2022 పాత నిబంధన
జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు: సాక్ష్యపు గుడారము మరియు బలి


“జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు: సాక్ష్యపు గుడారము మరియు బలి,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: పాత నిబంధన 2022 (2021)

“జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు: సాక్ష్యపు గుడారము మరియు బలి,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు:2022

చిత్రం
ఆలోచనల చిహ్నము

జ్ఞాపకముంచుకోవలసిన ఆలోచనలు

సాక్ష్యపు గుడారము మరియు బలి

మనము పాత నిబంధన చదివినప్పుడు, ప్రభువుకు అతి ముఖ్యమైన విషయాలను గూర్చిన సుదీర్ఘమైన లేఖన భాగాలను కొన్నిసార్లు మనము కనుగొంటాము, కానీ అవి నేడు మనకు సంబంధించినవి అని వెంటనే అనిపించకపోవచ్చు. నిర్గమకాండము 25–30; 35–40; లేవియకాండము 1–9; 16–17 ఉదాహరణలు. ఈ అధ్యాయాలు అరణ్యములోని ఇశ్రాయేలీయుల సాక్ష్యపు గుడారమును మరియు అక్కడ జరుపబడిన జంతు బలులను సవివరంగా వివరించాయి.1 సాక్ష్యపు గుడారము ఒక చిన్న దేవాలయము, ఆయన జనుల మధ్య ప్రభువు యొక్క నివాస స్థలము.

మన ఆధునిక దేవాలయాలు ఇశ్రాయేలీయుల సాక్ష్యపు గుడారముతో పోలికలను కలిగియున్నవి, కానీ అవి నిశ్చయంగా నిర్గమకాండములో దాని వివరణతో సరిపోల్చబడవు. మరియు 2,000 సంవత్సరాల క్రితం రక్షకుని యొక్క ప్రాయశ్చిత్తము జంతు బలిని ముగించింది గనుక మన దేవాలయాలలో మనము జంతువులను చంపము. ఈ భేదాలు ఉన్నప్పటికీ, మోర్మన్ గ్రంథములో దేవుని యొక్క జనులు వాటిని “క్రీస్తునందు వారి విశ్వాసమును బలపరచుటకు” ఒక విధానముగా చూసినట్లుగా, మనము వాటిని చూచిన యెడల, ప్రాచీన ఇశ్రాయేలీయులు పూజించిన రూపములను గూర్చి చదువుటలో నేడు గొప్ప విలువ కలదు. సాక్ష్యపు గుడారము మరియు జంతు బలి యొక్క చిహ్నరూపమును మనము గ్రహించినప్పుడు, క్రీస్తునందు మన విశ్వాసమును కూడా బలపరచు ఆత్మీయ అంతరార్థములను మనము పొందుతాము.

చిత్రం
సాక్ష్యపు గుడారము వద్ద యాజకులకు గొఱ్ఱెలను తెచ్చుచున్న జనులు

ఒక గొఱ్ఱెను సాక్ష్యపు గుడారము యొద్దకు తెచ్చుచున్న ఇశ్రాయేలీయుల యొక్క దృష్టాంతము, రాబర్ట్ టి. బారెట్ చేత

సాక్ష్యపు గుడారము క్రీస్తునందు మన విశ్వాసమును బలపరచును

ఇశ్రాయేలీయుల గుడారములో ఒక సాక్ష్యపు గుడారమును కట్టమని దేవుడు మోషేను ఆజ్ఞాపించినప్పుడు, ఆయన దాని ఉద్దేశ్యమును వివరించాడు: “నేను వారిలో నివసించునట్లు” (నిర్గమకాండము 25:8). సాక్ష్యపు గుడారము లోపల, దేవుని యొక్క సన్నిధి నిబంధన మందసము చేత సూచించబడింది— బంగారంతో కప్పబడిన ఒక చెక్క పెట్టె, ఆయన జనులతో దేవుని యొక్క నిబంధన వ్రాయబడిన వృత్తాంతమును కలిగియున్నది (నిర్గమకాండము 25:10–22 చూడండి). మందసము అత్యంత పరిశుద్ధమైన, లోపలి గదిలో ఉంచబడింది, ఒక తెర చేత సాక్ష్యపు గుడారములో మిగిలిన వాటినుండి ప్రత్యేకించబడింది. పతనము వలన దేవుని సన్నిధి నుండి మన వేర్పాటుకు చిహ్నముగా ఈ తెర ఉన్నది.

మోషే కాకుండా, ఆ “అతిపరిశుద్ధ స్థలమును” (నిర్గమకాండము 26:34) ప్రవేశించగల మనము ఎరిగిన ఏకైక వ్యక్తి —ప్రధాన యాజకుడు. మిగిలిన యాజకుల వలె, అతడు మొదట కడగబడి, అభిషేకించబడాలి (నిర్గమకాండము 40:12–13 చూడండి) మరియు అతడి స్థానము యొక్క చిహ్నాపూర్వకమైన పరిశుద్ధమైన వస్త్రమును ధరించాలి (నిర్గమకాండము 28 చూడండి). సంవత్సరానికి ఒకసారి, ప్రాయశ్చిత్త దినము అని పిలవబడిన రోజున, సాక్ష్యపు గుడారములోనికి ఒంటరిగా ప్రవేశించడానికి ముందు జనుల తరఫున మిగిలిన బలులను ప్రధాన యాజకుడు అర్పిస్తాడు. తెరవద్ద, అతడు అగ్నిమీద ధూపద్రవ్యమును వేస్తాడు (లేవియకాండము 16:12 చూడండి). పరిమళధూపము పరలోకమునకు ఎక్కివెళ్ళుట జనుల యొక్క ప్రార్థనలు దేవునికి ఆరోహణమగుటను సూచించును (కీర్తనలు 141:2 చూడండి). తరువాత ప్రధాన యాజకుడు, ఒక జంతు బలి నుండి రక్తమును తీసుకొని, తెర గుండా దాటి, నిబంధన మందసము చేత చిహ్నపూర్వకముగా ఉన్న దేవుని సింహాసనమును సమీపించును (లేవియకాండము 16:14–15 చూడండి).

యేసు క్రీస్తు మరియు పరలోక తండ్రి యొక్క ప్రణాళికలో ఆయన పాత్ర గురించి మీకు తెలిసిన దానిని ఎరిగి, సాక్ష్యపు గుడారము మనల్ని రక్షకుని వైపు ఎలా సూచిస్తుందో మీరు చూడగలరా? సాక్ష్యపు గుడారము, దానిలోని మందసము, ఆయన జనుల మధ్య దేవుని సన్నిధిని సూచించినట్లుగా, యేసు క్రీస్తు ఆయన జనుల మధ్య దేవుని సన్నిధిగా ఉన్నాడు (యోహాను 1:14 చూడండి). ప్రధాన యాజకుని వలె, యేసు క్రీస్తు మనకు మరియు తండ్రియైన దేవునికి మధ్య మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన స్వంత త్యాగపు రక్తము యొక్క సుగుణముచేత మన కొరకు మధ్యవర్తిత్వము చేయుటకు ఆయన తెరను దాటి వెళ్ళాడు (హెబ్రీయులకు 8–10 చూడండి).

ఇశ్రాయేలీయుల సాక్ష్యపు గుడారములో కొన్ని ఆకృతులు, ప్రత్యేకంగా మీ స్వంత విధులు పొందడానికి మీరు దేవాలయమునకు వెళ్ళిన యెడల, మీకు పరిచయమైనవిగా ధ్వనించవచ్చు. సాక్ష్యపు గుడారము యొక్క అతి పరిశుద్ధమైన స్థలము వలె, దేవాలయము యొక్క సిలెస్టియల్ గది దేవుని సన్నిధిని సూచిస్తుంది. ప్రవేశించడానికి, మనము మొదట కడగబడాలి మరియు అభిషేకించబడాలి. మనము పరిశుద్ధ వస్త్రములను ధరిస్తాము. బలపీఠము వద్ద మనము ప్రార్థిస్తాము, దాని నుండి ప్రార్థనలు దేవునికి ఆరోహణమవుతాయి. మరియు చివరిగా తెరగుండా మనము దేవుని సన్నిధిలోనికి వెళ్తాము.

బహుశా ఆధునిక దేవాలయాలు మరియు ప్రాచీన సాక్ష్యపు గుడారము మధ్య అత్యంత ముఖ్యమైన పోలిక, సరిగా గ్రహించబడితే, యేసు క్రీస్తునందు మన విశ్వాసమును బలపరచును మరియు ఆయన ప్రాయశ్చిత్త త్యాగము కొరకు కృతజ్ఞతతో మనల్ని నింపును. దేవుడు తన పిల్లలందరు ఆయన సన్నిధిలో ప్రవేశించాలని కోరుతున్నాడు; ఆయన “యాజకులు” మరియు యాజకురాళ్ళు ఉన్న రాజ్యమును కోరుతున్నాడు (నిర్గమకాండము 19:6). కానీ మన పాపములు ఆ దీవెన పొందడం నుండి మనల్ని ఆపివేస్తాయి, ఏలయనగా “అపవిత్రమైన వస్తువేదియు దేవునితో నివసింపజాలదు” (1 నీఫై 10:21). కనుక తండ్రియైన దేవుడు యేసు క్రీస్తును పంపెను, ఆయన మన “మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చెను” (హెబ్రీయులకు 9:11). ఆయన మన కొరకు తెరను తెరచి, “మనము కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుటకు” (హెబ్రీయులకు 4:16) దేవుని యొక్క పిల్లలు అందరికి అధికారమిచ్చును.

ఈ రోజు, దేవాలయముల యొక్క ఉద్దేశము మనకై మనం ఉన్నత స్థితిని పొందుట కంటె ఎక్కువైనది. మన స్వంత విధులను పొందిన తరువాత, మన పూర్వీకుల స్థానములో, వారి తరఫున ప్రతినిధులుగా మనము విధులను పొందడానికి నిలబడగలము. ఒక భావనలో, మనము ప్రాచీన ప్రధాన యాజకునిగా—ఇతరులకు దేవుని సన్నిధికి మార్గమును తెరుస్తూ—గొప్ప ప్రధాన యాజకునిగా ఎదోవిధంగా కాగలము.

త్యాగము యేసు క్రీస్తునందు విశ్వాసమును బలపరచును.

ప్రాయశ్చిత్తము యొక్క సూత్రము మరియు సయోధ్య యొక్క సూత్రములు ప్రాచీన జంతు బలి ఆచరణలో శక్తివంతంగా బోధింపబడింది, పునఃస్థాపించబడిన సువార్త వలన ఆదాము, హవ్వలు బలిని అర్పించారని, రక్షకుని యొక్క త్యాగమునకు దాని చిహ్నపూర్వకమైన అన్వయమును గ్రహించారని, వారి పిల్లలకు దానిని బోధించారని మనము ఎరుగుదుము (మోషే 5:4–12 చూడండి; ఆదికాండము 4:4 కూడా చూడండి).

ప్రాచీన ఇశ్రాయేలీయ ప్రాయశ్చిత్త దినోత్సవం (“Yom Kippur” in Hebrew) సందర్భంగా జంతు బలి యొక్క ప్రతీకవాదం ప్రత్యేకంగా చాలా పదునైనదిగా అనిపించవచ్చు. ఈ వార్షిక వేడుక కొరకు అవసరత లేవియకాండము 16:30 లో వ్యక్తపరచబడింది: “మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపములనుండి పవిత్రులగునట్లు, ఆ దినమున మిమ్ము పవిత్రపరచునట్లు, మీ నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయును. ఆవిధంగా దేవుని యొక్క సన్నిధి జనుల మధ్య నిలిచియుండగలదు. ఈ ప్రాయశ్చిత్తము వివిధ వేడుకల ద్వారా సాధించబడింది. వీటిలో ఒకటి, ఒక మేక జనుల యొక్క పాపముల కొరకు ఒక అర్పణగా చంపబడెను, మరియు ప్రధాన యాజకుడు ఆ మేక రక్తమును అత్యంత పరిశుద్ధ స్థలముకు తీసుకొనివెళ్ళాడు. తరువాత, ప్రధాన యాజకుడు ప్రాణమున్న మేకపై తన చేతులుంచి మరియు ఇశ్రాయేలీయుల పాపములను ఒప్పుకొంటాడు—చిహ్నపూర్వకంగా ఆ పాపములు ఆ మేకకు మరల్చుట. తరువాత ఆ మేక ఇశ్రాయేలీయుల గుడారము నుండి తరిమివేయబడుతుంది.

ఈ వైదిక క్రియలో, మేకలు పాపులైన జనుల స్థానమును తీసుకొంటూ యేసు క్రీస్తును సూచిస్తున్నాయి. పాపము దేవుని సన్నిధిలో అనుమతించబడరాదు. కానీ పాపులను నాశనము చేయుట లేక తరిమి వేయుటకు బదులుగా, దేవుడు మరొక మార్గమును అందించాడు—బదులుగా ఒక మేక చంపబడును లేక తరిమి వేయబడును. “ఆ మేక వారి దోషములన్నిటిని భరించిపోవును” (లేవియకాండము 16:22).

ఈ వైదిక క్రియల చిహ్నరూపము ఆయన సన్నిధికి మనల్ని తిరిగి తెచ్చుటకు దేవుడు సిద్ధపరచిన మార్గమును అనగా యేసు క్రీస్తు మరియు ఆయన ప్రాయశ్చిత్తమును సూచించును. రక్షకుడు “మన రోగములను భరించెను, మన వ్యసనములను” “మనయందరి దోషమును” (యెషయా 53:4, 6) వహించెను. ఆయన మన స్థానములో నిలబడ్డాడు, పాపములకు ప్రాయశ్చిత్తం చెల్లించుటకు తన ప్రాణమును ఇచ్చాడు మరియు తరువాత ఆయన పునరుత్థానము ద్వారా మరణమును జయించాడు (మోషైయ 15:8–9 చూడండి). యేసు క్రీస్తు యొక్క త్యాగము “గొప్ప మరియు చివరి బలి, అవును, ఒక మనుష్యుని యొక్క, లేక జంతువు యొక్క బలి కాదు” కాని “ఆనంతమైన మరియు నిత్యమైన బలి కావలెను” (ఆల్మా 34:10). ఆయన ప్రాచీన బలులు సూచించిన సమస్తము యొక్క నెరవేర్పు.

ఈ కారణము చేత, ఆయన త్యాగము పూర్తి చేయబడిన తరువాత ఆయన అన్నారు, “మీరు నాకు ఇక ఏ మాత్రము రక్తము చిందించుటను చేయరు. అవును, మీ బలులు మరియు బలి అర్పణములు …నిలిపివేయబడును. … “ … మీరు ఒక విరిగిన హృదయము మరియు ఒక నలిగిన ఆత్మను ఒక బలిగా నాకు అర్పించెదరు” (3 నీఫై 9:19–20).

పాత నిబంధనలో బలులు మరియు సాక్ష్యపు గుడారముల వాక్యభాగాలు (లేక తరువాత, దేవాలయము) మీరు కనుగొన్నప్పుడు—మరియు మీరు వాటిలో అనేకమును కనుగొంటారు—అన్నిటి యొక్క ప్రధాన ఉద్దేశము మెస్సీయా అయిన, యేసు క్రీస్తునందు మీ విశ్వాసమును బలపరచుట అని జ్ఞాపకముంచుకొనండి. మీ హృదయము, మీ మనస్సు ఆయనవైపు మరలనివ్వండి. దేవుని సన్నిధికి మిమ్మల్ని తిరిగి తేవడానికి ఆయన చేసిన దానిని—మరియు ఆయనను వెంబడించడానికి మీరు చేసే దానిని ధ్యానించండి.

వివరణ

  1. నిర్గమకాండము 33:7–11 “గుడారపు ద్వారమును” తెలియజేస్తుంది, అక్కడ మోషే ప్రభువుతో మాట్లాడుతున్నాడు, కానీ అది నిర్గమకాండము మరియు లేవియకాండములో వివరించబడిన బలుల కొరకైన సందర్భము కాదు. నిర్గమకాండము 25–30 లో వివరించబడిన సాక్ష్యపు గుడారములో ఆ బలులు నెరవేర్చబడినవి, అది దేవుడు మోషేను నిర్మించమని ఆజ్ఞాపించినది మరియు దానిని ఇశ్రాయేలీయులు నిర్మించారు (నిర్గమకాండము 35–40 చూడండి). అహరోను అతడి కుమారులు జంతు బలులు ఇచ్చిన, ఈ సాక్ష్యపు గుడారము, తరచుగా “ప్రత్యక్షపు గుడారపు ద్వారము” (ఉదాహరణకు, నిర్గమకాండము 28:43; 38:30; లేవియకాండము 1:3 చూడండి) కూడా సూచించబడింది.

ముద్రించు