రండి, నన్ను అనుసరించండి
సెప్టెంబర్ 14–20. 3 నీఫై 8–11: “లేచి నా యొద్దకు రండి”


“సెప్టెంబర్ 14–20. 3 నీఫై 8–11: ‘లేచి నా యొద్దకు రండి,‘” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)

“సెప్టెంబర్ 14–20. 3 నీఫై 8–11,“ రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020

యేసు నీఫైయులకు ప్రత్యక్షమగుట

నేను లోకమునకు వెలుగైయున్నాను, జేమ్స్ ఫుల్మర్ చేత

సెప్టెంబర్ 14–20

3 నీఫై 8–11

“లేచి నా యొద్దకు రండి”

3 నీఫై 8–11 లో జనులు దేవుని స్వరము తమతో మాట్లాడుట విన్నారు. మీరు ఈ అధ్యాయాలను చదివినప్పుడు, ఆయన స్వరము మీతో ఏమి చెప్పుచున్నదో శ్రద్ధగా వినండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

”ఇదిగో లోకములోనికి వచ్చునని ప్రవక్తలు సాక్ష్యమిచ్చిన యేసు క్రీస్తును నేనే” (3 నీఫై 11:10). ఈ మాటలతో, 600 సంవత్సరాలకు పైగా మోర్మన్ గ్రంథ ప్రవచనాలను నెరవేరుస్తూ, పునరుత్థానము చెందిన రక్షకుడు తననుతాను పరిచయం చేసుకున్నారు. ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ ఇలా వ్రాసారు, “ఆ ప్రత్యక్షత మరియు ఆ ప్రకటన మోర్మన్ గ్రంథము యొక్క సమస్త చరిత్రలో ఒక కేంద్ర బిందువును, మహోన్నత క్షణాన్ని ఏర్పరచింది. ప్రతి నీఫై ప్రవక్తకు తెలియజేసి, ప్రేరేపించిన ప్రత్యక్షత మరియు ఆదేశమది. … ప్రతి ఒక్కరు ఆయన గురించి మాట్లాడారు, ఆయన గురించి పాడారు, ఆయన గురించి కలలుగన్నారు మరియు ఆయన ప్రత్యక్షత కోసం ప్రార్థించారు—కానీ ఇక్కడ ఆయన నిజంగా ఉన్నారు. అద్భుతమైన దినము! ప్రతి చీకటి రాత్రిని ఉదయపు వెలుగుగా మార్చే దేవుడు వచ్చియున్నాడు” (Christ and the New Covenant [1997], 250–51).

వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

3 నీఫై 8–11

యేసు క్రీస్తు లోకమునకు వెలుగైయున్నారు.

చీకటి మరియు వెలుగుకు సంబంధించిన చిహ్నములు—భౌతికమైనవి మరియు ఆత్మీయమైనవి— 3 నీఫై 8–11 అంతటా మళ్ళీ మళ్ళీ చెప్పబడ్డాయని మీరు గమనించగలరు. ఆత్మీయ అంధకారము మరియు వెలుగు గురించి ఈ అధ్యాయాల నుండి మీరేమి నేర్చుకుంటారు? మీ జీవితంలో చీకటిని తెచ్చేది ఏది? వెలుగును తెచ్చేది ఏది? “లోకమునకు వెలుగు మరియు జీవమునైయున్నానని” రక్షకుడు తననుతాను పరిచయం చేసుకోవడానికి ఎందుకు ఎన్నుకున్నారని మీరనుకుంటున్నారు? (3 నీఫై 9:18; 11:11). యేసు క్రీస్తు మీ జీవితంలో ఏవిధంగా వెలుగైయున్నారు?

3 నీఫై 8–10

నేను పశ్చాత్తాపపడినట్లయితే, రక్షకుడు నన్ను సమకూర్చి, కాపాడి, స్వస్థపరుస్తారు.

3 నీఫై 8 లో వివరించబడిన నాశనమును మరియు అంధకారమును అనుభవించిన తర్వాత జనులు ఏవిధంగా భావించియుంటారని మీరూహిస్తున్నారు? అధ్యాయాలు 9 మరియు 10 లో వెలుగు, దయ మరియు విమోచన గురించి రక్షకుని స్వరము మాట్లాడుటను వారు వినినప్పుడు వారేవిధంగా భావించియుంటారని మీరనుకుంటున్నారు?

భీకరమైన నాశనము జనుల పాపముల యొక్క ఫలితమేనని రక్షకుడు ప్రకటించినప్పటికీ, తన వద్దకు తిరిగివచ్చి, పశ్చాత్తాపపడు వారిని తాను స్వస్థపరిచెదనని ఆయన వాగ్దానం చేసారు (3 నీఫై 9:2, 13 చూడండి). ఎల్డర్ నీల్ ఎల్. ఆండర్సన్ ఇలా వ్యాఖ్యానించారు: “విడిచిపెట్టబడిన పాపము ఎంత స్వార్థపూరితమైనదైనప్పటికీ, పశ్చాత్తాపపడిన వారికొరకు రక్షకుని యొక్క దయగల బాహువులు మరియు ప్రేమ పట్ల నేను ఆశ్చర్యపడుతున్నాను. మన పాపములను క్షమించడానికి రక్షకుడు సమర్థుడని మరియు ఆతృతగా ఉన్నారని నేను సాక్ష్యమిస్తున్నాను” (“Repent … That I May Heal You,” Ensign or Liahona, Nov. 2009, 40).

క్రీస్తు యొక్క దయ మరియు క్షమించడానికి ఆయన ఆతృత యొక్క సాక్ష్యము కొరకు 3 నీఫై 9–10 వెదకండి. ఉదాహరణకు, రక్షకుని ప్రేమ మరియు దయను అనుభవించడానికి మీకు సహాయపడేలా 3 నీఫై 9:13–22 మరియు 10:1–6 లో మీరేమి కనుగొంటారు? ఆయన మిమ్మల్ని ”చేర్చుకొని”, ”పోషించినట్లు” మీరు భావించిన అనుభవాలను ధ్యానించండి (3 నీఫై 10:4 చూడండి). ఈ అనుభవాలను దినచర్య పుస్తకంలో నమోదు చేయడం లేక మీ ప్రియమైన వారితో పంచుకోవడం గురించి ఆలోచించండి.

3 నీఫై 11:1–8

దేవుని స్వరమును వినడాన్ని మరియు గ్రహించడాన్ని నేను నేర్చుకోగలను.

దేవుడు మీకు చెప్తున్న ఒక సందేశాన్ని అర్థం చేసుకోవడానికి మీరు కష్టపడుతున్నట్లు మీరెప్పుడైనా భావించారా? దేవుని స్వరమును వినడం మరియు గ్రహించడం గురించి కొన్ని సూత్రాలను అర్థం చేసుకోవడానికి 3 నీఫై 11:1–8 లోని జనుల అనుభవం బహుశా మీకు సహాయపడగలదు. జనులు వినిన దేవుని స్వరము యొక్క స్వభావాలను మరియు దానిని బాగా అర్థం చేసుకోవడానికి వారు చేసిన దానిని మీరు వ్రాసియుంచుకోవచ్చు. వ్యక్తిగత బయల్పాటు ద్వారా మీ జీవితంలో దేవుని స్వరమును విని, గుర్తించడానికి మీ ప్రయత్నాల్లో ఈ వృత్తాంతము ఏవిధంగా అన్వయించబడుతుంది?

3 నీఫై 11:8–17

ఆయన గురించి ఒక వ్యక్తిగత సాక్ష్యమును పొందమని యేసు క్రీస్తు నన్ను ఆహ్వానించారు.

యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, సమృద్ధి దేశమందు సుమారు 2,500 మంది జనులు సమకూడారు (3 నీఫై17:25). ఇంత గొప్ప సంఖ్యలో ఉన్నప్పటికీ, ఆయన చేతులు మరియు పాదాలలో ఉన్న మేకు గురుతులను తాకడానికి వారిలో ప్రతిఒక్కరిని ”ఒకరి తర్వాత ఒకరుగా” రమ్మని రక్షకుడు ఆహ్వానించారు (3 నీఫై11:14–15). యేసు క్రీస్తులో విశ్వాసాన్ని పెంపొందించే వ్యక్తిగత అనుభవాలను కలిగియుండడం యొక్క ప్రాముఖ్యత గురించి ఇది మీకేమి సూచిస్తున్నది? ఏ విధాలుగా రక్షకుడు మిమ్మల్ని “లేచి తన వద్దకు రమ్మని“ ఆహ్వానిస్తున్నారు? (3 నీఫై 11:14). ఆయన మీ రక్షకుడని సాక్ష్యము పొందునట్లు మీకు సహాయపడిన అనుభవాలేవి? ఈ వచనాలలో ఉన్న రక్షకుని మాదిరి ఇతరులకు పరిచర్య చేసేందుకు మీ ప్రయత్నాలను ఏవిధంగా ప్రేరేపించగలదో మీరు ఆలోచించవచ్చు.

యేసు తన చేతులలోని గురుతులను నీఫైయులకు చూపుట

ఒకరి తర్వాత ఒకరు, వాల్టర్ రేన్ చేత

కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మీ కుటుంబముతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చుటకు ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు చర్చించాలో తెలుసుకొనుటకు ఆత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.

3 నీఫై 8–9

3 నీఫై 8–9 లో వివరించబడిన అనుభవాలతో పోల్చుకోవడానికి మీ కుటుంబానికి సహాయపడేందుకు ఒక చీకటి గదిలో మీరు ఈ అధ్యాయాలలో నమోదు చేయబడిన కొన్ని భాగాలను మళ్ళీ చెప్పవచ్చు లేదా వినవచ్చు. మూడు రోజులు చీకటిలో ఉండడం ఎలా ఉంటుందో చర్చించండి. అప్పుడు యేసు క్రీస్తు ఏవిధంగా ”లోకమునకు వెలుగైయున్నారు” (3 నీఫై 9:18) అనే దాని గురించి మీరు మాట్లాడవచ్చు.

3 నీఫై 10:1–6

కోడి తన పిల్లలను రెక్కల క్రింద చేర్చుకొని కాపాడే కథ, రక్షకుని స్వభావము మరియు పనిని అర్థం చేసుకోవడానికి పిల్లలకు సహాయపడేందుకు శక్తివంతమైన బోధనా సాధనం కాగలదు. మీ కుటుంబము కోడి మరియు కోడిపిల్లల చిత్రాన్ని చూస్తున్నప్పుడు మీరు ఈ వచనాలను చదవవచ్చు. ఒక కోడి తన పిల్లలను సమకూర్చవలసిన అవసరమేమిటి? రక్షకుడు మనల్ని ఆయనకు దగ్గరగా సమకూర్చాలని ఎందుకు కోరుతున్నారు? పిలిచినప్పుడు దగ్గరకు రాకూడదని ఒక కోడిపిల్ల ఎంచుకొనినట్లయితే ఏమి జరుగవచ్చు?

3 నీఫై 11:1–7

బహుశా ఈ వచనాలలో కొన్నింటిని మీరు సున్నితంగా, ”మెల్లని స్వరము” లో చదవవచ్చు (3 నీఫై11:3). పరలోకము నుండి వచ్చిన స్వరమును గ్రహించడానికి జనులు ఏమి చేయవలసియుండెను? వారి అనుభవము నుండి మనమేమి నేర్చుకుంటాము?

3 నీఫై 11:21–38

మీ కుటుంబంలో ఎవరైనా బాప్తీస్మము తీసుకోవడానికి సిద్ధపడుతున్నారా? 3 నీఫై11:21–38 చదవడం సిద్ధపాటులో వారికి సహాయపడవచ్చు. ఇంతకుముందే బాప్తీస్మము పొందిన కుటుంబ సభ్యులకు ఈ వచనాలలో ఉన్న రక్షకుని బోధనలను ధ్యానించడం ఏ విధంగా సహాయపడగలదు?

3 నీఫై 11:29–30

వివాదము గురించి ఈ వచనాలు మనకేమి బోధిస్తాయి? మన ఇంటిలో మనమేవిధంగా వివాదాన్ని ”దూరం చేయగలము”? (3 నీఫై 11:30).

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లోని ఈ వారం సారాంశమును చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

మనోభావాలను నమోదు చేయండి. ఎల్డర్ రిఛర్డ్ జి. స్కాట్ ఇలా అన్నారు, ”జాగ్రత్తగా నమోదు చేయబడిన జ్ఞానమే అవసరంలో ఉన్నప్పుడు లభ్యమయ్యే జ్ఞానము. … (ఆత్మీయ అభిప్రాయాలను నమోదు చేయడం) ఇంకా ఎక్కువ వెలుగును పొందాలనే మీ ఇష్టాన్ని అభివృద్ధి చేస్తుంది” (“Acquiring Spiritual Knowledge,” Ensign, Nov. 1993, 88).

యేసు నీఫైయులకు ప్రత్యక్షమగుట

ఒక గొఱ్ఱెలకాపరి, హోవార్డ్ లైయన్