2010–2019
శుద్ధమైన ప్రేమ: యేసు క్రీస్తు యొక్క ప్రతీ నిజమైన శిష్యుని యొక్క నిజమైన చిహ్నము
ఏప్రిల్ 2018


శుద్ధమైన ప్రేమ: యేసు క్రీస్తు యొక్క ప్రతీ నిజమైన శిష్యుని యొక్క నిజమైన ప్రతీక

యేసు క్రీస్తు యొక్క సువార్త మన కొరకు తండ్రి మరియు రక్షకుని యొక్క ప్రేమపై మరియు వారి కొరకు, ఒకరినొకరి కొరకు మన ప్రేమపై కేంద్రీకరించబడింది.

అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్‌ను మేము ప్రేమిస్తున్నాము మరియు గుర్తు చేసుకుంటున్నాము, మరియు అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్‌ను మేము ప్రేమిస్తున్నాము మరియు ఆమోదిస్తున్నాము. అధ్యక్షులు నెల్సన్‌ నా హృదయములో ప్రత్యేక స్థానమును కలిగియున్నారు.

నేను యౌవన తండ్రిగా ఉన్నప్పుడు, ఐదు సంవత్సరాల మా చిన్న కుమారుడు, ఒకరోజు స్కూలు నుండి వచ్చి, తన తల్లిని అడిగాడు, “నాన్న ఎలాంటి ఉద్యోగము చేస్తాడు?” తరువాత అతడు తన క్రొత్త తరగతి సభ్యులు, వారి తండ్రుల ఉద్యోగాలను గూర్చి వాదన ప్రారంభించారని వివరించాడు. ఒకడు తన తండ్రి ఒక పెద్ద కంపెనీకి అధికారి అని గర్వంగా ప్రకటించగా, మరొకడు పట్టణ పోలీసు అధికారని చెప్పాడు.

తన తండ్రి గురించి అడిగినప్పుడు, నా కొడుకు మామూలుగా ఇలా జవాబిచ్చాడు, “మా నాన్న ఆఫీసులో కంప్యూటరుపై పనిచేస్తాడు.” తరువాత, అతడి జవాబు తన క్రొత్త స్నేహితులను అంతగా ప్రభావితం చేయలేదని గమనించి, అతడు చేర్చాడు, “మా నాన్న విశ్వము యొక్క అధికారి.”

అది సంభాషణ యొక్క ముగింపని నేనూహిస్తున్నాను.

“రక్షణ ప్రణాళిక గురించి మరికొన్ని వివరాలు మరియు నిజముగా అతి ముఖ్యమైన వ్యక్తి ఎవరో అతడికి బోధించుటకు ఇది సమయము” అని నేను నా భార్యతో చెప్పాను.

కాని మా పిల్లలకు మేము రక్షణ ప్రణాళికను బోధించినప్పుడు, అది ప్రేమ యొక్క ప్రణాళిక అని వారు నేర్చుకొన్నప్పుడు, పరలోక తండ్రి కొరకు మరియు రక్షకుని కొరకు వారి ప్రేమ ఎదిగెను. యేసు క్రీస్తు యొక్క సువార్త మన కొరకు తండ్రి మరియు రక్షకుని యొక్క ప్రేమపై మరియు వారి కొరకు, ఒకరినొకరి కొరకు మన ప్రేమపై కేంద్రీకరించబడింది.

ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ చెప్పారు: “నిత్యత్వమంతటిలో మొదటి గొప్ప ఆజ్ఞ ఏదనగా, మన పూర్ణ హృదయము, శక్తి, మనస్సు, మరియు బలముతో దేవునిని ప్రేమించుట---అది మొదటి గొప్ప ఆజ్ఞ. కానీ నిత్యత్వమంతటిలో మొదటి గొప్ప సత్యము దేవుడు మనల్నితన పూర్ణ హృదయము, శక్తి, మనస్సు, మరియు బలముతో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ నిత్యత్వము యొక్క పునాది రాయి, మరియు అది మన అనుదిన జీవితము యొక్క పునాది రాయిగా ఉండాలి.”1

మన అనుదిన జీవితములో పునాది రాయిగా ఉండి, శుద్ధమైన ప్రేమ యేసు క్రీస్తు యొక్క ప్రతీ నిజమైన శిష్యుని కొరకు అర్హత.

“అందువలన నా ప్రియమైన సహోదరులారా, ఆయన కుమారుడు యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులైన వారందరి పైన, ఆయన ఉంచిన ఈ ప్రేమతో మీరు నింపబడవలెనని, హృదయము యొక్క సమస్త శక్తితో తండ్రికి ప్రార్థన చేయుడి,”2 అని ప్రవక్త మోర్మన్ బోధించాడు.

వాస్తవానికి ప్రేమ యేసు క్రీస్తు యొక్క ప్రతీ నిజమైన శిష్యుని యొక్క ప్రతీక.

నిజమైన శిష్యులు సేవ చేయుటను ప్రేమిస్తారు. సేవ చేయుట నిజమైన ప్రేమ మరియు బాప్తీస్మము వద్ద వారు చేసిన నిబంధన యొక్క వ్యక్తీకరణ.3 సంఘములో వారి పిలుపులు లేక సమాజములో వారి పాత్రను లక్ష్యపెట్టకుండా, వారు ప్రభువును మరియు ఒకరినొకరిని ప్రేమించుటకు మరియు సేవ చేయుటకు వారు హెచ్చింపబడిన కోరికను అనుభూతి చెందుతారు.

నిజమైన శిష్యులు క్షమించుటను ప్రేమిస్తారు. రక్షకుని యొక్క ప్రాయశ్చిత్తము మనలో ప్రతి ఒక్కరము చేసిన పాపములకు మరియు తప్పులకు అన్వయించబడుతుందని వారు ఎరుగుదురు. ఆయన చెల్లించినది “సమస్తము కొరకు చెల్లించబడింది” అని వారు ఎరుగుదురు. పాపములు, తప్పులు, లేక తప్పిదములకు సంబంధించిన ఆత్మీయ పన్నులు, ఫీజులు, ప్రతిఫలాలు, మరియు ఖర్చులు అన్నిటికి అన్వయించబడినవి. నిజమైన శిష్యులు త్వరగా క్షమిస్తారు మరియు క్షమించమని త్వరగా అడుగుతారు.

నా ప్రియమైన సహోదర, సహోదరిలారా, క్షమించుటకు బలమును కనుగొనుటకు మీకు కష్టమైన యెడల ఇతరులు మీకు చేసిన దాని గురించి ఆలోచించవద్దు, కానీ రక్షకుడు మీ కొరకు చేసిన దానిగురించి ఆలోచించుము, మరియు ఆయన ప్రాయశ్చిత్తము యొక్క విమోచించు దీవెనలందు మీరు సమాధానమును కనుగొంటారు.

నిజమైన శిష్యులు తమ హృదయములో సమాధానముతో ప్రభువుకు తమ్మును తాము అప్పగించుటకొనుటను ప్రేమిస్తారు. వారు ఆయనను ప్రేమిస్తారు కనుక వారు వినయము కలిగి మరియు దీనత్వము కలిగియుంటారు. వారు ఆయన చేయు దానిలో మాత్రమే కాదు కానీ ఎలా, ఎప్పుడు అనే దానియందు ఆయన చిత్తమును పూర్తిగా అంగీకరించుటకు వారు విశ్వాసము కలిగియున్నారు. నిజమైన దీవెనలు ఎల్లపుడు వారు కొరుకున్నవి మాత్రమే కాదు కాని ప్రభువు వారి కొరకు కోరినవన్ని నిజమైన శిష్యులు ఎరుగుదురు.

నిజమైన శిష్యులు లోకము కంటే ప్రభువును ఎక్కువగా ప్రేమిస్తారు మరియు వారి విశ్వాసమునందు స్థిరముగా మరియు కదలకుండా ఉంటారు. వారు మారుచున్న మరియు కలవరముతో నిండిన లోకములో బలముగా మరియు స్థిరముగా నిలిచియుంటారు. “పరిశుద్ధ స్థలములలో నిలిచియుండుటకు”4 నిజమైన శిష్యులు ఇష్టపడతారు, మరియు వారు నిలబడిన స్థలములను పరిశుద్ధ స్థలములుగా చేయుటకు వారు ప్రేమిస్తారు. వారు ఎక్కడికి వెళ్ళినప్పటికిని, వారు ఇతరుల హృదయాలకు ప్రభువు యొక్క ప్రేమను మరియు సమాధానమును తెస్తారు. నిజమైన శిష్యులు ప్రభువు యొక్క ఆజ్ఞలను పాటించుటకు సహాయపడతారు, మరియు వారు ప్రభువును ప్రేమిస్తారు కనుక వారు విధేయులవుతారు. వారు తమ నిబంధలను ప్రేమించి, పాటించినప్పుడు, వారి హృదయాలు క్రొత్తవిగా చేయబడతాయి మరియు వారి సహజ స్వభావము మారును.

శుద్ధమైన ప్రేమ యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యుల యొక్క నిజమైన ప్రతీక.

సంఘ సభ్యురాలు కానీ మా అమ్మనుండి, శుద్ధమైన ప్రేమ గురించి నేను నేర్చుకున్నాను.

అనేక సంవత్సరాల క్రితం, ఒకరోజు, నేను కాన్సరుతో బాధపడుచున్న అమ్మను చూడటానికి వెళ్ళాను. ఆమె చనిపోబోతుందని నాకు తెలుసు, కానీ ఆమె బాధపడుతుందని నేను ఆందోళన చెందాను. నేనేమి చెప్పలేదు, కాని నన్ను బాగా ఎరిగిన, ఆమె ఇలా అన్నది, “నీవు ఆందోళన చెందుతున్నావని నేను చూస్తున్నాను.”

తరువాత నా ఆశ్చర్యమునకు బలహీనమైన స్వరముతో ఆమె నన్ను అడిగింది, “ఎలా ప్రార్థన చేయాలో నాకు నేర్పుతావా? నేను నీ కోసం ప్రార్థించాలనుకుంటున్నాను. ‘ప్రియమైన పరలోక తండ్రి,’ అని నువ్వు ప్రారంభిస్తావని నాకు తెలుసు, కానీ తరువాత నేనేమి చెప్పాలి?”

ఆమె మంచము ప్రక్కన నేను మోకరించాను మరియు ఆమె నా కోసం ప్రార్థన చేసింది, ఇదివరకెన్నడూ నేను భావించని ప్రేమను అనుభూతిచెందాను. అది సరళమైన, సత్యమైన, శుద్ధమైన ప్రేమ. రక్షణ ప్రణాళిక గురించి ఆమెకు తెలియనప్పటికిని, ఆమె తన హృదయములో, ప్రేమ యొక్క వ్యక్తిగత ప్రణాళికను, తన కుమారుని కొరకు తల్లికుండే ప్రేమ యొక్క ప్రణాళికను కలిగియున్నది. ఆమె బాధలో ఉన్నది, ప్రార్థించుటకు బలమును కనుగొనుటకు కూడా ప్రయాసపడుచున్నది. నేను ఆమె స్వరమును స్వల్పంగా వినగలిగాను, కాని నిశ్చయముగా ఆమె ప్రేమను అనుభవించాను.

“ఎవరైన అటువంటి గొప్ప బాధలో ఉండి వేరొకరి కొరకు ఎలా ప్రార్థిస్థారు? అని నేను ఆలోచించుట నాకు గుర్తున్నది. ఆమెకే అది అవసరము.”

తరువాత జవాబు నా మనస్సులోనికి స్పష్టముగా వచ్చింది: శుద్ధమైన ప్రేమ. ఆమె నన్ను ఎంతగానో ప్రేమించి తన గురించి తాను మరచిపోయింది. ఆమె మిక్కిలి కష్టమైన సమయములో, ఆమె తనకంటే ఎక్కువగా నన్ను ప్రేమించింది.

ప్రియమైన సహోదర, సహోదరిలారా, ఇప్పడు, ఇదే కదా రక్షకుడు చేసింది? అవును, శాశ్వతమైన మరియు మిక్కిలి విశాలమైన దృష్టికోణములో. కాని ఆ రాత్రి గెత్సేమనే వనములో, తన గొప్ప బాధ మధ్యలో, మనము ఊహించని రీతిలో లేక గ్రహించలేని రీతిలో బాధపడుతూ, ఆయనకే సహాయము అవసరము. కానీ చివరకు, ఆయన తనను తాను మరచిపోయాడు మరియు పూర్తి వెల చెల్లించే వరకు మన కొరకు ప్రార్థన చేసాడు. ఆయన దానిని ఎలా చేయగలిగాడు? ఎందుకనగా ఆయన తనను పంపిన తండ్రి కొరకు, మరియు మన కొరకు శుద్ధమైన ప్రేమను కలిగియున్నాడు. ఆయన తనకంటే ఎక్కువగా తండ్రిని మరియు మనల్ని ప్రేమించాడు.

ఆయన చేయని దాని కొరకు ఆయన చెల్లించాడు. ఆయన చేయని పాపముల కొరకు ఆయన చెల్లించాడు. ఎందుకు? శుద్ధమైన ప్రేమ. పూర్తి వెలను చెల్లించి, మనము పశ్చాత్తాపపడిన యెడల, ఆయన చెల్లించిన దాని యొక్క దీవెనలను మనకిచ్చే స్థానములో ఆయన ఉన్నాడు. ఆయన దీనిని ఎందుకు ఇచ్చాడు? మరలా, మరియు ఎల్లప్పుడు, శుద్ధమైన ప్రేమ.

శుద్ధమైన ప్రేమ ప్రతీ నిజమైన శిష్యుని యొక్క ప్రతీక.

అధ్యక్షులు థామస్ ఎస్. మాన్సన్ చెప్పారు: “వారు మన కుటుంబ సభ్యులు, మన స్నేహితులు, కేవలము పరిచయస్తులు లేక పూర్తిగా క్రొత్త వారు అయినప్పటికిని, దేవుని పిల్లలందరికీ, ప్రేమను వ్యక్తపరచుటను ఇప్పుడే, ఈరోజే మనము ప్రారంభిద్ధామా. ప్రతీరోజు మనము లేచినప్పుడు, మన మార్గములో ఏదీ వచ్చినప్పటికినీ ప్రేమ మరియు దయతో స్పందించుటకు మనము తీర్మానిద్దాము.”5

సహోదర, సహోదరులారా, యేసు క్రీస్తు యొక్క సువార్త ప్రేమ యొక్క సువార్త. గొప్ప ఆజ్ఞ ప్రేమను గూర్చినది. నాకైతే, అది పూర్తిగా ప్రేమను గూర్చినది. మన కొరకు తన కుమారుని త్యాగము చేసిన తండ్రి యొక్క ప్రేమ. మనందరి కొరకు త్యాగము చేసిన రక్షకుని యొక్క ప్రేమ. తమ పిల్లల కొరకు ఏదైనా ఇవ్వగల ఒక తల్లి లేక తండ్రి యొక్క ప్రేమ. మౌనముగా సేవచేయు వారు మరియు మనలో చాలామందికి తెలియరు గాని ప్రభువుకు తెలిసిన వారి యొక్క ప్రేమ. అందరిని మరియు ఎల్లప్పుడు క్షమించే వారి ప్రేమ. వారు పొందిన దానికంటే ఎక్కువగా ఇచ్చే ఒకరి యొక్క ప్రేమ.

నేను నా పరలోక తండ్రిని ప్రేమిస్తున్నాను. నేను నా రక్షకుని ప్రేమిస్తున్నాను. నేను సువార్తను ప్రేమిస్తున్నాను. నేను సంఘమును ప్రేమిస్తున్నాను. నేను నా కుటుంబమును ప్రేమిస్తున్నాను. నేను ఈ అద్భుతమైన జీవితమును ప్రేమిస్తున్నాను. నాకైతే, అదంతా ప్రేమను గూర్చినది.

రక్షకుని యొక్క పునరుత్థానమును జ్ఞాపకము చేసుకొనే దినము, మనలో ప్రతిఒక్కరికి ఆత్మీయ పునరుద్ధరణ దినము అగునుగాక. ఈ దినము “మన అనుదిన జీవితము యొక్క పునాది రాయి,” ప్రేమ నిండిన జీవితమునకు ఆరంభముగా ఉండునుగాక.

యేసు క్రీస్తు యొక్క ప్రతీ నిజమైన శిష్యుని యొక్క నిజమైన ప్రతీకగా, మన హృదయాలు క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమతో నింపబడియుండును గాక. యేసు క్రీస్తు నామములో ఇది నా ప్రార్థన, ఆమేన్.

ముద్రించు