ప్రేమించు, పంచు, ఆహ్వానించు
మనం ప్రేమించి, పంచి, ఆహ్వానించినప్పుడు, భూమిని తన మెస్సీయ రాకడ కొరకు సిద్ధం చేసే గొప్ప మహిమకరమైన పనిలో మనం భాగస్థులమవుతాము.
గలిలయలో కొండమీద నిలబడి, పునరుత్థానం చెందిన రక్షకుడు తన శిష్యులను దర్శిస్తున్న అద్భుతాన్ని, మహిమను చూస్తున్నట్లు ఒక్క క్షణం నాతో పాటు ఊహించండి. ఆయన వారితో పంచుకున్న ఈ మాటలను, “కాబట్టి మీరు వెళ్ళి, తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు సమస్త జనులకు బోధించుడి ,”1 అనే ఆయన గంభీరమైన ఆజ్ఞను వ్యక్తిగతంగా వినాలనుకోవడం ఎంతో ఆశ్చర్యకరమైనది, ప్రేరణాపూర్వకమైనది. నిశ్చయంగా ఈ మాటలు మనకు అధికారమిస్తాయి, ప్రేరేపిస్తాయి మరియు ఆయన అపొస్తలులను ప్రభావితం చేసినట్లు మనలో ప్రతీఒక్కరిని ప్రభావితం చేస్తాయి. వాస్తవానికి, వారు ఆ ఆజ్ఞను పాటించడానికి వారి జీవితమంతా అంకితమిచ్చారు.
ఆసక్తికరమైనది ఏమిటంటే, యేసు మాటలకు అపొస్తలులు మాత్రమే లోబడలేదు. ఆనాటి సంఘ సభ్యులు, క్రొత్తవారి నుండి పాతవారి వరకు, రక్షకుని గొప్ప కార్యములో పాల్గొని, వారు కలిసిన మరియు వారికి తెలిసిన వారితో సువార్త యొక్క మంచి సమాచారాన్ని పంచుకున్నారు. యేసు క్రీస్తు గురించి వారి సాక్ష్యాన్ని పంచుకోవాలనే దృఢసంకల్పం క్రొత్తగా స్థాపించబడిన ఆయన సంఘములో విస్తారమైన పెరుగుదలకు సహాయపడింది.2
మొదటిసారి ఆయన దానిని ప్రకటించినప్పుడు మనం గలిలయలో ఆ కొండమీద ఉన్నట్లు, క్రీస్తు యొక్క శిష్యులుగా మనం కూడా నేడు ఆయన ఆజ్ఞకు చెవియొగ్గాలని ఆహ్వానించబడ్డాము. 1830లో యేసు క్రీస్తు సంఘము యొక్క తొలి సువార్తికునిగా సహోదరుడు సామ్యుయెల్‌ను జోసెఫ్ స్మిత్ ప్రత్యేకపరచినప్పుడు ఈ ఆజ్ఞ మళ్ళీ మొదలైంది.3 అప్పటినుండి, 1.5 మిలియన్ల కంటే ఎక్కువమంది సువార్తికులు ప్రపంచమంతటా ప్రయాణిస్తూ సమస్త జనులకు బోధించారు మరియు పునఃస్థాపించబడిన సువార్త యొక్క సంతోషకరమైన సువర్తమానాన్ని హత్తుకున్న వారికి బాప్తిస్మమిచ్చారు.
ఇది మా సిద్ధాంతము. మా ప్రియమైన కోరిక.
మా చిన్నపిల్లల నుండి మా మధ్యనున్న పెద్దల వరకు, ఎప్పుడు మేము రక్షకుని పిలుపును వింటామా మరియు ప్రపంచంలోని జనులతో సువార్తను పంచుకుంటామా అని ఆ సమయం కోసం అపేక్షిస్తాము. రక్షకుడు తన అపొస్తలులతో చేసినట్లుగా నిన్న మన ప్రవక్త పూర్తి-కాల సువార్తసేవ కోసం సిద్ధపడమని మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు, ఆయన నుండి అటువంటి అధికారమిచ్చు సవాలును యువతీయువకులైన మీరు భావించారని నేననుకుంటున్నాను.
పరుగుపందెంలో పరిగెత్తేవారు పందెం మొదలుకావడానికి వేచియున్నట్లే, మేము మా సేవను మొదలుపెట్టడానికి ప్రవక్త యొక్క సంతకంతో ఉన్న అధికారిక ఆహ్వానం కోసం వేచియుంటాము. ఈ కోరిక ఉన్నతమైనది, ప్రేరేపితమైనది; అయినప్పటికీ, ఈ ప్రశ్నను పరిగణిద్దాం: మనం అందరం ఇప్పుడే ఎందుకు మొదలుపెట్టము?
మీరు అడగవచ్చు, “పేరుగల బ్యాడ్జి లేకుండా నేను సువార్తికునిగా ఎలా కాగలను?” లేదా మనకైమనం ఇలా చెప్పవచ్చు, “ఈ పని చేయడానికి పూర్తి-కాల సువార్తికులు ప్రత్యేకపరచబడ్డారు. నాకు సహాయం చేయాలని ఉంది, కానీ జీవితం కాస్త కుదుటబడ్డాక చూద్దాం.”
సహోదర సహోదరీలారా, ఇది అనుకున్న దానికంటే చాలా సులువైనది! కృతజ్ఞతాపూర్వకంగా, చిన్నతనం నుండి మనలో ప్రతీఒక్కరికి బోధించబడిన, తేలికైన, సులువుగా గ్రహింపదగిన సూత్రాలైన ప్రేమించు, పంచు మరియు ఆహ్వానించు అనే వాటి ద్వారా రక్షకుని యొక్క గొప్ప కార్యము సాధించబడగలదు.
ప్రేమించు
మనం చేయగలిగిన మొదటి పని క్రీస్తు ప్రేమించినట్లుగా ప్రేమించడం.
ఈ కల్లోల సమయాల్లో ప్రపంచమంతటా మనం చూస్తున్న మానవ శ్రమలు, ఆందోళనలతో మన హృదయాలు బరువెక్కాయి. అయినప్పటికీ, అట్టడుగున ఉన్నవారు—తమ ఇంటి నుండి వెళ్ళగొట్టబడినవారు, తమ కుటుంబాల నుండి వేరుచేయబడిన వారు లేదా ఇతర రకాల బాధలను, నిరాశను అనుభవిస్తున్న వారిని సమీపించడానికి ప్రతీచోటనున్న జనులు చేసిన ప్రయత్నాల ద్వారా వెల్లువెత్తిన కనికరము మరియు మానవతావాదం చేత మనం కూడా ప్రేరేపించబడగలము.
ఇటీవల, నిరాశతో వలసపోతున్న కుటుంబాల కోసం విచారిస్తూ, శరణార్థులైన తల్లులు మరియు పిల్లలు రైలు దిగినప్పుడు సరిహద్దులు దాటడం కోసం వారికి అవసరమవుతాయని పోలాండ్‌లో ఒక తల్లుల గుంపు పూర్తిగా సిద్ధం చేసిన పిల్లల తోపుడుబండ్లను ఒక రైల్వే స్టేషను ప్లాట్‌ఫాం మీద సిద్ధంగా ఉంచి, వేచియుంది. నిశ్చయంగా ఇటువంటి నిస్వార్థ దాతృత్వపు చర్యల పట్ల మన పరలోక తండ్రి సంతోషిస్తారు, ఎందుకంటే మనం ఒకరి బాధలను మరొకరం పంచుకున్నప్పుడు, మనం “క్రీస్తు యొక్క ధర్మశాస్త్రాన్ని నేరవేరుస్తాం.”4
మన పొరుగువారి పట్ల క్రీస్తు వంటి ప్రేమను చూపినప్పుడల్లా, మనం ఒక్క మాట మాట్లాడకపోయినా కూడా సువార్తను ప్రకటిస్తాం.
ఇతరులపట్ల ప్రేమ అనేది మన పొరుగువారిని ప్రేమించమనే రెండవ గొప్ప ఆజ్ఞకు చక్కటి వ్యక్తీకరణ;5 అది మన స్వంత ఆత్మలలో పనిచేస్తున్న పరిశుద్ధాత్మ యొక్క మెరుగుపరచే ప్రక్రియను చూపుతుంది. క్రీస్తు యొక్క ప్రేమను ఇతరులకు చూపడం ద్వారా, మన మంచి కార్యాలను చూసేవారు “పరలోకమందున్న [మన] తండ్రిని మహిమపరిచేలా” మనం చేయవచ్చు.6
బదులుగా ఏమీ ఆశించకుండా దీనిని మనం చేస్తాము.
వారు ఎలా స్పందిస్తారు అనేది మన చేతుల్లో లేనప్పటికీ, మన ప్రేమను, మన సందేశాన్ని వారు అంగీకరిస్తారనేది మన ఆశ.
మనం ఏమి చేస్తాం మరియు మనం ఎవరం అనేది మాత్రమే మన చేతుల్లో ఉంది.
ఇతరుల కోసం క్రీస్తువంటి ప్రేమ ద్వారా మనం క్రీస్తు సువార్త యొక్క మహిమకరమైన, జీవితాన్ని మార్చే లక్షణాలను ప్రకటిస్తాము మరియు ఆయన గొప్ప ఆజ్ఞను నేరవేర్చడంలో ప్రముఖంగా పాల్గొంటాము.
పంచు
మనం చేయగల రెండవ పని పంచుకోవడం.
కొవిడ్-19 వచ్చిన మొదటి నెలల్లో, థాయ్‌లాండ్ నుండి సహోదరుడు విసన్ మోర్మన్ గ్రంథ అధ్యయనం నుండి తాను నేర్చుకున్న దాని గురించి తన ఆలోచనలను, మనోభావాలను తన సామాజిక మాధ్యమ ఖాతాలో పంచుకోవాలని ప్రేరేపించబడ్డాడు. ప్రత్యేకించి అతని వ్యక్తిగత పోస్టులలో ఒకదానిలో అతడు, ఆల్మా మరియు అమ్యులెక్ అనే ఇద్దరు మోర్మన్ గ్రంథ సువార్తికుల కథను పంచుకున్నాడు.
తన మత విశ్వాసాలలో స్థిరంగా ఉన్న అతని సహోదరుడు వినాయ్ ఆ పోస్టు ద్వారా స్పృశించబడి, “ఈ గ్రంథం థాయ్ భాషలో దొరుకుతుందా?” అని అడుగుతూ అనుకోకుండా స్పందించాడు.
విసన్ తెలివిగా మోర్మన్ గ్రంథ ప్రతిని ఇద్దరు సువార్తికురాళ్ళ చేత పంపించాడు, వారు అతని సహోదరునికి బోధించడం మొదలుపెట్టారు.
విసన్ వర్చువల్ పాఠాలకు హాజరైనప్పుడు, అతడు మోర్మన్ గ్రంథం గురించి తన భావాలను పంచుకున్నాడు. సత్యాన్ని అంగీకరించి, హత్తుకోవాలని వినాయ్ సత్యాన్వేషణాత్మతో అధ్యయనం చేయడం, ప్రార్థించడం నేర్చుకున్నాడు. కొద్దినెలల్లోనే వినాయ్ బాప్తిస్మము పొందాడు!
తర్వాత విసన్ ఇలా అన్నాడు, “దేవుని చేతిలో సాధనం కావలసిన బాధ్యత మనకుంది మరియు మన ద్వారా ఆయన విధానంలో ఆయన కార్యాన్ని చేయడానికి ఆయన కోసం మనం ఎప్పుడూ తప్పక సిద్ధంగా ఉండాలి.” సాధారణమైన, సహజ పద్ధతిలో విసన్ సువార్తను పంచుకోవడం వలన వారి కుటుంబంలో అద్భుతం జరిగింది.
మనమందరం ఇతరులతో పంచుకుంటాం. మనం తరచు అలా చేస్తాం. మనం ఇష్టపడే సినిమాలు, ఆహారం, మనం చూసే హాస్యాస్పద విషయాలు, మనం దర్శించే ప్రదేశాలు, మనం మెచ్చే కళ, మనం ప్రేరేపించబడిన వ్యాఖ్యానాలు వంటివి మనం పంచుకుంటాము.
యేసు క్రీస్తు సువార్త గురించి మనకు నచ్చే దానిని మనం పంచుకొనే విషయాల జాబితాకు జతచేస్తే ఎలా ఉంటుంది?
ఎల్డర్ డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్ వివరించారు : “వారాంతము గురించి ఎవరైనా అడిగినట్లైతే, సంఘములో మీరు ఏమి అనుభూతిచెందారో దాని గురించి మాట్లాడుటకు మీరు సందేహించవద్దు. సభికుల ముందర నిలబడి, తాము యేసు వలె ఉండుటకు ప్రయత్నిస్తున్నామని ఆతృతతో పాడిన చిన్న పిల్లలు గురించి చెప్పండి. వ్యక్తిగత చరిత్రలు సేకరించుటకు వసతి గృహాలలో ఉన్న వృద్ధులకు సహాయము చేయుటలో సమయాన్ని గడిపిన యౌవనుల గుంపు గురించి మాట్లాడండి.”7
పంచుకోవడమనేది సువార్తను “అమ్మడం” కాదు. మీరు ఒక ప్రసంగం వ్రాయనక్కరలేదు లేదా మరొకరి తప్పుడు అవగాహనలను సరిదిద్దనవసరం లేదు.
సువార్త పరిచర్యకు సంబంధించి, దేవుడు మిమ్మల్ని తన అధికారిగా ఉండమని కోరడం లేదు; అయినప్పటికీ, మీరు ఆయన గురించి పంచుకొనేవారిగా ఉండాలని ఆయన కోరుతున్నారు.
సువార్తలో మన సానుకూల అనుభవాలను ఇతరులతో పంచుకోవడం ద్వారా మనం రక్షకుని యొక్క గొప్ప కార్యాన్ని నెరవేర్చడంలో పాలుపంచుకుంటాము.
ఆహ్వానించు
మీరు చేయగలిగిన మూడవ పని ఆహ్వానించడం.
ఈక్వెడార్ నుండి ఇటీవల పరివర్తన చెందిన వ్యక్తి సహోదరి మేరా. తన బాప్తిస్మము తర్వాత వెంటనే సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా తన చుట్టూ ఉన్న స్నేహితులను, ప్రియమైన వారిని ఆహ్వానించినప్పుడు, సువార్తలో ఆమె ఆనందం అవధులు దాటింది. ఆమె పోస్టులను చూసిన అనేకమంది కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు ప్రశ్నలతో స్పందించారు. మేరా వారితో సంబంధం కలుపుకొని, సువార్తికులను కలుసుకోవడానికి తరచూ వారిని తన ఇంటికి ఆహ్వానించేది.
మేరా తల్లిదండ్రులు, ఆమె తోబుట్టువులు, ఆమె అత్త, ఇద్దరు బంధువులు మరియు ఆమె స్నేహితులలో అనేకమంది బాప్తిస్మం పొందారు, ఎందుకంటే “వచ్చి చూడండి,” “వచ్చి సేవ చేయండి” మరియు “వచ్చి చెందియుండండి” అని ఆమె వారిని ధైర్యంగా ఆహ్వానించింది. సాధారణమైన మరియు సహజమైన ఆమె ఆహ్వానాల ద్వారా, 20 మందికి పైగా జనులు యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘంలో బాప్తిస్మం పొందడానికి ఆమె ఆహ్వానాన్ని అంగీకరించారు. సంఘ సభ్యురాలిగా తాను పొందిన ఆనందాన్ని అనుభవించడానికి సహోదరి మేరా ఇతరులను ఆహ్వానించడం ద్వారా ఇది సాధ్యమయింది.
మనం ఇతరులకు వందలాది ఆహ్వానాలను అందించవచ్చు. ఒక సంస్కార సేవకు, వార్డు ప్రోత్సాహ కార్యక్రమానికి, యేసు క్రీస్తు సువార్తను వివరించే ఆన్‌లైన్ వీడియో చూడడానికి “వచ్చి చూడండి” అని మనం ఇతరులను ఆహ్వానించగలం. మోర్మన్ గ్రంథం చదవడానికి లేదా ప్రతిష్ఠాపనకు ముందు సందర్శనార్థం తెరిచి ఉంచినప్పుడు క్రొత్త దేవాలయాన్ని దర్శించడానికి, “వచ్చి చూడండి” అనేది ఒక ఆహ్వానం కాగలదు. కొన్నిసార్లు ఆహ్వానం అనేది మనం లోలోపల ఇచ్చేది కావచ్చు—మనకు స్పృహను, మన చుట్టూ ఉన్న అవకాశాల దర్శనాన్ని కల్పిస్తూ, వాటిపై పనిచేయమని మనకైమనం ఇచ్చే ఆహ్వానం వంటిది.
మన డిజిటల్ కాలంలో, సభ్యులు తరచూ సామాజిక మాధ్యమం ద్వారా సందేశాలు పంచుకుంటారు. పంచుకోవడానికి తగినవని మీరు కనుగొనే ఉన్నతమైన విషయాలు వేలల్లో కాకపోయినా వందల్లో ఉండవచ్చు. ఈ విషయం “వచ్చి చూడండి,” “వచ్చి సేవ చేయండి” మరియు “వచ్చి చెందియుండండి” అని ఆహ్వానిస్తుంది.
యేసు క్రీస్తు సువార్త గురించి మరింత నేర్చుకోవడానికి మనం ఇతరులను ఆహ్వానించినప్పుడు, ఆయన ఆజ్ఞాపించిన కార్యములో నిమగ్నమవమని రక్షకుడు ఇచ్చిన పిలుపులో మనం భాగం పంచుకుంటాము.
ముగింపు
ప్రియమైన నా సహోదర సహోదరీలారా, ఎవరైనా చేయగల మూడు సరళమైన పనులు—సులువైన పనుల గురించి మనం ఈరోజు మాట్లాడుకున్నాం. మీరు చేయగల పనులు! మీరు వాటిని చేస్తున్నారని పూర్తిగా తెలియకుండానే, బహుశా మీరు వాటిని ఇదివరకే చేస్తూ ఉండవచ్చు.
మీరు ప్రేమించగల, పంచుకోగల, ఆహ్వానించగల విధానాలను పరిగణించమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరు దీనిని చేసినప్పుడు, మన ప్రియ రక్షకుని మాటలను మీరు వింటున్నారని తెలుసుకొని మీరు చాలా ఆనందిస్తారు.
మీరు చేయాలని నేను కోరుతున్నది క్రొత్త కార్యక్రమమేదీ కాదు. మీరు ఈ సూత్రాలను ఇదివరకే వినియున్నారు. ఇది మీరు చేయాలని సంఘము అడుగుతున్న “మరో పెద్ద పని” కాదు. ఈ మూడు విషయాలు యేసు క్రీస్తు యొక్క శిష్యులుగా మనం ఇదివరకే ఉన్నదానికి పొడిగింపు మాత్రమే.
పేరుగల బ్యాడ్జి లేదా ఉత్తరం ఏదీ అవసరం లేదు.
క్రమబద్ధమైన పిలుపు ఏదీ అవసరం లేదు.
మనం ఎవరమో మరియు ఎలా జీవిస్తున్నామో అనే దానిలో ఈ మూడు విషయాలు సహజంగానే భాగమవుతాయి, వాటంతటవే నిజమైన ప్రేమ యొక్క సహజ వ్యక్తీకరణగా మారతాయి.
2000ల సంవత్సరాల క్రితం, గలిలయలో ఆయన నుండి నేర్చుకోవడానికి సమకూడిన క్రీస్తు యొక్క ఆ శిష్యుల వలె మనం కూడా రక్షకుని ఆజ్ఞను హత్తుకోగలం మరియు సమస్త లోకానికి సువార్తను ప్రకటించగలం.
మనం ప్రేమించి, పంచి, ఆహ్వానించినప్పుడు, భూమిని తన మెస్సీయ రాకడ కొరకు సిద్ధం చేసే గొప్ప మహిమకరమైన పనిలో మనం భాగస్థులమవుతాము.
మనం రక్షకుని పిలుపును విని, ఆయన గొప్ప కార్యములో నిమగ్నమవడానికి ప్రయత్నించాలని నేను యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్.