“మీ వ్యక్తిగత లేఖన అధ్యయనాన్ని మెరుగుపరచుకొనడానికి ఉపాయాలు,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)
“మీ వ్యక్తిగత లేఖన అధ్యయనాన్ని మెరుగుపరచుకొనడానికి ఉపాయాలు,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులకు మరియు కుటుంబాల కొరకు: 2020
మీ వ్యక్తిగత లేఖన అధ్యయనాన్ని మెరుగుపరచుకొనడానికి ఉపాయాలు
లేఖనాలలో దేవుని వాక్యము యొక్క మీ అధ్యయనాన్ని మెరుగుపరిచే కొన్ని సులువైన మార్గాలు.
యేసు క్రీస్తు గురించిన సత్యాలను వెతకండి
అన్ని విషయాలు క్రీస్తును గూర్చి సాక్ష్యమిస్తున్నాయని లేఖనాలు మనకు బోధిస్తున్నాయి (2 నీఫై 11:4; మోషే 6:63 చూడండి), మోర్మన్ గ్రంథములోని సంఘటనలలో, కథల్లో మరియు బోధనలలో ఆయన కోసం వెతకండి. రక్షకుని గురించి మరియు ఆయనను ఎలా అనుసరించాలో మనకు బోధించు వచనాలను ఆనవాలు లేదా గుర్తువెయ్యడం గురించి పరిగణించండి.
ప్రేరేపించే పదాలను మరియు మాటలను వెతకండి
అవి ప్రత్యేకంగా మీకోసమే వ్రాయబడినట్లు మిమ్మల్ని ఆకర్షించే పదాలు మరియు మాటలు లేఖనాలలో మీరు కనుగొనవచ్చు. అవి వ్యక్తిగతంగా సంబంధించినట్లు అనిపించి, మిమ్మల్ని ప్రేరేపించి మీకు స్ఫూర్తినివ్వవచ్చు. మీ లేఖనాలలో వాటికి గుర్తువెయ్యడాన్ని లేదా వాటిని దినచర్య పుస్తకములో వ్రాయడాన్ని పరిగణించండి.
సువార్త సత్యాల కొరకు వెతకండి
కొన్నిసార్లు సువార్త సత్యాలు (తరచు సిద్ధాంతము లేదా సూత్రాలు అని పిలువబడేవి) సూటిగా చెప్పబడతాయి, మరియు కొన్నిసార్లు వాటిని ఒక ఉదాహరణ రూపంలో లేదా కథగా అంతర్లీనము చెయ్యబడతాయి. “ఈ వచనాలలో ఎటువంటి శాశ్వతమైన సత్యాలు బోధించబడ్డాయి?” అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.
ఆత్మ మాటలు వినండి
మీరు చదివినవాటికి సంబంధం లేనప్పటికీ, మీ ఆలోచనలు మరియు భావాలకు శ్రద్ధవహించండి. మీ పరలోక తండ్రి మీరు నేర్చుకోవాల్సిందిగా కోరుచున్నది కేవలం ఆ భావాలే కావచ్చు.
లేఖనాలను మీ జీవితానికి పోల్చుకోండి
మీరు చదివే కథలు మరియు బోధనలు మీ జీవితానికి ఎలా వర్తిస్తాయో పరిగణించండి. ఉదాహారణకు, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవచ్చు, “నేను చదివిన వాటికి తగినట్టుగా నాకు ఏమి అనుభవం ఉంది?” లేదా “లేఖనాలలో ఈ వ్యక్తి ఉదాహరణను నేను ఎలా అనుసరించగలను?”
మీరు అధ్యయనం చేస్తున్నప్పుడు ప్రశ్నలు అడగండి
మీరు లేఖనాలను అధ్యయనం చేస్తున్నప్పుడు మీ మనసులోకి ప్రశ్నలు రావచ్చు. ఈ ప్రశ్నలు సాధారణంగా మీ జీవితంలో లేదా మీరు చదువుతున్న వాటికి సంబంధంగా ఉండవచ్చు. మీరు లేఖనాల అధ్యయనాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఈ ప్రశ్నలను దీర్ఘాలోచన చేసి, వాటి సమాధానాల కోసం వెతకండి.
లేఖన అధ్యయన సహాయాలను ఉపయోగించండి
మీరు చదువు వచనాల యొక్క అదనపు అంతరార్థములను తెలుసుకొనుటకు, పాదవివరణను, విషయ దీపిక, బైబిల్ నిఘంటువు, లేఖన దీపిక (scriptures.ChurchofJesusChrist.org) మరియు ఇతర అధ్యయన సహాయకాలను ఉపయోగించండి.
లేఖనాల సందర్భాన్ని పరిగణించండి
ఒక లేఖనము యొక్క అర్థవంతమైన అంతరార్థములను దాని యొక్క సందర్భమును—అనగా ఆ లేఖనము యొక్క పరిస్థితులు లేదా స్థితిగతులను పరిగణించినట్లైతే—వాటిని మీరు కనుగొనగలరు. ఉదాహరణకు, ప్రవక్త మాట్లాడిన మనుషుల యొక్క నమ్మకాలను మరియు స్థితిగతులను తెలుసుకోవడం వలన ఆయన మాటల ఉద్దేశాన్ని అర్థంచేసుకోవడానికి సహాయపడగలవు.
మీ ఆలోచనలను మరియు అనుభూతులను నమోదుచెయ్యండి
మీరు అధ్యయనం చేసేటప్పుడు వచ్చే హావభావాలను చాలా రకాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఉదాహరణకు, అర్థవంతమైన పదము లేదా పదసముదాయము గుర్తువేసి, మీ ఆలోచనలను ఒక వివరణగా మీ లేఖనాలలో వ్రాసుకోవచ్చు. మీరు పొందే మెళకువలు, అనుభూతులు మరియు హావభావాలను దినచర్య పుస్తకములో వ్రాసిపెట్టుకోవచ్చు.
కడవరి దిన ప్రవక్తలు మరియు అపొస్తలుల మాటలు అధ్యయనము చెయ్యండి
లేఖనములలో మీరు కనుగొను సూత్రముల గురించి కడవరి దిన ప్రవక్తలు మరియు అపొస్తలులు ఏమి బోధించారో చడవండి (ఉదాహరణకు conference.ChurchofJesusChrist.org మరియు సంఘ పత్రికలు చూడండి).
అంతరార్థములను పంచుకోండి
మీ వ్యక్తిగత అధ్యయనము నుంచి వచ్చిన అంతరార్థములను చర్చించడం ఇతరులకు బోధించే ఒక మంచి మార్గం మాత్రమే కాదు, కానీ అది మీరు చదివినదాన్ని అర్థం చేసుకోవడానికి కూడా సహాయపడుతుంది.
మీరు నేర్చుకున్నదాని ప్రకారము జీవించండి
లేఖన అధ్యయనము మనల్ని ప్రేరేపించడం మాత్రమే కాదు కానీ ఇది మనం జీవిస్తున్న మార్గాన్ని మార్చేలా కూడా చేస్తుంది. మీరు చదువుతున్నప్పుడు ఆత్మ మీకు ఏమి ప్రేరేపిస్తుందో వినండి, తరువాత ఆ ప్రేరణలను అనుసరించి నడుచుకొనుటకు వాగ్దానం చెయ్యండి.
అధ్యక్షులు రస్సెల్ యం. నెల్సన్ ఇలా చెప్పారు: “మనం క్రీస్తు వాక్యమమును విందారగించుచూ ముందుకుసాగి, అంతము వరకు సహించిన యెడల, … [మనం] నిత్యజీవమును పొందుతాము’ [2 నీఫై 31:20].
“విందు అనగా రుచిచూడటం కంటే ఎక్కువైంది. విందారగించడం అనగా రుచిని ఆస్వాదించడం. లేఖనాలను సంతోషకరమైన ఆవిష్కరణ మరియు నమ్మకమైన విధేయతతో అధ్యయనం చెయ్యడం వలన మనం వాటి రుచిని ఆస్వాదిస్తాము. మనం దేవుని యొక్క మాటలను విందారగిస్తే, అవి ‘మెత్తని హృదయములు అను పలకలమీద’ చెక్కబడతాయి [2 కొరింథీయులు 3:3]. అవి మన స్వభావంలో అంతర్భాగమవుతాయి” (“Living by Scriptural Guidance,” Ensign, నవం. 2000, 17).