచ్చుచున్నానని వారితో అనెను!”14

దేవుని కుమారుడు శరీరమందు యెరూషలేము ప్రజల యెదుట చెరలో నిలబడ్డాడు.

వారు యేసును చూడగలిగారు, కానీ వారు నిజముగా ఆయనను చూడలేదు.

వారు చూచుటకు కన్నులను కలిగిలేరు.15

ఉపమాన భావనలో, మనము కూడ “ఈ మనుష్యుని” చూచుటకు ఆహ్వానించబడ్డాము. ప్రపంచములో ఆయనను గూర్చి అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. ప్రాచీన మరియు ఆధునిక ప్రవక్తలు ఆయన దేవుని కుమారుడని సాక్ష్యమిచ్చారు. నేను కూడా దానిని చేస్తాను. మనలో ప్రతిఒక్కరము దానిని మనకై మనము తెలుసుకొనుట ప్రముఖమైనది మరియు ముఖ్యమైనది. అందువలన మీరు యేసు క్రీస్తు యొక్క జీవితము మరియు పరిచర్యను ధ్యానించినప్పుడు, మీరేమి చూసారు?

ఈ మనుష్యుని నిజముగా చూచుటకు ఒక మార్గమును కనుగొనేవారు, జీవితము యొక్క గొప్ప ఆనందాలకు ద్వారమును మరియు జీవితము యొక్క మిక్కిలి జరూరైన నిరాశలకు మందును కనుగొంటారు.

కనుక, విచారములు మరియు వేదనచేత మీరు చుట్టుముట్టబడినప్పుడు, ఈ మనుష్యుని చూడుము.

మీరు తప్పిపోయినట్లు లేక మరిచిపోబడినట్లు భావించినప్పుడు, ఈ మనుష్యుని చూడుము.

మీరు నిరాశ చేంది, ఒంటరిగా విడువబడి, సందేహించి, నష్టపోయి, లేక ఓడిపోయినప్పుడు, ఆ మనుష్యుని చూడుము.

ఆయన మిమ్మల్ని ఓదార్చును.

ఆయన మిమ్మల్ని స్వస్థపరచును మరియు మీ ప్రయాణమునకు అర్ధమునిచ్చును. ఆయన తన ఆత్మను కుమ్మరించి మరియు మీ హృదయాలను అత్యధికమైన ఆనందముతో నింపును.16

“సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తి హీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే.”17

మనము నిజముగా ఈ మనుష్యునిని చూచినప్పుడు, మనము ఆయనను గూర్చి నేర్చుకుంటాము మరియు ఆయనతో మన జీవితాలను కలుపుకొనుటకు వెదకుతాము. మనము పశ్చాత్తాపపడతాము మరియు మన స్వభావాలను శుద్ధి చేయుటకు మరియు ప్రతీరోజు ఆయనకు దగ్గరగుటకు ఎదుగుతాము. మనము ఆయనను నమ్ముతాము. ఆయన ఆజ్ఞలను పాటించుట ద్వారా మరియు మన పరిశుద్ధ నిబంధనలకు తగినట్లు జీవించుట ద్వారా ఆయన కొరకు మన ప్రేమను చూపుతాము.

మరొక మాటలలో, మనము ఆయన శిష్యులమవుతాము.

ఆయన శుద్ధి చేయు కాంతి మన ఆత్మలను పూర్తిగా నింపును. ఆయన కనికరము మనల్ని పైకెత్తును. మన భారములు తేలిక చేయబడును, మన శాంతి హెచ్చింపబడును. మనము ఆ మనుష్యుని నిజముగా చూచినప్పుడు, జీవితపు ప్రయాణములో శ్రమలు మరియు సవాళ్ల గుండా మనల్ని బలపరచును. గతమును ఆలోచించినప్పుడు, ఒక దైవిక మాదిరి ఉందని, మీకు జరిగే విషయాలు అర్ధాన్ని కలిగియున్నవని మరియు వాటి ఉద్దేశమును మనము గుర్తిస్తాము.18

ఆయన త్యాగమును మీరు అంగీకరించి, ఆయన శిష్యులుగా మారినప్పుడు, మరియు చివరకు మీ భూలోక ప్రయాణము ముగింపును చేరుకున్నప్పుడు, ఈ జీవితములో మీరు సహించిన విచారముల విషయమేమిటి?

విచారములు గతించును.

మీరు ఎదుర్కొన్న నిరాశలు, మోసగించబడుట, హింసల మాటేమిటి?

గతించెను.

మీరు అనుభవించిన బాధ, హృదయవేదన, నేరభావన, అవమానము, మరియు వేదన?

గతించెను.

మరచిపోబడెను.

“మేము క్రీస్తు గురించి మాట్లాడుచున్నాము, మేము క్రీస్తునందు ఆనందించుచున్నాము, మేము క్రీస్తు గురించి బోధించుచున్నాము, మేము క్రీస్తును గూర్చి ప్రవచించుచున్నాము . . . మా పిల్లలు వారి యొక్క పాపముల నివృత్తి కొరకు వారు ఏ మూలాధారమును చూడవలెనో మా సంతానము తెలుసుకొనుటలో”19 ఆశ్చర్యమేదైనా ఉన్నదా?

ఆ మనుష్యుని నిజముగా చూచుటకు మన పూర్ణ హృదయములతో ప్రయాసపడుటలో ఆశ్చర్యమేదైనా ఉన్నదా?

నా ప్రియమైన సహోదర, సహోదరిలారా, మానవ చరిత్రలో అత్యంత ముఖ్యమైన దినము, దేవుని కుమారుడైన యేసు, దేవుని యొక్క పిల్లలందరి కొరకు మరణమును మరియు పాపమును జయించినప్పుడు, అని సాక్ష్యమిచ్చుచున్నాను. మీ, నా జీవితములో అతి ముఖ్యమైన దినము; “ఇదిగో ఈ మనుష్యుని” మనము చూచుట నేర్చుకున్నప్పుడు, ఆయన నిజముగా ఎవరో మనము చూచినప్పుడు, ఆయన ప్రాయశ్చిత్త శక్తిని మన హృదయము మరియు మనస్సుతో పాలుపంచుకొన్నప్పుడు, క్రొత్తగా చేయబడిన ఉత్సాహము మరియు బలముతో, ఆయనను వెంబడించుటకు ఒడంబడిక చేసుకున్నప్పుడు. మన జీవితములంతటా ఆ దినము తిరిగి పలుమార్లు పునరావృతమగును గాక.

“ఇదిగో ఈ మనుష్యుని” మనము చూచినప్పుడు, ఈ భూలోక జీవితములో ఆనందమును మరియు శాంతిని, రాబోయే లోకములో నిత్యజీవమును కనుగొంటామని నా దీవెనను మరియు సాక్ష్యమును నేను మీతో వదలుచున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. మోషైయా 15:23 చూడుము.

  2. యోహాను 19:30.

  3. ఆల్మా 11:45 చూడుము.

  4. బయల్పాటు 21:4 చూడుము.

  5. 1 కొరింథీయులకు 15:21–23 చూడుము

  6. 3 నీఫై 27:19.

  7. యోహాను 4:14 చూడుము.

  8. లూకా 23:2 చూడుము

  9. యోహాను 18:38. యేసుకు తీర్పు తీర్చుటను మానుటకు, పిలాతు కేసును హేరోదు అంతిపకు అప్పగించాడు. బాప్తీస్మమిచ్చు యోహాను(Matthew 14:6–11 చూడుము), యొక్క మరణమును ఆజ్ఞాపించిన హేరోదు , యేసును దూషించిన యెడల, పిలాతు తీర్పును స్టాంపు వేసి, శాంతిని కాపాడుటకు బదులుగా అతడు అంగీకరించిన స్థానిక విషయము మాత్రమేనని చెప్పవచ్చును. కానీ యేసు హేరోదుతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు (Luke 23:6–12 చూడుము), మరియు హేరోదు ఆయనను పిలాతు వద్దకు తిరిగి పంపాడు.

  10. మార్కు 15:6–7; యోహాను 18:39–40 చూడుము. క్రొత్త నిబంధన పండితులొకరు వ్రాసారు, “పస్కా పండుగనాడు, రోమా గవర్నరు యూదా జనభాకు ఎవరైన క్రూరమైన ఖైదీని విడుదల చేయుట ఆచారముగా కనబడుచున్నది” (Alfred Edersheim, The Life and Times of Jesus the Messiah [1899], 2:576). బరబ్బా పేరుకు అర్ధము “తండ్రి యొక్క కుమారుడు.” పరిహాసమేదనగా, ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య ఎంపికను యెరూషలేము జనులకు ఇచ్చుట ఆసక్తికరమైనది.

  11. మాదిరి 15:11–14 చూడుము

  12. This scourging was so terrible it was called “the intermediate death” (Edersheim, Jesus the Messiah, 2:579).

  13. యోహాను 19:1–3 చూడుము

  14. యోహాను 19:1–3

  15. ఇంతకుముందు, యేసు “ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసికొనియున్నారు గనుక, మీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహింపనే గ్రహింపరు, చూచుటమట్టుకు చూతురు గాని యెంత మాత్రమును తెలిసికొనరు” (మత్తయి 13:15–16). మన హృదయాలు కఠినము చేయబడుటకు మనము అనుమతిస్తామా, లేక ఇదిగో మనుష్యుని మనము నిజముగా చూచునట్లు, మన కన్నులు మరియు హృదయములను తెరచుటకు అనుమతిస్తున్నామా?

  16. మోషైయా 4:20 చూడుము

  17. యెషయా 40:29.

  18. See Dieter F. Uchtdorf, “The Adventure of Mortality” (worldwide devotional for young adults, Jan. 14, 2018), broadcasts.lds.org.

  19. 2 నీఫై 25:26.

ముద్రించు