“చిన్న పిల్లలకు బోధించడం,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)
“చిన్న పిల్లలకు బోధించడం,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020
చిన్న పిల్లలకు బోధించడం
మీ కుటుంబంలో చిన్న పిల్లలు ఉన్నట్లయితే, వారు నేర్చుకోవడానికి సహాయపడేలా ఇక్కడ కొన్ని కార్యకలాపాలు ఇవ్వబడ్డాయి:
-
పాడడం. కీర్తనలు మరియు పిల్లల పాటల పుస్తకంలోని పాటలు సిద్ధాంతాలను శక్తివంతంగా బోధిస్తాయి. మీరు బోధిస్తున్న సువార్త సూత్రాలకు సంబంధించిన పాటలను కనుగొనడానికి పిల్లల పాటల పుస్తకం వెనుక ఉన్న విషయసూచికను ఉపయోగించండి. పాటలలోని సందేశాలను వారి జీవితాలకు అన్వయించుకొనేలా పిల్లలకు సహాయం చేయండి. ఉదాహరణకు, మీరు పాటలోని పదాలు లేదా మాటల గురించి ప్రశ్నలు అడగవచ్చు. పాడడానికి అదనంగా, మీ పిల్లలు పాటలకు అనుబంధంగా నటించవచ్చు లేదా వారు వేరే పనులు చేస్తున్నప్పుడు పాటలను నేపథ్య సంగీతంగా వినవచ్చు.
-
ఒక కథను వినండి లేదా నటించి చూపండి. లేఖనాల నుండి, మీ జీవితం నుండి, సంఘ చరిత్ర నుండి లేక సంఘ మాసపత్రికల నుండి—కథలను చిన్న పిల్లలు ఇష్టపడతారు. కథలు చెప్పడంలో వారిని కలుపుకోవడానికి మార్గాలను వెదకండి. వారు చిత్రాలు లేదా వస్తువులు పట్టుకోవచ్చు, వారు వినే దాన్ని బొమ్మలుగా గీయవచ్చు, కథను నటించి చూపవచ్చు, లేదా కథ చెప్పడానికి సహాయం చేయవచ్చు. మీరు పంచుకున్న కథల్లోని సువార్త సత్యాలను మీ పిల్లలు గుర్తించడానికి సహాయం చేయండి.
-
లేఖనాన్ని చదవండి. చిన్న పిల్లలు అంత ఎక్కువగా చదవలేకపోవచ్చు, అయినప్పటికీ మీరు వారిని లేఖనాల నుండి నేర్చుకోవడంలో నిమగ్నం చేయవచ్చు. మీరు ఒక వచనం, కీలకమైన వాక్యభాగం లేదా పదంపై దృష్టి పెట్టాలి. వారు పదే పదే చెప్పడం వల్ల లేఖనాలలోని చిన్న వాక్యభాగాలను కంఠస్థం చేయగలరు. వారు దేవుని వాక్యం విన్నప్పుడు, ఆత్మని అనుభూతి చెందుతారు.
-
ఒక చిత్రాన్ని చూడండి లేదా వీడియోను చూడండి. లేఖన కథ లేదా సువార్త సూత్రాలకు సంబంధించిన వీడియోను లేదా చిత్రాన్ని మీ పిల్లలకు మీరు చూపించినప్పుడు, వారు చూచిన దాని నుండి నేర్చుకోవడానికి సహాయపడేలా వారిని ప్రశ్నలడగండి. ఉదాహరణకు, “ఈ వీడియో లేదా చిత్రంలో ఏం జరుగుతోంది? అది మీరు ఏవిధంగా భావించేలా చేస్తుంది?” అని మీరు అడగవచ్చు. సువార్త గ్రంథాలయ యాప్, medialibrary.ChurchofJesusChrist.org, మరియు children.ChurchofJesusChrist.org వీడియోలు మరియు చిత్రాలు చూడడానికి మంచి ప్రదేశాలు.
-
సృష్టించండి. వారు నేర్చుకున్న కథకు లేదా సూత్రాలకు సంబంధించిన వాటిని పిల్లలు నిర్మించడం, బొమ్మలుగా గీయడం, లేదా రంగులద్దడం చేయవచ్చు.
-
వస్తు పాఠాలలో పాల్గొనండి. వివరించడానికి కష్టంగా ఉండే సువార్త సూత్రాలను మీ పిల్లలు అర్థంచేసుకోవడానికి ఒక సులువైన వస్తు పాఠం సహాయపడగలదు. వస్తు పాఠాలను ఉపయోగించేటప్పుడు, మీ పిల్లలను పాల్గొనేలా చేయడానికి మార్గాలను వెదకండి. ఒక ప్రదర్శనను చూడటం కంటే పరస్పర అనుభవం నుండి వారు మరింత నేర్చుకుంటారు.
-
నటించి చూపడం. నిజ జీవితంలో వారు ఎదుర్కోగల ఒక సందర్భాన్ని పిల్లలు నటించి చూపుతున్నప్పుడు, ఒక సువార్త సూత్రం వారి జీవితాలకు ఎలా వర్తిస్తుందనేది వారు బాగా అర్థం చేసుకోగలరు.
-
కార్యకలాపాలను పునరావృతం చేయండి. భావాలను అర్థం చేసుకోవడానికి చిన్న పిల్లలు వాటిని అనేకసార్లు వినవలసి రావచ్చు. కథలు లేదా కార్యకలాపాలను తరచుగా పునరావృతం చేయడానికి భయపడకండి. ఉదాహరణకు, రకరకాల విధానాల్లో ఒక లేఖన కథను మీరు చాలా సార్లు పంచుకోవచ్చు—లేఖనాల నుండి చదవడం, మీ సొంత మాటలలో చెప్పడం, వీడియో చూపించడం, మీరు కథ చెప్పడానికి మీ పిల్లలు సహాయపడేలా చేయడం, ఒక కథను నటించి చూపడానికి వారిని ఆహ్వానించడం, మరియు ఇంకా అలాంటివి.