2024 రండి, నన్ను అనుసరించండి
డిసెంబరు 2-8: “వారిని సరియైన మార్గమందు ఉంచుటకు.” మొరోనై 1–6


“డిసెంబరు 2-8: ‘వారిని సరియైన మార్గమందు ఉంచుటకు.’ మొరోనై 1-6,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2023)

“డిసెంబరు 2-8. మొరోనై 1-6,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2023)

మోర్మన్ జలముల వద్ద జనులకు బాప్తిస్మమిస్తున్న ఆల్మా

మినర్వా టైఛర్ట్ (1888–1976), Alma Baptizes in the Waters of Mormon [మోర్మన్ జలములలో ఆల్మా బాప్తిస్మమిచ్చుట], 1949-1951, కృత్రిమ చెక్కపై తైలవర్ణ చిత్రము, 35 7/8 x 48 అంగుళాలు. బ్రిగమ్ యంగ్ యూనివర్సిటీ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ , 1969

డిసెంబరు 2-8: “వారిని సరియైన మార్గమందు ఉంచుటకు”

మొరోనై 1–6

నీఫైయుల గురించి తన తండ్రి యొక్క వృత్తాంతమును పూర్తి చేసి, జెరడీయుల వృత్తాంతమును సంగ్రహించిన తరువాత, గ్రంథమును కాపాడే తన కార్యము నెరవేర్చబడిందని మొరోనై అనుకున్నాడు (మొరోనై 1:1 చూడండి). పూర్తిగా నాశనము చేయబడిన రెండు దేశముల గురించి ఇంకా ఏమి చెప్పాలి? కానీ మొరోనై మన కాలములను చూసాడు (మోర్మన్ 8:35 చూడండి) మరియు “భవిష్యత్తులో ఏదో దినమందు … బహుశ అవి విలువ కలిగియుండునేమోయని మరికొన్ని సంగతులను వ్రాయుటకు” (మొరోనై 1:4) అతడు ప్రేరేపించబడ్డాడు. సాధారణంగా యాజకత్వ విధులు మరియు మతము గురించి కలవరమును దానితోపాటు తెస్తూ, విస్తృతమైన విశ్వాసభ్రష్టత్వము రాబోతున్నదని అతనికి తెలుసు. అందుకే అతడు సంస్కారము, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ యొక్క వరమును ఇచ్చుట మరియు “[మన] విశ్వాసము యొక్క ఆదియు అంతమునైన క్రీస్తు యొక్క యోగ్యతలపై మాత్రమే ఆధారపడుచూ, … [ఒకరినొకరు] సరైన మార్గమందు ఉంచుటకు” (మొరోనై 6:4) సహ విశ్వాసులతో సమావేశమగుట యొక్క దీవెనల గురించి స్పష్టపరిచే వివరాలను ఇచ్చియుండవచ్చు. అతడు “మరికొన్ని సంగతులను వ్రాయునట్లు” (మొరోనై 1:4) మొరోనై ప్రాణాన్ని ప్రభువు కాపాడినందుకు కృతజ్ఞత కలిగియుండుటకు ఇటువంటి విలువైన అంతర్‌జ్ఞానములు మనకు కారణమునిస్తాయి.

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

మొరోనై 1

వ్యతిరేకత ఉన్నప్పటికీ నేను యేసు క్రీస్తును అనుసరించగలను.

మీరు మొరోనై 1 చదివినప్పుడు, ప్రభువుకు మరియు అతడి పిలుపుకు మొరోనై విశ్వాసంగా ఉండుట గురించి మిమ్మల్ని ప్రేరేపించేది ఏమిటి? ఒక వ్యక్తి “క్రీస్తును తిరస్కరించడానికి” గల కొన్ని మార్గాలు ఏవి? (మొరోనై 1:2–3). మీరు శ్రమలను, వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పుడు కూడా, యేసు క్రీస్తు పట్ల విశ్వాసముగా ఎలా ఉండగలరో ధ్యానించండి.

మొరోనై 2–6

యాజకత్వపు విధులు తప్పనిసరిగా ప్రభువు ఆజ్ఞాపించినట్లుగా నిర్వహించబడాలి.

మొరోనై ఈ అధ్యాయాలు వ్రాసేటప్పుడు తన ప్రాణం కోసం పరిగెడుతున్నాడు. విధులను ఎలా అమలు చేయాలనేటటువంటి పరిపాలనా వివరాల గురించి వ్రాయాలని అతను ఎందుకు అనుకొనియుంటాడు? మీరు మొరోనై 2–6 చదువుతున్నప్పుడు, దీని గురించి ధ్యానించండి. ఈ వివరాలు ప్రభువుకు ఎందుకు ముఖ్యమైనవని మీరు అనుకుంటున్నారు? మీ అధ్యయనమును నడిపించగల ప్రశ్నలు కొన్ని ఇక్కడున్నాయి:

నిర్ధారణ (మొరోనై 2; 6:4).మొరోనై 2:2 లో ఉన్న రక్షకుని యొక్క సూచనలు నిర్ధారణ యొక్క విధి గురించి మీకు ఏమి బోధిస్తాయి? “పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రేరేపించబడి శుద్ధి చేయబడుట” అంటే ఏమిటనే దాని గురించి మీరు ఎలా వివరిస్తారు? (మొరోనై 6:4).

యాజకత్వ నియామకము (మొరోనై 3).యాజకత్వమునకు నియమించబడుటకై ఒకరు సిద్ధపడుటకు సహాయపడునట్లు ఈ అధ్యాయములో మీరు ఏమి కనుగొంటారు? ఒక విధిని నిర్వహించుటకు సిద్ధపడడానికి ఎవరికైనా సహాయపడునట్లు మీరు ఏమి కనుగొంటారు?

సంస్కారము (మొరోనై 4–5; 6:6).సంస్కారమును మీ వారంలో ఆధ్యాత్మిక ముఖ్యాంశంగా చేయడానికి మీరు ఏమి చేయగలరు?

బాప్తిస్మము (మొరోనై 6:1–3).బాప్తిస్మము పొందుటకు అర్హతలను కొనసాగించడానికి మీరు ఏమి చేస్తున్నారు?

ఒక దీవెన పొందుతున్న యువతి

విధులు ఎలా నిర్వహించబడాలో యేసు బోధించారు.

మీరు నేర్చుకొన్న దానిపై ఆధారపడి, ఈ విధుల కోసం మీరు ఆలోచించే, పాల్గొనే లేదా ఇతరులను సిద్ధపరిచే విధానాలను మీరు ఎలా మార్చగలరు?

సిద్ధాంతము మరియు నిబంధనలు 84:20 కూడా చూడండి.

నటించి చూపుట. మీరు నేర్చుకుంటున్న వాటిని గుర్తుంచుకోవడానికి ఒక గొప్ప మార్గం వాటిని ఇతరులకు వివరించడం. ఉదాహరణకు, ఇలాంటి నటించి చూపే దృశ్యాలను ప్రయత్నించండి: ఒక స్నేహితురాలికి తాను బాప్తిస్మము తీసుకోవడానికి సిద్ధంగా ఉందో లేదో ఖచ్చితంగా తెలియదు. ఆమెకు సహాయం చేయడానికి మీరు మొరోనై 6 ని ఎలా ఉపయోగిస్తారు?

మొరోనై 4-5

సంస్కారమును తీసుకోవడం యేసు క్రీస్తుకు దగ్గరవ్వడానికి నాకు సహాయపడుతుంది.

మీరు బహుశా సంస్కార ప్రార్థనలను చాలాసార్లు వినియున్నారు, కానీ పదాల అర్థం గురించి మీరు జాగ్రత్తగా ఎంత తరచుగా ఆలోచిస్తారు? మీ జ్ఞాపకము నుండి మీరు రెండు సంస్కార ప్రార్థనలను వ్రాయడానికి ప్రయత్నించవచ్చు. తర్వాత, మీరు వ్రాసిన వాటిని మొరోనై 4:3 మరియు 5:2 తో పోల్చండి. మీరు ఇదివరకు గమనించనిదేదైనా ఈ ప్రార్థనలలో మీరు గమనించారా?

మొరోనై 6:4–9

సెమినరీ చిహ్నము
యేసు క్రీస్తు శిష్యులు ఒకరి ఆత్మల కొరకు ఒకరు శ్రద్ధ చూపుతారు.

క్రీస్తును అనుసరించాలనే ఎంపిక వ్యక్తిగతమైనది, కానీ తోటి విశ్వాసులు మనలను “సరైన మార్గంలో” ఉంచడంలో సహాయపడగలరు (మొరోనై 6:4-5). మొరోనై కాలంలోని సంఘ సభ్యులు ఒకరినొకరు బలపరచుకోవడానికి ఏమి చేశారు? మీరు మొరోనై 6:4–9 చదివినప్పుడు, “క్రీస్తు సంఘము యొక్క జనుల మధ్య లెక్కింపబడియుండుట” (మొరోనై 6:4) నుండి వచ్చే దీవెనలను ధ్యానించండి.

మీ వార్డు లేదా శాఖకు హాజరయ్యే వ్యక్తుల గురించి కూడా మీరు ఆలోచించవచ్చు. మీ ప్రేమ యొక్క ప్రత్యేక అవసరమున్నవారు ఎవరైనా ఉన్నారా—బహుశా కొత్తవారు లేదా ఇటీవల తిరిగి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా? అధ్యక్షులు డాల్లిన్ హెచ్. ఓక్స్ గారి సందేశము, “ఒక సంఘము యొక్క అవసరము,” (లియహోనా, నవ. 2021, 24-25) లోని విభాగం I లో మీరు కొన్ని ఉపాయాలను కనుగొనవచ్చు.

“దేవుని సువార్త ద్వారా పోషింపబడునట్లు” (మొరోనై 6:4) అంటే ఏమిటో మీరు ఆలోచిస్తున్నప్పుడు, ఒక విత్తనానికి లేదా శిశువుకు అవసరమైన పోషణ గురించి ఆలోచించడం—మరియు దానిని నిర్లక్ష్యం చేస్తే ఏమి జరుగుతుందో ఆలోచించడం సహాయపడవచ్చు. ఇతరులను ఆధ్యాత్మికంగా “పోషించడం”లో మీరు ఎలా సహాయపడగలరు అనే ఉపాయాల కొరకు మొరోనై 6:4–9 ను శోధించండి. మిమ్మల్ని పోషించేందుకు తోటి శిష్యులు ఎలా సహాయం చేశారు?

“క్రీస్తు సంఘము యొక్క ప్రజలలో లెక్కించబడడం” మరియు సంఘ సమావేశాలలో “తరచుగా కలవడం” ఎందుకు ముఖ్యమో అందరికీ స్పష్టంగా తెలియదు. యేసు క్రీస్తు యొక్క సంఘములో సభ్యుడిగా ఉన్నందుకు మీరు ఎందుకు కృతజ్ఞత కలిగియున్నారో మీరు ఎలా వివరిస్తారు? (అధ్యక్షులు ఓక్స్ గారి సందేశం “ఒక సంఘము యొక్క అవసరము” లోని ఇతర విభాగాలను చూడండి).

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

మొరోనై 2–6

పరిశుద్ధాత్మ ఒక పవిత్రమైన బహుమతి.

  • మొరోనై 2–6 లో చాలాసార్లు పరిశుద్ధాత్మ లేదా ఆత్మ గురించి ప్రస్తావించబడింది. బహుశా ఆయన గురించి ప్రస్తావించే ప్రతీ వచనాన్ని కనుగొనమని, ఆ వచనాలను చదవమని మరియు పరిశుద్ధాత్మ గురించి వారు నేర్చుకున్న వాటిని జాబితా చేయమని మీరు మీ పిల్లలను అడగవచ్చు. మీరు ఆత్మ యొక్క ప్రభావాన్ని భావించిన అనుభవాలను కూడా పరస్పరం పంచుకోవచ్చు.

మొరోనై 4-5

నేను ఎల్లప్పుడూ యేసు క్రీస్తును జ్ఞాపకముంచుకుంటానని చూపడానికి నేను సంస్కారమును తీసుకుంటాను.

  • మీ పిల్లలతో సంస్కార ప్రార్థనలను చదవడం, సంస్కారముతో మరింత అర్థవంతమైన అనుభవాలను ఎలా పొందాలనే దాని గురించిన చర్చకు దారి తీయగలదు. ఒక స్నేహితుడు సంస్కార సమావేశానికి మొదటిసారి వస్తున్నాడని ఊహించుకోవడం వారికి సహాయపడవచ్చు. సంస్కారము అంటే ఏమిటి మరియు అది ఎందుకు పవిత్రమైనది అని మన స్నేహితుడికి మనం ఎలా వివరిస్తాము? మీ పిల్లలను వారి వివరణలలో మొరోనై 4 లేదా 5 నుండి ఏదైనా ఉపయోగించమని ప్రోత్సహించండి. చిన్న పిల్లలు ఈ వారం ప్రోత్సాహ కార్యక్రమ పేజీని ఉపయోగించవచ్చు.

  • మీరు సంస్కార సమయంలో భక్తితో కూర్చోవడాన్ని కూడా సాధన చేయవచ్చు.

మొరోనై 6:1-3

నేను బాప్తిస్మము తీసుకోవడానికి సిద్ధపడగలను.

  • ఎవరు బాప్తిస్మము పొందవచ్చు? మొరోనై 6:1–3 లో ఈ ప్రశ్నకు జవాబులు కనుగొనడానికి మీ పిల్లలకు సహాయపడండి. “విరిగిన హృదయము మరియు నలిగిన మనస్సు” కలిగియుండుట అనగా అర్థమేమిటి? (మొరోనై 6:2). ఇది బాప్తిస్మము కొరకు సిద్ధపడుటకు మనకు ఎలా సహాయపడుతుంది? మీరు బాప్తిస్మము తీసుకోవడానికి ఎలా సిద్ధపడ్డారో మీ పిల్లలకు చెప్పండి.

మొరోనై 6:4–6, 9

మనము సంస్కారము తీసుకొని ఒకరికొకరు మద్దతు ఇవ్వడం కొరకు సంఘానికి వెళ్తాము.

  • మీరు సంఘానికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారో మీ పిల్లలకు తెలుసా? మొరోనై 6:4–6, 9 చదవడం వలన సంఘములో మనం చేసే కొన్ని విషయాలను కలిసి చర్చించుకునే అవకాశం మీకు లభిస్తుంది. బహుశా వారు ఈ పనులు చేస్తున్నట్లు వారి చిత్రాలను గీయవచ్చు (ప్రార్థించడం, బోధించడం, పాడడం మరియు సంస్కారము తీసుకోవడం వంటివి).

  • మొరోనై 6:4 ను కలిసి చదివిన తర్వాత, మీరు మరియు మీ పిల్లలు పోషణనిచ్చే ఆహారాల చిత్రాలను లేదా ఉదాహరణలను చూడవచ్చు మరియు మన శరీరాలను పోషించడాన్ని “దేవుని సువార్త ద్వారా పోషింపబడునట్లు”తో పోల్చవచ్చు.

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

ఒక గుహలో దాగుకున్న మొరోనై

Moroni in the Cave [గుహలో మొరోనై], జార్జ్ కొక్కో చేత