2010–2019
క్రీస్తు మిమ్మును క్షమించునట్లే, మీరును అలాగు చేయుడి
ఏప్రిల్ 2018


క్రీస్తు మిమ్మును క్షమించునట్లే, మీరును అలాగు చేయుడి

మనకు వ్యతిరేకంగా తప్పు చేసిన వారిని నిరాటంకముగా క్షమించడం మనము నేర్చుకొన్నప్పుడు మనమందరం చెప్పలేని మనశ్శాంతిని మరియు మన రక్షకునితో భాగస్వామ్యమును పొందుతాము.

“ఆదివారమున తెల్లవారుచుండగా, వారును, వారితో పాటు మరికొందరును, తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములను తీసికొని సమాది యొద్దకు వచ్చిరి.

“మరియు వారు సమాధి యొక్క రాయి దొర్లించబడి యుండుట చూచిరి.

“మరియు వారు లోపలికి వెళ్ళిరిగాని, ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు.

“ఇందును గూర్చి వారికేమియు తోచకయుండగా, ప్రకాశమైన వస్త్రములు ధరించిన, ఇద్దరు మనుష్యులు వారి యొద్ద నిలువబడిరి.

“వారు భయపడి, వారి ముఖములను నేల మోపియుండగా వీరుసజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు?

“ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచియున్నాడు,”1 అని వారితో అనిరి.

రేపు, పునరుత్థాన సబ్బాతు దినమున, యేసు క్రీస్తు మనకు ఏమి చేసాడో మనము ప్రత్యేక విధానములో జ్ఞాపకము చేసికొందాము: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతీవాడును నశింపక, నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.”2 చివరకు, మనము కూడా ఆయన వలే పునరుత్థానము నొంది నిత్యజీవమును పొందగలము.

యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త త్యాగము యొక్క అద్భుతము ద్వారా, పశ్చాత్తాపము యొక్క అవకాశము మరియు బాధ్యతను మనము అంగీకరించిన యెడల, మన పాపములు మరియు దుశ్చర్యలకు క్షమాపణను కూడా మనము పొందవచ్చు. అవసరమైన విధులను పొంది, నిబంధనలను పాటించుట, మరియు ఆజ్ఞలకు విధేయత చూపుట ద్వారా, మనము నిత్య జీవము మరియు మహోన్నత స్థితిని పొందగలము.

ఈరోజు, మన రక్షకుడు, విమోచకుడైన యేసు క్రీస్తు నుండి మనకు ఇవ్వబడిన ముఖ్యమైన మరియు ప్రశస్తమైన వరము క్షమాపణపై నేను దృష్టి సారిస్తున్నాను.

1982లో ఒక డిసెంబరు రాత్రి నా భార్య టెర్రీ, నేను ఐడాహో, పోకటేల్లోలోని మా ఇంటిలో నిద్రించుచుండగా, ఫోను పిలుపుతో మేల్కొన్నాము. నేను ఫోనుకు జవాబిచ్చినప్పుడు, వెక్కివెక్కి ఏడ్వటం మాత్రమే నేను విన్నాను. చివరకు, నా సహోదరి స్వరము అతికష్టంగా, “టామీ చనిపోయాడు,” అన్నది.

కొలరేడో, డెన్వర్ నగరు సమీపంలో 20 ఏళ్ళ త్రాగుబోతు డ్రైవర్ గంటకు 85 మైళ్ళు (135 కి.మీ.) వేగంతో విచక్షణారహితంగా ఆగమనే ట్రాఫిక్ సిగ్నల్ దాటి, మా చిన్న తమ్ముడు టామీ నడుపుతున్న కారును ఢీకొని, అతడిని, అతడి భార్య జోయాన్ వెంటనే ప్రాణాలు కోల్పోయారు. వారు ఒక క్రిస్మస్ పార్టీని ముగించుకొని చిన్నకూతురు ఇంటికి తిరిగి వస్తున్నారు.

నేను, నా భార్య వెంటనే డెన్వర్‌కు విమానంలో ప్రయాణమయ్యాము మరియు మా దారిలో మార్చురీకి చేరుకున్నాము. మేము మా తల్లిదండ్రులు, తోబుట్టువులతో కలిసి కూడుకొని, మా ప్రియమైన టామీ మరియు జోయాన్‌ను కోల్పోయినందుకు విలపించాము. ఒక బుద్ధిలేని నేర చర్యకు వారు చనిపోయారు. మా గుండెలు పగిలినవి, మరియు నేరం చేసిన ఆ యువకుని మీద కోపం నాలోపల రేగసాగింది.

టామీ అమెరికా సంయుక్త రాష్ట్రాల న్యాయశాఖలో ఒక న్యాయవాదిగా సేవ చేసాడు మరియు రాబోవు సంవత్సరాలకు స్థానిక అమెరికా భూములను, ప్రకృతి వనరులను పరిరక్షించుటకు బలమైన న్యాయవాదిగా అవుతున్నాడు.

కొంతకాలమైన తరువాత, వాహనముతో మానవ హత్యకు బాధ్యుడిగా కనుగొనబడిన యువకుని పై కోర్టు తీర్పు విచారణకువచ్చింది. వారి కొనసాగుతున్న వేదన మరియు విచారములో, మా తల్లిదండ్రులు మరియు పెద్దక్క, కాటీ, కోర్టుకు హాజరయ్యారు. ఆ త్రాగుబోతు డ్రైవరు యొక్క తల్లిదండ్రులు కూడా అక్కడున్నారు, మరియు వాయిదా పూర్తియిన తర్వాత, వారు బెంచి మీద కూర్చొని ఏడ్చారు. వారు తమ దుఃఖాన్ని నియత్రించుకోవాలని కోరుతూ, మా తల్లిదండ్రులు, అక్క, కూడా ఆ దగ్గరలో కూర్చొన్నారు. ఒక క్షణం తరువాత, మా తల్లిదండ్రులు, అక్క, లేచి ఆ డ్రైవరు తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి వారికి ఓదార్పు మాటలతో క్షమాపణను తెలియచేశారు. పురుషులు కరచాలనము చేసుకున్నారు; తల్లులు చేతులు పట్టుకొన్నారు; అక్కడ అందరికి లోతైన విచారము, కన్నీళ్ళు ఉన్నాయి మరియు ఇరువురు కుటుంబాలు ఎంతగానో బాధపడ్డారనే గుర్తింపున్నది. వారి ప్రశాంతమైన బలము, ధైర్యముతో మార్గమును నడిపించి, క్షమాపణ ఎలా ఉంటుందో మా కుటుంబమునకు చూపించారు.

అటువంటి క్షణాలలో కూడా ఆ విధంగా క్షమాపణ అందించడం నా స్వంత హృదయాన్ని కరిగించి, స్వస్థతకు ఒక మార్గమును తెరిచింది. కాలక్రమేణా నేను క్షమించే హృదయం ఎలా పొందగలనో నేర్చుకున్నాను. సమాధానకర్తయగు అధిపతి యొక్క సహాయముతో మాత్రమే నా బాధకారమైన భారము తీసివేయబడింది. నా హృదయము టామీ మరియు జోయాన్‌లను ఎల్లప్పుడు జ్ఞాపకముంటారు, కాని క్షమించుట ఇప్పుడు అపరిమితమైన ఆనందముతో వారిని జ్ఞాపకము చేసుకొనుటకు నాకు సాధ్యపరచింది. మరియు మేము ఒక కుటుంబంగా మరలా కలిగియుంటామని నేనెరుగుదును.

చట్టవిరుద్ధమైన ప్రవర్తనను మన్నించాలని నేను సూచించడంలేదు. వ్యక్తులు తన నేర ప్రవృత్తికి మరియు పౌర అపరాధములకు బాధ్యత వహించ వలెనని మనము పూర్తిగా ఎరుగుదుము. అయినప్పటికిని, దేవుని కుమారులు, కుమార్తెలుగా, మనము యేసు క్రీస్తు బోధలను అనుసరిస్తాము. ఇతరులు మన క్షమాపణను హామీగా పొందనట్లుగా కనబడినప్పుడు కూడా మనము క్షమించగలగాలి.

రక్షకుడు నేర్పించాడు:

“మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన యెడల, మీ పరలోకపుతండ్రియు మిమ్మును క్షమించును:

“మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన యెడల, మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు.”3

మనకు వ్యతిరేకముగా తప్పు చేసిన వారిని మనము ఇష్టపూర్వకంగా క్షమించటం నేర్చుకున్నప్పుడు, మనమందరము చెప్పలేని మనశ్శాంతిని మరియు మన రక్షకునితో భాగస్వామ్యమును పొందగలము. ఇటువంటి భాగస్వామ్యము మన జీవితాలలోనికి రక్షకుని యొక్క శక్తిని స్పష్టమైన మరియు ఎప్పటికీ మరచిపోలేని విధానములో తెచ్చును.

అపోస్తులుడైన పౌలు సలహా ఇచ్చాడు:

“కాగా, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులును ప్రియులునైన వారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి;

“ఒకని కొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి, … : ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.4

ప్రభువు తానే ధృవీకరించియున్నాడు:

“కాబట్టి, నేను మీకు చెప్పుచున్నాను, మీరు ఒకరినొకరు క్షమించవలసియున్నది; ఏలయనగా ఎవడైతే తన సహోదరుని అతిక్రమములను క్షమించడో అతడు ప్రభువు యెదుట ఖండింపబడును; ఏలయనగా అతనిలో మరి ఎక్కువ పాపము నిలిచియున్నది.

“ప్రభువునైన నేను ఎవరిని క్షమింతునో, వారిని క్షమించెదను, కాని మీకైతే మనుష్యులందరిని క్షమించవలెను.”5

మన రక్షకుని, మరియు విమోచకుడైన యేసు క్రీస్తు బోధనలు స్వచ్చమైనవి; ఒక పాపి క్షమాపణ పొంద కోరిన యెడల అతడు గాని, ఆమె గాని, ఇతరులను క్షమించుటకు సమ్మతముగా నుండవలెను.6

సోదర సోదరీలారా, మనలను గాయపరచు మనుషులు మన జీవితములలో ఉన్నారా? ఎవరిమీదైనా పూర్తిగా న్యాయ సమ్మతమైనవిగా కనబడుచున్న ఆగ్రహము, కోప భావనలు మనము దాచుకొనియున్నామా? క్షమించకుండా, విడిచిపెట్టకుండా మన గర్వము మనల్ని ఆపివేయనిస్తున్నామా? పూర్తిగా క్షమించవలెనని మరియు లోపల నుండి స్వస్థత కలగనియ్యమని నేను మీ అందరిని ఆహ్వనిస్తున్నాను. క్షమాపణ ఈరోజు రానప్పటికిని, మనము కోరి, దాని కొరకు పనిచేసిన యెడల, చివరకు నా తమ్ముడి మరణము తరువాత నాకు వచ్చినట్లుగా---అది వచ్చును.

క్షమించుటలో ముఖ్యమైన అంశము, మనల్ని క్షమించుకొనుటను కలిపియున్నదని కూడ దయచేసి జ్ఞాపకముంచుకొనుడి.

“ ఎవడైతే తన పాపములను గూర్చి పశ్చాత్తాపపడియున్నాడో,” “అతడే క్షమించబడును, మరియు ప్రభువైన, నేను, వాటిని ఇక ఎన్నటికీ జ్ఞాపకముంచుకొనను.”7

యేసు క్రీస్తు యొక్క మాదిరిని జ్ఞాపకముంచుకొని, అనుసరించవలెనని ఈ రోజు మనందరిని నేను బ్రతిమాలుచున్నాను. గొల్గొతా వద్ద సిలువపై, ఆయన వేదనపడి, ఈ మాటలు పలికియున్నాడు: “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక, వీరిని క్షమించుము.”8

నా తల్లిదండ్రులు, అక్క వలే క్షమించు ఆత్మను కలిగి, ఆవిధంగా చేస్తూ, రక్షకుని యొక్క వాగ్దానమును మనము గ్రహించగలము: “శాంతిని మీకనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకనుగ్రహించుచున్నాను, లోకమిచ్చునట్టుగా నేను మీకనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.”9

యేసు క్రీస్తు బోధలను లక్ష్యముంచి, ఇతరులను క్షమించుట ద్వారా ఆయన మాదిరిని అనుసరించినప్పుడు, ఈ శాంతి మన జీవితములలోనికి వచ్చునని నేను సాక్ష్యమిచ్చుచున్నాను. మనము క్షమించినప్పుడు, రక్షకుడు మనలను బలపరచును, మరియు ఆయన శక్తి, సంతోషము, మన జీవితాలలోనికి ప్రవహించునని నేను వాగ్దానమిచ్చుచున్నాను.

సమాధి ఖాళీగా ఉన్నది. క్రీస్తు జీవిస్తున్నాడు. నేనాయనను యెరుగుదును. నేనాయనను ప్రేమిస్తున్నాను. అన్ని విషయాలను స్వస్థ పరచుటకు సరిపడు బలమునిచ్చు శక్తి, ఆయన కృప కొరకు నేను కృతజ్ఞుడను. యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో, ఆమేన్.

ముద్రించు