“నవంబరు 25–డిసెంబరు 1: ‘విశ్వాసము ద్వారా అన్ని సంగతులు నెరవేర్చబడును.’ ఈథర్ 12–15,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2023)
“నవంబరు 25–డిసెంబరు 1. ఈథర్ 12-15,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2023)
నవంబరు 25–డిసెంబరు 1: “విశ్వాసము ద్వారా అన్ని సంగతులు నెరవేర్చబడును”
ఈథర్ 12–15
జెరెడీయులకు ఈథర్ యొక్క ప్రవచనాలు “గొప్ప ఆశ్చర్యకరమైనవి” (ఈథర్ 12:5). అతడు “వారికి మనుష్యుని యొక్క ఆరంభము నుండి అన్ని సంగతులను చెప్పెను” (ఈథర్ 13:2). అతడు “క్రీస్తు యొక్క దినములను” మరియు కడవరి దిన క్రొత్త యెరూషలేమును ముందుగా చూసాడు (ఈథర్ 13:4). “మేలైన లోకము కొరకు, అనగా దేవుని యొక్క కుడి చేతి వైపున ఒక స్థలము కొరకు నిరీక్షించుట” (ఈథర్ 12:4) గురించి అతడు మాట్లాడాడు. కానీ, ఈరోజు దేవుని యొక్క సేవకుల ప్రవచనాలను జనులు తరచు తిరస్కరించడానికి గల అదే కారణము వలన జెరడీయులు అతడి మాటలను తిరస్కరించారు—“వారు వాటిని [చూడ] లేదు కనుక” (ఈథర్ 12:5). అవిశ్వాసులైన జనులకు “గొప్ప ఆశ్చర్యకరమైన విషయాలను” గూర్చి ప్రవచించడానికి ఈథర్‌కు విశ్వాసము అవసరమైనట్లుగా, మనము చూడలేని సంగతులను గూర్చి వాగ్దానములు లేదా హెచ్చరికలను నమ్మడానికి విశ్వాసము అవసరము. “వ్రాయుటలో అతడి బలహీనతను” తీసుకొని, ప్రభువు దానిని బలముగా మారుస్తారని (ఈథర్ 12:23–27 చూడండి) నమ్మడానికి మొరోనైకు విశ్వాసము అవసరమైంది. ఇటువంటి విశ్వాసమే మనల్ని “నిశ్చయముగా నిలకడగా ఎల్లప్పుడు సత్‌క్రియలలో వృద్ధి పొందుచూ దేవుడిని మహిమపరచుటకు నడిపింపబడునట్లు చేయును” (ఈథర్ 12:4). మరియు ఈ రకమైన విశ్వాసము ద్వారానే “అన్ని సంగతులు నెరవేర్చబడును” (ఈథర్ 12:3).
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
యేసు క్రీస్తునందు విశ్వాసము అద్భుతాలకు దారితీయగలదు.
ఈథర్ కాలములోని జెరెడీయుల వలె, నేడు అనేకమంది జనులు, దేవునియందు మరియు ఆయన శక్తియందు విశ్వసించే ముందు సాక్ష్యాలను చూడాలని కోరుతున్నారు. ఈ ఆలోచన గురించి మీరు ఈథర్ 12:5–6 నుండి ఏమి నేర్చుకుంటారు?
మీరు ఈథర్ 12 చదువుతున్నప్పుడు, మీరు “విశ్వాసం” అనే పదాన్ని కనుగొన్న ప్రతీసారి నమోదు చేయవచ్చు. విశ్వాసం గురించి ప్రతీ సందర్భము ఏమి బోధిస్తుందో పరిగణించండి. ఇటువంటి ప్రశ్నలు సహాయపడవచ్చు: విశ్వాసము అనగా ఏమిటి? విశ్వాసమును సాధన చేయడం అంటే ఏమిటి? యేసు క్రీస్తు నందు విశ్వాసము యొక్క ఫలములేవి? “మీ విశ్వాసము పరీక్షించబడిన తర్వాత” (ఈథర్ 12:6) మీరు పొందిన సాక్ష్యములను గూర్చి మీ ఆలోచనలను కూడా మీరు వ్రాయవచ్చు.
రస్సెల్ ఎమ్.నెల్సన్, “క్రీస్తు లేచియున్నాడు; ఆయనయందు విశ్వాసం పర్వతములను కదిలించును,” లియహోనా, మే 2021, 101–4 కూడా చూడండి.
యేసు క్రీస్తు మనకు “అధిక శ్రేష్ఠమైన నిరీక్షణను” ఇచ్చును.
విశ్వాసము గురించి లోతైన అంతర్‌జ్ఞానములకు అదనముగా, నిరీక్షణ గురించి చెప్పడానికి కూడా ఈథర్ 12 అధిక విషయమును కలిగియున్నది. ఈ ప్రశ్నలు మీ అధ్యయనమును నడిపించనివ్వండి:
-
“మేలైన లోకము కొరకు నిరీక్షించుటకు” ఈథర్‌కు గల కారణములేవి? (ఈథర్ 12:2–5 చూడండి).
-
లంగరు యొక్క ప్రయోజనం ఏమిటి? ఒక లంగరు పడవ కొరకు చేయునట్లుగా, నిరీక్షణ మీ ఆత్మ కొరకు ఏమి చేస్తుంది? (ఈథర్ 12:4 చూడండి).
-
మనము వేటి కొరకు నిరీక్షణ కలిగియుండాలి? (ఈథర్ 12:4;మొరోనై 7:41 చూడండి).
-
యేసు క్రీస్తు యొక్క సువార్త మీకు “అధిక శ్రేష్ఠమైన నిరీక్షణను” ఎలా ఇచ్చింది? (ఈథర్ 12:32).
మొరోనై 7:40–41; జెఫ్రీ ఆర్. హాలండ్, “పరిపూర్ణమైన ప్రకాశవంతమైన నిరీక్షణ,” లియహోనా, మే 2020, 81–84 కూడా చూడండి.
యేసు క్రీస్తు నా బలహీనతను బలముగా మార్చగలరు.
మొరోనై యొక్క శక్తివంతమైన రచనలు మనము చదివినప్పుడు, “వ్రాయుటలో తన బలహీనత” గురించి అతడు చింతించిన దానిని మరియు అతడి మాటలను బట్టి జనులు ఎగతాళి చేస్తారని భయపడిన దానిని మరచిపోవడం సులభము (ఈథర్ 12:23–25 చూడండి). మీరు ఎప్పుడైనా మీ స్వంత బలహీనత గురించి విచారముగా భావించినట్లయితే,—ఈథర్ 12:23–29 లో మొరోనై యొక్క కష్టాలు—మరియు రక్షకుని ప్రతిస్పందన గురించి చదవండి. యేసు క్రీస్తు మీ బలహీనతను గుర్తించడంలో మీకు సహాయపడి—ఆయన వాటిని పూర్తిగా తీసివేయనప్పటికీ, మిమ్మల్ని శక్తిమంతులుగా చేసిన సందర్భాలను కూడా మీరు ధ్యానించవచ్చు. ప్రస్తుతం మీరు ప్రయాసపడుతున్న బలహీనతలను గూర్చి కూడా ఆలోచించండి. “బలహీనమైన సంగతులను బలమైనవిగా చేయుదును” అనే రక్షకుని వాగ్దానాన్ని పొందడానికి మీరు ఏమి చేయాలి? (ఈథర్ 12:27).
లేఖనాల్లోని ఇతరులు యేసు క్రీస్తు యొక్క కృప ద్వారా ఎలా బలాన్ని పొందారో చూడడానికి క్రింది గద్యగాలను శోధించడం గురించి ఆలోచించండి:
-
హనోకు (మోషే 5:31-34; 7:13)
-
మోషే (నిర్గమకాండము 4:10–-12; 14:31)
-
గిద్యోను (న్యాయాధిపతులు 6:12–16; 8:22–23).
-
పేతురు (లూకా 5:8–10; 22:55–62; అపొస్తలుల కార్యములు 4:13–-21)
-
మొరోనై (ఈథర్ 12:23-29)
-
జోసెఫ్ స్మిత్ (జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:28; సిద్ధాంతము మరియు నిబంధనలు 35:17; 135:3)
ప్రభువు యొక్క ప్రవక్తలను తిరస్కరించుట నన్ను ఆత్మీయ అపాయములో పడవేస్తుంది.
జెరెడీయులకు రాజుగా ఉండుట, చారిత్రాత్మకంగా ప్రమాదకరమైన స్థానం. “బలమైన మనుష్యులనేకులు … అతడిని నాశనము చేయుటకు కోరిరి” (ఈథర్ 13:15–16) కావున, ఇది ప్రత్యేకంగా కోరియాంటమర్ విషయంలో నిజమైనది. ఈథర్ 13:15–22 లో, తననుతాను కాపాడుకోవడానికి కోరియాంటమర్ చేసిన దానిని మరియు బదులుగా ఏమి చేయమని ఈథర్ అతడికి సలహా ఇచ్చాడనే దానిని గమనించండి. మిగిలిన ఈథర్ గ్రంథమును మీరు చదివినప్పుడు, ప్రవక్తలను తిరస్కరించుట వలన కలిగే పర్యవసానాలను ధ్యానించండి. “ప్రభువు యొక్క ఆత్మ వారితో పోరాడుట [మానివేసినప్పుడు]” జనులకు ఏమి జరుగుతుంది? (ఈథర్ 15:19). ఈ వృత్తాంతాల నుండి మీరు ఏమి నేర్చుకోవాలని ప్రభువు కోరుతున్నారు? ఆయన ప్రవక్తలను అనుసరించడానికి మీరు ఏమి చేయగలరో ఆలోచించండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
విశ్వాసం అంటే నేను చూడలేని విషయాలను నమ్మడం.
-
ఈథర్ 12:6 నుండి “విశ్వాసమనగా నిరీక్షింపబడిన మరియు అదృశ్యమైన సంగతులు ఉన్నవనుట” అని మీతో పాటు పునరావృతం చేయడానికి మీ పిల్లలకు సహాయం చేయడాన్ని పరిగణించండి. ఈథర్ 12:13–15, 19–21 లో విశ్వాసం యొక్క ఉదాహరణలను చూపించే చిత్రాలను చూసి వారు ఆనందించవచ్చు. ప్రతీ కథ గురించి వారికి తెలిసిన దానిని మీ పిల్లలను వివరించనివ్వండి. విశ్వాసం యొక్క ఈ ఉదాహరణలను చర్చించడంలో మీకు సహాయపడేందుకు ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి:
-
ఈ ప్రజలు వేటి కొరకు నిరీక్షణ కలిగియున్నారు?
-
వారి విశ్వాసము ఎలా పరీక్షించబడింది?
-
వారి విశ్వాసము మూలముగా ఏం జరిగింది?
మీరు విశ్వాసాన్ని సాధన చేసినప్పటి మీ స్వంత అనుభవాలను కూడా పంచుకోవచ్చు.
-
నిరీక్షణ నా ఆత్మకు ఒక లంగరు వంటిది.
-
నిరీక్షణ గురించి ఈథర్ 12:4 ఏమి బోధిస్తుందో అర్థం చేసుకోవడానికి, మీరు మరియు మీ పిల్లలు పడవ మరియు లంగరు చిత్రాన్ని చూడవచ్చు. పడవలకు లంగరులు ఎందుకు అవసరం? లంగరు లేని పడవకు ఏమి జరుగుతుంది? మీరు ఈథర్ 12:4 ను కలిసి చదివినప్పుడు,పడవకు లంగరు సహాయం చేసే విధంగా నిరీక్షణ మనకు ఎలా సహాయపడుతుందనే దాని గురించి మాట్లాడండి. పడవ మరియు లంగరు చిత్రాలను గీయడానికి మీ పిల్లలను ఆహ్వానించండి, తద్వారా వారు నిరీక్షణ గురించి ఇతరులకు బోధించగలరు.
-
ఈ నిర్వచనం మరియు ఈథర్ 12:4, 32 ప్రకారం, మనము వేటి కొరకు నిరీక్షణ కలిగియుండాలి? (మొరోనై 7:40–42 కూడా చూడండి) నిరీక్షణకు వ్యతిరేకమైన పదాలతో పాటు, నిరీక్షణ కొరకు ఇతర పదాల గురించి ఆలోచించడంలో మీ పిల్లలకు సహాయపడండి. మీకు నిరీక్షణనిచ్చే కొన్ని సువార్త సత్యాలను కూడా మీరు పరస్పరం పంచుకోవచ్చు.
నేను ఆధ్యాత్మికంగా బలపడేందుకు యేసు క్రీస్తు నాకు సహాయం చేయగలరు.
-
పిల్లలు కొన్నిసార్లు మొరోనై వలె బలహీనంగా భావించే పరిస్థితులను ఎదుర్కొంటారు. ఈథర్ 12:23–25 లో మొరోనైకి ఎందుకు అలా అనిపించిందో తెలుసుకోవడానికి మీ పిల్లలకు సహాయం చేయండి మరియు వారు ఎప్పుడైనా ఇలాంటి భావాలను కలిగి ఉన్నారా అని వారిని అడగండి. తర్వాత, మొరోనైకి ప్రభువు ఎలా సహాయం చేశారో తెలుసుకోవడానికి 26–27 వచనాలను చదవమని వారిని ఆహ్వానించండి.
-
బహుశా మీ పిల్లలు ఒక బలహీనమైన మరియు ఒక బలమైన వాటి చిత్రాలను గీయవచ్చు. తరువాత వారు ఈథర్ 12:23–29 నుండి కొన్ని పదాలు మరియు వాక్యభాగాలను వారి చిత్రాలకు జోడించవచ్చు, అది రక్షకుడు మన బలహీనతను ఎలా శక్తివంతముగా మార్చగలరో వారికి బోధిస్తుంది. వారిలో ఉన్న ఒక బలహీనత గురించి ఆలోచించమని మరియు శక్తిమంతులుగా మారడానికి రక్షకుని సహాయం కోరమని మీ పిల్లలను ప్రోత్సహించండి. కష్టతరమైనదేదైనా చేయగలిగినంత శక్తిమంతులు కావడానికి రక్షకుడు మీకు సహాయం చేసిన అనుభవాన్ని కూడా మీరు పంచుకోవచ్చు.