2010–2019
మరొక్క రోజు
ఏప్రిల్ 2018


మరొక్క రోజు

మనందరికీ జీవించడానికి “ఈరోజు” ను కలిగియున్నాము, మరియు మన రోజును విజయవంతం చేసుకోవడానికి ముఖ్యమైనది ఇష్టపూర్వకమైన త్యాగము.

కొన్నేళ్ళ క్రితం, నా స్నేహితులకు బ్రిగమ్ అనే అందమైన బాబు పుట్టాడు. పుట్టిన తర్వాత, బ్రిగమ్‌కి హంటర్ సిండ్రోమ్ అని పిలవబడిన అరుదైన వ్యాధి ఉందని నిర్ధారించబడింది, విచారకరముగా దానర్థము బ్రిగమ్ ఎంతోకాలం బ్రతకడు. ఒకరోజు బ్రిగమ్ తన కుటుంబంతో దేవాలయ స్థలాలను దర్శిస్తున్నప్పుడు, ఒక ప్రత్యేకమైన మాటను ప్రకటించాడు, “మరొక్క రోజు” అని రెండుసార్లు అన్నాడు. ఆ మరుసటిరోజే, బ్రిగమ్ మరణించాడు.

చిత్రం
బ్రిగమ్
చిత్రం
బ్రిగమ్ యొక్క కుటుంబము
చిత్రం
బ్రిగమ్ యొక్క సమాధి

నేను బ్రిగమ్ సమాధిని కొన్నిసార్లు దర్శించాను, నేను వెళ్ళిన ప్రతిసారీ “మరొక్క రోజు” అనే మాట గురించి నేను లోతుగా ఆలోచిస్తాను. దానర్థం ఏమిటి, నా జీవించటానికి ఒకే ఒక రోజు మాత్రమే ఉందని తెలుసుకొనుట అది నాపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? నా భార్య, పిల్లలు, మరియు ఇతరులను నేనెలా ఆదరిస్తాను? నేను ఎంత సహనంతో, మర్యాదతో వ్యవహరిస్తాను? నా శరీరం పట్ల ఏవిధంగా శ్రద్ధ తీసుకుంటాను? నేను ఎంత తీవ్రంగా ప్రార్థిస్తాను మరియు లేఖనాలను పరిశోధిస్తాను? ఒకవిధంగా లేక మరొకవిధంగా, మనమందరం ఏదో ఒక సందర్భంలో, “మరొక్క రోజు” జ్ఞానమును కలిగియుంటాము ---మనకున్న సమయాన్ని వివేకంగా మనము ఉపయోగించాలనే జ్ఞానము.

పాతనిబంధనలో మనము యూదా రాజైన హిజ్కియా, వృత్తాంతాన్ని చదివాము. హిజ్కియా జీవితం ముగిసిపోబోతోందని యెషయా ప్రవక్త హిజ్కియాకు చెప్పారు. ప్రవక్త మాటలు వినినప్పుడు, హిజ్కియా ప్రార్థించడం, వేడుకోవడం మరియు వేదనతోఏడ్వడం మొదలుపెట్టాడు. ఆ సందర్భంలో , దేవుడు హిజ్కియా జీవితాన్ని 15 సంవత్సరాలు పొడిగించాడు. (యెషయా 38: 1–5 చూడుము.)

మనం ఎంతోకాలం బ్రతకమని మనకి చెప్పబడినట్లయితే, మనం కూడా మనం చేసియుండవలసిన వాటి కోసం లేదా మరోవిధంగా చేయాలనుకున్న వాటికోసం మరికొన్ని రోజులు జీవించాలని వేడుకుంటాము.

కాలంతో సంబంధం లేకుండా ప్రభువు, తన జ్ఞానమందు, మనము నిశ్చయమనుకోగల ఒక దానిని మనలో ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి నిశ్చయించుకున్నారు: మనందరికీ జీవించడానికి “ఈరోజు” ఇవ్వబడింది, అయితే మన రోజును విజయవంతం చేసుకోవడానికి ముఖ్యంగా కావలసింది ఇష్టపూర్వకమైన త్యాగము.

“ఇదిగో, మనుష్య కుమారుని రాకడ దినము వరకు ఇది ఈరోజుఅని పిలువబడుచున్నది, ఇది త్యాగదినము అని ప్రభువు చెప్పారు (సి మరియు ని 64:23; వివరణ చేర్చబడినది).

లాటిన్ పదాలు సాకర్, అనగా అర్థము “పరిశుద్ధమైనది,” మరియు ఫాసిరి, అనగా “చేయుటకు,” మరొక మాటలలో, విషయాలను పరిశుద్ధమైనవిగా చేయుటకు, వాటికి ఘనతను తెచ్చుట వంటి పదములనుండి త్యాగము అను పదము వచ్చును.

“త్యాగము మనకు పరలోకము యొక్క దీవెనలను తెచ్చును” (“Praise to the Man,” Hymns, no. 27).

త్యాగము మన రోజులను అర్థవంతంగా, దీవెనకరముగా ఏవిధాలుగా చేస్తుంది?

మొదటిది, వ్యక్తిగత త్యాగము మనల్ని బలపరుస్తుంది మరియుమనం త్యాగం చేసిన విషయాలకు విలువనిచ్చును.

కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఉపవాస ఆదివారమున, ఒక వృద్ధురాలైన సహోదరి తన సాక్ష్యాన్ని పంచుకోవడానికి వేదిక మీదకు వచ్చింది. ఆమె పెరూ దేశంలో ఉన్న అమెజాన్ అటవీ ప్రాంతమైన ఈక్విటోస్ పట్టణంలో నివసించింది. తాను బాప్తీస్మము తీసుకున్నప్పటి నుండి, లైమా, పెరూలో ఉన్న దేవాలయంలో విధులను పొందాలనేది ఎల్లప్పుడు తన లక్ష్యంగా ఉండేదని మాతో చెప్పింది. విశ్వాసంతో ఆమె పూర్తి దశమభాగాన్ని చెల్లించింది, ఏళ్ళ తరబడి తనకొచ్చే స్వల్ప జీతాన్ని పొదుపు చేసింది.

దేవాలయానికి వెళ్ళి, అక్కడ పరిశుద్ధ విధులను పొందినప్పుడు ఆమెకు కలిగిన ఆనందం ఈ మాటల్లో వ్యక్తపరచబడింది: “ఈ జీవితాన్ని వదిలి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నానని నేను చివరకు భావిస్తున్నానని ఈరోజు నేను చెప్పగలను. ఈ ప్రపంచంలో నేను చాలా సంతోషంగా ఉన్న స్త్రీని; దేవాలయానికి వెళ్ళడానికి నేను ఎంతోకాలంగా డబ్బు కూడబెట్టానో మీకు తెలియదు, మరియు 7 రోజులు నదిపైన, 18 గంటలు బస్సులో, ప్రయాణించిన తర్వాత, చివరకి నేను ప్రభువు యొక్క మందిరంలో ఉన్నాను. ఆ పరిశుద్ధ ప్రదేశాన్ని విడిచి వస్తున్నప్పుడు, ఇలా అనుకున్నాను, దేవాలయానికి రావడానికి నేను ఇంత త్యాగం చేసిన తర్వాత, నేను చేసిన ప్రతీ నిబంధనను తేలికగా తీసుకునేందుకు దేనిని నేను అనుమతించను; అది వ్యర్ధము అవుతుంది. ఇది చాలా గంభీరమైన నిబద్ధత!”

వ్యక్తిగత త్యాగము అనేది అత్యంత విలువైన శక్తియని, అది మన నిర్ణయాలను, తీర్మానాలను ప్రేరేపిస్తుందని ఈ ప్రియమైన సహోదరి నుండి నేను నేర్చుకున్నాను. వ్యక్తిగత త్యాగము మన చర్యలను, నిబద్ధతలను, నిబంధనలను ప్రేరేపిస్తుంది, మరియు పరిశుద్ధమైన విషయాలకు అర్ధమునిచ్చును.

రెండవది, ఇతరుల కోసం మనం చేసే త్యాగము, మరియు ఇతరులు మన కోసం చేసే త్యాగము, అందరికీ దీవెనలను తెచ్చును.

నేను దంత కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడు, స్థానికంగా మా స్థానిక ఆర్థిక భవిష్యత్తు వైఖరి అంత ప్రోత్సాహకరంగా లేదు. ద్రవ్యోల్బణం రోజురోజుకీ మా కరెన్సీ విలువను నాటకీయంగా తగ్గించివేసింది.

అది శస్త్రచికిత్స నేర్పే తరగతిలో నేను చేరవలసిన సంవత్సరము నాకు జ్ఞాపకమున్నది; ఆ సెమిస్టర్‌లో చేరేముందు అవసరమైన శస్త్రచికిత్స పరికరాలన్నీ నేను కలిగియుండాలి. నా తల్లిదండ్రులు అవసరమైన డబ్బు కూడబెట్టారు. కానీ ఒక రాత్రి నాటకీయంగా ఏదో జరిగింది. మేము పరికరాలు కొనడానికి వెళ్ళగా, అన్నింటిని కొనడానికి సరిపోయే డబ్బు అప్పుడు కేవలం ఒక్క జత పట్టకార్లు కొనడానికే సరిపోయింది మరియు ఇంకేమి కొనటానికి లేదు. ఆ సెమిస్టరు కళాశాలకు వెళ్ళలేననే భారమైన హృదయముతో, ఒట్టి చేతులతో మేము ఇంటికి తిరిగివచ్చాము. హఠాత్తుగా, మా అమ్మ “టేలర్, నాతో రా; బయటికి వెళ్దాం,” అన్నది

మేము వాణిజ్యప్రాంతానికి వెళ్ళాము, అక్కడ నగల అమ్మకం మరియు కొనుగోలు జరిగే అనేక ప్రదేశాలున్నాయి. మేము ఒక దుకాణానికి వెళ్ళినప్పుడు, మా అమ్మ తన పర్సులో నుండి చిన్న నీలిరంగు మకమలు సంచిని బయటకి తీసింది, అందులో దానిమీద “నా ప్రియమైన కూతురికి మీ నాన్న నుండి” అని చెక్కబడిన ఒక అందమైన బంగారు కడియమున్నది. అది మా తాతగారు ఆమె పుట్టినరోజులలో ఒక దానికి ఆమెకివ్వబడిన బహుమతి. అప్పుడు, నా కళ్ళముందు, ఆమె దానిని అమ్మివేసింది.

డబ్బు చేతికొచ్చిన తర్వాత, ఆమె నాతో అన్నది, “ఒక్క విషయం నాకు నిశ్చయంగా తెలుసు, అదేమంటే నువ్వు దంతవైద్యుడివి కాబోతున్నావు. వెళ్ళు, నీకు కావలసిన పరికరాలన్నీ కొనుక్కో.” ఇప్పుడు, ఆ క్షణమునుండి నేను ఎలాంటి విద్యార్థిగా మారానో మీరూహించగలరా? నేను ఉత్తమంగా ఉండాలని, వీలైనంత త్వరగా నా చదువు పూర్తి చేయాలని కోరుకున్నాను, ఎందుకంటే ఆమె చేస్తున్న త్యాగము యొక్క అత్యధిక విలువేంటో నాకు తెలుసు.

మన కోసం మన ప్రియమైన వాళ్ళు చేసే త్యాగం, ఎడారి మధ్యలో చల్లటి నీళ్ళు సేదతీర్చినట్లుగా మనకి క్రొత్త బలాన్నిస్తుందని నేను నేర్చుకున్నాను. అటువంటి త్యాగం నిరీక్షణను, ప్రేరణను తెస్తుంది.

మూడవది, మనం చేసే త్యాగమేదైనా దేవుని కుమారుడు చేసిన త్యాగముతో పోల్చినప్పుడు చిన్నదే అవుతుంది.

దేవుని కుమారుని త్యాగంతో పోల్చినప్పుడు ప్రియమైన బంగారు కడియం విలువెంత? ఆ అనంతమైన త్యాగాన్ని మనమెలా గౌరవించగలము? జీవించడానికి, విశ్వాసంగా ఉండడానికి మనకి మరొక రోజు ఉందని మనం ప్రతిరోజు గుర్తు పెట్టుకోగలం. “అవును మీరు ముందుకు రావలెనని మరియు ఇక ఏ మాత్రము మీ హృదయములను కఠినపరచుకొనరాదని నేను కోరుచున్నాను. ఏలయనగా ఇదిగో ఇప్పుడే మీ రక్షణ యొక్క దినము మరియు సమయము. మరియు కాబట్టి మీరు పశ్చాత్తాపము పొంది మరియు మీ హృదయములను కఠినపరచుకొనక యుండిన యెడల, వెంటనే విమోచన యొక్క గొప్ప ప్రణాళిక మీ కొరకు పని చేయును” (ఆల్మా 34:31) అని అమ్యులెక్ బోధించాడు. మరొకమాటలో, మనము ప్రభువుకు విరిగిన మనస్సును, నలిగిన ఆత్మను బలిగా అర్పించిన యెడల వెంటనే ఆ గొప్ప సంతోష ప్రణాళిక యొక్క దీవెనలు మన జీవితాల్లో ప్రత్యక్షపరచబడతాయి.

యేసు క్రీస్తు యొక్క త్యాగము వలన విమోచన ప్రణాళిక సాధ్యమయింది. ఆ త్యాగము “అందరికంటే గొప్పవాడను, అనగా దేవుడనైన, నన్ను బాధ వలన వణకి, ప్రతి స్వేద రంధ్రము నుండి రక్తము కారి, శరీరము, ఆత్మ శ్రమపడునట్లు చేసెను--- ఆ చేదు పాత్రను త్రాగకుండ, వెనుదిరగాలని నేను అనుకొనేలా చేసెనని ఆయన వివరించారు” (సి మరియు ని 19: 18)).

ఈ త్యాగము మూలంగా, మనఃపూర్వకమైన పశ్చాత్తాప ప్రక్రియను అనుసరించిన తర్వాత, మన తప్పులు, పాపముల భారము తేలిక చేయబడినట్లు మనం భావించగలము. వాస్తవానికి, అపరాధ భావన, సిగ్గు, బాధ, వేదన, మనల్ని మనం కించపరచుకోవడం వంటివాటి స్థానంలో స్పష్టమైన మనస్సాక్షి, సంతోషం, ఆనందం మరియు నిరీక్షణలు భర్తీ చేయబడతాయి.

అదే సమయంలో, ఆయన త్యాగాన్ని మనం గౌరవించి, కృతజ్ఞత కలిగియున్నప్పుడు, దేవుని యొక్క మంచి పిల్లలుగా ఉండాలని, పాపము నుండి దూరంగా ఉండాలని, మరియు మునుపెన్నడూ లేనివిధంగా నిబంధనలను పాటించాలనే లోతైన కోరికను అధిక మొత్తంలో మనం పొందగలము.

అప్పుడు, తన పాపముల కొరకు క్షమాపణ పొందిన తర్వాత ఈనస్ ఉన్నట్లుగా, త్యాగము చేయాలని మరియు మన సహోదర సహోదరీల యొక్క క్షేమమును వెదకాలనే కోరికను మనకై మనం భావిస్తాము (ఈనస్ 1:9 చూడుము). ఇంకా ప్రతి “మరొక్క రోజు” అధ్యక్షులు హావర్డ్ డబ్ల్యు. హంటర్ గారు మనకిచ్చిన ఆహ్వానాన్ని అనుసరించడానికి ఎక్కువ సుముఖంగా ఉంటాము, ఆయన ఇలా చెప్పారు: “వివాదాన్ని పరిష్కరించండి. మరచిపోయిన స్నేహితుడిని వెదకండి. అనుమానాన్ని తీసివేసి దానికి బదులుగా నమ్మకముంచండి. . . . మృదువుగా జవాబివ్వండి. యువతను ప్రోత్సహించండి. మాటలో చేతలో మీ నిజాయితీని కనపరచండి. వాగ్దానాన్ని నిలబెట్టుకోండి. ప్రతీకారాన్ని విడనాడండి. శత్రువును క్షమించండి. క్షమాపణ అడగండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇతరుల నుండి మీరు ఆశించేవాటిని పరీక్షించుకోండి. ఇతరుల గురించి ముందుగా ఆలోచించండి. దయ కలిగియుండుము. సున్నితంగా ఉండండి. మరి కాస్త నవ్వండి. మీ కృతజ్ఞతను తెలియజేయండి. క్రొత్త వారిని ఆహ్వానించండి. ఒక బిడ్డ హృదయాన్ని సంతోషపరచుము. . . . మీ ప్రేమను తెలియజేయండి, తరువాత దానిని మరలా తెలియజేయండి” (Teachings of Presidents of the Church: Howard W. Hunter [2015], 32; adapted from “What We Think Christmas Is,” McCall’s, Dec. 1959, 82–83).

మనము అటువంటి చర్యలతో మరియు వ్యక్తిగత త్యాగము నుండి వచ్చే బలముతో, ఇతరుల కోసం మనము చేసే త్యాగము లేక మనకు ఇతరులు ఇచ్చే దాని నుండి వచ్చే బలముతో మన రోజులను నింపెదముగాక. ఒక ప్రత్యేక విధానంలో, అద్వితీయుడు మనకిచ్చే త్యాగము అందించే సమాధానము, సంతోషాలను; అవును, ఆదాము మనుష్యులుండునట్లు పతనమాయెను, మనుష్యులు—మీరు—సంతోషమును కలిగియుండునట్లు మీరున్నారని (2 నీఫై 2:25) చూడుము) మనము చదివినప్పుడు చెప్పబడిన అదే సమాధానమును మనము ఆనందించెదముగాక. ఆ ఆనందం నిజమైన ఆనందం, రక్షకుడైన యేసు క్రీస్తు త్యాగము మరియు ప్రాయశ్చిత్తఃము మాత్రమే అందించగలదు.

మనము ఆయనను అనుసరించాలని, ఆయనను విశ్వసించాలని, ఆయనను ప్రేమించాలని మరియు మరొక్క రోజు జీవించే అవకాశము మనకు కలిగిన ప్రతిసారీ ఆయన త్యాగము ద్వారా చూపబడిన ప్రేమను అనుభవించాలని నేను ప్రార్థిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

ముద్రించు