సెమినరీలు మరియు ఇన్‌స్టిట్యూట్లు
మీరు బోధించే వారిని ప్రేమించండి


“మీరు బోధించే వారిని ప్రేమించండి,” రక్షకుని విధానములో బోధించుట: గృహములో మరియు సంఘములో బోధించువారందరి కొరకు (2022)

“మీరు బోధించే వారిని ప్రేమించండి,” రక్షకుని విధానములో బోధించుట

చిత్రం
బావి వద్ద స్త్రీతో మాట్లాడుచున్న యేసు

రక్షకుడు మన మాదిరిగా ఉన్నప్పుడు, ప్రేమ మన బోధనకు ప్రేరణగా మారుతుంది.

మీరు బోధించే వారిని ప్రేమించండి

రక్షకుడు చేసిన భూలోక పరిచర్య అంతా ప్రేమచేత ప్రేరేపించబడినది. మనము క్రీస్తు యొక్క నిజమైన అనుచరులుగా ఉండుటకు కృషి చేస్తున్నప్పుడు, మనము అదే ప్రేమతో నింపబడగలము (యోహాను 13:34–35; మొరోనై 7:47–48; 8:26 చూడండి). రక్షకుని ప్రేమ మన హృదయాలలో ఉన్నప్పుడు, ఇతరులు క్రీస్తును గూర్చి తెలుసుకొని, ఆయన యొద్దకు వచ్చుటలో సహాయపడుటకు సాధ్యమైన ప్రతీ మార్గాన్ని మనం వెదకుతాము. ప్రేమ మన బోధనకు ప్రేరణ అవుతుంది.

మీరు బోధించే వారిని ప్రేమించండి.

  • దేవుడు అభ్యాసకులను చూసే విధంగా మీరూ చూడండి.

  • వారిని తెలుసుకొనుటకు ప్రయత్నించండి—వారి పరిస్థితులు, అవసరాలు మరియు బలాలు అర్థం చేసుకోండి.

  • వారి కోసం పేరు పేరున ప్రార్థించండి.

  • అందరూ గౌరవించబడేలా మరియు వారి సహకారం విలువైనదని తెలుసుకొనేలా సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించండి.

  • మీ ప్రేమను వ్యక్తపరచడానికి తగిన మార్గాలను కనుగొనండి.

రక్షకుడు తాను బోధించిన ప్రతీ ఒక్కరిలో దైవిక సామర్థ్యమును చూచెను

యెరికోలోని చాలామంది ప్రజలు జక్కయ్య గురించి తెలుసుకోవలసినదంతా తమకు తెలుసని భావించారు. అతడు సుంకరి మరియు పన్ను వసూలు చేసేవాడు—వాస్తవానికి ప్రధాన సుంకరి—అతడు ధనవంతుడు. ఖచ్చితంగా అతడు నిజాయితీ లేనివాడు మరియు అవినీతిపరుడు అని వారు అనుకున్నారు. కానీ యేసు జక్కయ్య హృదయాన్ని చూచెను మరియు గౌరవనీయమైన “అబ్రాహాము కుమారుడిని” చూచెను (లూకా 19:1–10 చూడండి). రక్షకుడు ప్రజలను వారు కనిపించిన విధముగా కాకుండా, వారు నిజంగా ఎలా ఉన్నారో మరియు వారు ఏమి కాగలరో చూచెను. సీమోను, అంద్రెయ, యాకోబు మరియు యోహాను వంటి మొరటు మత్స్యకారులలో ఆయన తన సంఘము యొక్క భవిష్యత్తు నాయకులను చూచెను. భయపడిన మతోన్మాదియైన సౌలులో, రాజులు మరియు దేశాల యెదుట తన సువార్తను బోధించే “ఏర్పరచుకొనిన పాత్రను” ఆయన చూచెను (అపొస్తలుల కార్యములు 9:10–15 చూడండి). మీలో మరియు మీరు బోధించే ప్రతీ వ్యక్తిలో రక్షకుడు అపరిమితమైన సామర్థ్యమును కలిగియున్న దేవుని కుమారుడు లేదా కుమార్తెను చూస్తారు.

మీరు బోధించే జనులలో, విశ్వాసులుగా మరియు పరివర్తన చెందిన వారిగా అనిపించే వారు కొందరు మరియు ఆసక్తి లేనివారిగా లేదా తిరుగుబాటుదారులుగా అనిపించే వారు కొందరు ఉండే అవకాశం ఉంది. మీరు చూసే వాటి ఆధారంగా మాత్రమే అంచనాలు వేయకుండా జాగ్రత్త వహించండి. రక్షకుడు చూసేవాటిలో కొన్నింటిని ప్రతీ వ్యక్తిలో చూడడానికి పరిశుద్ధాత్మ మీకు సహాయం చేయగలరు—మరియు ఆయన ప్రేమించే విధంగా వారిని ప్రేమించడం ప్రారంభించడంలో మీకు సహాయం చేయగలరు.

ధ్యానించవలసిన ప్రశ్నలు: మీరు బోధించే ప్రతీ వ్యక్తి గురించి ఆలోచించండి, పరలోక తండ్రి మరియు యేసు ప్రతీ ఒక్కరి గురించి ఎలా భావిస్తారో ధ్యానించండి. అతడిలో లేదా ఆమెలో వారు ఏమి చూడవచ్చు? మీరు ఆ వ్యక్తికి బోధించే విధానాన్ని ఈ ఆలోచనలు ఎలా ప్రభావితం చేస్తాయి?

లేఖనముల నుండి; 1 సమూయేలు 16:7; కీర్తనలు 8:4–5; రోమా 8:16–17;సిద్ధాంతము మరియు నిబంధనలు 18:10–14

రక్షకుడికి మన గురించి తెలుసు మరియు మన పరిస్థితులు, అవసరాలు, బలాలను అర్థం చేసుకుంటారు

సమరయ స్త్రీ సువార్త సందేశం వినుటకు బావి వద్దకు రాలేదు. ఆమె నీళ్ళు తోడుకొనుటకు వచ్చింది. కానీ ఆమె దాహం భౌతికమైనదాని కంటే ఎక్కువ అని రక్షకుడు గ్రహించగలిగారు. అస్థిర సంబంధాలతో ఆమె గతం నిండి ఉందని ఆయనకు తెలుసు. కాబట్టి యేసు ఆమె తక్షణ ఆసక్తిని కలిగి ఉన్న భౌతిక అవసరమైన ప్రాణాన్ని కాపాడే జలాన్ని తీసుకుని, దానిని ఆమె లోతైన ఆత్మీయ అవసరాలైన “జీవజలము” మరియు “నిత్యజీవము”లతో జోడించెను. వారి సంభాషణ ముగిసే సమయానికి, యేసే క్రీస్తు అని ఆ స్త్రీ వ్యక్తిగత సాక్ష్యము పొందెను, ఆయన ఆమెను ఎంత బాగా యెరిగియుండెనో అనే దాని చేత కొంత వరకు ప్రేరేపణ పొందెను. “[ఆయన] నేను చేసినవన్నియు నాతో చెప్పెను,” అని ఆమె చెప్పింది. “ఈయన క్రీస్తుకాడా?” (యోహాను 4:6–29 చూడండి).

క్రీస్తును పోలిన బోధకునిగా ఉండుటలో మీరు బోధించే వ్యక్తులను తెలుసుకొనుట మరియు వారి హృదయాలలో ఏముందో అర్థం చేసుకొనుటకు కృషి చేయుట ఇమిడివుంది. మీరు వారి జీవితాలపై ఆసక్తి చూపగలరు మరియు కనికరము చూపగలరు. మీరు వారి నేపథ్యాలు, ప్రతిభలు, ఆసక్తులు మరియు అవసరాలను అర్థం చేసుకొనుటకు మార్గాల కొరకు వెదకవచ్చు. వారు ఉత్తమంగా ఎలా నేర్చుకుంటారో మీరు తెలుసుకొనవచ్చు. మీరు ప్రశ్నలు అడగవచ్చు, శ్రద్ధగా వినవచ్చు మరియు గమనించవచ్చు. అన్నింటికంటే మించి, ఆత్మ మాత్రమే ఇవ్వగల అవగాహన కొరకు మీరు ప్రార్థించవచ్చు. మీరు ఒక వ్యక్తిని ఎంత ఎక్కువగా తెలుసుకుంటే, అంత ఎక్కువగా అతనికి లేదా ఆమెకు యేసు క్రీస్తు సువార్తలో వ్యక్తిగత అర్థాన్ని మరియు శక్తిని కనుగొనడంలో మీరు సహాయం చేయగలరు. మీరు ఒక వ్యక్తి యొక్క దాహాన్ని అర్థం చేసుకున్నప్పుడు, రక్షకుని జీవజలంతో దానిని ఎలా తీర్చాలో పరిశుద్ధాత్మ మీకు నేర్పగలరు.

ధ్యానించవలసిన ప్రశ్నలు: మీరు బోధించే వ్యక్తుల గురించి ఇదివరకే మీకేమి తెలుసు? వారికి ఏది ముఖ్యమైనది? వారి బలాలు ఏమిటి? వారు దేనితో పోరాడుతున్నారు? వారిని బాగా అర్థం చేసుకొనుటకు మీరేమి చేయగలరు?

లేఖనముల నుండి; కీర్తనలు 139:1–5; మత్తయి 6:25–32; మార్కు 10:17–21; యోహాను 10:14; 3 నీఫై 17:1–9

రక్షకుడు తాను బోధించిన వారిని గూర్చి ప్రార్థించెను

“సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును కోరుకొనెను, … నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని” (లూకా 22:31–32) అని రక్షకుడు చెప్పినప్పుడు సీమోను పేతురు ఏవిధముగా భావించియుండెనో ఊహించండి. యేసు క్రీస్తు మీ కొరకు తండ్రిని ప్రార్థించారని తెలుసుకొనుట మిమ్ములను ఏవిధంగా ప్రభావితం చేస్తుంది? ప్రాచీన అమెరికాలోని ప్రజలకు ఇలాంటి అనుభవం ఎదురైంది మరియు వారు దానిని ఈ విధంగా వర్ణించారు: “[యేసు] మా కొరకు తండ్రిని ప్రార్థించుటను మేము వినిన సమయమున, మా ఆత్మలను నింపిన ఆనందమును ఎవ్వరూ ఉహించలేరు” (3 నీఫై 17 :17).

నిరంతరముగా, మీరు ఒకరి కొరకు వారి పేరున ప్రార్థించినప్పుడు మీ లోపల ఏమి జరుగుతుందో కూడా మీరు ఆలోచించవచ్చు. ఆ వ్యక్తి పట్ల మీకున్న భావాన్ని మీ ప్రార్థనలు ఎలా ప్రభావితం చేస్తాయి? అవి మీ చర్యలను ఎలా ప్రభావితం చేస్తాయి? ఒక అభ్యాసకుడికి సహాయం చేయాలి అనుకునే బోధకుని యొక్క హృదయపూర్వక ప్రార్థనలను పరలోకంలో ఉన్న మన తండ్రి ఖచ్చితంగా వింటారు మరియు సమాధానమిస్తారు. అనేక సందర్భాలలో, ఆ ప్రార్థనలకు సమాధానమిచ్చే ఒక మార్గం ఏమిటంటే, అభ్యాసకుడికి ఆయన ప్రేమను అనుభవించడంలో సహాయపడేలా ఏదైనా చేయమని లేదా చెప్పమని బోధకుని హృదయాన్ని తాకడం మరియు ప్రేరేపించడం.

ధ్యానించవలసిన ప్రశ్నలు: మీరు బోధించే వ్యక్తుల గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు, ప్రత్యేకించి మీ ప్రార్థనల అవసరం ఉందని మీరు భావించే వారెవరైనా ఉన్నారా? అతడు లేదా ఆమె తరఫున ప్రార్థించడానికి మీరు ఏ ప్రేరణను పొందారు? ఒకరి కొరకు ఒకరు ప్రార్థించమని మీరు అభ్యాసకులను ఆహ్వానించినప్పుడు ఎటువంటి ఆశీర్వాదాలు రావచ్చు?

లేఖనముల నుండి; యోహాను 17; ఆల్మా 31:24–36; 3 నీఫై 18:15–24;19:19–23, 27–34

అందరూ గౌరవించబడతారని మరియు విలువైనవారిగా భావిస్తారని రక్షకుడు హామీ ఇచ్చెను

పాపులను దూరంగా ఉంచాలనేది యేసు కాలంలోని మతనాయకుల సాధారణ దృక్పథం. ఈ కారణంగా, యేసు పాపులతో సంభాషించడం చూసినప్పుడు, ఈ నాయకులు భయపడ్డారు. అటువంటి వారితో సహవాసం చేసే వ్యక్తి ఆత్మీయ బోధకుడు ఎలా కాగలడు?

వాస్తవానికి, యేసు భిన్నమైన విధానాన్ని కలిగియుండెను. ఆత్మీయంగా అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచడానికి ఆయన ప్రయత్నించెను (మార్కు 2:15–17; లూకా 4:17–18 చూడండి). వారి చుట్టూ ఉన్న వారి కంటే భిన్నంగా ఉన్నవారిని లేదా సమస్యాత్మకమైన గతాన్ని కలిగి ఉన్నవారిని ఆయన స్థిరంగా సమీపించెను మరియు పాపం చేసిన వారితో ఆయన సంభాషించెను. రోమా సైనికుడి విశ్వాసాన్ని ఆయన మెచ్చుకొనెను (మత్తయి 8:5–13 చూడండి). తన నమ్మకమైన శిష్యులలో ఒకడిగా ఉండడానికి పన్ను వసూలు చేసే అపనమ్మకస్థుడైన వ్యక్తిని ఆయన పిలిచెను (మార్కు 2:14 చూడండి). ఒక స్త్రీ వ్యభిచారముతో నిందించబడినప్పుడు, ఆమె సురక్షితంగా భావించేలా ఆయన చేసెను మరియు పశ్చాత్తాపపడి, మెరుగైన జీవితాన్ని గడపమని ఆమెను ప్రేరేపించెను (యోహాను 8:1–11 చూడండి).

కానీ యేసు అంతకు మించి చేసెను. ఆయన తన అనుచరుల మధ్య ఇదే అంగీకారం మరియు ప్రేమ వైఖరిని పెంపొందించెను. జనులందరి యొద్దకు సువార్తను తీసుకొని వెళ్ళే సమయం వచ్చినప్పుడు ఆయన మాదిరి ఖచ్చితంగా తన అపొస్తలుల హృదయాలలో నిలిచియుంది. అది పేతురు మాటలలో ప్రతిబింబించింది: “దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించియున్నాను” (అపొస్తలుల కార్యములు 10:34).

మీరు బోధించడానికి పిలువబడిన వారిలో దాదాపు ప్రతీఒక్కరూ గౌరవించబడినవారిగా మరియు విలువైనవారిగా భావించడానికి ఏదో ఒక విధంగా సతమతమయ్యే అవకాశం ఉంది. మీరు వారిని ప్రేమించే మరియు గౌరవించే విధానం ద్వారా, వారు ఆహ్వానితులు మాత్రమే కాదు, కానీ అవసరమైనవారు కూడా అని మీరు తెలియజేయవచ్చు. పురోగతి నెమ్మదిగా ఉన్నట్లు అనిపించినప్పుడు మీరు ఓపికతో ఉండి, హాజరుకానివారు, కష్టపడుతున్నవారు లేదా ఆసక్తి చూపని వారిని సంప్రదించవచ్చు. తోటి విశ్వాసులతో తమ ఆందోళనలను పంచుకొనుటలో ప్రతీఒక్కరూ సురక్షితముగా మరియు సౌకర్యముగా భావించుటకు మీరు సహాయం చేయవచ్చు. మరియు మీరు దాని కంటే ఎక్కువ చేయవచ్చు. గౌరవము, చెందియున్న భావన మరియు ప్రేమ యొక్క ఆత్మలో బోధించబడే వాతావరణాన్ని సృష్టించడంలో మీకు సహాయపడుటకు మీరు అభ్యాసకులందరినీ ప్రేరేపించవచ్చు.

ధ్యానించవలసిన ప్రశ్నలు: ఒక వ్యక్తి గౌరవించబడినట్లుగా మరియు విలువైనవానిగా భావించుటకు ఏది సహాయపడుతుంది? ఇతరులను గౌరవించుటకు మరియు విలువిచ్చుటకు ఒక వ్యక్తిని ఏది ప్రేరేపిస్తుంది? మీరు బోధించే వ్యక్తుల గురించి మీరు ప్రార్థనాపూర్వకంగా ఆలోచిస్తున్నప్పుడు, వారందరూ ఆహ్వానించబడినవారిగా మరియు అవసరమైనవారిగా భావించేలా ఏమి చేయాలని మీరు ప్రేరేపించబడ్డారు?

లేఖనముల నుండి; యోహాను 4; 2 నీఫై 26:27–28, 33; ఆల్మా 1:26;3 నీఫై 18:22–25

చిత్రం
పిల్లలకు బోధిస్తున్న తండ్రి

బోధకులు తాము బోధించే వారు ప్రేమించబడినట్లు భావించడంలో సహాయపడగలరు.

రక్షకుడు తాను బోధించిన వారి కొరకు తన ప్రేమను వ్యక్తపరచెను

నీఫైయుల మధ్య బోధించడం మరియు పరిచర్య చేయడం యొక్క అద్భుతమైన, ఉత్తేజకరమైన దినము యొక్క ముగింపులో, యేసు తాను వెళ్ళవలసిన సమయం ఆసన్నమైనదని గమనించెను. ఆయన ఇతర వ్యక్తులను దర్శించవలెను. “మీరు మీ గృహములకు వెళ్ళి, రేపటి కొరకు మీ మనస్సులు సిద్ధము చేసుకొనుడి” అని ఆయన చెప్పెను. కానీ జనులు “కన్నీళ్ళతో” అక్కడే కూర్చొనియుండి, “మరికొంతసేపు వారితో నిలిచియుండమని ఆయనను అడుగుచున్నట్లు ఆయనవైపు తదేకముగా చూచెను.” చెప్పలేని వారి అవసరాన్ని గ్రహించి, యేసు “కనికరముతో నిండి” మరికొంత కాలము వారితో ఉండెను (3 నీఫై 17:3, 5–6). ఆయన వారి రోగులను, బాధింపబడిన వారిని దీవించెను. ఆయన వారితో మోకరించి ప్రార్థించెను. ఆయన వారితో దుఃఖించెను మరియు వారితో సంతోషించెను.

3 నీఫై 17 లోని రక్షకుని మాటలు మరియు క్రియలను ప్రార్థనాపూర్వకంగా అధ్యయనం చేయడాన్ని పరిగణించండి. ఆయన బోధించిన వారి పట్ల ఆయన చూపిన ప్రేమను గూర్చి ఆలోచించండి. లేఖనాలలోని ఇతర ప్రదేశాలలో ఆయన ప్రేమ యొక్క వ్యక్తీకరణల కొరకు చూడండి. అప్పుడు మీరు బోధించే వ్యక్తుల గురించి ఆలోచించండి. మీరు వారి పట్ల ప్రేమను సరిగ్గా ఎలా వ్యక్తపరుస్తారు? ఆత్మ మిమ్మల్ని నడిపించనివ్వండి. మీరు బోధించే వారి పట్ల ప్రేమను అనుభవించడం లేదా వ్యక్తపరచడం మీకు కష్టంగా అనిపించినట్లయితే, దేవుని ప్రేమకు సాక్ష్యమివ్వడం ద్వారా ప్రారంభించండి. తరువాత “ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులందరికి ఆయన అనుగ్రహించిన [క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమతో] మీరు నింపబడవలెనని హృదయము యొక్క పూర్ణ శక్తితో తండ్రికి ప్రార్థన చేయుడి” (మొరోనై 7:48). మరియు పాఠం బోధించడం పట్ల మీకున్న అక్కర మీ మాటలు మరియు చర్యల ద్వారా ప్రేమను వ్యక్తపరచకుండా మీ దృష్టిని మరల్చకూడదని గుర్తుంచుకోండి. తరచుగా, మీరు వారికి ఏమి బోధిస్తారు అనేది ఎంత ముఖ్యమో, మీరు వ్యక్తులతో వ్యవహరించే విధానం కూడా అంతే ముఖ్యం.

ధ్యానించవలసిన ప్రశ్నలు: మీ పట్ల ఆయనకున్న ప్రేమను గూర్చి తెలుసుకొనుటకు రక్షకుడు మీకు ఏవిధముగా సహాయం చేసారు? ఆయన ప్రేమను అనుభవించడంలో తల్లిదండ్రులు లేదా ఇతర బోధకులు మీకు ఏవిధముగా సహాయం చేసారు? మీరు బోధించే వ్యక్తులకు మీరు వారిని ప్రేమిస్తున్నారని తెలుసా? రక్షకుడు వారిని ప్రేమిస్తున్నారని వారికి తెలుసా?

లేఖనముల నుండి; మార్కు 6:31–42; యోహాను 13:3–16, 34–35; 15:12–13; 1 కొరింథీయులకు 13:1–7; 1 యోహాను 4:7–11

మీరు నేర్చుకొనుచున్న దానిని అన్వయించుకొనుటకు కొన్ని మార్గాలు

  • మీరు ఒక తరగతికి బోధిస్తున్నట్లయితే, అభ్యాసకుల పేర్లను నేర్చుకోండి మరియు మీరు బోధించేటప్పుడు వాటిని ఉపయోగించండి.

  • అభ్యాసకులు సహకరించినప్పుడు మీ కృతజ్ఞతను తెలియజేయండి.

  • మీరు బోధించే ముందు మరియు తర్వాత అభ్యాసకులతో మాట్లాడండి.

  • అభ్యాసకులు ఒకరికొరకు ఒకరు ప్రేమ మరియు గౌరవం యొక్క వాతావరణాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడండి.

  • మీరు బోధిస్తున్నప్పుడు మరియు ఇతర సమయాలలో శ్రద్ధగా వినండి.

  • మీరు బోధించే వారి కొరకు సేవా కార్యక్రమాలను నిర్వహించండి.

  • మీరు బోధించే వారికి అర్థవంతమైన సూత్రాలపై ఎక్కువ సమయం వెచ్చించేందుకు మీ బోధన ప్రణాళికలను మార్చుకోవడానికి సిద్ధంగా ఉండండి.

ముద్రించు