సెమినరీలు మరియు ఇన్‌స్టిట్యూట్లు
నాయకుల కొరకు—బోధకుల విజయానికి సహాయము చేయుట


“నాయకుల కొరకు—బోధకుల విజయానికి సహాయము చేయుట,” రక్షకుని విధానములో బోధించుట: గృహములో మరియు సంఘములో బోధించువారందరి కొరకు (2022)

“నాయకుల కొరకు—బోధకుల విజయానికి సహాయము చేయుట,” రక్షకుని విధానములో బోధించుట

చిత్రం
ఆదివారపు బడి తరగతి

నాయకుల కొరకు—బోధకుల విజయానికి సహాయము చేయుట

ఒక్కరితో-ఒక్కరు సంభాషణలు

బోధకుల ప్రత్యేక అవసరాలను తీర్చడానికి తరచుగా ఉత్తమమైన మార్గం, ఒక్కరితో-ఒక్కరు సంభాషణలు జరపడం. ఉదాహరణకు, నాయకులుగా మీరు రక్షకుని విధానములో బోధించుట యొక్క సూత్రాలను చర్చించడానికి తరగతికి ముందు లేదా తర్వాత బోధకునితో క్లుప్తంగా చర్చించవచ్చు. బోధకుడు బోధించడాన్ని గమనించడం ద్వారా మీరు ఈ చర్చకు సిద్ధం కావచ్చు. బోధకుని బలాలను బాగా అర్థం చేసుకోవడానికి మరియు మీరు మద్దతు అందించగల మార్గాలను కనుగొనడానికి ప్రయత్నించండి.

అభివృద్ధికి అవకాశాలను గుర్తించడం ఎంత ముఖ్యమో, బోధకుని బలాలపై నిర్మించడం కూడా అంతే ముఖ్యము. ఏది బాగా జరుగుతోందో మరియు ఎక్కడ పురోగతి సాధించవచ్చని వారు భావిస్తున్నారో స్వయంగా ఆలోచించమని అడగడం ద్వారా బోధకులతో చర్చలు ప్రారంభించడం సహాయకరంగా ఉంటుంది.

మీరు బోధకులను కలిసినప్పుడు, వారిని బలపరిచే మార్గాలను పరిగణించండి మరియు వారు అందించే సేవకు దయతో, కృతజ్ఞతతో వారిని ప్రోత్సహించండి.

బోధకుల సలహామండలి సమావేశాలు

ప్రతీ వార్డు త్రైమాసిక బోధకుల సలహామండలి సమావేశాలు నిర్వహించాలి, అందులో బోధకులు క్రీస్తును పోలిన బోధనా సూత్రాల గురించి కలిసి ఆలోచన చేయగలరు. బోధకుల సలహామండలి సమావేశాలు తల్లిదండ్రులకు కూడా నిర్వహించవచ్చు (General Handbook: Serving in The Church of Jesus Christ of Latter-day Saints, 13.5, ChurchofJesusChrist.org) చూడండి.

ఈ సమావేశాలను ఎప్పుడు నిర్వహించాలి?

ఆదివారం 50 నిమిషాల తరగతి సమయంలో బోధకుల సలహామండలి సమావేశాలు నిర్వహించబడతాయి.

  • స్థానిక నాయకులచేత నిర్ణయించబడిన ప్రకారం యాజకత్వము, ఉపశమన సమాజము మరియు యువతుల యొక్క బోధకులు మొదటి లేదా మూడవ ఆదివారం హాజరు కావచ్చు.

  • స్థానిక నాయకులచేత నిర్ణయించబడిన ప్రకారం, ఆదివారపు బడి బోధకులు రెండవ లేదా నాల్గవ ఆదివారం హాజరు కావచ్చు.

  • వార్డు ప్రాథమిక మరియు ఆదివారపు బడి అధ్యక్షత్వములచేత నిర్ణయించబడిన ప్రకారం, ప్రాథమిక బోధకులు ఏ ఆదివారమైనా హాజరు కావచ్చు. కోరినట్లయితే, ప్రాథమిక బోధకులు ఇతర బోధకుల నుండి విడిగా సమావేశమై పిల్లలకు బోధించే ప్రత్యేక అంశాల గురించి ఆలోచన చేయవచ్చు. ఇది పాటలు పాడే 20 నిమిషాల సమయంలో, సాధారణ ఆదివారపు సమావేశాలకు ముందు లేదా తర్వాత లేదా వారంలో మరొక రోజు జరుగవచ్చు. ప్రాథమిక బోధకులకు త్రైమాసికానికి ఒకటి కంటే ఎక్కువ బోధకుల సలహామండలి సమావేశాలు నిర్వహించబడవచ్చు, తద్వారా వారందరూ ఒకే వారంలో ప్రాథమిక తరగతులను కోల్పోరు. (గమనిక: అవసరమైనప్పుడు, ప్రాథమిక అధ్యక్షత్వము ప్రత్యామ్నాయ బోధకులను నియమిస్తుంది, తరగతులను జతచేస్తుంది లేదా ప్రాథమిక బోధకులు బోధకుల సలహామండలి సమావేశాలకు హాజరు కావడానికి ఇతర ఏర్పాట్లు చేస్తుంది.)

  • వార్డు సలహామండలి చేత నిర్ణయించబడిన ప్రకారం, తల్లిదండ్రుల కోసం బోధకుల సలహామండలి సమావేశం ఏ ఆదివారమైనా నిర్వహించబడవచ్చు.

ఎవరు హాజరు కావాలి?

వార్డులో ఒక సమూహము లేదా తరగతికి బోధించే ప్రతీ ఒక్కరూ ఆ సమూహాలు లేదా తరగతులపై బాధ్యత వహించే యాజకత్వ లేదా సంస్థ నాయకులలో కనీసం ఒకరితో పాటు హాజరు కావాలి. అవసరమైతే, పాల్గొనేవారు తాము బోధించే వారి అవసరాలకు అనుగుణంగా సమూహాలుగా విభజింపబడవచ్చు. ఉదాహరణకు, యువత లేదా పిల్లల బోధకులు యువత లేదా పిల్లలకు బోధించడంలో నిర్దిష్టమైన సమస్యలను చర్చించడానికి సందర్భానుసారంగా విడివిడిగా కలుసుకోవడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.

తల్లిదండ్రుల కొరకైన బోధకుల సలహామండలి సమావేశాల కొరకు, నిర్దిష్ట తల్లిదండ్రులను ఆహ్వానించాలా లేదా పాల్గొనాలనుకునే వారందరికీ హాజరయ్యే అవకాశాన్ని కల్పించాలా అని వార్డు సలహామండలి నిర్ణయిస్తుంది.

ఈ సమావేశాలకు ఎవరు నాయకత్వం వహిస్తారు?

ఆదివారపు బడి అధ్యక్షత్వము సహాయంతో వార్డు సలహామండలి, బోధకుల సలహామండలి సమావేశాలను పర్యవేక్షిస్తుంది. తరగతులు మరియు సమావేశాలలో వారు గమనించిన వాటి ఆధారంగా బోధకులు మరియు అభ్యాసకుల అవసరాల గురించి వారు కలిసి ఆలోచన చేస్తారు. రక్షకుని విధానములో బోధించుట నుండి ఏ సూత్రాలు మరియు ఆచరణలు వారు గుర్తించిన అవసరాలను ఉత్తమంగా తీరుస్తాయో తెలుసుకోవడానికి వారు కలిసి పని చేస్తారు.

సాధారణంగా, ఆదివారపు బడి అధ్యక్షుడు బోధకుల సలహామండలి సమావేశాలకు నాయకత్వం వహిస్తాడు. అయినప్పటికీ, సమావేశాలను నడిపించుటకు ఇతర వార్డు సభ్యులు సందర్భానుసారంగా నియమించబడవచ్చు. సమావేశంలో చర్చించబడిన సూత్రాలు మరియు అభ్యాసాలను సమూహము మరియు సంస్థ అధ్యక్షత్వాలు తమ బోధకులతో బలపరుస్తాయి.

బోధకుల సలహామండలి సమావేశంలో ఏమి జరగాలి?

బోధకుల సలహామండలి సమావేశం ఈ ఆకృతిని అనుసరించాలి:

  • కలిసి పంచుకోండి మరియు ఆలోచన చేయండి. ఇటీవలి బోధనా అనుభవాలను పంచుకోవడానికి, బోధనకు సంబంధించిన ప్రశ్నలు అడగడానికి మరియు సవాళ్ళను అధిగమించడానికి ఆలోచనలను పంచుకోవడానికి ఉపాధ్యాయులను ఆహ్వానించండి. సమావేశంలోని ఈ భాగం మునుపటి సమావేశాలలో చర్చించబడిన సూత్రాల సమీక్షను కలిగి ఉంటుంది.

  • కలిసి నేర్చుకోండి. ఈ వనరులో అందించబడిన క్రింది సూత్రాలలో ఒకదానిని చర్చించడానికి ఉపాధ్యాయులను ఆహ్వానించండి: యేసు క్రీస్తుపై కేంద్రీకరించండి, మీరు బోధించే వారిని ప్రేమించండి, ఆత్మ ద్వారా బోధించండి, సిద్ధాంతాన్ని బోధించండి మరియు శ్రద్ధతో నేర్చుకోవడాన్ని ఆహ్వానించండి. సూత్రాలను ఏ క్రమంలోనైనా చర్చించవచ్చు మరియు వార్డు సలహామండలి చేత నిర్దేశించబడితే తప్ప, సమావేశంలో పాల్గొనేవారు చర్చించవలసిన తదుపరి సూత్రాన్ని ఎంచుకోవచ్చు. అవసరమైతే మీరు ఒక సూత్రంపై ఒకటి కంటే ఎక్కువ సమావేశాలను జరుపవచ్చు.

  • ప్రణాళిక చేయండి మరియు ఆహ్వానించండి. బోధకులు తాము చర్చించిన సూత్రాన్ని ఎలా వర్తింపజేస్తారో ప్రణాళిక చేయడానికి వారికి సహాయపడండి. సముచితమైనప్పుడు, మీరు చర్చించిన ఒక నైపుణ్యాన్ని కూడా మీరు కలిసి సాధన చేయవచ్చు. వారి గృహాలలో బోధించడానికి వారు చేసే ప్రయత్నాలతో సహా వారి బోధనలో సూత్రాన్ని ఎలా వర్తింపజేయాలనే దాని గురించి వారు పొందే మనోభావాలను నమోదు చేయడానికి మరియు వాటిపై చర్య తీసుకోవడానికి వారిని ఆహ్వానించండి. చర్చించవలసిన తదుపరి సూత్రాన్ని అధ్యయనం చేయడం ప్రారంభించమని వారిని ప్రోత్సహించండి.

సాధ్యమైనంత వరకు, బోధకుల సలహామండలి సమావేశాలు చర్చించబడుతున్న సూత్రాలకు నమూనాగా ఉండాలి.

చిత్రం
హత్తుకొనుచున్న యువతులు

బోధకుల సలహామండలి సమావేశాలు బోధకులకు క్రీస్తును పోలిన బోధనా సూత్రాలను బాగా అర్థం చేసుకోవడానికి మరియు అన్వయించడానికి సహాయపడగలవు.

క్రొత్తగా పిలువబడిన బోధకులకు దిశానిర్దేశం చేయుట

ఒక నాయకునిగా, మీ సంస్థలో “క్రొత్తగా పిలువబడిన బోధకులను కలవడం” మరియు “వారి పిలుపుల కోసం వారిని సిద్ధం చేయడంలో సహాయపడే” బాధ్యతను మీరు కలిగియున్నారు (General Handbook, 17.3, ChurchofJesusChrist.org). ఈ సమావేశాలు క్రొత్త బోధకులను వారి పవిత్రమైన పిలుపులకు పరిచయం చేయడానికి మరియు రక్షకుని విధానములో బోధించుట అంటే ఏమిటనే దర్శనంతో వారిని ప్రేరేపించడానికి ఒక అవకాశం. ఒక నాయకునిగా, మీరు ఈ క్రింది వాటిని చేయడం ద్వారా క్రొత్త బోధకులు సేవ చేయడానికి సిద్ధపడుటలో సహాయం చేయవచ్చు:

  • వారి పిలుపులో రక్షకుడు వారికి సహాయం చేస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేయండి ( సిద్ధాంతము మరియు నిబంధనలు 88:78 చూడండి).

  • క్రొత్త బోధకులకు ఈ వనరు యొక్క ప్రతిని ఇవ్వండి మరియు వారి బోధనలో దాని సూత్రాలను అన్వయించే మార్గాల కోసం వెదకమని వారిని ప్రోత్సహించండి.

  • క్రొత్త బోధకులకు సహాయపడేలా మీ సంస్థ గురించి వారు తెలుసుకోవలసిన ఏ విషయమైనా వారితో పంచుకోండి.

  • అవసరమైనప్పుడు, క్రొత్త బోధకులు ఏ గదిలో బోధించాలో మరియు ఏ పాఠాన్ని ప్రారంభించాలో చెప్పండి. వారి తరగతి మరియు తరగతి సభ్యుల గురించి వారికి అవసరమైన ఏ సమాచారాన్నైనా అందించండి.

  • వారి పిలుపులో మీరు వారికి సహాయం చేయగలరని క్రొత్త బోధకులకు వివరించండి. అవసరమైతే తరగతి గదిలో మద్దతునివ్వండి మరియు బోధన వనరులకు ప్రవేశాన్ని కల్పించండి.

  • అప్పుడప్పుడు బోధకుల తరగతులను గమనిస్తామని ప్రతిపాదించండి మరియు ఆత్మ ప్రేరేపించిన విధంగా అభిప్రాయాన్ని తెలియజేయండి.

  • త్రైమాసిక బోధకుల సలహామండలి సమావేశాలలో పాల్గొనడానికి బోధకులను ఆహ్వానించండి.

ముద్రించు